23
1 అప్పుడు రాజు యూదాలోనూ జెరుసలంలోనూ ఉన్న పెద్దలందరినీ తన దగ్గరికి పిలిపించాడు. 2 ✝ఆ తరువాత రాజు యెహోవా ఆలయానికి వెళ్ళాడు. అతనితో కూడా యూదా మనుషులంతా, జెరుసలం నగరవాసులంతా, యాజులు, ప్రవక్తలు – ఘనులే గానీ అల్పులే గానీ – ప్రజలంతా వెళ్ళారు. అక్కడ వారంతా వినేలా యెహోవా ఆలయంలో కనిపించిన ఒడంబడిక గ్రంథంలో ఉన్న మాటలన్నీ రాజు చదివి వినిపించాడు. 3 ఆ తరువాత రాజు ఒక స్తంభం✽ దగ్గర నిలుస్తూ, యెహోవాను అనుసరిస్తామని యెహోవా సన్నిధానంలో ఒడంబడిక✽ చేశాడు. దొరికిన గ్రంథంలో వ్రాసి ఉన్న ఒడంబడిక మాటలన్నీ నెరవేర్చడానికి యెహోవా ఆజ్ఞలనూ శాసనాలనూ చట్టాలనూ – హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో అనుసరిస్తామని ఒడంబడిక చేశాడు. ప్రజలంతా ఆ ఒడంబడికకు సమ్మతించారు.✽4 ✽రాజు ప్రముఖయాజి అయిన హిల్కీయానూ క్రింది ఉద్యోగస్థులైన యాజులనూ ద్వారపాలకులనూ పిలిపించాడు. బయల్‌దేవుడికీ అషేరాదేవికీ సూర్యచంద్ర నక్షత్రాల సమూహానికీ చేసి ఉన్న వస్తువులన్నిటినీ యెహోవా ఆలయంనుంచి బయటికి తేవాలని రాజు వారికి ఆజ్ఞాపించాడు. రాజు ఆ వస్తువులను జెరుసలం వెలుపల కిద్రోను పొలాల్లో కాల్చివేశాడు, ఆ బూడిద బేతేల్‌కు పంపివేశాడు. 5 అంతకుముందు యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని యోషీయారాజు తొలగించాడు. ఆ పూజారులు✽ ఎత్తయిన పూజాస్థలాల✽ మీద, యూదా పట్టణాలలో, జెరుసలం చుట్టు ఉన్న స్థలాలలో ధూపం వేసేవాళ్ళు; బయల్‌దేవుడికీ సూర్యచంద్ర నక్షత్ర సముదాయాలకూ✽ – ఆకాశంలో ఉన్న సమూహమంతటికీ ధూపం వేసేవాళ్ళు. రాజు వాళ్ళందరినీ తొలగించివేశాడు. 6 అతడు యెహోవా ఆలయం నుంచి జెరుసలం వెలుపల ఉన్న కిద్రోను వాగు దగ్గరికి అషేరాదేవి స్తంభాన్ని తెప్పించాడు, అక్కడ దానిని కాల్చివేశాడు. పొడిగా నలగగొట్టాడు. పొడిని బహిరంగ శ్మశానం మీద చల్లాడు. 7 ✝యెహోవా ఆలయ ఆవరణంలో ఉన్న పురుష సంపర్కుల గదులను రాజు పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అషేరాదేవి పూజ కోసం వస్త్రాలను అల్లేవారు.
8 యోషీయారాజు యూదా పట్టణాలలో ఉన్న యాజులందరినీ జెరుసలంకు తెప్పించాడు. ఆ యాజులు ధూపం వేసే ఎత్తయిన పూజా స్థలాలను – గెబా నుంచి బేర్‌షెబా వరకు – అశుద్ధం చేశాడు. జెరుసలం నగర అధికారి అయిన యెహోషువ ఇంటిద్వారం దగ్గర ఉన్న ఎత్తయిన పూజా స్థలాలను పడగొట్టించాడు (ఆ ఎత్తు స్థలాలు✽ నగరద్వారంలో ప్రవేశించినవారికి ఎడమ వైపు ఉన్నాయి). 9 ఎత్తయిన పూజాస్థలాల దగ్గర సేవ చేసిన ఆ యాజులను జెరుసలంలో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గరికి అతడు సమీపించనివ్వలేదు. అయినా వారు తమ సాటి యాజులదగ్గర పొంగని రొట్టెలు తినగలిగారు.
10 తరువాత ఎవ్వడూ తన కొడుకును గానీ కూతురిని గానీ మొలెక్ విగ్రహం ముందు మంటల ద్వారా✽ దాటించకుండా ఉండేలా యోషీయా బెన్‌హిన్నోం లోయలో ఉన్న తోఫెతును అశుద్ధ స్థలంగా చేశాడు. 11 ✽మునుపటి యూదా రాజులు సూర్యుడికి ప్రతిష్ఠించిన గుర్రాలను యోషీయా తొలగించాడు (అవి యెహోవా ఆలయ ద్వారం దగ్గర ఉన్న పరిచారకుడైన నెతన్‌మెలక్ గది దగ్గర ఉన్నాయి). సూర్యుడికి ప్రతిష్ఠించిన రథాలను భస్మం చేశాడు. 12 ✽ ఆహాజు మేడగది పైకప్పుమీద యూదుల రాజులు కట్టించిన బలిపీఠాలనూ యెహోవా ఆలయంయొక్క రెండు ఆవరణాలలో మనష్షే కట్టించిన బలిపీఠాలనూ యోషీయా పడగొట్టాడు. వాటిని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను కిద్రోను వాగులో పారవేశాడు. 13 ✽ గతంలో ఇస్రాయేల్ రాజైన సొలొమోను జెరుసలంకు ఎదురుగా ఉన్న “నాశన పర్వతం”కు కుడివైపుగా ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. సీదోనువాళ్ళు పూజించే అషేరా అనే అసహ్యమైన దేవికీ మోయాబువాళ్ళు పూజించే కెమోష్ అనే అసహ్యమైన వేల్పుకూ అమ్మోనువాళ్ళు పూజించే మిల్కొం అనే అసహ్యమైన వేల్పుకూ సొలొమోను ఆ ఎత్తు స్థలాలను కట్టించాడు. యోషీయారాజు ఆ ఎత్తు స్థలాలను అశుద్ధం చేశాడు. 14 అక్కడి విగ్రహాలను ముక్కలు చేశాడు. అషేరాదేవి స్తంభాలను పడగొట్టాడు. ఆ స్థలాలు మనుషుల ఎముకలతో✽ నింపాడు.
15 ✽ బేతేల్‌లో ఉన్న బలిపీఠాన్ని కూడా రాజు పడగొట్టించాడు. నెబాతు కొడుకు యరొబాం ఆ ఎత్తయిన పూజాస్థలం కట్టించి దాని వల్ల ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించాడు. యోషీయారాజు ఆ బలిపీఠాన్నీ ఆ ఎత్తయిన పూజా స్థలాన్నీ పడగొట్టించాడు. దానిని కాల్చివేసి పొడిగా చేశాడు. అషేరాదేవి స్తంభాన్ని కూడా కాల్చివేశాడు. 16 యోషీయా వెనుకకు తిరిగినప్పుడు ఆ కొండమీద సమాధులు కనిపించాయి. అతడు మనుషులను పంపి ఆ సమాధులలోనుంచి ఎముకలను తెప్పించాడు. వాటిని అక్కడి బలిపీఠం మీద కాల్చి దానిని అశుద్ధం చేశాడు. దేవుని మనిషి గతంలో చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది. 17 ✝యోషీయా “అదుగో నాకు కనిపిస్తున్న జ్ఞాపకార్థ స్తంభం ఏమిటి?” అని అడిగాడు.
అందుకు ఆ ఊరివారు అతనికి ఇలా బదులు చెప్పారు: “అది యూదా నుంచి వచ్చిన దేవుని మనిషి సమాధి. మీరు ఈ బలిపీఠానికి చేసినదాన్ని గురించి అతడు చాటించాడు.”
18 యోషీయా “అది అలాగే ఉంచండి. ఆయన ఎముకలు కదల్చకూడదు” అన్నాడు. గనుక అతని ఎముకలను షోమ్రోనునుంచి వచ్చిన ప్రవక్త ఎముకలతో పాటు అలాగే ఉండనిచ్చారు.
19 మునుపు ఇస్రాయేల్ రాజులు షోమ్రోను పట్టణాలలో ఎత్తయిన పూజాస్థలాలమీద గుళ్ళను కట్టించి యెహోవాకు కోపం రేపారు. యోషీయా వాటన్నిటినీ పడగొట్టించాడు. బేతేల్ బలిపీఠానికి ఎలా జరిగించాడో వాటికీ అలాగే జరిగించాడు. 20 ✽ ఆ ఎత్తయిన పూజాస్థలాల పూజారులందరినీ వాటి బలిపీఠాలమీద వధించాడు. ఆ బలిపీఠాలమీద మనుషుల ఎముకలను కాల్చివేశాడు. ఆ తరువాత అతడు జెరుసలం తిరిగి వచ్చాడు.
21 అప్పుడు రాజు ప్రజలందరికీ “ఈ ఒడంబడిక గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు మీ దేవుడు యెహోవాకు పస్కాపండుగ✽ ఆచరించండి” అని ఆజ్ఞ జారీ చేశాడు. 22 అలాంటి పస్కా పండుగ ఇస్రాయేల్‌ప్రజకు న్యాయం తీర్చిన నాయకుల కాలం నుంచి వారు ఆచరించలేదు, ఇస్రాయేల్ రాజులూ యూదా రాజులూ పరిపాలించిన కాలమంతట్లో ఆచరించలేదు. 23 యోషీయారాజు పరిపాలిస్తున్న పద్ధెనిమిదో సంవత్సరంలో, జెరుసలంలో, ఈ పస్కాపండుగ యెహోవాకు ఆచరించాడు.
24 యెహోవా ఆలయంలో హిల్కీయాకు కనిపించిన గ్రంథంలోని ధర్మశాస్త్ర వాక్కులను నెరవేర్చడానికి యోషీయా ప్రయత్నం చేశాడు, గనుక మాంత్రికులనూ✽ పూనకం వచ్చి పలికేవాళ్ళనూ గృహదేవతలనూ✽ విగ్రహాలనూ యూదాలోనూ జెరుసలంలోనూ కనబడ్డ అసహ్యమైనవాటన్నిటినీ తొలగించాడు. 25 ✽అతడు హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బలమంతటితో యెహోవావైపు తిరిగాడు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించాడు. అతనికంటే ముందు ఉన్న రాజులలో అతనిలాంటి రాజు ఎవ్వడూ లేడు. అతని తరువాత వచ్చిన రాజులలో కూడా లేడు.
26 అయినా యెహోవా యూదావారి మీద ఉన్న తన మహా కోపోద్రేకం నుంచి మళ్ళలేదు. మనష్షే✽ ఆయనకు రేపిన ఆ కోపాగ్ని✽ ఇంకా మండుతూనే ఉంది. 27 గనుక యెహోవా ఇలా అనుకొన్నాడు: “నేను ఇస్రాయేల్✽ప్రజను చేసినట్టు యూదా ప్రజను కూడా నా సముఖంలో లేకుండా చేస్తాను. నేను ఎన్నుకొన్న ఈ జెరుసలం నగరాన్ని, నా పేరు✽ అక్కడ ఉంటుందని చెప్పిన ఈ ఆలయాన్ని విసర్జిస్తాను.”✽
28 యోషీయాను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదారాజుల చరిత్ర గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయి. 29 ✽ అతని పరిపాలన కాలంలో ఈజిప్ట్ రాజైన ఫరో నెకో యూఫ్రటీసునది దగ్గర అష్షూరు రాజుతో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాడు. యోషీయారాజు అతణ్ణి ఎదురుకోబోయాడు. ఈజిప్ట్ రాజు యోషీయాను చూచి చంపాడు. ఇది మెగిద్దో దగ్గర జరిగింది. 30 ✝యోషీయా సేవకులు అతని మృత దేహాన్ని రథంలో జెరుసలం తీసుకువచ్చారు. అతని సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అప్పుడు దేశప్రజలు యోషీయా కొడుకు యెహోయాహాజును పట్టాభిషేకం చేసి అతడి తండ్రి స్థానంలో రాజుగా చేశారు.
31 యెహోయాహాజు రాజయినప్పుడు అతడు ఇరవై మూడేళ్ళవాడు. అతడు జెరుసలంలో మూడు నెలలు పరిపాలించాడు. లిబ్నా పట్టణస్థుడైన యిర్మీయా కూతురు హమూటలు అతడి తల్లి. 32 యెహోయాహాజు తన పూర్వీకులు✽ చేసిన ప్రకారమే యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 33 హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లా✽లో ఫరో నెకో అతణ్ణి ఖైదీగా చేశాడు, అతణ్ణి జెరుసలంలో పరిపాలించకుండా చేశాడు, యూదామీద మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండిని, ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల బంగారాన్ని కప్పంగా నిర్ణయించాడు. 34 ✽ఫరోనెకో యోషీయా కొడుకైన ఎల్యాకీంను యోషీయా స్థానంలో రాజుగా చేశాడు. అతడి పేరు యెహోయాకీంగా మార్చాడు. యెహోయాహాజును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళాడు. అతడు అక్కడే చనిపోయాడు. 35 ఫరోనెకో నిర్ణయించిన ఆ వెండి బంగారాలు యెహోయాకీం అతడికి ఇచ్చాడు. అలా చేయడానికి దేశం మీద కప్పం నిర్ణయించి దేశప్రజలలో ఒక్కొక్కరి దగ్గర వారి వారి ఆస్తిపాస్తుల ప్రకారం వసూలు చేయించాడు.
36 ✝యెహోయాకీం రాజయినప్పుడు అతడు ఇరవై అయిదేళ్ళవాడు, అతడు జెరుసలంలో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. రూమా ఊరివాడైన పెదాయా కూతురు జెబూదా అతడి తల్లి. 37 అతడి పూర్వీకులు చేసినట్టే అతడూ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.