5
1 రూబేను ఇస్రాయేల్‌కు మొదట పుట్టినవాడు. అతడు జ్యేష్ఠుడై ఉన్నా, అతనికి జన్మహక్కు ఇస్రాయేల్ కొడుకు యోసేపు కొడుకులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి పడకెక్కి దానిని అపవిత్రం చేశాడు. కనుక జన్మహక్కు ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు. 2 యూదా తన అన్నదమ్ములకంటే బలప్రభావాలు గలవాడయ్యాడు. అతని వంశంలో నుంచి పరిపాలకుడు వచ్చాడు. అయినా జ్యేష్ఠుడి జన్మహక్కు యోసేపుకు చేకూరింది. 3 ఇస్రాయేల్‌కు మొదట పుట్టిన రూబేను కొడుకులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. 4 యోవేలు సంతతివారు: అతని కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగ్, గోగ్ కొడుకు షిమీ, 5 షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బేల్, 6 బేల్ కొడుకు బేరా. ఇతడు రూబేను గోత్ర నాయకుడుగా ఉన్నప్పుడు అష్షూరు రాజైన తిగ్లత్‌ పిలేసెరు అతణ్ణి బందీగా తీసుకుపొయ్యాడు. 7 వారి తరాల వంశవృక్షంలో ఉన్నట్టు వారి కుటుంబాల ప్రకారం అతని బంధువులు: నాయకుడైన యెహీయేల్, జెకర్యా, 8 యోవేల్‌కు జన్మించిన షెమ మనుమడూ ఆజాజ్ కొడుకూ అయిన బెల. వీరు అరోయేర్‌లో, అక్కడనుంచి నెబో వరకు, బేల్‌మెయోను వరకు కాపురమేర్పరచుకొన్నారు. 9 వారి పశువులు గిలాదు ప్రదేశంలో వృద్ధి అయిన తరువాత, తూర్పుగా యూఫ్రటీస్ నది వరకు వ్యాపించే ఎడారి అంచువరకు వారు కాపురమేర్పరచుకొన్నారు. 10  సౌలు పరిపాలన కాలంలో వారు హగ్రీ జాతివారితో యుద్ధం చేసి వారిని ఓడించారు, గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో హగ్రీవారి నివాస స్థలాలలో కాపురం చేశారు.
11 వారికి ఎదురుగా బాషాను ప్రదేశం లో సల్కా వరకు గాదు గోత్రంవారు నివసించారు. 12 వారిలో నాయకుడు యోవేల్. రెండోవాడు షాపాం. తరువాత యహనయి, షాపాతు. వీరు భాషానులో ఉండేవారు. 13 వారి కుటుంబాల ప్రకారం వారి బంధువులు: మికాయేల్, మెషుల్లాం. షేబ, యూరయి, యకాను, జీయ, ఏబెరు – మొత్తం ఏడుగురు. 14 వీరు హూరీ కొడుకైన అబీహాయిల్ కొడుకులు. హూరీ తండ్రి యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మికాయేల్. మికాయేల్ తండ్రి యెషీషయి. యెషీషయి తండ్రి యహదో. యహదో తండ్రి బూజ్. 15 ఈ కుటుంబ నాయకుడు గూని మనుమడూ అబ్దీయేల్ కొడుకూ అయిన అహీ. 16 గాదు గోత్రంవారు గిలాదులో, భాషానులో, దాని గ్రామాలలో, షారోను ప్రాంతమంతటిలో, దాని పల్లెటూళ్ళలో కాపురం ఉన్నారు. 17 వీరందరూ యూదా రాజైన యోతాం రోజుల్లో, ఇస్రాయేల్ రాజైన యరొబాం రోజుల్లో వంశావళి పత్రాలలో నమోదయ్యారు.
18 రూబేను గోత్రికులలో, గాదు గోత్రికులలో, మనష్షే అర్ధ గోత్రంవారిలో యుద్ధ సన్నద్ధులు నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు. వారు ఈటెను, ఖడ్గాన్ని, విల్లును ప్రయోగించడం నేర్చుకొన్న సమర్థులు. 19 వారు హగ్రీ జాతివాళ్ళతో, యెతూరువాళ్ళతో, నాపీషువాళ్ళతో, నోదాబ్ వాళ్ళతో యుద్ధం చేశారు. 20 వారు యుద్ధంలో దేవునికి మొరపెట్టారు గనుక దేవుడు వారికి సహాయం చేసి, ఆ హగ్రీవాళ్ళనూ వాళ్ళతో ఉన్నవాళ్ళనూ వారి వశం చేశాడు. వారు ఆయనమీద నమ్మకం ఉంచినందుచేత ఆయన వారి ప్రార్థన అంగీకరించాడు. 21 వారు హగ్రీవాళ్ళు ఒంటెలను యాభై వేలు, గొర్రెలను రెండు లక్షల యాభై వేలు, గాడిదలను రెండు వేలు, వాళ్ళలో లక్షమందిని పట్టుకొన్నారు. 22 ఆ యుద్ధం దేవునివల్ల అయింది, గనుక వాళ్ళలో చాలామంది కూలారు. ఇస్రాయేల్‌వారు బందీలుగా వెళ్ళే వరకు వారు హగ్రీవాళ్ళ ప్రాంతంలో కాపురమున్నారు.
23 మనష్షే అర్ధగోత్రంవారు చాలామంది. బాషాను నుంచి బేల్‌హెర్మోనువరకు, శెనీరు, హెర్మోను వరకు ఉన్న ప్రాంతంలో కాపురమేర్పరచుకొన్నారు. 24 వారి కుటుంబాల నాయకులు వీరు: ఎఫెరు, ఇషీ, ఎలీయేల్, అజ్రీయేల్, యిర్మీయా, హోదవయా, యహదీయేల్. వీరు పరాక్రమశాలురు, పేరుపొందిన వారు, కుటుంబాల నాయకులు. 25 అయితే వారు తమ పూర్వీకుల దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు వారి ఎదుట ఆ దేశంలో ఏ జనాలను నాశనం చేశాడో ఆ జనాల దేవుళ్ళను పూజిస్తూ వేశ్యల్లాగా ప్రవర్తించారు. 26 గనుక ఇస్రాయేల్ ప్రజల దేవుడు అష్షూరు రాజు పూల్ (అంటే, అష్షూరు రాజు తిగ్లత్ పిలేసెరు) మనసును పురికొలిపాడు. అతడు వచ్చి, రూబేను గోత్రంవారినీ గాదు గోత్రం వారిని, మనష్షే అర్ధ గోత్రం వారినీ బందీలుగా తీసుకుపోయాడు. అతడు వారిని హాలహుకూ హాబోరుకూ హారాకూ గోజానులోని నదీ ప్రాంతాలకూ తీసుకుపోయాడు. ఈ రోజువరకు వారు ఆ స్థలాలలో ఉన్నారు.