22
1 యోషీయా రాజయినప్పుడు అతడి వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు జెరుసలంలో ముప్ఫయి ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కత్ గ్రామస్థుడైన అదాయా కూతురు. 2 యోషీయా యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. అతడు తన పూర్వీకుడు దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించేవాడు. దాని నుంచి కుడి వైపుకు గానీ ఎడమ వైపుకు గానీ వైదొలిగినవాడు కాదు.
3 యోషీయారాజు పరిపాలిస్తున్న పద్ధెనిమిదో సంవత్సరంలో అతడు లేఖకుడైన షాఫానును యెహోవా ఆలయానికి పంపాడు. (షాఫాను అజల్యా కొడుకు, మెషుల్లాం మనుమడు.) రాజు అతడికి ఇలా ఆదేశించాడు: 4  “నీవు ప్రముఖయాజి అయిన హిల్కీయా దగ్గరికి వెళ్ళు. యెహోవా ఆలయానికి వచ్చే ప్రజలనుంచి ద్వారపాలకులు వసూలు చేసిన వెండి నాణేల మొత్తాన్ని చూడాలని హిల్కీయాతో చెప్పు. 5 వారు ఆ డబ్బును యెహోవా ఆలయంలో పని చేస్తున్న తనిఖీదారుల చేతికి అప్పచెప్పాలి. తనిఖీదారులు ఆ డబ్బును యెహోవా ఆలయాన్ని మరమ్మత్తు చేసే పనివాళ్ళకు – 6 వడ్రంగులకూ కట్టేవారికీ తాపీపనివారికీ – ఇవ్వాలి; ఆలయాన్ని మరమ్మత్తు చేయడానికి కలప మ్రానుల కోసం, చెక్కిన రాళ్ళ కోసం కూడా ఆ డబ్బు ఖర్చు చేయాలి. 7  వారి చేతికి అప్పగించే డబ్బుకు వారినుంచి లెక్కలు అడగవద్దు. వారు నిజాయితీపరులు.”
8 ప్రముఖయాజి అయిన హిల్కీయా లేఖకుడైన షాఫానుతో “యెహోవా ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు కనిపించింది” అన్నాడు. హిల్కీయా ఆ గ్రంథం షాఫాను చేతికిచ్చాడు. షాఫాను అది చదివాడు. 9 లేఖకుడైన షాఫాను రాజుదగ్గరికి తిరిగి వచ్చి ఇలా తెలియచెప్పాడు:
“మీ సేవకులు యెహోవా ఆలయంలో ఉన్న వెండి జమ చేసి ఆలయంలో పని చేస్తున్న తనిఖీదారుల చేతికి అప్పచెప్పారు.”
10 హిల్కీయాయాజి తనకు ఒక పుస్తకం ఇచ్చాడని రాజుకు చెప్పి దానిని రాజు ఎదుట చదివి వినిపించాడు. 11 రాజు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొన్నాడు. 12 తరువాత హిల్కీయాయాజికీ షాఫాను కొడుకు అహీకాంకూ మీకాయా కొడుకు అక్బోరుకూ లేఖకుడైన షాఫానుకూ అశాయా అనే తన సన్నిహిత సేవకుడికీ రాజు ఇలా ఆజ్ఞాపించాడు:
13  “మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలో ఉన్న మాటలను గురించి నాకోసం, ప్రజలకోసం, యూదా రాజ్యమంతటికోసం యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వీకులు ఈ గ్రంథంలోని మాటలు చెవిని పెట్టలేదు. మన విషయం రాసినవన్నిటి ప్రకారం చేయలేదు.”
14 జెరుసలంలో రెండో భాగంలో దేవుని మూలంగా పలికే స్త్రీ ఒకతె ఉంది. ఆమె షల్లూం భార్య హుల్దా, (షల్లూం తిక్వా కొడుకు, హరహష్ మనుమడు. అతడు వస్త్రశాల అధికారి.) హిల్కీయాయాజి, అహీకాం, అక్బోరు, అశాయా హుల్దాప్రవక్త్రి దగ్గరికి వెళ్ళారు, ఆమెతో మాట్లాడారు. 15 ఆమె వాళ్ళతో ఇలా చెప్పింది:
“మిమ్ములను నాదగ్గరికి పంపినవానికి ఈ మాటలు తెలియజేయండి – ఇస్రాయేల్ దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, 16 యూదా రాజు చదివించిన గ్రంథంలోని మాటల ప్రకారమే నేను ఈ స్థలంమీదికీ దీని కాపురస్థులమీదికీ విపత్తు రప్పిస్తాను. 17 ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన పనులన్నిటివల్ల నాకు కోపం రేపారు. అందుకనే ఈ స్థలంమీద నా కోపాగ్ని రగులుకొని ఉంది. అది ఆరదు. 18 యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్ములను పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి – ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నా వాక్కులు విన్నావు. 19 ఈ స్థలం పాడవుతుందనీ దీని కాపురస్తులు శాపగ్రస్థులవుతారనీ నేను చెప్పిన మాట విని నీవు మెత్తని మనసుతో యెహోవా సముఖంలో వినయంతో తల వంచుకొన్నావు. నీ బట్టలు చించుకొని నా ఎదుట ఏడ్చావు. కనుక నేను నీ ప్రార్థన విన్నాను – యెహోవా ఇలా చెపుతున్నాడు – 20 నేను నిన్ను నీ పూర్వీకులదగ్గరికి చేరుస్తాను; శాంతితో నీవు నీ సమాధికి చేరుకొంటావు. నేను ఈ స్థలంమీదికి రప్పించే విపత్తులో ఏమీ నీ కంటికి కనబడదు.” అప్పుడు ఆ మాటలు వారు రాజు దగ్గరికి వచ్చి చెప్పారు.