21
1  మనష్షే రాజయినప్పుడు అతడి వయస్సు పన్నెండేళ్ళు. అతడు జెరుసలంలో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు హెఫ్సిబా. 2 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇస్రాయేల్ ప్రజల ముందునుంచి యెహోవా వెళ్ళగొట్టిన జనాల మాదిరి అనుసరించి నీచ కార్యాలు చేసేవాడు. 3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఎత్తయిన పూజా స్థలాలను అతడు తిరిగి కట్టించాడు. ఇస్రాయేల్ రాజైన అహాబు చేసినట్టు అతడు బయల్‌దేవుడి బలిపీఠాలను కట్టించాడు, అషేరాదేవి స్తంభాన్ని నిలిపాడు, సూర్యచంద్ర నక్షత్రాల సమూహాన్ని పూజించి కొలిచాడు. 4 యెహోవా తన ఆలయం ఉద్దేశించి “జెరుసలంలో నా పేరు ఉంచుతాన”ని చెప్పాడు. మనష్షే ఆ ఆలయంలో కూడా అలాంటి బలిపీఠాలు కట్టించాడు. 5 యెహోవా ఆలయం రెండు ఆవరణాలలో సూర్యచంద్ర నక్షత్రాల సమూహానికి బలిపీఠాలను కట్టించాడు. 6 తన కొడుకును మంటలద్వారా దాటించాడు. మంత్రవిద్య ప్రయోగించాడు. శకునాలు చూడడం అభ్యాసం చేసుకొన్నాడు. పూనకం వచ్చి పలికేవాళ్ళతోను సోదెగాండ్రతోను కలిసి మెలిసి ఉన్నాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుతనం జరిగిస్తూ, యెహోవాకు కోపం రెచ్చగొట్టాడు. 7 యెహోవా తన ఆలయాన్ని గురించి దావీదుకూ అతడి కొడుకైన సొలొమోనుకూ “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకొన్న జెరుసలంలో, ఈ దేవాలయంలో నా పేరు ఎప్పుడూ ఉంచుతాను” అని చెప్పాడు. ఆ దేవాలయంలో కూడా మనష్షే అషేరాదేవి స్తంభాన్ని చేయించి ఉంచాడు. 8 యెహోవా “నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, నా సేవకుడైన మోషే వారికి ఆదేశించిన ధర్మశాస్త్రం ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటే నేను వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ దేశంనుంచి వారిని వెళ్ళగొట్టను” అన్నాడు. 9 అయితే వారు ఆ మాట వినలేదు. ఇస్రాయేల్ ప్రజల ముందునుంచి యెహోవా నాశనం చేసిన జనాలకంటే ఎక్కువ చెడుగు చేయడానికి మనష్షే వారిని పురికొల్పాడు.
10 యెహోవా తన సేవకులైన ప్రవక్తలచేత ఇలా మాట్లాడించాడు: 11 “యూదా రాజైన మనష్షే ఈ అసహ్య కార్యాలు జరిగించాడు. అతడికంటే ముందు ఉన్న అమోరీవాళ్ళను మించి చెడుగు చేశాడు. అతడు నిలిపిన విగ్రహాలతో యూదా ప్రజలను తప్పుదారి పట్టించాడు. 12 గనుక ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా అనే నేను యూదా మీదికీ జెరుసలం మీదికీ విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్నవాళ్ళ రెండు చెవులు గింగురుమంటాయి. 13 నేను షోమ్రోనునూ అహాబు రాజవంశాన్నీ కొలత తీసుకొన్నట్టు జెరుసలం నగరాన్ని చేస్తాను. ఒక మనిషి గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను జెరుసలంను తుడిచివేస్తాను. 14 వారసత్వంగా ఉన్న నా ప్రజల్లో మిగిలినవారిని చెయ్యి విడిచి వారి శత్రువుల చేతికి అప్పగిస్తాను. 15 వారి పూర్వీకులు ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆ రోజునుంచి ఈ రోజువరకు వారు నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు. అందుకనే వారు వారి శత్రువులందరికీ కొల్లగా దోపిడీసొమ్ముగా ఉంటారు.”
16  యూదా ప్రజ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేలా మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. జెరుసలం ఆ చివరనుంచి ఈ చివరవరకు రక్తంతో నిండింది. 17 మనష్షేను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, అతడు చేసిన పాపాలు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 18 మనష్షే కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. ఉజ్జా అనే తోటలో – అతడి భవనం తోటలో – అతణ్ణి సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఆమోను రాజయ్యాడు.
19 ఆమోను రాజయినప్పుడు అతడి వయసు ఇరవై రెండేళ్ళు. అతడు జెరుసలంలో రెండేళ్ళు పరిపాలించాడు అతడి తల్లి పేరు మెషుల్లేమెత్. ఆమె యొట్బ గ్రామస్థుడైన హారూసు కూతురు. 20 తన తండ్రి మనష్షే లాగే ఆమోను యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 21 అతడు తన తండ్రి కొలిచిన విగ్రహాలను అతడూ కొలిచి పూజించేవాడు. 22 అతడు తన పూర్వీకుల దేవుడు యెహోవాను విడిచి పెట్టాడు, ఆయన మార్గంలో నడుచుకోలేదు. 23 ఆమోను సేవకులు అతడి మీద కుట్ర చేసి అతడి సొంత భవనంలోనే అతణ్ణి చంపారు. 24 అప్పుడు యూదా దేశప్రజలు ఆమోనురాజు మీద కుట్ర చేసినవాళ్ళను హతమార్చారు. అతడి స్థానంలో అతడి కొడుకు యోషీయాను రాజుగా చేశారు. 25 ఆమోనును గురించిన ఇతర విషయాలు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 26 వారు అతణ్ణి ఉజ్జా తోటలో అతడి సమాధిలో పాతిపెట్టారు. అతడి స్థానంలో అతడి కొడుకు యోషీయా రాజయ్యాడు.