13
1 యూదా రాజైన అహజ్యా కొడుకు యోవాషు పరిపాలిస్తున్న ఇరవై మూడో సంవత్సరంలో యెహూ కొడుకు యెహోయాహాజు ఇస్రాయేల్‌పై రాజయ్యాడు. అతడు షోమ్రోనులో పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరొబాం పాపాలను అనుసరించేవాడు. అతడు వాటి నుంచి వైదొలగనే లేదు. 3 యెహోవాకు ఇస్రాయేల్ ప్రజ మీద కోపాగ్ని రగులుకొంది గనుక వారిని ఎప్పటికీ సిరియారాజైన హజాయేల్, అతడి కొడుకు బెన్‌హదదుల చేతులకు అప్పగించాడు. 4 అప్పుడు యెహోయాహాజు యెహోవాను బ్రతిమిలాడాడు. సిరియా రాజుచేత ఇస్రాయేల్‌ప్రజ అనుభవిస్తూ ఉన్న బాధ చూచి యెహోవా యెహోయాహాజు ప్రార్థన విన్నాడు. 5 యెహోవా ఇస్రాయేల్‌ప్రజలకు ఒక రక్షకుణ్ణి ప్రసాదించాడు. అతడి ద్వారా ఇస్రాయేల్‌ప్రజ సిరియావాళ్ళ చేతిలోనుంచి తప్పించుకొని మునుపటిలాగే వారి వారి ఇండ్లలో కాపురం ఉన్నారు. 6 అయినా వారు ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకు యరొబాం రాజవంశీయుల పాపాలనుంచి వైదొలగలేదు. వారు ఆ పాపాలు చేస్తూ వచ్చారు. అంతేగాక, అషేరాదేవి స్తంభాలు అలాగే షోమ్రోనులో నిలిచి ఉన్నాయి. 7 యెహోయాహాజు సైన్యంలో మిగిలినది యాభై రౌతులూ పది రథాలూ పది వేలమంది పదాతులూ మాత్రమే. సిరియా రాజు ఇస్రాయేల్ సైన్యాన్ని నాశనం చేశాడు, దుళ్ళగొట్టిన దుమ్ములాగా చేశాడు.
8 యెహోయాహాజును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, అతడి పరాక్రమం ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 9 యెహోయాహాజు కన్ను మూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరాడు. ప్రజలు అతణ్ణి షోమ్రోనులో సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోయాషు రాజయ్యాడు.
10 యూదారాజు యోవాషు పరిపాలనలో ముప్ఫయి ఏడో ఏట యెహోయాహాజు కొడుకు యెహోయాషు ఇస్రాయేల్ మీద రాజయ్యాడు. అతడు షోమ్రోనులో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. 11 అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. నెబాతు కొడుకు ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించినవాడైన యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు. వాటిని చేస్తూ వచ్చాడు. 12 యెహోయాషును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజైన అమజ్యాపై యుద్ధం చేసినప్పుడు అతడు చూపిన పరాక్రమం ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 13 యెహోయాషు కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. యరొబాం అతడి సింహాసనం ఎక్కాడు. యెహోయాషును షోమ్రోనులో ఇస్రాయేల్ రాజులదగ్గర సమాధి చేశారు.
14 ఎలీషాకు జబ్బు చేసింది. తరువాత ఆ జబ్బుతోనే అతడు చనిపోయాడు. ఇస్రాయేల్ రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూచి ఏడ్చాడు. “నా తండ్రీ! నా తండ్రీ! ఇస్రాయేల్‌కు చెందిన రథం, దాని రౌతులు!” అని రాజు చెప్పాడు.
15 అతడితో ఎలీషా “విల్లు, బాణాలు తీసుకో” అన్నాడు. ఇస్రాయేల్ రాజు విల్లు, బాణాలు తీసుకొన్న తరువాత ఎలీషా అతడితో 16 “విల్లు ఎక్కుపెట్టు” అన్నాడు. రాజు అలా చేసిన తరువాత ఎలీషా తన చేతులు రాజు చేతులమీద ఉంచి 17 “తూర్పుగా ఉన్న కిటికీ తెరువు” అన్నాడు. రాజు కిటికీ తెరిచాడు. ఎలీషా “బాణం విసురు” అన్నాడు. రాజు బాణం విసిరాడు. “ఇది యెహోవా విజయ బాణం. సిరియా మీద విజయం సూచించే బాణం. నీవు అఫెకు దగ్గర సిరియావాళ్ళను పూర్తిగా ఓడిస్తావు” అని ఎలీషా చెప్పాడు.
18 ఆ తరువాత అతడు “బాణాలు చేతపట్టుకో” అన్నాడు. ఇస్రాయేల్ రాజు ఆ బాణాలు చేతపట్టుకొన్నాక ఎలీషా “వాటితో నేలను కొట్టు” అన్నాడు. రాజు నేలను మూడు సార్లు కొట్టి ఆగాడు.
19 అది చూచి దేవుని మనిషి అతడి మీద కోపపడ్డాడు. “నీవు అయిదారు సార్లు కొట్టి వుంటే, నీవు సిరియా సైన్యాన్ని పూర్తిగా ఓడించి ఉంటావు. కాని ఇప్పుడు వాళ్ళను మూడు సార్లు మాత్రమే ఓడిస్తావు” అన్నాడు.
20 ఎలీషా చనిపోయాడు, సమాధి అయ్యాడు. మరుసటి సంవత్సరంలో మోయాబు దేశస్థులైన దోపిడీగాళ్ళ గుంపులు ఇస్రాయేల్‌లోకి వచ్చాయి. 21 కొంతమంది ఒక మనిషి మృతదేహాన్ని సమాధి చేస్తూ ఉంటే ఆ దోపిడీ గుంపులలో ఒకటి వారికి కనిపించింది. వెంటనే వారు ఆ మృతదేహాన్ని ఎలీషా సమాధిలో పడవేశారు. ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి నిలబడ్డాడు.
22 యెహోయాహాజు కాలమంతట్లో సిరియారాజైన హజాయేల్ ఇస్రాయేల్ ప్రజలను బాధించాడు. 23 అయితే యెహోవా వారి మీద జాలిపడి దయ చూపాడు. తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ఒడంబడిక కారణంగా ఆయన వారిని చూచి కటాక్షించాడు. వారిని నాశనం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఇప్పటి వరకు ఆయన వారిని తన సముఖంనుంచి వెళ్ళగొట్టలేదు.
24 సిరియా రాజు హజాయేల్ చనిపోయినప్పుడు అతడి స్థానంలో అతడి కొడుకు బెన్‌హదదు రాజయ్యాడు. 25  అంతకుముందు హజాయేల్ యెహోయాహాజురాజు మీద యుద్ధం చేసి అతడి వశంలోనుంచి కొన్ని పట్టణాలు పట్టుకొన్నాడు. ఇప్పుడు యెహోయాహాజు కొడుకు యెహోయాషు వెళ్ళి హజాయేల్ కొడుకు బెన్‌హదదు వశంలోనుంచి ఆ పట్టణాలు పట్టుకొన్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు ఓడించి ఇస్రాయేలుకు చెందిన ఆ పట్టణాలు మళ్ళీ స్వాధీనం చేసుకొన్నాడు.