12
1 ✝కీషు కొడుకైన సౌలు దగ్గర నుంచి తప్పించుకొని దావీదు సిక్లగుకు వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు సౌలు బంధువులలో కొంతమంది అతని దగ్గరికి వచ్చారు. 2 ✽ఈ బెన్యామీను గోత్రంవారు విలుకాండ్రు. కుడిచేతితో అయినా ఎడమ చేతితో అయినా వడిసెలచేత రాళ్ళు, వింటిచేత బాణాలు వేయగలిగినవారు. యుద్ధంలో దావీదుకు సహాయం చేసిన వీరులలో వారు ఉన్నారు. 3 వారెవరంటే, గిబియా గ్రామంవాడైన షెమయా కొడుకులు అహీయెజెరు, యోవాషు (అహీయెజెరు అధిపతిగా ఉన్నాడు); అజమావెతు కొడుకులు యెజీయేల్, పెలెట్; బరెకా; అనతోతు గ్రామంవాడు యెహూ; 4 గిబియోను ఊరివాడు ఇషమయా (అతడు ఆ ముప్ఫయిమందిలో పరాక్రమశాలి, వారికి ఒక నాయకుడు); యిర్మీయా; యహజీయేల్; యోహానాను; గెదేరాతువాడు యోజాబాదు; 5 ఎలూజయి; యెరీమోతు; బెయలయా, షెమరయా; హరీపువాడు షెఫటయా; 6 కోరహు వంశంవారు ఎల్కానా, యెష్షీయా, అజరేల్, యోహెజెరు, యాషాబాం; 7 గెదోరు గ్రామంవాడు యెరోహాం కొడుకులు యోహేలా, జెబదయా.8 ఎడారిలో ఉన్న తన భద్రమైన స్థలంలో దావీదు ఉన్నప్పుడు గాదు గోత్రంవారు✽ కొంతమంది అతని దగ్గర చేరారు. వారు కూడా పరాక్రమశాలురు, డాలునూ ఈటెనూ ప్రయోగించగల యుద్ధ సమర్ధులు. వారి ముఖాలు సింహాల ముఖాలలాంటివి. కొండలలో ఉన్న జింకలంత త్వరగా పరుగెత్త గలిగినవారు. 9 వారి నాయకుడు ఏజెరు, రెండోవాడు ఓబద్యా, మూడోవాడు ఏలియాబ్, 10 నాలుగోవాడు మిషమన్నా, అయిదోవాడు యిర్మీయా, 11 ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేల్, 12 ఎనిమిదో వాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్‌జాబాదు, 13 పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మకబన్నయి. 14 ఈ గాదు గోత్రికులు సైన్యంలో అధిపతులు. వీరిలో అత్యల్పుడు వందమందితో సమానుడు. గొప్పవాడు వెయ్యిమందితో సమానుడు. 15 ఒకసారి మొదటి నెల✽లో యొర్దాను గట్టులమీదుగా పొర్లిపారుతూ ఉన్నప్పుడు, దానిని దాటిపోయి తూర్పుగా పడమరగా ఉన్న లోయలలో ఉన్న వాళ్ళందరినీ పరుగెత్తించినవారు వీరే.
16 బెన్యామీను గోత్రంవారిలో ఇంకా కొంతమంది, యూదా గోత్రంవారు కొంతమంది కూడా దావీదు భద్రమైన స్థలానికి✽ అతని దగ్గరికి వచ్చారు. 17 వారిని కలుసుకోవడానికి బయలుదేరి వచ్చి దావీదు వారితో ఇలా అన్నాడు: “నాకు సహాయం చేయడానికి శాంతిభావంతో మీరు నా దగ్గరికి వచ్చారంటే, మీతో ఒకటయ్యే మనసు నాకు ఉంది. నన్ను నా శత్రువుల చేతికి పట్టియివ్వడానికి వచ్చారా, మన పూర్వీకుల దేవుడు అది చూచి మీకు తీర్పు తీరుస్తాడు గాక! నేను ఏమీ దౌర్జన్యం చేయలేదు గదా.”
18 అప్పుడు ముప్ఫయి మందికి నాయకుడుగా ఉన్న అమాశైను దేవుని ఆత్మ✽ ఆవరించాడు. అతడు “దావీదూ! మేము మీ వాళ్ళం. యెష్షయి కుమారా! మీ పక్షాన ఉన్నాం. మీకు క్షేమం కలుగుతుంది గాక! మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు. కనుక దావీదు వారిని చేర్చుకొని తన గుంపులో ఇతర నాయకులలో నాయకులుగా నియమించాడు.
19 ✝సౌలు మీద యుద్ధం చేయడానికి ఫిలిష్తీయవాళ్ళు వెళ్ళిన కాలంలో వాళ్ళతో దావీదు బయలుదేరినప్పుడు మనష్షే గోత్రంవారిలో కొంతమంది అతని దగ్గరికి వచ్చి అతని పక్షం వహించారు. (దావీదు, అతని మనుషులు ఫిలిష్తీయవాళ్ళకు సహాయం చేయలేదు. ఎందుకంటే ఫిలిష్తీయవాళ్ళ అధికారులు “అతడు తన యజమాని సౌలు పక్షం మళ్ళీ చేరితే మనకు ప్రాణాపాయం తప్పదు” అని ఆలోచించి దావీదును పంపివేశారు.) 20 ✝అతడు సిక్లగుకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, మనష్షే గోత్రానికి చెందిన వీరు వచ్చి అతని పక్షం చేరారు: అద్నా, యోజాబాదు, యెదీయవేల్, మికాయేల్, యోజాబాదు, ఎలీహు, జిల్లెతయి. వారు మనష్షే గోత్ర సైన్యంలో సహస్రాధిపతులు. 21 వారందరూ పరాక్రమవంతులు. దావీదు సైన్యంలో అధిపతులై, దోపిడీదారుల గుంపుల మీద యుద్ధం చేయడంలో దావీదుకు సహాయం చేశారు. 22 రోజు రోజుకు దావీదుకు సహాయం చేయడానికి మనుషులు వచ్చారు. అతని సైన్యం దేవుని సైన్యంలాంటి మహా సైన్యం అయింది.
23 యెహోవా చెప్పినట్టు✽ సౌలు రాజ్యాన్ని దావీదు వశం చేయడానికి హెబ్రోను✽లో అతని దగ్గరికి వచ్చిన వారి సంఖ్యలు ఇవి (ఈ మనుషులందరూ యుద్ధ సన్నద్ధులు). 24 యూదావారిలో డాలునూ ఈటెనూ ధరించిన యుద్ధ సన్నద్ధులు ఆరువేల ఎనిమిది వందలమంది; 25 షిమ్యోను వారిలో యుద్ధానికి తగిన శూరులు ఏడు వేల వందమంది; 26 లేవీవారిలో అలాంటివారు నాలుగు వేల ఆరు వందల మంది; 27 అహరోను వంశంవారికి నాయకుడైన యెహోయాదా, అతనితో కూడా ఉన్న మూడు వేల ఏడు వందలమంది; 28 పరాక్రమశాలి అయిన సాదోకు అనే యువకుడు, అతనితో కూడా అతని తండ్రి వంశానికి చెందిన ఇరవై ఇద్దరు అధిపతులు; 29 సౌలు బంధువులైన బెన్యామీనువారిలో మూడు వేలమంది (అంతవరకు వారిలో చాలామంది సౌలు పక్షం వహించినవారు); 30 ఎఫ్రాయిం గోత్రానికి చెందిన పరాక్రమవంతులు ఇరవై వేల ఎనిమిది వందల మంది (వారందరూ తమ కుటుంబాలలో పేరు పొందినవారు); 31 దావీదును రాజుగా చేయడానికి మనష్షే అర్ధగోత్రానికి చెందినవారు పద్ధెనిమిది వేలమంది (ఒక్కొక్కరూ పేరు పేరుగా నియమించబడ్డవారు); 32 ఇశ్శాకారువారిలో ఉన్న నాయకులు రెండు వందల మంది, వారితోపాటు వారి అధికారం క్రింద వారి బంధువులందరూ (ఈ ఇశ్శాకారువారు కాలాలు గ్రహించినవారు, ఇస్రాయేల్ ప్రజలు ఏమి చేయాలో అది తెలుసుకొన్నవారు✽); 33 జెబూలూనువారిలో అన్ని రకాల యుద్ధాయుధాలను ధరించిన యుద్ధ సన్నద్ధులైన సైనికులు యాభైవేలమంది (చపలచిత్తం లేకుండా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు); 34 నఫ్తాలివారిలో వెయ్యిమంది అధిపతులు, డాలునూ ఈటెనూ ధరించిన ముప్ఫయి ఏడు వేలమంది; 35 దానువారిలో యుద్ధసన్నద్ధులు ఇరవై ఎనిమిది వేల ఆరు వందలమంది; 36 ఆషేరువారిలో యుద్ధ సన్నద్ధులైన సైనికులు నలభై వేలమంది. 37 యొర్దాను అవతల ఉన్న రూబేనువారిలో, గాదువారిలో, మనష్షే అర్ధ గోత్రంలో అన్ని రకాల యుద్ధాయుధాలను ధరించిన యుద్ధసన్నద్ధులు లక్ష ఇరవై వేల మంది.
38 ✽యుద్ధ సన్నద్ధులైన ఈ సైనికులందరూ దావీదును ఇస్రాయేల్ ప్రజలందరిమీద రాజుగా చేద్దామని ఏక మనస్సుతో హెబ్రోనుకు వచ్చారు. మిగతా ఇస్రాయేల్ వారందరూ కూడా దావీదును రాజుగా చేయడానికి ఏకీభవించారు. 39 వారు దావీదుతో మూడు రోజులు గడిపి అక్కడ తిన్నారు, త్రాగారు. వారి బంధువులు వారికోసం భోజన పదార్థాలు సిద్ధం చేశారు. 40 ✽ఇశ్శాకారు, జెబూలూను, నఫ్తాలి ప్రదేశాల సరిహద్దుల నుంచి కూడా వారి పొరుగువారు గాడిదలమీద, ఒంటెలమీద, కంచరగాడిదలమీద, ఎద్దుల మీద ఆహార వస్తువులను తీసుకువచ్చారు. పిండి వంటకాలు, అంజూరు పండ్ల అడలు, ద్రాక్షపండ్ల అడలు, ద్రాక్షరసం, నూనె, గొర్రెలు, పశువులు సమృద్ధిగా ఉన్నాయి. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు సంతోష భరితులయ్యారు✽.