16
1 వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి దానికోసం దావీదు వేసిన డేరాలో ఉంచారు. అప్పుడు వారు దేవుని సన్నిధానంలో హోమ బలులూ శాంతి బలులూ అర్పించారు. 2 హోమబలులూ శాంతిబలులూ అర్పించిన తరువాత యెహోవా పేర దావీదు ప్రజలను దీవించాడు. 3 అప్పుడతడు ఇస్రాయేల్ ప్రజలలో ప్రతి పురుషుడికీ ప్రతి స్త్రీకీ ఒక రొట్టెనూ అంజూరుపండ్ల అడ ఒకదానినీ ఎండిన ద్రాక్షపండ్ల అడ ఒకదానినీ ఇచ్చాడు.
4 తరువాత యెహోవా మందసం ఎదుట సేవ చేయడానికీ ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను కీర్తించడానికీ స్తుతించడానికీ ఆయనకు కృతజ్ఞత అర్పించడానికీ లేవీగోత్రికులలో కొంతమందిని అతడు నియమించాడు. 5 వారిలో నాయకుడు ఆసాపు; జెకర్యా రెండోవాడు; తరువాత యెమీయేల్, షెమీరామోతు, యెహీయేల్, మత్తితయా, ఎలీయాబ్, బెనాయా, ఓబేదెదోం, యెమీయేల్. వారు తంతివాద్యాలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలు వాయించేవాడు. 6 యాజులు బెనాయా, యహజీయేల్ దేవుని ఒడంబడికపెట్టె ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు. 7 ఆ రోజు దావీదు మొదటిసారిగా యెహోవాను గురించిన ఈ స్తుతి కీర్తన ఆసాపు చేతికీ అతని బంధువుల చేతికీ ఇచ్చాడు:
8 యెహోవాకు కృతజ్ఞత అర్పించండి.
ఆయన పేర ప్రార్థన చేయండి.
ఆయన క్రియలను జనాలకు తెలపండి.
9 ఆయనను ఉద్దేశించి పాటలు పాడండి.
స్తుతి గీతాలు చెయ్యండి.
ఆయన చేసే అద్భుతాలన్నిటిని గురించీ
కబుర్లాడుకోండి.
10 ఆయన పవిత్రమైన పేర అతిశయించండి.
యెహోవాను వెదికేవారి హృదయం ఆనందిస్తుంది.
11 యెహోవానూ ఆయన బలాన్నీ వెదకండి.
ఆయన ముఖ సందర్శనాన్ని ఎప్పటికీ వెదకండి.
12 ఆయన సేవకుడైన ఇస్రాయేల్ వంశమా!
ఆయన ఎన్నుకొన్న యాకోబు పిల్లలారా!
13 ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం ఉంచుకోండి.
ఆయన చేసిన ఆశ్చర్యకరమైన క్రియలు,
ఆయన నోటినుంచి వెలువడే న్యాయనిర్ణయాలు
జ్ఞాపకం చేసుకోండి.
14 ఆయన మన దేవుడు యెహోవా.
ఆయన తీర్పులు లోకంలో అంతటా
జరుగుతున్నాయి.
15 తాను చెప్పిన మాట వెయ్యి తరాలు
ఆయన జ్ఞాపకం ఉంచుకొంటాడు.
అబ్రాహాముతో చేసుకొన్న తన ఒడంబడిక,
16 ఇస్సాకుకు ఆయన చేసిన ప్రమాణం
ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకొంటాడు.
17 ఆయన దానిని యాకోబుకు శాసనంగా
స్థిరపరచాడు.
ఇస్రాయేల్‌కు శాశ్వతమైన ఒప్పందంగా
సుస్థిరం చేశాడు.
18 ఆయన ఇలా మాట ఇచ్చాడు:
“కనాను దేశం మీకు వారసత్వంగా ఇస్తాను.
అది మీ భాగం”.
19 అప్పుడు వారిని సులభంగా లెక్కపెట్టవచ్చు.
ఆ కొద్దిమంది ఆ దేశంలో
పరాయివాళ్ళుగా ఉన్నారు.
20 దేశం నుంచి దేశానికి తిరుగాడారు వారు.
ఒక రాజ్యంనుంచి ఇంకో రాజ్యానికి తిరిగారు.
21 యెహోవా “నేను అభిషేకించినవారిని మీరు
ముట్టకూడదు.
నా ప్రవక్తలకు హాని చెయ్యకూడదు” అంటూ
22 ఎవరినీ వారికి హాని చేయనియ్యలేదు.
వారి పక్షాన రాజులను ఆయన హెచ్చరించాడు.
23 సర్వలోక ప్రజలారా! యెహోవాను
సంకీర్తనం చేయండి.
ప్రతిరోజూ ఆయన రక్షణను చాటించండి.
24 ఇతర జనాలలో ఆయన మహిమను
తెలియజేయండి.
అన్ని దేశాల ప్రజలలో ఆయన
అద్భుతాలను వివరించండి.
25 యెహోవా గొప్పవాడు. ఆయన అత్యంత
స్తుతికి యోగ్యుడు.
దేవుళ్ళందరికంటే భయభక్తులకు పాత్రుడు.
26 ఎందుకంటే జనాల దేవుళ్ళంతా
విగ్రహాలు మాత్రమే.
యెహోవా ఆకాశాలను సృజించాడు.
27 మహిమ, వైభవం ఆయన సన్నిధానంలో
ఉన్నాయి.
ఆయన నివాసస్థలంలో బలం, ఆనందం
ఉన్నాయి.
28 జనాంగాల్లారా! యెహోవాకు సమర్పణ చేయండి.
మహత్తు, బలం యెహోవాకు ఆరోపించండి.
29 యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు
ఆరోపించండి.
నైవేద్యం చేతపట్టుకొని ఆయన
సన్నిధానంలోకి రండి.
పవిత్రత అనే సౌందర్యంతో యెహోవాను
ఆరాధించండి.
30 సర్వలోక ప్రజలారా! ఆయన సమక్షంలో
వణకండి.
లోకం స్థిరంగా ఉంది. అది కదలదు.
31 ఇతర జనాలలో ఇలా ప్రకటించండి: “యెహోవా
పరిపాలన చేస్తున్నాడు!”
ఆకాశాలు ఆనందిస్తాయి గాక!
భూమి సంతోషిస్తుంది గాక!
32 సముద్రం, దానిలో ఉన్నదంతా గోష
పెడుతుంది గాక మైదానాలు,
వాటిలో ఉన్నదంతా ఆనంద
ధ్వనులు చేస్తాయి గాక!
33 యెహోవా రాబోతున్నాడు.
భూమిమీది ప్రజానీకానికి తీర్పు తీర్చడానికి
ఆయన వేంచేస్తున్నాడు!
అప్పుడు అడవి చెట్లు ఉత్సాహంతో కేకలు వేస్తాయి.
34 యెహోవా మంచివాడు.
ఆయన అనుగ్రహం శాశ్వతంగా నిలుస్తుంది.
ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోండి.
35 ఇలా చెప్పండి: “దేవా, మా రక్షకా!
మమ్ములను రక్షించు.
మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞత అర్పించేలా
నిన్ను స్తుతించడంలో మాకు అతిశయం కలిగేలా
ఇతర జనాల మధ్య నుంచి మమ్ములను విడిపించి సమకూర్చు.”
36 ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు
శాశ్వతంగా స్తుతి!
అప్పుడు ప్రజలంతా “తథాస్తు” అని చెప్పి యెహోవాను స్తుతించారు. 37  యెహోవా ఒడంబడిక పెట్టె ఎదుట ప్రతిరోజూ జరగవలసిన సేవ క్రమంగా చేయడానికి అక్కడ పెట్టె ఎదుటే దావీదు ఆసాపునూ అతని బంధువులనూ ఉంచాడు. 38 ఓబేదెదోంనూ అతని అరవై ఎనిమిదిమంది బంధువులనూ కూడా అక్కడ ఉంచాడు. యెదూతూను కొడుకు ఓబేదెదోం, హోసా అనేవారు ద్వారపాలకులు. 39 దావీదు యాజి అయిన సాదోకునూ అతని సాటి యాజులనూ గిబియోనులో ఎత్తయిన స్థలంమీద ఉన్న యెహోవా గుడారం దగ్గర ఉంచాడు. 40 యెహోవా ఇస్రాయేల్ ప్రజలకు ఆదేశించిన ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాసి ఉన్నట్టు, ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం క్రమంగా హోమ బలిపీఠం మీద హోమాలు యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు. 41 “యెహోవా అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది” అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితోకూడా అతడు హేమానునూ యెదూతూనునూ పేర్లు చెప్పి ఎన్నుకొన్న ఇంకా కొంతమందినీ నియమించాడు. 42 బూరలు ఊదడానికీ తాళాలునూ దేవుని పాటలతో ఇతర వాద్యాలనూ వాయించడానికీ హేమానునూ యెదూతూనునూ నియమించాడు. యెదూతూను కొడుకులను ద్వారపాలకులుగా అతడు నియమించాడు. 43 ఆ తరువాత ప్రజలంతా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటివారిని దీవించడానికి వారిదగ్గరికి వెళ్ళాడు.