24
1 ✝యెహోయాకీం రోజుల్లో బబులోను రాజైన నెబుకద్‌నెజరు✽ జెరుసలం మీదికి వచ్చాడు. మూడేళ్ళు యెహోయాకీం అతడికి లొంగి ఉన్నాడు. తరువాత అతడి మీద తిరుగుబాటు చేశాడు. 2 అయితే యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి యెహోవా దానిమీదికి కల్దీయవాళ్ళ సేనాంగాన్నీ, సిరియనుల, మోయాబువాళ్ళ, అమ్మోనువాళ్ళ సేనాంగాలనూ పంపించాడు✽. ఇది యెహోవా తన సేవకులైన ప్రవక్తల✽ద్వారా చెప్పినట్టు జరిగింది. 3 యూదామీదికి వచ్చినదంతా యెహోవా ఆజ్ఞప్రకారమే వచ్చింది. మనష్షే✽ చేసిన పాపాలన్నిటి కారణంగా, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తం కారణంగా యూదాప్రజలను తన సముఖంలో లేకుండా చేయాలని యెహోవా సంకల్పించాడు. 4 ✽ మనష్షే నిరపరాధుల రక్తంతో జెరుసలం నింపాడు. అది క్షమించడానికి యెహోవా ఇష్టపడలేదు. 5 యెహోయాకీంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయి. 6 యెహోయాకీం కన్ను మూసి✽ అతడి పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోయాకీను✽ రాజయ్యాడు.7 ✽ఆ రోజుల్లో ఈజిప్ట్‌వాగు నుంచి యూఫ్రటీసునది వరకు ఈజిప్ట్ రాజు వశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకొన్నాడు. గనుక ఈజిప్ట్ రాజు తన సొంత దేశంలోనే ఉండిపోయాడు.
8 యెహోయాకీను రాజయినప్పుడు పద్ధెనిమిదేళ్ళవాడు. అతడు జెరుసలంలో మూడు నెలలు పరిపాలించాడు. జెరుసలం నగరవాసి ఎల్నాతాను కూతురు నెహుష్తా అతడి తల్లి. 9 అతడి తండ్రి చేసినట్టే అతడూ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.
10 అతడి కాలంలో బబులోను రాజైన నెబుకద్‌నెజరు సైన్యం జెరుసలంమీదికి వచ్చి దానిని ముట్టడి వేసింది. 11 వాళ్ళు నగరాన్ని ముట్టడిస్తూ ఉంటే బబులోను రాజైన నెబుకద్‌నెజర్ తానే దానిమీదికి వచ్చాడు. 12 యూదా రాజు యెహోయాకీను, అతడి తల్లి, అతడి పరివారం, అతడి క్రింద అధిపతులు, రాజభవన అధికారులు, నగరం వెలుపల బబులోను రాజు దగ్గరికి వెళ్ళి అతడికి అధీనులయ్యారు. బబులోను రాజు పరిపాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును ఖైదీగా✽ చేశాడు. 13 ✝అప్పుడతడు యెహోవా ఆలయంలో నుంచీ రాజభవనంలో నుంచీ విలువైన వస్తువులన్నిటినీ బయటికి తెప్పించాడు. ఇస్రాయేల్ రాజైన సొలొమోను యెహోవా ఆలయంకోసం చేయించిన బంగారు పాత్రలన్నిటినీ బబులోను రాజు ముక్కలు చేశాడు. ఈ విషయం యెహోవా అంతకుముందే తెలియజెప్పాడు. 14 ✝బబులోను రాజు జెరుసలం నగరవాసులందరినీ ఖైదీలుగా తీసుకువెళ్ళాడు. వారిలో పది వేలమంది అధికారులూ యుద్ధవీరులూ ఉన్నారు. జెరుసలంలో ఉన్న కంసాలి వారందరినీ కమ్మరివారందరినీ కూడా తీసుకువెళ్ళాడు. దేశప్రజలలో దీనావస్థలో ఉన్న బీదలు మాత్రమే మిగిలారు. 15 ✝అతడు యెహోయాకీనును బబులోనుకు తీసుకుపోయాడు. రాజు తల్లినీ రాజు భార్యలనూ రాజభవన అధికారులనూ దేశంలో ఉన్న ప్రముఖులనూ దేశభ్రష్టులను చేసి జెరుసలంనుంచి బబులోనుకు తీసుకుపోయాడు. 16 జెరుసలంలో యుద్ధంలో ఆరితేరిన బలాఢ్యులైన పరాక్రమవంతులందరూ ఏడు వేలమంది. కంసాలివారు, కమ్మరివారు వెయ్యిమంది. బబులోను రాజు వారిని బందీలుగా బబులోనుకు తీసుకువెళ్ళాడు. 17 ✝బబులోనురాజు యెహోయాకీను పినతండ్రి అయిన మత్తన్యాను అతడి స్థానంలో రాజుగా చేశాడు. అతడికి సిద్కియా అనే వేరే పేరు పెట్టారు.
18 ✽సిద్కియా రాజయినప్పుడు అతడి వయసు ఇరవైయొక్క సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. లిబ్నా పట్టణస్థుడైన యిర్మీయా కూతురు హమూటల్ అతడి తల్లి. 19 ✝యెహోయాకీం చేసినట్టే అతడూ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 20 తరువాత సిద్కియా బబులోను మీద తిరుగుబాటు చేశాడు. యెహోవా జెరుసలంవారినీ యూదావారినీ తన సముఖం నుంచి వెళ్ళగొట్టేవరకూ అక్కడ ఇదంతా జరగాలని యెహోవా ఆగ్రహం✽తో సంకల్పించాడు.