11
1 ✝అహజ్యా తల్లి అతల్యా✽ తన కొడుకు చనిపోయాడని తెలుసుకొన్నప్పుడు ఆమె రాజ వంశం✽వారందరినీ నాశనం చేయడానికి పూనుకొంది. 2 కానీ అహజ్యా సోదరీ యెహోరాంరాజు యొక్క కూతురూ అయిన యెహోషెబ✽ అహజ్యా కొడుకైన యోవాషును దాచిపెట్టింది. చావుకు గురి అయిన రాకుమారులదగ్గరనుంచి ఆమె అతణ్ణి రహస్యంగా తీసుకుపోయింది. అతణ్ణీ అతడి దాదినీ ఒక పడకగదిలో ఉంచింది. అతణ్ణి అతల్యా చేతిలో పడకుండా ఆమె దాచిపెట్టినందుచేత అతడు మరణం కాలేదు. 3 అతడు యెహోవా ఆలయంలో ఆమెతో ఉంటూ ఆరేళ్ళు మరుగై ఉన్నాడు. అతల్యా దేశం పరిపాలిస్తూ ఉంది.4 ఏడో ఏట యాజి అయిన యెహోయాదా✽ రాజభవనం కావలివారిమీద, సంరక్షకుల✽మీద ఉన్న శతాధిపతులను పిలవనంపించాడు. వారిని యెహోవా ఆలయంలోకి తీసుకువెళ్ళి వారితో ఒడంబడిక చేశాడు. వారిచేత శపథం చేయించి రాజు కొడుకును✽ వారికి చూపెట్టాడు.
5 అప్పుడు యెహోయాదా వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు చేయవలసినదేమిటంటే, విశ్రాంతి దినం పనిమీద ఉన్న మూడో భాగం వచ్చి రాజభవనాన్ని కాపలా కాయాలి. 6 ఇంకో మూడో భాగం ‘సూర్’ ద్వారం దగ్గర, మరో మూడో భాగం కాపలావాళ్ళు వెనుక ఉన్న ద్వారం దగ్గర ఉండాలి. ఈ విధంగా మీరు నగరును భద్రం చేయాలి. 7 మీలో మిగతావారు – విశ్రాంతిదినం పనిమీద ఉండనివారు – వచ్చి రాజు ఉన్న యెహోవా ఆలయాన్ని కాపలా కాయాలి. 8 ప్రతి ఒక్కరూ ఆయుధాలు చేతపట్టుకొని రాజు చుట్టూ ఉండాలి. ఎవడైనా మీ వరుస సమీపిస్తే వాణ్ణి చంపాలి. రాజు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆయన వెంట ఉండాలి.”
9 యాజి అయిన యెహోయాదా ఆదేశించినట్టెల్లా ఆ శతాధిపతులు చేశారు. ఒక్కొక్కడు విశ్రాంతిదినం పనికి వెళ్ళేవారిని విశ్రాంతిదినం పనికి వెళ్ళనివారితోపాటు యెహోయాదా యాజిదగ్గరకు తీసుకువచ్చారు. 10 ✝దావీదు రాజుకు చెందిన ఈటెలూ డాళ్ళూ కొన్ని యెహోవా ఆలయంలో ఉన్నాయి. యాజి ఆ శతాధిపతులకు వాటిని అందించాడు. 11 కావలివారు ప్రతి ఒక్కరూ ఆయుధం చేతపట్టుకొని యెహోవా ఆలయం కుడి వైపు నుండి ఎడమ వైపు వరకు, బలిపీఠం దగ్గర రాజు చుట్టూ నిలబడ్డారు. 12 అప్పుడు యెహోయాదా రాకుమారుణ్ణి బయటికి తీసుకువచ్చి అతని తలమీద కిరీటం పెట్టాడు. ధర్మశాస్త్రం ప్రతి✽ని అతనికి అందించాడు. అతణ్ణి రాజుగా అభిషేకించాడు✽. కావలివారు చప్పట్లు కొడుతూ “రాజు చిరంజీవి కావాలి!” అని కేకలు వేశారు.
13 కావలివారూ ప్రజలూ చేసే చప్పుడు అతల్యాకు వినిపించింది. వెంటనే ఆమె యెహోవా ఆలయానికి ప్రజలదగ్గరికి వచ్చింది. 14 ✝ఆమె వచ్చి చూస్తే అక్కడ ఆచారం ప్రకారం రాజు ఒక స్తంభం దగ్గర నిలుచున్నాడు; అధిపతులూ బాకా ఊదేవాడూ రాజు ప్రక్కనే ఉన్నారు; దేశప్రజలంతా సంబరపడుతూ బూరలు ఊదుతూ ఉన్నారు. అది చూచి అతల్యా తన బట్టలు చించుకొని “రాజద్రోహం! రాజద్రోహం!” అని అరచింది.
15 అప్పుడు యెహోయాదాయాజి సైన్యంలో ఆ శతాధిపతులకు “ఆమెను యెహోవా ఆలయంలో చంపకూడదు. కావలివారు వరుస మధ్య ఆమెను బయటికి తీసుకురండి. ఆమె పక్షంవాళ్ళను కూడా ఖడ్గంతో చంపండి” అని ఆజ్ఞాపించాడు. 16 వారు ఆమెను పట్టుకొని రాజభవనం యొక్క గుర్రాల ద్వారం చేరి అక్కడ ఆమెను చంపారు.
17 ✽ “మనం యెహోవా ప్రజగానే ఉంటాం” అని యెహోయాదా యెహోవా పేర రాజుచేత, ప్రజలచేత ఒడంబడిక చేయించాడు. రాజుకూ ప్రజలకూ మధ్య కూడా ఒడంబడిక కుదిర్చాడు. 18 ✽ అప్పుడు దేశప్రజలంతా బయల్‌దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి దానిని పడగొట్టారు. దాని బలిపీఠాలనూ విగ్రహాలనూ చిన్నాభిన్నం చేశారు. ఆ బలిపీఠాల ముందే బయల్‌దేవుడి పూజారి మత్తానును చంపారు. యెహోవా ఆలయానికి కావలివారిని యెహోయాదాయాజి నియమించి 19 ✝శతాధిపతులనూ అధికారులనూ కాపలావారినీ దేశప్రజలందరినీ వెంటబెట్టుకొని యెహోవా ఆలయంనుంచి రాజును రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు కావలివారి ద్వారం గుండా వచ్చారు. అప్పుడు రాజు రాజుల సింహాసనం మీద కూర్చున్నాడు. 20 కావలివారు అతల్యాను రాజభవనం దగ్గర చంపిన తరువాత నగరం ప్రశాంతంగా ఉంది. దేశప్రజలంతా సంబరపడుతూ✽ ఉన్నారు.
21 యోవాషు రాజయినప్పుడు అతడి వయస్సు ఏడు సంవత్సరాలు.