11
1  ఇస్రాయేల్ ప్రజలంతా హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మేము మీకు సన్నిహిత బంధువులం. 2 మునుపు సౌలు పాలిస్తూ ఉన్నప్పుడు కూడా దండయాత్రలలో ఇస్రాయేల్ వారిని బయటికి తీసుకుపోయేదీ లోపలికి తీసుకువచ్చేది మీరే. యెహోవా ‘నా ఇస్రాయేల్ ప్రజలకు నీవు కాపరిగా ఉంటావు, వారిమీద పరిపాలకుడుగా ఉంటావు’ అని మీతో చెప్పాడు గదా.” 3 ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా హెబ్రోనులో దావీదురాజు దగ్గరికి వచ్చిన తరువాత అక్కడ యెహోవా సన్నిధానంలో రాజు వారితో ఒడంబడిక చేశాడు. యెహోవా సమూయేలు ద్వారా వాగ్దానం చేసినట్టే వారు దావీదును ఇస్రాయేల్‌ప్రజలమీద రాజుగా అభిషేకించారు.
4  దావీదు, ఇస్రాయేల్‌వారంతా యెబూసుకు, అంటే జెరుసలంకు వెళ్ళారు. 5 అక్కడ కాపురమున్న యెబూసి జాతివాళ్ళు “నీవు లోపలికి రాలేవు” అని దావీదుతో అన్నారు. అయినా కోట ఉన్న సీయోను – అంటే, “దావీదు నగరం” – దావీదు స్వాధీనం చేసుకొన్నాడు.
6 అంతకుముందు దావీదు “ఎవడు మొదట యెబూసివాణ్ణి హతం చేస్తాడో అతడు ప్రముఖ సైన్యాధిపతి అవుతాడు” అని చెప్పాడు. సెరూయా కొడుకు యోవాబు అందరికంటే ముందుగా ఎక్కిపోయాడు. కనుక ఆ ఆధిపత్యం పొందాడు. 7 కోట ఉన్న ఆ స్థలంలో దావీదు కాపురమేర్పరచుకొన్నాడు. అందుచేతే దానికి “దావీదు నగరం” అనే పేరు వచ్చింది. 8 కోటనుంచి లోపలికి, చుట్టూరా ఉన్న స్థలమంతటిలో నగరాన్ని కట్టించాడు దావీదు. నగరంలో మిగతా భాగాలను యోవాబు బాగు చేయించాడు. 9 సేనల ప్రభువు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, గనుక దావీదు ఎంతో అభివృద్ధి పొందుతూ వచ్చాడు.
10  దావీదు వీరులలో ప్రముఖులు వీరు: ఇస్రాయేల్ ప్రజలను గురించి యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం దావీదును రాజుగా చేయడానికి అతని రాజ్యంలో అతనికి ఇస్రాయేల్ ప్రజలందరితోకూడా సహాయం చేసిన ఆ వీరుల పేర్లు ఇవి: 11 ఈ ముప్ఫయి మందిలో ప్రముఖుడు హకమోనివాడొకడి కొడుకైన యాషాబాం. ఒకే యుద్ధంలో అతడు మూడు వందల మందిని తన ఈటెతో చంపాడు. 12 అతడి తరువాత అహోవ వంశంవాడైన దోదో కొడుకు ఎలియాజరు. అతడు ముగ్గురు ముఖ్య వీరులలో ఒకడు. 13 ఒకసారి ఫిలిష్తీయ వాళ్ళు పసదమ్మీంలో యుద్ధానికి సమకూడి వస్తే, అతడు అక్కడ దావీదుతో ఉన్నాడు. యవలతో నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయవాళ్ళను చూచి ఇస్రాయేల్‌వారు పారిపోయారు 14 గానీ వీరు ఆ పొలంలో నిలిచి దానిని కాపాడి ఫిలిష్తీయవాళ్ళను ఓడగొట్టారు. యెహోవా వారికి గొప్ప విజయం ఇచ్చాడు.
15 మరోసారి ఫిలిష్తీయవాళ్ళ సైనికుల గుంపు రెఫాయీం లోయలో దిగారు. దావీదు అదుల్లాం గుహలో ఉన్నాడు. ముప్ఫయిమంది ముఖ్య వీరులలో ముగ్గురు ఆ బండదగ్గర ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. 16 ఆ భద్రమైన స్థలంలో దావీదు ఉన్నప్పుడు ఫిలిష్తీయ సైనికుల గుంపు బేత్లెహేంలో ఉంది.
17 దావీదు నీళ్ళకోసం తహతహలాడుతూ “బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుండు!” అన్నాడు.
18 అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయ సైనికుల బారులగుండా చొరబడి బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు చేది దావీదు దగ్గరికి తీసుకువచ్చారు. అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి యెహోవా సన్నిధానంలో పారబోశాడు.
19 “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఇవి వీరి రక్తంతో సమానం. నేను తాగుతానా?” అని చెప్పి నీళ్ళు త్రాగలేదు. ఆ ముగ్గురు వీరులు చేసిన కార్యాలు ఇలాంటివే.
20 యోవాబు తోబుట్టువు అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడు వందలమందిని హతమార్చాడు. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరుప్రతిష్ఠలు పొందాడు. 21 అతడు ఆ ముగ్గురికంటే రెండంతలుగా గౌరవించబడ్డాడు. అతడు వారికి అధిపతి అయ్యాడు గానీ వారిలో ఒకడుగా ఎంచబడలేదు.
22 కబ్సేల్ గ్రామంవాడూ యెహోయాదా కొడుకూ అయిన బెనాయా కూడా పరాక్రమశాలి. అతడు గొప్ప సాహస కార్యాలను చేసేవాడు. అతడు మోయాబువాళ్ళలో ఇద్దరు మహా శూరులను హతమార్చాడు. మరోసారి చలిమంచు కురుస్తూ ఉన్న రోజున ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. 23 మరొకప్పుడు అతడు అయిదు మూరల ఎత్తుగల ఈజిప్ట్‌వాణ్ణి చంపాడు. ఆ ఈజిప్ట్‌వాడి చేతిలో నేతగాడి దోనిలాంటి ఈటె ఉన్నా బెనాయా దుడ్డుకర్ర చేతపట్టుకొని వాడి మీదికి పోయాడు. ఈజిప్ట్‌వాడి చేతిలో ఉన్న ఈటెను ఊడలాగి దానితోనే వాణ్ణి చంపాడు. 24 యెహోయాదా కొడుకు బెనాయా చేసిన కార్యాలు అలాంటివే. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరు ప్రతిష్ఠలు పొందాడు. 25 ఆ ముప్ఫయి మందిలో ఘనతకెక్కాడు గానీ మొదటి ముగ్గురికి సాటి కాలేదు. దావీదు అతణ్ణి తన రక్షకభటుల మీద అధిపతిగా నియమించాడు.
26 ఆ వీరులు వీరు: యోవాబు తోబుట్టువు అశాహేల్‌; బేత్లెహేం పురవాసి దోదో కొడుకు ఎల్‌హానాను; 27 హరోర్‌వాడు షమ్మోతు; పెలోనువాడు హేలెసు; 28 తెకోవవాడూ ఇక్కేషు కొడుకూ అయిన ఈరా; అనతోతు గ్రామంవాడు అబియెజెరు; 29 హుషాతువాడు సిబ్బెకయి; అహోహివాడు ఈలై; 30 నెటోపాతివాడు మహరయి; నెటోపాతివాడూ బయనా కొడుకూ అయిన హేలెదు; 31 బెన్‌యామీనులో ఉన్న గిబియా గ్రామంవాడూ రీబయి కొడుకైన ఈతయి; పిరాతోనువాడు బెనాయా, 32 గాయషు వాగుల ప్రాంతంవాడు హూరయి; అర్బా గ్రామంవాడు అబీయేల్‌; 33 బహురూం గ్రామం వాడు అజమావెతు; షాలబోను గ్రామంవాడు ఎల్‌యాబా; 34 గిజోనువాడైన హాషేం కొడుకులు; హరారు గ్రామంవాడైన షాగే కొడుకు యోనాతాను; 35 హరారు గ్రామం వాడైన శాకారు కొడుకు అహీయాం; ఊర్ కొడుకు ఎలీపాల్‌; 36 మెకేరాతువాడు హెపెరు; పెలోనువాడు అహీయా; 37 కర్మెల్ గ్రామంవాడు హెజ్రో; ఎజబయి కొడుకు సమరయి; 38 నాతాను తోబుట్టువు యోవేల్‌; హగ్రీ కొడుకు మిబహారు; 39 అమ్మోనువాడు జెలెకు; బెరోతు గ్రామంవాడు నహరయి (అతడు సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలను మోసేవాడు); 40 ఇత్రీ వంశంవాడు ఈరా; ఇత్రీ వంశంవాడు గారేబ్‌; 41 హిత్తివాడు ఊరియా; అహలయి కొడుకు జాబాదు; 42 రూబేను గోత్రంవాడైన షీజా కొడుకూ రూబేనువారికి నాయకుడూ అయిన అదీనా, అతనితో కూడా ఉన్న ముప్ఫయి మంది; 43 మయకా కొడుకు హానాను; మిత్నీవాడు యెహోషాపాతు; 44 ఆష్తెరాతువాడు ఉజ్జీయా; అరోయేర్ పట్టణంవాడైన హోతాం కొడుకులు షామా, యెహీయేల్‌; 45 షిమ్రీ కొడుకు యెదీయేల్‌; తిజి గ్రామంవాడూ యెదీయేల్ తోబుట్టువు అయిన యోహా; 46 మహవవాడు ఎలీయేల్‌; ఎల్‌నయం కొడుకులు యెరీబయి, యోషవయా; మోయాబువాడు ఇతమా; 47 ఎలీయేల్‌; ఓబేదు; మెజోబాయా గ్రామం వాడు యాశీయేల్.