16
1 రెమల్యా కొడుకు పెకహు పరిపాలిస్తున్న పదిహేడో సంవత్సరంలో యూదా రాజైన యోతాం కొడుకు ఆహాజు రాజయ్యాడు. 2 అప్పుడు ఆహాజు వయస్సు ఇరవై సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన పూర్వీకుడు దావీదులాగా ప్రవర్తించలేదు. యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు కాడు. 3 ఇస్రాయేల్‌రాజుల విధానమే అతడు అనుసరించేవాడు. ఇస్రాయేల్‌ప్రజల ముందు నుంచి యెహోవా ఏ జనాలైతే వెళ్ళగొట్టాడో ఆ జనాల నీచమైన అలవాట్లప్రకారం చేసి తన కొడుకును మంటల ద్వారా దాటించాడు. 4 ఎత్తయిన పూజా స్థలాలమీద, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ ఉండేవాడు.
5 అప్పుడు సిరియారాజు రెజీను, ఇస్రాయేల్ రాజూ రెమల్యా కొడుకూ అయిన పెకహు జెరుసలంమీదికి యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఆహాజును ముట్టడించారు గానీ అతణ్ణి జయించలేకపోయారు. 6 (ఆ సమయంలోనే సిరియా రాజు రెజీను సిరియా కోసం ఏలతును మళ్ళీ పట్టుకొని దానిలో నుంచి యూదా వారిని వెళ్ళగొట్టాడు. సిరియావాళ్ళు వచ్చి ఏలతులో నివసించారు. ఈ నాటికీ వాళ్ళు అక్కడ ఉన్నారు.)
7 అప్పుడు ఆహాజు వార్తాహరులచేత అష్షూరు రాజు తిగ్లత్‌పిలేసెరుకు ఈ కబురు పంపించాడు: “నేను మీ దాసుణ్ణి, మీ కొడుకును. సిరియా రాజూ ఇస్రాయేల్ రాజూ నామీదికి యుద్ధానికి వచ్చారు. మీరు వచ్చి వాళ్ళ చేతిలో నుంచి నన్ను రక్షించండి.”
8  ఆహాజు యెహోవా ఆలయంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు. 9 అష్షూరు రాజు అతడి మాట అంగీకరించాడు. దమస్కుమీద దండెత్తి దానిని పట్టుకొని రెజీనును చంపాడు. దమస్కు నగరవాసులను కీర్‌కు బందీలుగా తీసుకువెళ్ళాడు.
10 ఆహాజురాజు అష్షూరు రాజైన తిగ్లత్‌పిలేసరును కలుసుకోవడానికి దమస్కుకు వెళ్ళాడు. దమస్కులో బలిపీఠం ఒకదానిని చూశాడు. ఆహాజురాజు ఆ బలిపీఠం నమూనా, దాని పనితనం వివరాలన్నీ యాజి అయిన ఊరియాకు పంపాడు. 11 ఆహాజురాజు దమస్కునుంచి పంపిన నమూనాప్రకారమే, అతడు అక్కడనుంచి వచ్చేముందే ఊరియాయాజి ఒక బలిపీఠం నిర్మించాడు. 12 రాజు దమస్కునుంచి తిరిగి వచ్చి ఆ బలిపీఠం చూశాడు. దానిని సమీపించి ఎక్కాడు. 13 దాని మీద హోమాలూ నైవేద్యాలూ అర్పించాడు, పానార్పణ పోశాడు, శాంతిబలి రక్తం చల్లాడు. 14 యెహోవా సముఖంలో ఉన్న కంచు బలిపీఠాన్ని ఆలయం ముందునుంచి తీయించాడు. అది తాను కట్టించిన బలిపీఠానికీ యెహోవా ఆలయానికీ మధ్య ఉంది. ఆ బలిపీఠాన్ని తాను కట్టించిన బలిపీఠానికి ఉత్తరంవైపున ఉంచాడు.
15 ఆహాజురాజు ఊరియాను ఇలా ఆదేశించాడు: “ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే హోమబలులూ సాయంకాలం అర్పించే నైవేద్యాలూ కాల్చు. రాజు చేసే హోమబలులూ నైవేద్యాలూ కూడా ఈ బలిపీఠం మీద కాల్చు. వారి పానార్పణలు దీనిమీద పోయాలి, హోమాలు, బలిపశువుల రక్తమంతా దీనిమీద చల్లాలి. నేను దేవుని దగ్గర విచారణ చేయడానికి కంచు బలిపీఠం ఉండాలి.” 16 ఆహాజురాజు ఆజ్ఞాపించినట్టెల్లా ఊరియాయాజి చేశాడు.
17  పీఠాలనుంచి గంగాళాలను, పీఠాలకున్న ప్రక్క పలకలను ఆహాజురాజు తీయించాడు. కంచు ఎద్దుల మీద నుంచి సరస్సును దింపించి, అక్కడ పరచిన రాళ్ళమీద ఉంచాడు. 18 విశ్రాంతిదిన ఆచరణ కోసం కట్టిన మంటపాలను, రాజు వచ్చే ద్వారాన్ని యెహోవా ఆలయంనుంచి ఆహాజు తీయించాడు. ఇది అష్షూరు రాజు కారణంగా జరిగింది. 19 ఆహాజును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినది యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 20 ఆహాజు కన్ను మూసి అతడి పూర్వీకులదగ్గరికి చేరాడు. అతడి పూర్వీకుల దగ్గర దావీదునగరంలో సమాధి అయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు హిజ్కియా రాజయ్యాడు.