15
1  ఇస్రాయేల్ రాజు యరొబాం పరిపాలిస్తున్న ఇరవై ఏడో సంవత్సరంలో యూదా రాజైన అమజ్యా కొడుకు అజర్యా రాజయ్యాడు. 2 అతడు రాజయినప్పుడు అతడి వయస్సు పదహారు సంవత్సరాలు. అతడు జెరుసలంలో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యకొల్యా. ఆమె జెరుసలం నగరవాసి. 3 అజర్యా తన తండ్రి అమజ్యాను పూర్తిగా అనుసరిస్తూ, యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. 4 అయినా ఎత్తయిన పూజా స్థలాలను తొలగించడం జరగలేదు. ప్రజలు వాటి మీద బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.
5 యెహోవా అజర్యారాజును మొత్తాడు. అజర్యా చనిపోయే రోజువరకు కుష్ఠురోగి. అతడు ప్రత్యేకమైన భవనంలో నివసించాడు. రాజు కొడుకు యోతాం రాజ భవనం మీద అధికారిగా ఉండి, దేశ ప్రజలను పరిపాలించాడు. 6 అజర్యాను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 7 అజర్యా కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. తన పూర్వీకుల దగ్గర, దావీదు నగరంలో సమాధి అయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యోతాం రాజయ్యాడు.
8 యూదారాజు అజర్యా పరిపాలిస్తున్న ముప్ఫయి ఎనిమిదో సంవత్సరంలో యరొబాం కొడుకు జెకర్యా ఇస్రాయేల్ మీద రాజయ్యాడు. అతడు షోమ్రోనులో ఆరు నెలలు పరిపాలించాడు. అతడు తన పూర్వీకులలాగే యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 9 ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు. 10 యాబేష్ కొడుకు షల్లూం అతడి మీద కుట్ర చేశాడు, ప్రజలు చూస్తూ ఉండగానే అతణ్ణి కొట్టి చంపి అతడి స్థానంలో రాజయ్యాడు. 11 జెకర్యాను గురించిన ఇతర విషయాలు ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 12  గతంలో యెహోవా యెహూతో “నాలుగు తరాల వరకు నీ సంతానం ఇస్రాయేల్ రాజ్య సింహాసనం ఎక్కుతారు” అని చెప్పాడు. ఆ వాక్కు ప్రకారమే జరిగింది.
13 యూదా రాజు ఉజ్జియా పరిపాలిస్తున్న ముప్ఫయి తొమ్మిదో సంవత్సరంలో యాబేష్ కొడుకు షల్లూం రాజయ్యాడు. అతడు షోమ్రోనులో ఒక నెల పరిపాలించాడు. 14 అప్పుడు గాదీ కొడుకు మెనహేం తిర్సానుండి షోమ్రోనుకు వచ్చి యాబేష్ కొడుకు షల్లూంను కొట్టి చంపి అతడి స్థానంలో రాజయ్యాడు. 15 షల్లూంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 16 అప్పుడు మెనహేం తిప్సహుకు వెళితే వారు దాని ద్వారాలు తెరవలేదు గనుక అతడు దానిని నాశనం చేశాడు. ఆ పట్టణంలో, తిర్సా అవతలి ప్రాంతంలో ఉన్న వారందరినీ హతం చేశాడు. గర్భిణీస్త్రీలందరి కడుపులు చీల్చాడు.
17 యూదా రాజు అజర్యా పరిపాలిస్తున్న ముప్ఫయి తొమ్మిదో సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేం ఇస్రాయేల్ ప్రజపై రాజయ్యాడు. అతడు షోమ్రోనులో పది సంవత్సరాలు పరిపాలించాడు. 18 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. అతడు బ్రతికి ఉన్నంతవరకు ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు. 19 అతడి కాలంలో అష్షూరు రాజైన పూల్ ఇస్రాయేల్ మీదికి దండెత్తి వచ్చాడు. మెనహేం తన చేతిలో రాజ్యం సుస్థిరం అయ్యేలా సహాయం చేయమని పూల్‌కు ముప్ఫయి నాలుగు వేల కిలోగ్రాముల వెండి ఇచ్చాడు. 20 ఆ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేం ఇస్రాయేల్‌లో ఉన్న ధనవంతులందరి దగ్గరా, ఒక్కొక్కరి దగ్గర యాభై తులాల వెండి చొప్పున, వసూలు చేశాడు. అప్పుడు అష్షూరు రాజు ఇస్రాయేల్ దేశంలో ఆగక వెళ్ళిపోయాడు. 21 మెనహేంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 22 మెనహేం కన్ను మూసి అతడి పూర్వీకులదగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు పెకహ్యా రాజయ్యాడు.
23 యూదా రాజు అజర్యా పరిపాలిస్తున్న యాభైయో సంవత్సరంలో మెనహేం కొడుకు పెకహ్యా ఇస్రాయేల్‌పై రాజయ్యాడు. అతడు షోమ్రోనులో రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 24 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. నెబాతు కొడుకూ ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించినవాడూ అయిన యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు. 25 అతడి సైన్యంలో ఒక అధిపతి అతడి మీద కుట్ర చేశాడు. అతడు రెమల్యా కొడుకు షెకహు. అతడు అర్గోబ్, అరీహే అనే వాళ్ళతో, యాభైమంది గిలాదు వాళ్ళతోపాటు పెకహ్యా పైబడ్డాడు. ఇది షోమ్రోనులో ఉన్న రాజభవనంలో ఒక గదిలో జరిగింది. పెకహు అతణ్ణి చంపి అతడి స్థానంలో రాజయ్యాడు. 26 పెకహ్యాను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
27 యూదా రాజు అజర్యా పరిపాలిస్తున్న యాభై రెండో సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు ఇస్రాయేల్ మీద రాజయ్యాడు. అతడు షోమ్రోనులో ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు. 28 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. నెబాతు కొడుకూ ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించినవాడైన యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు. 29 ఇస్రాయేల్ రాజు పెకహు కాలంలో తిగ్లత్ పిలేసెరు అనే అష్షూరు రాజు వచ్చి ఈయొను, ఆబెల్‌బెత్‌మయకా, యానోయహు, కెదెషు, హాసోరు అనే పట్టణాలూ, గిలాదు, గలలీ, నఫ్తాలి ప్రదేశాలన్నిటినీ పట్టుకొన్నాడు. ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకువెళ్ళాడు. 30 తరువాత రెమల్యా కొడుకు పెకహుమీద ఏలా కొడుకు హోషేయ కుట్ర చేశాడు. అతణ్ణి కొట్టి చంపి అతడి స్థానంలో రాజయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు యోతాం పరిపాలనలో ఇరవైయో సంవత్సరంలో జరిగింది. 31 పెకహును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
32 ఇస్రాయేల్ రాజూ రెమల్యా కొడుకూ అయిన పెకహు పరిపాలిస్తున్న రెండో సంవత్సరంలో యూదా రాజైన ఉజ్జియా కొడుకు యోతాం రాజయ్యాడు. 33 అతడు రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై అయిదేళ్ళు. అతడు జెరుసలంలో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యెరుషా. ఆమె సాదోకు కూతురు. 34 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే చేస్తూ, యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. 35 అయినా ఎత్తయిన పూజా స్థలాలను తొలగించడం జరగలేదు. ప్రజలు వాటి మీద బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. యోతాం యెహోవా ఆలయానికి ఎత్తు ద్వారాన్ని కట్టించాడు. 36 యోతాంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 37 ఆరోజుల్లో యెహోవా యూదామీదికి సిరియా రాజైన రెజీనునూ రెమల్యా కొడుకు పెకహునూ పంపించడం మొదలుపెట్టాడు. 38 యోతాం కన్ను మూసి అతని పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని పూర్వీకుడైన దావీదు నగరంలో అతని పూర్వీకుల దగ్గర సమాధి అయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు ఆహాజు రాజయ్యాడు.