12
1 ✝యెహూ పరిపాలిస్తున్న ఏడో సంవత్సరంలో యోవాషు రాజయ్యాడు. జెరుసలంలో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. బేర్‌షెబా పురవాసి జిబ్యా అతని తల్లి. 2 ✽ యాజి అయిన యెహోయాదా అతనికి ఉపదేశిస్తూ ఉండే కాలమంతా యోవాషు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. 3 ✽ కానీ అతడు ఎత్తయిన పూజాస్థలాలను నాశనం చేయలేదు. ప్రజలింకా ఎత్తయిన పూజాస్థలాలమీద బలులు అర్పించేవారు, ధూపం వేసేవారు.4 యోవాషు యాజులను పిలిపించి వారికి ఇలా ఆదేశించాడు: “ప్రజలు యెహోవా ఆలయానికి పవిత్రమైన కానుకలుగా తెచ్చే వెండి అంతా – ఒక్కొక్క మనిషి తెచ్చే వ్యక్తిగతమైన✽ సుంకం✽ గానీ స్వేచ్ఛా పూర్వకంగా✽ తెచ్చే వెండి గానీ – యాజులైన మీరు కూడబెట్టాలి. 5 యాజులలో ఒక్కొక్కడు తమకు పరిచయం అయిన వారిదగ్గర ఆ వెండి తీసుకొని కూడబెట్టి తరువాత యెహోవా ఆలయం పూర్తిగా మరమ్మత్తు చేయాలి.”
6 ✽అయితే యోవాషు పరిపాలిస్తున్న ఇరవై మూడో సంవత్సరం వరకు యాజులు దేవాలయానికి ఎలాంటి మరమ్మత్తు చేయలేదు. 7 గనుక అప్పుడు యోవాషు రాజు యెహోయాదాయాజినీ మిగతా యాజులనూ పిలిపించి ఇలా చెప్పాడు: “మీరెందుకు దేవాలయాన్ని మరమ్మత్తు చెయ్యలేదు? ఇప్పట్నుంచి మీ పరిచయస్థుల దగ్గర డబ్బు మీకోసం తీసుకోవద్దు. దేవాలయం మరమ్మత్తు కోసం ఆ డబ్బు ఇచ్చివేయాలి.” 8 యాజులు ప్రజలదగ్గర డబ్బు తీసుకోమనీ ఆలయాన్ని మరమ్మత్తు చేయడానికి బాధ్యత తీసుకోమనీ అంగీకారం తెలిపారు.
9 యెహోయాదాయాజి ఒక పెట్టె✽ తెచ్చి దాని మూతకు రంధ్రం చేసి దానిని బలిపీఠం దగ్గర ఉంచాడు. ఆ పెట్టె యెహోవా ఆలయంలో కుడి ప్రక్కన ఉంది. ప్రజలు యెహోవా ఆలయానికి తెచ్చే డబ్బంతా ద్వారం దగ్గర కాపలా ఉండే✽ యాజులు ఆ పెట్టెలో వేశారు. 10 పెట్టెలో చాలా డబ్బు ఉన్నట్టు తెలిసినప్పుడెల్లా రాజు యొక్క లేఖకుడూ ప్రముఖయాజీ వచ్చారు, యెహోవా ఆలయంలో ఉన్న డబ్బంతా లెక్క పెట్టి సంచులలో కట్టారు. 11 ✽ఆ తరువాత యెహోవా ఆలయం మరమ్మత్తు పని నిర్వహించేవారికి ఆ డబ్బు పంచియిచ్చారు. వీరు ఆ డబ్బు ఆలయంలో పనిచేసే వడ్రంగులకూ కట్టేవారికీ కంసాలులకూ 12 తాపీపనివాళ్ళకూ రాళ్ళు మలిచేవాళ్ళకూ ఇచ్చారు; యెహోవా ఆలయం మరమ్మత్తు చేయడానికి దూలాలూ మలిచిన రాళ్ళూ కావలసినవాటన్నిటికోసం డబ్బు ఖర్చు చేశారు. 13 అయినా యెహోవా ఆలయానికి తెచ్చే ఆ డబ్బు ఆలయం కోసం వెండి గిన్నెలూ కత్తెరలూ పళ్ళేలూ, బాకాల కోసం, మరే వెండి పాత్రలూ బంగారు పాత్రలకోసం ఖర్చు చేయలేదు. 14 ఆ డబ్బంతా యెహోవా ఆలయాన్ని మరమ్మత్తు చేసేవారికే ఇచ్చారు. 15 ఆ డబ్బు తీసుకొని ఆ పనిమీద పైవిచారణ చేసేవారు నిజాయితీపరులు✽ గనుక వారు పనివాళ్ళకు పంచియిచ్చిన డబ్బు విషయం ఎవరూ లెక్కలు అడగలేదు. 16 ✝అపరాధ బలులవల్ల, పాపాలకోసమైన బలులవల్ల వచ్చే డబ్బు యాజులది గనుక అది యెహోవా ఆలయానికి ఉపయోగించలేదు.
17 ✽ఆ కాలంలో సిరియా రాజు హజాయేల్✽ దండెత్తి వెళ్ళి గాతు పట్టణాన్ని వశం చేసుకొన్నాడు. అప్పుడు జెరుసలం మీద దాడి చేయదలచాడు. 18 ✽ అయితే యూదా రాజు యోవాషు తన పూర్వీకులూ యూదా రాజులూ అయిన యెహోషాపాతు, యెహోరాం, అహజ్యా ప్రతిష్టించినవాటినీ తాను ప్రతిష్టించిన వాటినీ యెహోవా ఆలయంలో, రాజభవనంలో ఉన్న ఖజానాలోని బంగారమంతా సిరియా రాజైన హజాయేల్‌కు పంపాడు. కనుక హజాయేల్ జెరుసలం నుంచి వెళ్ళాడు.
19 యోవాషును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథం✽లో రాసి ఉన్నాయి. 20 యోవాషు సేవకులు కుట్ర చేసి సిల్లాకు పోయే త్రోవలో ఉన్న “మిల్లో” నగరులో అతణ్ణి చంపారు✽. 21 షిమాతు కొడుకు యోజాకార్, షోమేర్ కొడుకు యెహోజాబాద్ అతణ్ణి కొట్టి చంపారు. వారు అతని సేవకులు. అతడు తన పూర్వీకుల దగ్గర, దావీదు నగరం✽లో సమాధి అయ్యాడు. అతడి స్థానంలో తన కొడుకు అమజ్యా రాజయ్యాడు.