7
1 ఇశ్శాకారు కొడుకులు నలుగురు: తోలా, పువ్వా, యాషూబ్, షిమ్రోను. 2 తోలా కొడుకులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేల్, యహమయి, యిబ్‌షాం, సమూయేల్. వీరు వంశాల నాయకులు, తమ తరాలలో పరాక్రమశాలురు. దావీదు రోజుల్లో తోలా సంతతివారు ఇరవై రెండు వేల ఆరువందల మంది. 3 ఉజ్జీ కొడుకు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకులు మికాయేల్, ఓబద్యా, యోవేల్, ఇష్షీయా. వీరు అయిదుగురు నాయకులు. 4 వారి సంతతివారికి చాలా మంది భార్యలు, పిల్లలు కలగడంచేత వారి వంశావళి ప్రకారం వారిలో ముప్ఫయి ఆరు వేల మంది యుద్ధ సన్నద్ధులున్నారు. 5 ఇశ్శాకారు కుటుంబాలన్నిటికీ చెందిన వీరి బంధువులలో, వారి వంశవృక్షాల ప్రకారం, పరాక్రమశాలురుగా ఉన్నవారు ఎనభై ఏడు వేల మంది.
6  బెన్యామీను ముగ్గురు కొడుకులు: బెల, బకేరు, యెదీయేల్. 7 బెల కొడుకులు అయిదుగురు: ఎసబోను, ఉజ్జీ, ఉజ్జీయేల్, యెరీమోతు, ఈరీ. వీరు వంశ నాయకులు, పరాక్రమశాలురు. వీరి వంశవృక్షంలో నమోదైనవారు ఇరవై రెండు వేల ముప్ఫయి నలుగురు. 8 బకేర్ కొడుకులు: జెమీరా, యోవాష్, ఎలీయెజెర్, ఎల్‌యోయేనయి, ఒమ్రీ, యెరీమోత్, అబీయా, అనాతోత్, ఆలెమెత్. వీరందరూ బకేర్ కొడుకులు. 9 వీరు తమ వంశాల నాయకులు. వారి వంశావళిలో నమోదైనవారు ఇరవైవేల రెండు వందల మంది పరాక్రమశాలురు. 10 యెదీయేల్ కొడుకు: బిల్‌హాను. బిల్‌హాను కొడుకులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్‌షీషు, అహీషహరు. 11 యెదీయేల్ కొడుకులైన వీరందరూ వంశాల నాయకులు. వీరి సంతతివారిలో యుద్ధసన్నద్ధులైన పరాక్రమశాలురు పదిహేడు వేల రెండు వందల మంది. 12 షుప్పీంవారూ హుప్పీంవారూ ఈరు సంతతివారు. హుషీంవారు అహేరు సంతతివారు.
13 నఫ్తాలి కొడుకులు: బిల్‌హాకు జన్మించిన యుహసయేల్, గూనీ, యేసేరు, షిల్లేం.
14 మనష్షే సంతతివారు: అతనికి సిరియా దేశస్ధురాలైన తన ఉంపుడుకత్తె అశ్రీయేల్‌ను కన్నది. ఆమె గిలాదుకు తండ్రి మాకీరును కూడా కన్నది. 15 మాకీరు షుప్పీంవారి, హుప్పీంవారి మధ్యనుంచి ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు. అతని సోదరి పేరు మయకా. రెండో సంతతివాడి పేరు సెలోపెహాదు. అతనికి కూతుళ్ళు మాత్రమే జన్మించారు. 16 మాకీరు భార్య అయిన మయకా కొడుకును కని అతడికి పెరెషు అనే పేరు పెట్టింది. అతడి తమ్ముడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాం, రాకెం. 17 ఊలాం కొడుకు: బెదాను. వీరు మనష్షే మనుమడూ మాకీర్ కొడుకూ అయిన గిలాదు కొడుకులు. 18 మాకీరు సోదరి హమ్మోలెకెతు. ఆమె ఇషోదును, అబీయెజెరును, మహలాను కన్నది. 19 షెమీదా కొడుకులు: అహెయాను, షెకెం, లికీ, అనీయాం.
20 ఎఫ్రాయిం సంతతివారు: అతని కొడుకు షూతలహు, షూతలహు కొడుకు బెరెదు, బెరెదు కొడుకు తాహతు, తాహతు కొడుకు ఎలాదా, ఎలాదా కొడుకు తాహతు, 21 తాహతు కొడుకు జాబాదు, జాబాదు కొడుకు షూతలహు. ఏజెరు, ఎల్‌యాదు తమ దేశంలో పుట్టిన గాతువాళ్ళ పశువులను పట్టుకుపోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు గాతువాళ్ళు వారిని చంపారు. 22 వారి తండ్రి ఎఫ్రాయిం చాలా రోజులు దుఃఖించాడు. అతని సోదరులు వచ్చి అతణ్ణి ఓదార్చారు. 23 ఆ తరువాత అతడు తన భార్యతో మళ్ళీ శయనించాడు. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. తన కుటుంబానికి విపత్తు కలిగినందుచేత ఎఫ్రాయిం అతనికి బెరీయా అని పేరు పెట్టాడు. 24 అతని కూతురు షెయెరా. ఆమె మీదిబేత్‌హోరోను, క్రింది బేత్‌హోరోను, ఉజ్జెను షెయెరాలను ఆమె కట్టించింది. 25 ఎఫ్రాయింకు రెపహు, రెషెపు కూడా జన్మించారు. రెషెపు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను. 26 తహను కొడుకు లద్దాను. లద్దాను కొడుకు అమీహూదు. అమీహూదు కొడుకు ఎలీషామా. 27 ఎలీషామా కొడుకు నూను. నూను కొడుకు యెహోషువ. 28 వారి ఆస్తి, నివాస స్థలాలు: బేతేల్, దాని గ్రామాలు, తూర్పుగా ఉన్న నహరాను, పడమరగా ఉన్న గెజెరు, దాని గ్రామాలు, షెకెం, దాని గ్రామాలు. వారి ప్రాంతం గాజా, దాని గ్రామాలవరకు ఉంది. 29 మనష్షే గోత్ర ప్రదేశం సరిహద్దు పొడుగున బేత్‌షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు ఉన్నాయి. ఈ స్థలాలలో ఇస్రాయేల్ కొడుకైన యోసేపు సంతతివారు కాపురమున్నారు.
30 ఆషేరు కొడుకులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారికి శెరహు సోదరి. 31 బెరీయా కొడుకులు: హెబెరు, మల్కీయేల్. మల్కీయేల్‌కు బిర్‌జాయీత్ జన్మించాడు. 32 హెబెరుకు యపలేట్, షోమేరు, హోతాం, వారి సోదరి షూయా జన్మించారు. 33 యపలేట్ కొడుకులు: పాసకు, బింహాల్, అష్వాతు. వీరు యపలేట్ కొడుకులు. 34 షోమేరు కొడుకులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాం. 35 అతని సోదరుడైన హేలెం కొడుకులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాల్. 36 జోపహు కొడుకులు: సూయ, హర్‌నెపెరు, షూయాల్, బేరీ, ఇమ్రా, 37 బేసెరు, హోదు, షమ్మా, షీల్షా, ఇత్రాను, బేర. 38 ఎతెరు కొడుకులు: యెఫున్నె, పిస్పా, అరా. 39 ఉల్లా కొడుకులు: ఆరహు, హన్నియేల్, రిజెయా. 40 వీరందరూ ఆషేరు సంతతివారు. వారు వంశాల నాయకులు, ప్రఖ్యాతి చెందిన పరాక్రమశాలురు, ప్రముఖ నాయకులు. వారి వంశవృక్షంలో నమోదైన యుద్ధ సన్నద్ధులు ఇరవై ఆరు వేల మంది.