4
1 యూదా కొడుకులు పెరెసు, హెష్రోను, కర్మీ, హూర్, శోబాల్. 2 శోబాల్ కొడుకైన రెవాయాకు యహతు జన్మించాడు. యహతుకు అహూమయి, లహదు జన్మించారు. అవి సొరాతివారి కుటుంబాలు. 3 అబీయేతాం సంతతివారు: యెజ్రేల్, ఇష్మా, ఇద్‌బాషు. వీరి సోదరి పేరు హజ్జెలెల్‌పోని. 4 పెనూయేల్‌కు గెదోరు జన్మించాడు. ఏజెరుకు హూషా జన్మించాడు. వీరందరూ హూర్ సంతతివారు. హూర్ ఎఫ్రాతాకు జ్యేష్ఠుడు, బేత్‌లెహేంకు తండ్రి. 5 తెకోవ తండ్రి అయిన అష్షూరుకు హెలా, నయరా అనే ఇద్దరు భార్యలున్నారు. 6 నయరావల్ల అతనికి అహుజాం, హెపెరు, తేమనీ, హాయహష్తారీ జన్మించారు. వీరు నయరా కన్న కొడుకులు. 7 హెలా కొడుకులు: జెరెతు, సోహరు, ఎత్నాను, కోజ్. 8 కోజ్ ఆనూబ్‌కు, జోబేబాకు, హారుం కొడుకైన అహర్‌హేల్ కుటుంబాలకు తండ్రి.
9 యబ్బేజ్ తన సోదరులకంటే ఘనుడయ్యాడు. అతని తల్లి “బాధతో ఇతణ్ణి కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజ్ అని పేరు పెట్టింది. 10 యబ్బేజ్ ఇస్రాయేల్ ప్రజల దేవునికి ఇలా మొర పెట్టాడు: “నీవు నన్ను రూఢిగా దీవించు. నా భూమి విశాలంగా చెయ్యి. నీ చేయి నాకు తోడుగా ఉండనిచ్చి, కీడు నన్ను బాధపెట్టకుండా దాని నుంచి నన్ను కాపాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించాడు.
11 షూవహు సోదరుడైన కెలూబ్‌కు మెహీరు జన్మించాడు. మెహీరుకు ఎష్తోను జన్మించాడు. 12 ఎష్తోనుకు బేత్‌రాఫా, పాసెయ, తెహిన్నా జన్మించారు. తెహిన్నా ఈర్‌నాహాషుకు తండ్రి. వీరందరూ రేకావారు. 13 కనజ్ కొడుకులు ఒత్‌నీయేల్, శెరాయా. ఒతనీయేల్ కొడుకులు హతతు, యెయానొతయి. 14 యెయానొతయికు ఒఫ్రా జన్మించాడు. శెరాయాకు యోవాబ్ జన్మించాడు. యోవాబ్ “లోహకారుల” లోయలో నివసించేవారికి పూర్వీకుడు. ఆ లోయలో ఉన్నవారంతా లోహకారులు. 15 యెఫున్నె కొడుకైన కాలేబు కొడుకులు: ఈరూ, ఏలా, నయం. ఏలా కొడుకు: కనజ్. 16 యెహల్లెలేల్ కొడుకులు: జీఫు, జీఫా, తీరయా, అశరయేల్. 17 ఎజ్రా కొడుకులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యలలో ఒకతె మిర్యాంనూ, షమ్మయినీ, ఇష్‌బాహునూ కన్నది. ఇష్‌బాహు ఎష్‌టెమోయకు తండ్రి. 18 యెరెదు పెళ్ళిచేసుకొన్న ఫరో కూతురైన బిత్యా కన్న కొడుకులు వీరే. యూదురాలైన అతని భార్యకు గెదోరు తండ్రి అయిన యెరెదు, శోకో తండ్రి అయిన హెబెరు, జానోహ తండ్రి అయిన యెకూతీయేల్ జన్మించారు. 19 నహం సోదరీ, హూదీయా భార్య అయిన స్త్రీకి జన్మించిన కొడుకులు. గర్మీవాడైన కెయిలా తండ్రి, మాయకాతువాడైన ఎష్‌టెమోయ. 20 షీమోను కొడుకులు: అమ్నోను, రిన్నా, బెన్‌హానాను, తీలోను. ఇషీ కొడుకులు: జోహేతు, బెన్‌జోహేతు. 21 యూదా కొడుకైన షీలహు కొడుకులు: లేకా తండ్రి ఏర్, మారేషా తండ్రీ, బేత్ అష్బీయలో ఉన్న సన్నని నారబట్ట నేసేవారి పూర్వీకుడూ అయిన లద్దా, 22 యోకీం, కోజేబావారు, యోవాషు, మోయాబుదేశంలో పరిపాలన చేసిన శారాపు, యాషూబిలెహెం (ఇవి చాలా కాలం క్రిందట వ్రాసిపెట్టిన సంగతులు). 23 వారు నెతాయీంలో, గెదేరాలో నివసించే కుమ్మరివాళ్ళు. వారు రాజు దగ్గర నివసించి రాజు కోసం పని చేసేవారు.
24 షిమ్యోను సంతతివారు: నెమూయేల్, యామీన్, యారీబ్, జెరహు, షావూల్. 25 షావూల్ కొడుకు షల్లూం, షల్లూం కొడుకు మిబ్‌శాం. మిబ్‌శాం కొడుకు మిష్మా. 26 మిష్మా సంతతివారు: మిష్మా కొడుకు హమ్మూయేల్, హమ్మూయేల్ కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు షిమీ. 27 షిమీకి పదహారు మంది కొడుకులు, ఆరుగురు కూతుళ్ళు జన్మించారు. అయితే అతని అన్నదమ్ములకు చాలా మంది పిల్లలు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్టు వారి వంశమంతా వృద్ధికాలేదు. 28 వారు నివాసం చేసిన పట్టణాలు బేర్‌షెబా, మోలాదా, హజర్ షువల్, 29 బిలహా, ఎజెం, తోలాదు, 30 బెతూయేల్, హోర్మా, సిక్లగు, 31 బేత్ మర్కాబోతు, హజరుసూసీం, బేత్‌బీరీ, షరాయిం. దావీదు పరిపాలన వరకు వారు ఆ పట్టణాలలో కాపురమున్నారు. 32 వారి ఊళ్ళు అయిదు – ఏతాం, అయూను, రిమ్మోను, తోకెను, ఆషాను. 33 బేల్ వరకు ఆ పట్టణాల చుట్టూరా ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు. వంశావళి పట్టీలు వారికి ఉన్నాయి. 34 మెషోబాబ్, యమ్లేకు, అమజ్యా కొడుకైన యోషా, 35 యోవేల్, అశీయేల్‌కు జన్మించిన శెరాయా మనుమడూ యోషిబయా కొడుకూ అయిన యెహూ, 36 ఎల్‌యోయేనయి, యాహకోబా, యెషోయాయా, అశాయా, అదీయేల్, యెశీమీయేల్, బెనాయా, 37 షిపి కొడుకు జీజా. షిపి తండ్రి అల్లోను. అల్లోను తండ్రి యదాయా. యదాయా తండ్రి షిమ్రీ. షిమ్రీ తండ్రి షెమయా.
38 ఈ వంశవృక్షంలో ఎవరి పేర్లు వ్రాసి ఉన్నాయో వారు తమ కుటుంబాలకు నాయకులు. ఈ కుటుంబాలు అధికంగా వృద్ధి అయ్యాయి. 39 వారు తమ మందలకోసం మేత వెదకడానికి లోయలో తూర్పుగా ఉన్న గెదోరు వరకు వెళ్ళారు. 40 అక్కడ మంచి బలమైన మేత దొరికింది. ఆ ప్రాంతం విశాలమైనది, నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. మునుపు హాము వంశంవారిలో కొంతమంది అక్కడ కాపురముండేవారు. 41 ఆ వంశవృక్షంలో పేర్లున్న వీరు హిజ్కియా రోజులలో అక్కడికి వెళ్ళి, హాము వంశంవారినీ, అక్కడున్న మయోను వాళ్ళనూ హతం చేసి, వాళ్ళ ఇండ్లను పడగొట్టారు. తమ మందలకు మేత దొరికినందుచేత వాళ్ళ స్థలంలో కాపురమేర్పరచుకొన్నారు. నేటి వరకు వారు అక్కడ ఉన్నారు. 42 ఈ షిమ్యోను వంశంవారిలో అయిదు వందల మంది శేయీర్ కొండసీమకు వెళ్ళారు. ఇషీ కొడుకులైన పెలటయా, నెయరయా, రెఫాయా, ఉజ్జీయేల్ వారికి నాయకులు. 43 అమాలేకు జాతివారిలో తప్పించుకొని అక్కడ కాపురమున్న మిగతా వాళ్ళను హతం చేశారు. నేటి వరకు వారు అక్కడ నివాసం చేస్తున్నారు.