17
1 యూదా రాజు ఆహాజు పరిపాలిస్తున్న పన్నెండో సంవత్సరంలో ఏలా కొడుకు హోషేయ షోమ్రోనులో రాజయ్యాడు. అతడు ఇస్రాయేల్‌ను తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. 2 తనకు ముందున్న ఇస్రాయేల్ రాజుల మాదిరి పూర్తిగా అనుసరించకపోయినా, అతడు కూడా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 3  అష్షూరు రాజైన షల్మనేసెరు అతడిమీదికి యుద్ధానికి వచ్చాడు. హోషేయ అతడికి లొంగిపోయి కప్పం చెల్లించడం మొదలు పెట్టాడు. 4 తరువాత హోషేయ ఏటేటా చెల్లిస్తూ ఉన్న కప్పం అష్షూరు రాజుకు చెల్లించక ఈజిప్ట్ రాజైన దగ్గరికి వార్తాహరులను పంపాడు. హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసికట్టాడు. అతణ్ణి బంధించి ఖైదులో ఉంచాడు. 5 అప్పుడు అష్షూరు రాజు దేశమంతా దాడి జరుపుతూ షోమ్రోనుకు వచ్చాడు. దానిని మూడేళ్ళ వరకు ముట్టడించాడు. 6 హోషేయ రాజయిన తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోనును స్వాధీనం చేసుకొన్నాడు. ఇస్రాయేల్‌వారిని అష్షూరుకు ఖైదీలుగా తీసుకుపోయాడు. హాబోరు నదికి దగ్గరలో ఉన్న హాలహులో, గోజానులో మాదియవాళ్ళ పట్టణాలలో ఉంచాడు.
7 ఇస్రాయేల్‌ప్రజ వారి దేవుడు యెహోవాకు వ్యతిరేకంగా పాపాలు చేసినందుకే అలా జరిగింది. యెహోవా వారిని ఈజిప్ట్ చక్రవర్తి ఫరో చేతి నుంచి విడిపించి ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చాడు. కానీ ఇస్రాయేల్‌ప్రజ వేరే దేవుళ్ళపట్ల భయభక్తులు చూపారు. 8 తమ ఎదుట నుంచి యెహోవా వెళ్ళగొట్టిన జనాల ఆచారాలు అవలంబించి, ఇస్రాయేల్ రాజులు ప్రవేశపెట్టిన ఆచారాలను అనుసరించారు. 9 ఇస్రాయేల్‌ప్రజ వారి దేవుడు యెహోవాకు వ్యతిరేకంగా, కపటంగా దుర్మార్గాలు కల్పించారు. అడవిలోని పల్లెటూళ్ళు మొదలుకొని ప్రాకారాలున్న పట్టణాలవరకు అన్ని చోట్ల తమ కోసం ఎత్తయిన పూజా స్థలాలను కట్టుకొన్నారు. 10 ఎత్తయిన ప్రతి కొండమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద తమ కోసం విగ్రహాలనూ అషేరాదేవి స్తంభాలనూ నిలిపారు. 11 వారి ముందునుంచి యెహోవా తొలగించిన జనాలలాగే వారు ఆ ఎత్తయిన పూజా స్థలాలమీద ధూపం వేశారు. చెడు కార్యాలు చేస్తూ యెహోవాకు కోపం రెచ్చగొట్టారు. 12 వారు విగ్రహాలను పూజించి సేవించారు. దాని గురించి యెహోవా వారికి “చేయకూడదు” అని ఆజ్ఞాపించాడు.
13 యెహోవా ఇస్రాయేల్‌వారినీ యూదావారినీ తన ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా ఇలా హెచ్చరిక చేశాడు: “మీ చెడు మార్గాలనుంచి నావైపు తిరగండి. నేను ధర్మశాస్త్రాన్ని మీ పూర్వీకులకు ఆజ్ఞాపించాను, మీకు నా సేవకులైన ప్రవక్తలచేత అందజేయించాను. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, శాసనాలప్రకారం ప్రవర్తించండి.” 14 కానీ వారు పెడచెవిని పెట్టారు. వారి దేవుడు యెహోవామీద నమ్మకం ఉంచనివారి పూర్వీకులలాగే తలబిరుసుగా అయ్యారు. 15 ఆయన శాసనాలను, ఆయన వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికను తిరస్కరించారు. ఆయన తమకు చేసిన హెచ్చరికలను నిరాకరించారు. పనికిమాలిన వాటిని అనుసరించి పనికిమాలినవారయ్యారు. వారి చుట్టూ ఉన్న జనాలలాగా ప్రవర్తించకూడదని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు గానీ వారు ఆ జనాల మాదిరి అనుసరించారు. 16 వారి దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి తమ కోసం పోత పోసిన రెండు దూడల విగ్రహాలను చేశారు; అషేరాదేవి స్తంభాలను చేశారు; సూర్యచంద్ర నక్షత్రాల సమూహాన్ని పూజించారు; బయల్‌దేవుణ్ణి కొలిచారు; 17 వారి కొడుకులనూ కూతుళ్ళనూ మంటలద్వారా దాటించారు. శకునాలు చెప్పారు, మంత్రవిద్య అభ్యసించారు; యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించడానికి తమను అమ్ముకొని ఆయనకు కోపం రేపారు. 18 ఈ కారణాలవల్ల యెహోవా ఇస్రాయేల్‌ప్రజమీద అధికంగా ఆగ్రహపడి తన సముఖంలో ఉండకుండా వారిని తొలగించాడు. యూదా గోత్రంవారు తప్ప దేశంలో మరో గోత్రం మిగలలేదు.
19  యూదాప్రజ కూడా తమ దేవుడు యెహోవా ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించలేదు. ఇస్రాయేల్ ప్రజ ప్రవేశపెట్టిన ఆచారాలను వారూ అనుసరించారు. 20 యెహోవా ఇస్రాయేల్ సంతతివారందరినీ విసర్జించాడు. వారిని బాధకు గురిచేశాడు, దోపిడీదారుల వశం చేశాడు, చివరికి తన సముఖంనుంచి వారిని త్రోసివేశాడు. 21 ఇస్రాయేల్ ప్రజను దావీదు రాజ వంశం నుంచి ఆయన విడగొట్టినప్పుడు వారు నెబాతు కొడుకైన యరొబాంను రాజుగా చేశారు. ఇస్రాయేల్ ప్రజ యెహోవాను అనుసరించకుండా చేసి యరొబాం వారిచేత ఘోరమైన పాపం చేయించాడు. 22 తరువాత ఇస్రాయేల్ ప్రజలంతా యరొబాం చేసిన పాపాలన్నీ అనుసరిస్తూ వచ్చారు. 23  యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా పలికినట్టు ఇస్రాయేల్ ప్రజలను తన సముఖం నుంచి తొలగించేవరకూ వారు ఆ పాపాలనుంచి వైదొలగలేదు. గనుక ఇస్రాయేల్‌ప్రజ వారి దేశంనుంచి బందీలుగా అష్షూరుకు వెళ్ళారు, ఈనాటికీ ఆ దేశంలో ఉన్నారు.
24 అష్షూరు రాజు బబులోనునుంచి, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీంనుంచి మనుషులను తీసుకువచ్చాడు, ఇస్రాయేల్ ప్రజకు బదులుగా షోమ్రోనులోని పట్టణాలలో వాళ్ళను ఉంచాడు. వాళ్ళు షోమ్రోను ప్రదేశాన్ని స్వాధీనం చేసుకొని దాని పట్టణాలలో కాపురం చేశారు. 25 వాళ్ళు అక్కడ నివసించడం మొదలు పెట్టినప్పుడు యెహోవా అంటే వాళ్ళకు భయభక్తులేమీ లేవు. యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపించాడు. అవి వాళ్ళలో కొంతమందిని చంపాయి.
26 అష్షూరు రాజుకు వారు ఇలా కబురంపారు: “మీరు తీసుకువచ్చి షోమ్రోను పట్టణాలలో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని గురించిన ఆచారాలు తెలియవు గనుక ఆయన వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి కొంతమందిని చంపుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఈ దేశం దేవుని గురించిన ఆచారాలు తెలియవు.”
27 అప్పుడు అష్షూరు రాజు “అక్కడనుంచి తీసుకువచ్చిన యాజులలో ఒకణ్ణి మళ్ళీ అక్కడికి పంపించు. అతడు వెళ్ళి అక్కడే ఉండి ఆ దేశం దేవుడి గురించిన ఆచారాలు నేర్పిస్తాడు” అని ఆజ్ఞ జారీ చేశాడు. 28 కనుక షోమ్రోనునుంచి బందీలుగా వెళ్ళిన యాజులలో ఒకడు బేతేల్‌కు వచ్చి అక్కడ కాపురం చేశాడు. యెహోవాను గురించిన భయభక్తులు ఆ ప్రజలకు నేర్పాడు.
29 ఆ ప్రాంతంలో ప్రతి జనమూ తాము ఉంటున్న పట్టణాలలో తమ తమ దేవుళ్ళ విగ్రహాలను చేశారు. అంతకు ముందు షోమ్రోను ప్రదేశస్థులు ఎత్తయిన పూజా స్థలాల మీద కట్టిన గుళ్ళలో వాటిని ఉంచారు.
30 బబులోనువాళ్ళు సుక్కోత్‌బెనోతు విగ్రహాలను చేశారు. కూతావాళ్ళు నెర్గల్ విగ్రహాలను, హమాతువాళ్ళు అషీమా విగ్రహాలను, 31 అవ్వావాళ్ళు నిబ్‌హజు, తర్తాక్ విగ్రహాలను చేశారు. సెపర్వయీం వాళ్ళు పెర్వయీం దేవుళ్ళైన అద్రమ్మెలెక్‌కూ అనెమ్మెలెక్‌కూ తమ సంతానాన్ని మంటలద్వారా దాటించారు. 32  దానితో పాటు వాళ్ళు యెహోవా పట్ల భయభక్తులు చూపారు. వాళ్ళు తమ మధ్యలో ఉన్న సామాన్యులను ఎన్నుకొని ఎత్తయిన పూజాస్థలాలకు పూజారులుగా నియమించారు. వాళ్ళకోసం ఆ పూజారులు ఎత్తయిన పూజా స్థలాల గుళ్ళలో బలులు అర్పించారు. 33 ఈవిధంగా వాళ్ళు యెహోవా విషయం భయభక్తులు చూపుతూ, వాళ్ళ సొంత దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ ఏ జనాలలో నుంచి వచ్చారో ఆ జనాల ఆచారాల ప్రకారం వాళ్ళ దేవుళ్ళను పూజించారు.
34 ఈ రోజు వరకూ వాళ్ళు ఆ మునుపటి ఆచారాలను అనుసరిస్తూ ఉన్నారు. యెహోవా అంటే వాళ్ళకు భయభక్తులు లేవు. ఇస్రాయేల్ అనే పేరు పొందిన యాకోబు సంతానానికి యెహోవా ఇచ్చిన శాసనాలనూ న్యాయనిర్ణయాలనూ ఉపదేశాలనూ ఆజ్ఞలనూ వాళ్ళు అనుసరించడం లేదు. 35 యాకోబు సంతానంతో యెహోవా ఒడంబడిక చేసినప్పుడు వారికి ఇలా ఆజ్ఞాపించాడు:
“ఇతర దేవుళ్ళకు మీరు భయభక్తులు చూపకూడదు, మ్రొక్కకూడదు, సేవ చేయకూడదు, బలులు అర్పించకూడదు. 36 తన మహా బలంవల్లా చాపిన తన హస్తంవల్లా మిమ్ములను ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చిన యెహోవాకే మీరు భయభక్తులు చూపించాలి, మ్రొక్కాలి, బలులు సమర్పించాలి. 37 ఆయన మీకు వ్రాయించిన శాసనాలనూ న్యాయనిర్ణయాలనూ ఉపదేశాలనూ ఆజ్ఞలనూ ఎప్పుడూ పాటిస్తూ, వాటి ప్రకారం ప్రవర్తించాలి. వేరే దేవుళ్ళంటే మీకు భయభక్తులు ఉండకూడదు. 38 నేను మీతో చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు. వేరే దేవుళ్ళంటే మీకు భయభక్తులు ఉండకూడదు. 39 మీ దేవుడైన యెహోవా పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తే, ఆయన మిమ్ములను మీ శత్రువులందరి చేతిలో నుంచి తప్పిస్తాడు.”
40 అయితే వాళ్లు పెడచెవిని పెట్టారు. మునుపటి ఆచారాల ప్రకారమే ప్రవర్తించారు. 41 ఆ ప్రజలు యెహోవా విషయం భయభక్తులు చూపుతూ వాళ్ళ విగ్రహాలను కొలిచారు. వాళ్ళ పూర్వీకులలాగే వాళ్ళ సంతానం, వాళ్ళ సంతానం సంతానం ఈ రోజు వరకూ మెలగుతూ ఉన్నారు.