14
1 ఇస్రాయేల్ రాజైన యెహోయాహాజు కొడుకు యెహోయాషు పరిపాలిస్తున్న రెండో సంవత్సరంలో యూదా రాజు యోవాషు కొడుకు అమజ్యా రాజయ్యాడు. 2 అతడు రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై అయిదేళ్ళు. అతడు జెరుసలంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. ఆమె జెరుసలం నగరవాసి. 3 అతడు పూర్వీకుడైన దావీదు ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించకపోయినా, అన్ని విషయాలలో అతడి తండ్రి యోవాషులాగా ప్రవర్తించేవాడు. 4 కానీ ఎత్తయిన పూజాస్థలాలను తొలగించడం జరగలేదు. ప్రజలు ఇంకా వాటిమీద బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ ఉండేవారు.
5 రాజ్యం అమాజ్యా వశంలో సుస్థిరమైన వెంటనే అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ సేవకులను హతం చేశాడు. 6 కానీ ఆ హంతకుల సంతానాన్ని హతం చేయలేదు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాసినదాని ప్రకారం అతడు చేశాడు. అందులో యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “కొడుకుల దోషాన్ని బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు; తండ్రుల దోషాన్నిబట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవడి పాపానికి వాడే మరణశిక్ష పొందాలి.”
7 తరువాత అమాజ్యా “ఉప్పు” లోయలో ఎదోంవాళ్ళను పది వేలమందిని కూలగొట్టాడు. సెలాను పట్టుకొని దానికి యొక్తయేల్ అనే పేరు పెట్టాడు. ఈ నాటికీ దాని పేరు అదే.
8 ఇస్రాయేల్ రాజూ యెహూ మనుమడూ యెహోయాహాజు కొడుకూ అయిన యెహోయాషుకు అమజ్యా ఇలా కబురు పంపాడు: “మనం ఒకర్ని ఒకరం ఎదుర్కొందాం, రా.”
9 అప్పుడు ఇస్రాయేల్ రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా కబురంపాడు: “లెబానోను అడవిలో ఉన్న ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు ‘నీ కూతురుని నా కొడుక్కు భార్యగా ఇవ్వు’ అని చెప్పి పంపిందట. అయితే లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళపొదను త్రొక్కి పాడు చేసిందట. 10 నీవు ఎదోంవాళ్ళను ఓడించి మిడిసిపడుతున్నావు. సరే, నీ ఘనతతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవెందుకు ఆపదలో చిక్కుపడతావు? దానివల్ల నీవు నీతోపాటు యూదా కూలిపోవడం జరుగుతుంది.”
11 దానికి అమజ్యా పెడచెవి పెట్టాడు గనుక ఇస్రాయేల్ రాజు యెహోయాషు బయలుదేరాడు. అతడు, యూదా రాజు అమజ్యా యూదాకు చెందిన బేత్‌షెమెషు దగ్గర ఎదురెదురుగా వచ్చారు. 12 ఇస్రాయేల్‌వాళ్ళ ఎదుట యూదావారు ఓడిపోయి వారి వారి ఇండ్లకు పారిపోయారు. 13 ఇస్రాయేల్ రాజు యెహోయాషు బేత్‌షెమెషులో అహజ్యా మనుమడూ యోవాషు కొడుకూ యూదా రాజూ అయిన అమజ్యాను పట్టుకొన్నాడు. అప్పుడు యెహోయాషు జెరుసలంకు వచ్చి జెరుసలం ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుంచి మూలద్వారం వరకు నాలుగు వందల మూరలు పడగొట్టాడు. 14 అతడు యెహోవా ఆలయంలో రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారాలంతా, పాత్రలన్నీ తీసుకొని షోమ్రోనుకు తిరిగి వెళ్ళాడు. కొంతమంది మనుషులను కుదువగా తీసుకుపోయాడు కూడా.
15 యెహోయాషును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినది, అతడి పరాక్రమం, యూదా రాజు అమజ్యాతో అతడు చేసిన యుద్ధం ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 16 యెహోయాషు కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. షోమ్రోనులో ఇస్రాయేల్ రాజుల దగ్గర సమాధి అయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యరొబాం రాజయ్యాడు.
17 యెహోయాహాజు కొడుకూ ఇస్రాయేల్ రాజూ అయిన యెహోయాషు మృతి చెందిన తరువాత యోవాషు కొడుకూ యూదా రాజూ అయిన అమాజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు. 18 అమజ్యాను గురించిన ఇతర విషయాలు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 19 జెరుసలంలో కొందరు అతనిమీద కుట్ర చేశారు. అతడు లాకీషుకు పారిపోయాడు గానీ వాళ్ళు లాకీషుకు మనుషులను పంపి అతణ్ణి చంపారు. 20 అప్పుడు వాళ్ళు గుర్రంమీద అతని మృత దేహాన్ని జెరుసలంకు తెప్పించి అతణ్ణి అతడి పూర్వీకుల దగ్గర దావీదు నగరంలో సమాధి చేశారు. 21  యూదా ప్రజలంతా అమజ్యా కొడుకైన అజర్యాను అతడి తండ్రి స్థానంలో రాజుగా చేశారు. అప్పుడు అజర్యా వయస్సు పదహారు సంవత్సరాలు. 22 అమజ్యారాజు కన్ను మూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరిన తరువాత అజర్యా ఏలత్ పట్టణాన్ని మళ్ళీ యూదాప్రజ స్వాధీనం చేసి దానిని తిరిగి కట్టించాడు.
23 యోవాషు కొడుకూ యూదా రాజూ అయిన అమజ్యా పరిపాలిస్తున్న పదిహేనో సంవత్సరంలో ఇస్రాయేల్ రాజైన యెహోయాషు కొడుకు యరొబాం రాజయ్యాడు. అతడు షోమ్రోనులో నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. 24 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు. 25  అతడు హమాతు దగ్గర నుంచి అరాబా లోయలోని సరస్సు వరకు ఇస్రాయేల్ దేశ సరిహద్దు మళ్ళీ స్వాధీనం చేసుకొన్నాడు. ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా తన సేవకుడైన యోనాప్రవక్త ద్వారా పలికిన వాక్కు ప్రకారం అలా జరిగింది. యోనా అమిత్తయి కొడుకు, గత్‌హేపెరు పురవాసి. 26 ఇస్రాయేల్ ప్రజల బాధ తీవ్రంగా ఉన్నట్టు యెహోవా చూశాడు. కొద్దివారు గానీ గొప్పవారు గానీ ఇస్రాయేల్ ప్రజకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. 27  ఇస్రాయేల్ పేరు ఆకాశం క్రింద లేకుండా తుడిచివేస్తానని యెహోవా చెప్పలేదు, గనుక యెహోయాషు కొడుకు యరొబాం ద్వారా వారిని రక్షించాడు.
28 యరొబాంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, అతడి పరాక్రమం, అతడు చేసిన యుద్ధాలు, యూదాకు చెందిన దమస్కునూ హమాతునూ అతడు ఇస్రాయేల్ ప్రజకోసం స్వాధీనం చేసుకొన్న విషయం – ఇదంతా ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 29 యరొబాం కన్ను మూసి అతడి పూర్వీకులైన ఇస్రాయేల్ రాజుల దగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు జెకర్యా రాజయ్యాడు.