10
1 అహాబు సంతానం డెబ్భైమంది షోమ్రోనులో ఉన్నారు. యెహూ లేఖలు వ్రాసి షోమ్రోనులో ఉన్న యెజ్రేల్ అధిపతులకూ నగరం పెద్దలకూ అహాబు సంతతివాళ్ళ సంరక్షకులకూ పంపాడు. ఆ లేఖలలో ఇలా రాసి ఉన్నది: 2 “మీ యజమాని సంతానం మీతోనే ఉన్నారు. రథాలూ గుర్రాలూ ఆయుధాలూ మీ దగ్గర ఉన్నాయి. మీరు ప్రాకారం, కోట ఉన్న పట్టణంలో ఉన్నారు. 3 కనుక మీకు ఈ లేఖ అందగానే మీ యజమాని సంతానంలో ఉత్తముడూ యోగ్యుడూ అయినవాణ్ణి ఎన్నుకొని అతణ్ణి అతడి పూర్వీకుడి సింహాసనం మీద కూర్చోబెట్టి మీ యజమాని రాజవంశంకోసం పోరాడండి.”
4 వాళ్ళు ఇది చదివి చాలా భయపడ్డారు. “ఇద్దరు రాజులే అతడి ముందు నిలువలేకపోయారే, మనం ఎలా నిలుస్తాం” అని చెప్పుకొన్నారు. 5 అందుచేత భవనం అధికారీ పట్టణం అధికారీ పెద్దలూ సంరక్షకులూ యెహూకు “మేము మీ దాసులం. మీ ఆజ్ఞలన్నీ శిరసావహిస్తాం. మేము ఎవరినీ రాజుగా చేసుకోము. మీకు ఏది మంచిదని తోస్తుందో అది చేయండి” అని చెప్పి పంపారు.
6 యెహూ ఇంకో లేఖ వ్రాసి వారికి పంపాడు. అందులో “మీరు నా పక్షంగా ఉంటే, నా మాట వినడానికి సిద్ధంగా ఉంటే, రేపు ఈ వేళకు యెజ్రేల్‌కు నా దగ్గరికి మీ యజమాని కొడుకుల తలలు తీసుకురండి” అని రాసి ఉన్నది.
ఆ డెబ్భై మంది రాకుమారులు పట్టణంలో ఘనుల దగ్గర ఉన్నారు. ఆ ఘనులు వారిని పెంచుతూ ఉన్నారు. 7 ఆ లేఖ వారికి అందగానే వారు ఆ డెబ్భైమంది రాకుమారులను వధించారు. వారి తలలు బుట్టలలో పెట్టి యెజ్రేల్‌లో ఉన్న యెహూకు పంపారు.
8 వార్తాహరుడు వచ్చి “రాజు కొడుకుల తలలు తెచ్చార”ని యెహూకు తెలిపాడు. యెహూ అతడితో “వాటిని నగరద్వారం దగ్గర రెండు కుప్పలుగా చేయి. ఉదయం వరకు వాటిని అలాగే ఉంచు” అన్నాడు. 9 తెల్లవారినప్పుడు యెహూ బయటికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరితో ఇలా చెప్పాడు: “మీరు నిర్దోషులు. నేను నా యజమానిపై కుట్ర చేసి అతణ్ణి చంపాను. నిజమే. కానీ వీళ్ళందరినీ చంపినది ఎవరు? 10 ఒక విషయం తెలుసుకోండి. యెహోవా అహాబు రాజవంశాన్ని గురించి చెప్పిన మాటలలో ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండదు. యెహోవా తన సేవకుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాటప్రకారం జరిగించాడు.”
11 అప్పుడు యెహూ యెజ్రేల్‌లో మిగిలిన అహాబు వంశీయులందరినీ హతమార్చాడు. అంతేగాక, అహాబు పక్షం ఉన్న ఘనులనూ అతడి మిత్రులనూ యాజులనూ కూడా చంపాడు. అతడి పక్షంవాళ్ళలో ఎవరినీ వదిలిపెట్టలేదు.
12 తరువాత యెహూ బయలుదేరి షోమ్రోనుకు వెళుతూ ఉన్నాడు. త్రోవలో, గొర్రెల బొచ్చు కత్తిరించే ఇంటిదగ్గర అతడికి యూదా రాజైన అహజ్యా బంధువులు ఎదురయ్యారు. 13 అతడు వాళ్ళను “ఎవరు మీరు?” అని అడిగాడు. వాళ్ళు “మేము అహజ్యా బంధువులం. రాజు కొడుకులనూ రాణి కొడుకులనూ చూడడానికి వెళ్తున్నాం” అన్నారు. 14 అది విని యెహూ తనతో ఉన్న వారికి “వీళ్ళను ప్రాణంతో పట్టుకోండి” అని ఆజ్ఞాపించాడు. వారు వాళ్ళను ప్రాణంతో పట్టుకొని గొర్రెబొచ్చు కత్తిరించే ఇంటిప్రక్క ఉన్న గుంటదగ్గర చంపారు. వాళ్ళు నలభై రెండుమంది. అతడు వాళ్ళలో ఒక్కణ్ణి కూడా వదిలిపెట్టలేదు.
15 యెహూ అక్కడనుంచి బయలుదేరి తనను కలుసుకోవడానికి రేకాబు కొడుకు యెహోనాదాబు రావడం చూశాడు, అతడికి శుభమని చెప్పి “నా మనసు నీపట్ల యథార్థంగా ఉన్నట్టు నీ మనసు నాపట్ల ఉందా?” అని అడిగాడు. యెహోనాదాబు “ఉంది” అని జవాబిచ్చాడు.
16 “యెహోవా కోసం నేను ఎంత ఆసక్తిగా ఉన్నానో వచ్చి చూడు” అని యెహూ చెప్పి తన రథంలో అతణ్ణి తీసుకువెళ్ళాడు. 17 అతడు షోమ్రోను నగరం చేరి అక్కడ మిగిలి ఉన్న అహాబు వంశంవాళ్ళందరిని చంపాడు. ఆ వంశాన్ని సమూల నాశనం చేశాడు. ఈ విధంగా ఏలీయాతో యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
18 ఆ తరువాత యెహూ ప్రజలందరిని సమకూర్చి ఇలా చెప్పాడు: “అహాబు బయల్‌దేవుడికి కొద్దిగానే సేవ చేశాడు. యెహూ ఆయనకు ఇంకా ఎక్కువ సేవ చేస్తాడు. 19 కనుక బయల్‌దేవుడి ప్రవక్తలందరినీ దాసులందరినీ పూజారులందరినీ నాదగ్గరికి పిలవండి. ఎవ్వడూ తప్పకూడదు. వారిలో రానివాళ్ళు బ్రతకరు. ఎందుకంటే నేను బయల్‌దేవుడికి గొప్ప బలి సమర్పిస్తాను.”
బయల్‌దేవుణ్ణి సేవించేవారిని నాశనం చేద్దామని యెహూ యుక్తిగా అలా చెప్పాడు. 20 “బయల్ దేవుడికి పండుగ ఏర్పాటు చేయండి” అని యెహూ ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు అలాగే ప్రకటించారు. 21 యెహూ ఇస్రాయేల్‌లో నలుదిక్కులకు కబురంపాడు. బయల్‌దేవుడి సేవకులంతా పండుగకు వచ్చారు. వాళ్ళలో ఒక్క మనిషి కూడా రాకుండా ఉండలేదు. వాళ్ళంతా బయల్‌దేవుడి గుడిలో ప్రవేశించారు. బయల్‌దేవుడి గుడి ఈ చివరనుండి ఆ చివరవరకు వాళ్ళతో నిండిపోయింది. 22 అప్పుడు యెహూ దుస్తుల గదిమీద అధికారం ఉన్నవాణ్ణి పిలిచి “బయల్‌దేవుడి దాసులందరికీ అంగీలు బయటికి తీసుకురా” అన్నాడు. ఆ మనిషి వాళ్ళ కోసం అంగీలు బయటికి తెచ్చాడు.
23 తరువాత యెహూ, రేకాబు కొడుకు యెహోనాదాబు బయల్‌దేవుడి గుడిలోకి వెళ్ళారు. “ఇక్కడ మీ మధ్య యెహోవా సేవకులు ఎవరూ లేకుండా చూడండి, బయల్‌దేవుడి దాసులు మాత్రమే ఉండాలి” అని యెహూ ఆదేశించాడు.
24 బయల్‌దేవుడి పూజారులు బలులూ హోమాలూ అర్పించడానికి లోపలికి వచ్చారు. అప్పుడు యెహూ గుడి వెలుపల ఎనభైమంది కావలివాళ్ళను ఉంచి ఇలా హెచ్చరించాడు:
“నేను మీ వశం చేయబోయేవాళ్ళలో ఒక్కణ్ణి కూడా తప్పించుకుపోనిస్తే వాడి ప్రాణానికి బదులు వాణ్ణి తప్పించుకుపోనిచ్చినవాడి ప్రాణం తీస్తాను.”
25 హోమబలి అర్పించడం ముగించాక యెహూ కావలివాళ్ళకూ వాళ్ళ అధికారులకూ ఇలా ఆదేశించాడు:
“లోపలికి వెళ్ళి వాళ్ళను కూలగొట్టండి. ఒక్కణ్ణి కూడా బయటికి రానియ్యకూడదు.” ఆ కావలివారూ అధిపతులూ వాళ్ళను ఖడ్గంతో కూలగొట్టారు. వాళ్ళ శవాలను బయట పారవేశారు. అప్పుడు వారు బయల్‌దేవుడి ఆలయంలోని గర్భగుడిలో చొరబడి 26 అక్కడి విగ్రహాలను బయటికి తెచ్చి తగలబెట్టారు. 27 బయల్‌దేవుడి స్తంభాన్ని పడగొట్టారు. బయల్‌దేవుడి గుడిని నేలమట్టం చేసి దానిని మరుగుదొడ్డిగా చేశారు. ఈ నాటికీ అది అలాగే ఉంది.
28 ఆ విధంగా యెహూ బయల్‌దేవుణ్ణి ఇస్రాయేల్‌లో లేకుండా నిర్మూలించాడు. 29  కానీ ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకైన యరొబాం పాపాలు యెహూ విడిచిపెట్టలేదు. బేతేల్‌లో, దానులో ఉన్న ఆ బంగారు దూడలను పూజించడం మానుకోలేదన్న మాట.
30 యెహోవా యెహూకు ఇలా చెప్పాడు: “నా మనసులో ఉన్నదాని ప్రకారమే నీవు అహాబు రాజవంశాన్ని చేసి నా దృష్టిలో న్యాయమైనదానిని జరిగించావు. దానిని బాగా నెరవేర్చావు గనుక నాలుగు తరాల వరకు నీ సంతానం ఇస్రాయేల్ రాజ్య సింహాసనం ఎక్కుతారు.”
31 అయినా ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇచ్చిన ఉపదేశం ప్రకారం యెహూ మనసారా ప్రవర్తించలేదు. ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు.
32 ఆ రోజుల్లో యెహోవా ఇస్రాయేల్‌ను తగ్గించ నారంభించాడు. యొర్దానుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో వారిని హజాయేల్ ఓడించాడు. 33 గిలాదు ప్రాంతమంతట్లో, అర్నోను లోయలో ఉన్న అరోయేర్ మొదలుకొని గాదు, రూబేను, మనష్షే గోత్రాలవారు నివసించిన గిలాదు, బాషాను ప్రదేశాలలో వారిని హజాయేల్ ఓడించాడు. 34 యెహూను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 35 యెహూ కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోయాహాజు రాజయ్యాడు. 36 యెహూ ఇస్రాయేల్‌ప్రజపై షోమ్రోనులో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు.