19
1 ఆ విషయం విని హిజ్కియారాజు తన బట్టలు చింపుకొన్నాడు, గోనెపట్ట కట్టుకొని యెహోవా ఆలయంలోకి వెళ్ళి, 2 రాజభవనం మీద అధికారి అయిన ఎల్యాకీంను, లేఖకుడు షెబ్నాను, యాజులలో పెద్దవారిని ఆమోజు కొడుకూ, ప్రవక్తా అయిన యెషయా దగ్గరికి పంపాడు. వారంతా గోనెపట్ట కట్టుకొన్నారు.
3 వారు యెషయాతో ఇలా అన్నారు: “హిజ్కియా చెప్పేదేమిటంటే, ఈ రోజు బాధ, చీవాట్లు, తిరస్కారం ఉన్న రోజు. కాన్పుకు వచ్చి కనే శక్తి లేని స్త్రీ లాగా ఉన్నాం. 4 జీవంగల దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన రబ్‌షాకేను పంపించాడు. ఒకవేళ రబ్‌షాకే పలికిన మాటలన్నీ మీ దేవుడు యెహోవా విని అష్షూరు రాజును శిక్షిస్తాడేమో. ఇక్కడ మిగిలి ఉన్న వారికోసం ప్రార్థించండి.”
5 హిజ్కియారాజు యొక్క సేవకులు యెషయా దగ్గరికి వచ్చినతరువాత అతడు వారితో ఇలా అన్నాడు: 6 “మీ యజమానికి ఇలా చెప్పండి – యెహోవా చెప్పేదేమిటంటే, అష్షూరు రాజు క్రిందివాళ్ళు నన్ను దూషిస్తూ చెప్పినమాటలు నీవు విన్నావు. ఆ మాటల కారణంగా భయపడవద్దు. 7 ఇదిగో విను. నేను అతని మనసుకు ఒక ఆలోచన పుట్టిస్తాను; అతడు వదంతి విని తన దేశానికి తిరిగి వెళ్తాడు. తన సొంత దేశంలోనే అతడు ఖడ్గంచేత కూలేలా చేస్తాను.”
8 అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచివెళ్ళి లిబ్నాను ముట్టడిస్తూ ఉన్నాడు. అది విని రబ్‌షాకే తిరిగి వెళ్ళి అష్షూరు రాజును కలుసుకొన్నాడు. 9 కూష్ రాజైన తర్‌హాకా తనమీదికి యుద్ధానికి బయలుదేరి వస్తున్నట్టు అష్షూరు రాజు విన్నాడు గనుక అతడు వార్తాహరులను హిజ్కియా దగ్గరికి మళ్ళీ పంపిస్తూ ఇలా అన్నాడు:
10 “మీరు యూదా రాజైన హిజ్కియాకు ఈవిధంగా చెప్పాలి – ‘జెరుసలం అష్షూరు రాజు వశంలోకి రాదని నీవు నమ్ముకున్న నీ దేవుడు చెపితే ఆయన నిన్ను మోసగించకుండా చూసుకో.’ 11 అష్షూరు రాజులు దేశాలన్నిటినీ పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినవచ్చింది గదా. నీవు మాత్రం తప్పించుకుంటాననుకుంటున్నావా? 12 గోజాన్, హారన్, రెజ్‌ప్‌లనూ తెలశ్శార్ పట్టణంలో ఉండే ఏదెన్‌వాళ్ళనూ నా పూర్వీకులు నాశనం చేసినప్పుడు ఆ జనాల దేవుళ్ళు వాళ్ళను విడిపించారా? 13 హమాతుయొక్క రాజు ఏమయ్యాడు? అర్పాద్ పట్టణం రాజు ఏమయ్యాడు? సెపర్వయీం నగరం, హేన, ఇవ్వాల రాజులు ఏమయ్యారు?”
14 హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ లేఖ అందుకొని దానిని చదివాడు. అప్పుడతడు యెహోవా ఆలయానికి వెళ్ళి యెహోవా సముఖంలో ఆ లేఖ విప్పి పరిచాడు. 15 యెహోవా సన్నిధానంలో హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! కెరూబుల పైగా సింహాసనాసీనుడా! నీవే దేవుడవు. భూరాజ్యాలన్నిటిమీదా నీవు ఒక్కడవే దేవుడవు. ఆకాశాలు, భూమి కలగజేసినది నీవే. 16 యెహోవా! చెవి పెట్టి విను. యెహోవా! కళ్ళు తెరచి చూడు. జీవం గల దేవుణ్ణి దూషించడానికి సన్‌హెరీబు చెప్పి పంపిన పలుకులు విను. 17 యెహోవా! అష్షూరు రాజులు ఆ జనాలన్నిటినీ వాళ్ళ దేశాలనూ నిజంగా పాడుచేశారు, 18 వాళ్ళ దేవుళ్ళను మంటలపాలు చేశారు. అయితే ఆ దేవుళ్ళలో ఎవడూ దేవుడు కాదు. కానీ కర్రతోనో రాళ్ళతోనో మనుషులు చేతులతో చేసిన పనులే. అందుచేతే వాళ్ళు ఆ దేవుళ్ళను నాశనం చేయగలిగారు. 19 యెహోవా! మా దేవా! దయ చూపి మమ్ములను సన్‌హెరీబు చేతిలోనుంచి విడిపించు. అప్పుడు, యెహోవా, నీవు ఒక్కడవే దేవుడవని భూరాజ్యాలన్నిటిలో ఉన్న ప్రజలు తెలుసుకొంటారు.”
20 అప్పుడు ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకు ఇలా కబురంపాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇలా చెపుతున్నాడు – నీవు అష్షూరు రాజైన సన్‌హెరీబును గురించి నాకు చేసిన ప్రార్థన విన్నాను. 21 అతణ్ణి గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: సీయోను కన్య అయిన కుమార్తె నిన్ను తిరస్కరిస్తూ వెక్కిరిస్తూ ఉంది. 22 నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరిమీద నీవు కేకలు పెట్టావు? గర్వంగా చూచినది ఎవరివైపు? ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడైన దేవుణ్ణి వ్యతిరేకించి ఇదంతా చేస్తున్నావు. 23 నీవు పంపినవాళ్ళ ద్వారా యెహోవాను దూషించావు. నీవు ‘నాకు చాలా రథాలున్నాయి. వాటితో పర్వతాల శిఖరాలమీదికి ఎక్కాను. లెబానోను చివరి ప్రాంతాలదాకా వెళ్ళాను. అక్కడి ఎత్తయిన దేవదారు చెట్లనూ మేలిరకమైన సరళ వృక్షాలనూ నరికివేశాను. లెబానోను చివరి సరిహద్దులవరకు, దాని సారవంతమైన అడవికి చేరుకున్నాను. 24 నేను నీళ్ళ బావులు తవ్వాను. పరుల నీళ్ళు తాగాను. నేను ఈజిప్ట్‌లో అడుగుపెట్టి దాని నదులన్నీ ఇంకిపోయేట్టు చేశాను’ అన్నావు గదా.
25 “అయితే అలా జరగాలని చాలా కాలం క్రిందట నేనే నిర్ణయించానని నీవు వినలేదా? పూర్వకాలంలో అలా సంకల్పించాను. ఇప్పుడు అలా జరిగేలా చేశాను. నీవు ప్రాకారాలూ కోటలూ ఉన్న పట్టణాలను పాడుచేసి కుప్పలుగా చేయడం నావల్లే జరిగింది. 26 కాబట్టి ఆ పట్టణాలవాళ్ళకు కొద్ది బలం మాత్రమే ఉంది. వాళ్ళు దిగులు పడ్డారు, సిగ్గుపాలయ్యారు. వాళ్ళు పొలంలో మొక్కలు, పచ్చని మొలకల్లాంటివారు. ఇంటికప్పు మీద పెరగకముందే మాడిపోయిన గడ్డిలాంటివారు. 27 నీవు కూర్చోవడం, వెళ్ళడం, రావడం నాకు తెలుసు. నాకు వ్యతిరేకమైన నీ ఉద్రేకం కూడా తెలుసు. 28  నాకు వ్యతిరేకమైన నీ ఉద్రేకం, నీ గర్వం విషయం నా చెవిని పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్ళెం నీ నోటిలో వేస్తాను. నిన్ను త్రిప్పి నీవు వచ్చిన దారినే పోయేలా చేస్తాను.
29 “హిజ్కియా, దానికి నీకిదే సూచన – ఈ సంవత్సరం ఊరకనే పండేది తింటావు. రెండో ఏట దాని నుంచి కలిగే ధాన్యం తింటారు. మూడో ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం తింటారు. 30 యూదా వంశంలో శేషం క్రిందికి వేళ్ళు తన్ని చిగిరించి ఫలిస్తుంది. 31 జెరుసలం నుంచి శేషం, సీయోను కొండ నుంచి తప్పించుకొన్నవారు బయలుదేరుతారు. సేనల ప్రభువు యెహోవా ఆసక్తి ఇది సాధిస్తుంది. 32 గనుక అష్షూరు రాజు విషయం యెహోవా ఇలా చెపుతున్నాడు: అతడు ఈ నగరంలో అడుగుపెట్టడు. బాణం కూడా వేయడు. డాలు పట్టుకొని ఈ నగరం దగ్గరికి రాడు. ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు. 33 అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతాడు. అతడు ఈ నగరంలోకి రాడు. ఇది యెహోవా వాక్కు. 34 నాకోసం, నా సేవకుడైన దావీదుకోసం నేను ఈ నగరాన్ని కాపాడి రక్షిస్తాను.”
35 ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలో లక్ష ఎనభై అయిదు వేలమందిని హతం చేశాడు. ప్రొద్దున మనుషులు లేచి చూస్తే వారంతా మృతదేహాలు. 36 అప్పుడు అష్షూరు రాజైన సన్‌హెరీబు తిరిగి వెళ్ళిపోయాడు. నీనెవె చేరి అక్కడ ఉండిపోయాడు. 37 ఒకరోజు అతడు నిస్రోకు అనే తన దేవుడి గుడిలో పూజ చేస్తూ ఉంటే, తన కొడుకులు అద్రెమ్మెలెకు, షరెజెరు ఖడ్గంతో అతణ్ణి కూలగొట్టారు. వాళ్ళు అరారాతు ప్రాంతానికి పారిపోయారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఏసర్‌హద్దోను రాజయ్యాడు.