25
1  సిద్కియా పరిపాలిస్తున్న తొమ్మిదో ఏట, పదో నెల, పదోరోజున బబులోను రాజైన నెబుకద్‌నెజరు తన సైన్యమంతటితో జెరుసలం మీదికి వచ్చాడు. వాళ్ళు దానిని చుట్టుముట్టారు. దాని చుట్టూరా ముట్టడి దిబ్బ కట్టారు. 2 సిద్కియా రాజు పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకు వాళ్ళు నగరాన్ని ముట్టడిస్తూనే ఉన్నారు. 3 ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున నగరంలో కరవు తీవ్రంగా ఉన్నప్పుడు నగర ప్రాకారాలలో రంధ్రాలు చేయడం జరిగింది. 4 కల్దీయవాళ్ళు నగరం చుట్టూ ఉన్నా, రాజూ సైనికులందరూ రాత్రివేళ రాజు తోట దగ్గర ఉన్న రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పారిపోయాడు. రాజు అరాబా లోయ వైపుకు వెళ్ళాడు. 5 అయితే కల్దీయవాళ్ళు రాజు వెంటబడి అతణ్ణి యెరికో మైదానాల ప్రాంతంలో పట్టుకొన్నారు. అతడి సైన్యం అతడి దగ్గరనుంచి చెల్లాచెదురు అయ్యారు. 6 రాజును పట్టుకొని వాళ్ళు రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకువచ్చారు. బబులోను రాజు అతడికి శిక్ష విధించాడు. 7 వాళ్ళు సిద్కియా కొడుకులను అతడి కళ్ళెదుటే వధించారు. అప్పుడు సిద్కియా కళ్ళు ఊడపెరికారు. తరువాత అతణ్ణి కంచు సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకువెళ్ళారు.
8  ఆ సంవత్సరంలోనే అయిదో నెల ఏడో రోజున (బబులోను రాజైన నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న పందొమ్మిదో సంవత్సరం) బబులోను రాజు సేవకుడూ రక్షక భటుల అధిపతీ అయిన నెబూజరదాను జెరుసలంకు వచ్చాడు. 9 అతడు యెహోవా ఆలయాన్నీ రాజభవనాన్నీ జెరుసలంలోని భవనాలన్నిటినీ తగలబెట్టించాడు. 10 రక్షక భటుల నాయకుడితోపాటు వచ్చిన కల్దీయవాళ్ళ సైనికులు జెరుసలం చుట్టు ఉన్న ప్రాకారాలను పడగొట్టారు. 11 ఆ తరువాత నగరంలో మిగిలినవారినీ, బబులోను రాజు పక్షం చేరిన వారినీ, మిగతా సామాన్య ప్రజలనూ రక్షకభటుల అధిపతి అయిన నెబూజరదాను బందీలుగా తీసుకుపోయారు. 12 అయితే అతడు ద్రాక్షతోటలలో పని చేయడానికీ సేద్యం చేయడానికీ దేశంలోని అతి బీదవారిలోను కొంతమందిని ఉండనిచ్చాడు.
13 కల్దీయవాళ్ళు యెహోవా ఆలయంలో ఉన్న కంచు వస్తువులను ముక్కలు చేసి, కంచు స్తంభాలనూ పీటలనూ కంచు సరస్సునూ బబులోనుకు తీసుకుపోయారు. 14 ఆలయం సేవకు ఉపయోగించే కుండలనూ పెద్దపెద్ద గరిటెలనూ కత్తెరలనూ ధూపార్తులనూ కంచు పాత్రలన్నిటినీ కూడా తీసుకుపోయారు. 15 నిప్పు తెచ్చే పాత్రలనూ బంగారంతో గానీ వెండితో గానీ చేసిన పాత్రలన్నిటినీ కూడా రక్షకభటుల అధిపతి తీసుకుపోయాడు. 16 యెహోవా ఆలయంకోసం సొలొమోను చేయించిన కంచు పాత్రలన్నీ, ఆ రెండు కంచు స్తంభాలు, ఆ కంచు సరస్సు, ఆ కంచు పీటల బరువు చూడడానికి వీలు లేకుండా ఉంది. 17 ఒక్కొక్క స్తంభం ఎత్తు పద్ధెనిమిది మూరలు. ఆ స్తంభాల మీద ఉన్న పీటలు కూడా కంచుతో చేసినవి. ఆ పీటల ఎత్తు మూడు మూరలు. ఆ పీటల చుట్టు అల్లిక పని, దానిమ్మ పండ్లు కూడా కంచువి. రెండు స్తంభాలు అలాగే ఉన్నాయి.
18 రక్షకభటుల అధిపతి ప్రముఖయాజి అయిన శెరాయానూ రెండో యాజి అయిన జెఫన్యానూ ముగ్గురు ద్వారపాలకులనూ పట్టుకొన్నాడు. 19 సైనికుల అధికారినీ, నగరంలో కనిపించిన రాజు మిత్రులను అయిదుగురినీ, మనుషులను సైన్యంలో చేర్చే అధిపతి యొక్క లేఖకుణ్ణీ, దేశప్రజలలో అరవైమందినీ కూడా నగరం నుండి తీసుకుపోయాడు. 20 రక్షకభటుల అధిపతి అయిన నెబూజరదాను వారిని ఖైదీలుగా రిబ్లాలో ఉన్న బబులోను రాజుదగ్గరికి తీసుకుపోయాడు. 21  బబులోను రాజు హమాతు ప్రాంతంలో రిబ్లాలోనే వారిని కూలగొట్టి చంపాడు. ఈ విధంగా యూదా ప్రజలు వారి దేశం నుంచి బందీలుగా తీసుకుపోవడం జరిగింది. 22 అయితే బబులోను రాజు నెబుకద్‌నెజరు యూదాదేశంలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు అహీకాం కొడుకూ షాఫాను మనుమడూ అయిన గెదల్యాను అధికారిగా నియమించాడు. 23 బబులోను రాజు గెదల్యాను నియమించాడని యూదా సైన్యంలో మిగిలిన అధిపతులకూ సైనికులకూ వినవచ్చింది. అప్పుడు వాళ్ళు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. ఆ అధిపతులు నెతన్యా కొడుకైన ఇష్మాయేల్, కారేహ కొడుకైన యోహానాను, నెటోపాతివాడైన తనహుమెతు కొడుకైన శెరాయా, మాయాకాతివాళ్ళలో ఒకడి కొడుకైన యజన్యా. వాళ్ళూ వాళ్ళ సైనికులంతా గెదల్యా దగ్గరికి వచ్చారు.
24 గెదల్యా వాళ్ళతో శపథం చేశాడు – “కల్దీయవాళ్ళ అధికారులకు మీరు భయపడకండి. దేశంలో ఉండండి. మీరు బబులోను రాజుకు సేవ చేస్తూ ఉంటే మీకు క్షేమంగా ఉంటుంది” అన్నాడు.
25 అయితే ఏడో నెలలో ఎలీషామా మనుమడూ నెతన్యా కొడుకూ అయిన ఇష్మాయేల్ పదిమంది మనుషులను వెంటబెట్టుకొని గెదల్యా దగ్గరికి వచ్చి అతణ్ణి హతం చేశాడు. మిస్పాలో గెదల్యాతో ఉన్న యూదావారినీ కల్దీయవాళ్ళనూ కూడా చంపాడు. ఈ ఇష్మాయేల్ రాజవంశంలో పుట్టినవాడు. 26 అప్పుడు ప్రజలంతా – ఘనులేమి, అల్పులేమి – సైనికుల అధిపతులు కల్దీయవాళ్ళకు భయపడి లేచి ఈజిప్ట్‌కు పారిపోయారు.
27 యూదా రాజైన యెహోయాకీను ఖైదులో ఉన్న ముప్ఫయి ఏడో ఏట పన్నెండో నెల ఇరవై ఏడో రోజున బబులోను రాజైన ఎవీల్‌మెరోదక్ అతణ్ణి ఖైదు నుంచి విడిపించాడు. ఎవీల్‌మెరోదక్ ఆ సంవత్సరంలోనే రాజయ్యాడు. 28 అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల ఆసనాలకంటే గౌరవనీయమైన ఆసనాన్ని అతడికిచ్చాడు. 29 యెహోయాకీను ఖైదు బట్టలు తీసివేసి వేరే వస్త్రాలు ధరించుకొని తాను బ్రతికి ఉన్నంతకాలం బబులోను రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు. 30 అతడు బ్రతికి ఉన్నంతవరకు రాజు ప్రతి రోజూ క్రమంగా అతడికి బత్తెం ఇచ్చేవాడు.