20
1 ఆరోజుల్లో హిజ్కియాకు జబ్బు చేసింది. అతడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకైన యెషయాప్రవక్త అతనిదగ్గరికి వచ్చి అతనితో “యెహోవా ఇలా చెపుతున్నాడు – నీవు చనిపోతున్నావు, బ్రతకవు. కనుక నీ ఇంటి విషయాలు సరిపెట్టు” అన్నాడు.
2 అందుకు హిజ్కియా గోడవైపు ముఖం త్రిప్పుకొని యెహోవాకు ప్రార్థన చేశాడు: 3  “యెహోవా! నీ ఎదుట నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో నడుస్తూ ఉండేవాణ్ణి, నీ దృష్టిలో సరిగా ప్రవర్తించేవాణ్ణి. అది తలంచుకొమ్మని నిన్ను ప్రాధేయపడుతున్నాను” హిజ్కియా వెక్కి వెక్కి ఏడ్చాడు.
4 యెషయా రాజభవనం నడిమి ఆవరణంలోనుంచి వెళ్ళేముందు అతనికి యెహోవానుంచి వాక్కు వచ్చింది. 5 “నీవు వెనకకు తిరిగి వెళ్ళి నా ప్రజల నాయకుడైన హిజ్కియాతో ఇలా చెప్పు – నీ పూర్వీకుడైన దావీదు యొక్క దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీ ప్రార్థన నేను విన్నాను. నీ కన్నీళ్ళు చూశాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజున నీవు యెహోవా ఆలయానికి వెళతావు. 6 ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్షు పెంచుతాను. అంతే కాకుండా నిన్నూ ఈ నగరాన్నీ అష్షూరు రాజు చేతి నుంచి రక్షిస్తాను. నాకోసం, నా సేవకుడు దావీదు కోసం ఈ నగరాన్ని కాపాడుతాను.”
7 తరువాత యెషయా “అంజూరు పండ్ల ముద్ద తీసుకురండి” అన్నాడు. వారు దానిని తెచ్చి కురుపుమీద పెట్టారు. హిజ్కియా జబ్బు నయమైంది.
8 హిజ్కియా “యెహోవా నన్ను బాగు చేస్తాడనీ మూడో రోజున నేను యెహోవా ఆలయానికి వెళతాననీ సూచన ఏమిటి?” అని అడిగాడు.
9 దానికి యెషయా “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తాడని ఆయన మీకు ఇచ్చిన సూచన ఇదే – నీడ గడియారం మీద నీడ పది మెట్లు ఇప్పుడు ముందుకు పోవాలా లేక వెనకకు రావాలా? ఏది కోరుకుంటారు?” అన్నాడు.
10  హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు పోవడం సులభమే. నీడ పది మెట్లు వెనకకు రావాలి” అని బదులు చెప్పాడు. 11 అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాను ప్రార్థించాడు. ఆహాజు చేయించిన నీడ గడియారం మీద ముందుకు పోయిన నీడ పది మెట్లు వెనుకకు పోయేలా యెహోవా చేశాడు.
12 ఆ రోజుల్లో బలదాను కొడుకైన మెరోదక్‌బలదాను బబులోనుకు రాజుగా ఉన్నాడు. హిజ్కియాకు జబ్బు చేసిందని విని అతడు లేఖలు, కానుక అతనికి పంపాడు. 13 వచ్చినవాళ్ళు చెప్పినది హిజ్కియా విని వాళ్ళకు తన భవనంలో ఖజానాలో ఉన్నవన్నీ చూపించాడు. బంగారం, వెండి, సుగంధద్రవ్యాలు, పరిమళ తైలం, ఆయుధాల కొట్టు, ధనాగారాలలో ఉన్నవన్నీ వాళ్ళకు చూపించాడు. తన భవనంలో గానీ రాజ్యమంతట్లో గానీ వాళ్ళకు చూపించనిది ఏదీ లేదు.
14 ఆ తరువాత రాజు దగ్గరికి యెహోవా ప్రవక్త యెషయా వచ్చి “ఆ మనుషులు ఏమి చెప్పారు? ఎక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చారు?” అని అడిగాడు.
అందుకు హిజ్కియా “వాళ్ళు బబులోను అనే దూరదేశం నుంచి వచ్చార”ని జవాబిచ్చాడు.
15 “మీ భవనంలో వాళ్ళు ఏమేమి చూశారు?” అని యెషయా అడిగాడు.
హిజ్కియా “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ మరుగు చేయక అన్నీ వాళ్ళకు చూపించాను” అన్నాడు.
16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా చెప్పాడు: “యెహోవా నుంచి వచ్చిన వాక్కు విను. 17 మీ భవనంలో ఉన్నవీ, ఈనాటికీ మీ పూర్వీకులు కూడబెట్టినవీ అన్నీ బబులోనుకు కొల్లగా పోయే సమయం వస్తుంది. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెపుతున్నాడు. 18 మీకు పుట్టబోయే మీ సంతానంలో కొంతమందిని బబులోను వాళ్ళు తీసుకుపోయి బబులోను రాజు నగరులో నపుంసకులుగా చేస్తారు.”
19 హిజ్కియా యెషయాతో “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే” అన్నాడు. తాను బ్రతికి ఉన్నంతకాలం స్థిరమైన సమాధానం ఉంటే మేలే గదా అనుకొన్నాడు.
20 హిజ్కియాను గురించిన ఇతర విషయాలు, అతని బలపరాక్రమాలంతా, అతడు కొలను త్రవ్వించి, కాలువ కట్టించి, నీళ్ళను నగరానికి సరఫరా చేసిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 21 హిజ్కియా కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు మనష్షే రాజయ్యాడు.