9
1 ✝ఎలీషా ప్రవక్తల బృందంలో✽ ఒకణ్ణి పిలిచి ఇలా అన్నాడు: “నీ నడికట్టు బిగించుకొని ఈ సీసాలో ఈ నూనె✽ చేతపట్టుకొని రామోత్ గిలాదుకు వెళ్ళు. 2 ✽ అక్కడికి చేరి యెహూ అనే వ్యక్తి కోసం వెదకు. అతడు నింషీ కొడుకైన యెహోషాపాతు కొడుకు. అతనిదగ్గరికి వెళ్ళి అతనితో కూడా ఉన్నవాళ్ళ మధ్యనుండి అతణ్ణి పిలిచి లోపలి గదిలోకి తీసుకుపో. 3 అప్పుడు ఈ నూనె సీసా చేతపట్టుకొని నూనె అతడి తలమీద పోసి ఈ విధంగా చెప్పు: ‘యెహోవా చెప్పేదేమిటంటే, నేను నిన్ను ఇస్రాయేల్‌ప్రజపై రాజుగా అభిషేకించాను’. తరువాత తలుపు తెరచి పారిపో. అక్కడ ఆగనేవద్దు.”4 ఆ యువకుడైన ప్రవక్త రామోత్ గిలాదు✽కు వెళ్ళాడు. 5 అక్కడికి చేరి సైన్యంలో అధిపతులు ఒకచోట కూర్చుని ఉండడం చూశాడు. అప్పుడతడు “అధిపతీ, మీకో కబురు చెప్పాలి” అన్నాడు. అందుకు యెహూ “ఇంతమందిలో ఎవరికి” అని అడిగినప్పుడు ఆ ప్రవక్త “అధిపతీ, మీకే” అని జవాబిచ్చాడు.
6 యెహూ లేచి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఆ ప్రవక్త అతడి తలమీద నూనె పోసి “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇలా చెపుతున్నాడు: యెహోవా ప్రజ అయిన ఇస్రాయేల్‌వారిపై నిన్ను రాజుగా అభిషేకించాను. 7 నీవు నీ యజమాని అహాబు✽ వంశీయులను హతం చేయాలి. ఎందుకంటే యెజెబెల్ నా సేవకులైన ప్రవక్తలనూ యెహోవాకు సేవ చేసిన ఇతరులనూ చంపించింది. ఆ రక్తపాతానికి నేను ప్రతీకారం✽ చేస్తాను. 8 ✽ అహాబు వంశం పూర్తిగా నశిస్తుంది. అహాబు వంశంలో మగవాళ్ళందరినీ అల్పులను గానీ ఘనులను గానీ ఇస్రాయేల్‌లో లేకుండా చేస్తాను.
9 ✝“నెబాతు కొడుకైన యరొబాం వంశాన్నీ అహీయా కొడుకైన బయెషా వంశాన్నీ నేను చేసినట్టే అహాబు వంశాన్ని చేస్తాను. 10 యెజెబెల్✽ను యెజ్రేల్ ప్రాంతంలో కుక్కలు తింటాయి. ఎవరూ ఆమెను సమాధి చేయరు” అన్నాడు. అప్పుడతడు తలుపు తెరచి పారిపోయాడు.
11 యెహూ తన రాజుకు సేవ చేసిన అధిపతుల దగ్గరికి తిరిగి వచ్చాడు. వాళ్ళలో ఒకడు “అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు✽ నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. అందుకు యెహూ “వాడు, వాడి మాటల తీరు మీకు తెలుసు గదా” అన్నాడు.
12 వాళ్ళు “అది నిజం కాదు. అసలేం జరిగిందో ఇప్పుడు మాకు చెప్పు” అన్నాడు. యెహూ “అతడు నాతో ఇలా చెప్పాడు: యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఇస్రాయేల్‌ప్రజపై నిన్ను రాజుగా అభిషేకించాను” అని చెప్పాడు.
13 వెంటనే వాళ్ళంతా వాళ్ళ పైవస్త్రాలను తీసి యెహూక్రింద మెట్లమీద పరిచారు. వాళ్ళు పొట్టేలు కొమ్ము బూర✽ ఊది “యెహూ రాజయ్యాడు” అని ప్రకటించారు.
14 నింషీ కొడుకైన యెహోషాపాతు కొడుకు యెహూ యెహోరాంరాజు మీద కుట్ర చేశాడు. యెహూ “మీరు నా పక్షం వహించాలనుకుంటే ఈ విషయం యెజ్రేల్‌కు వెళ్ళి చెప్పడానికి ఇక్కడనుంచి ఎవరినీ వెళ్ళనియ్యకండి” అన్నాడు. అంతకుముందు యెహోరాం ఇస్రాయేల్ సైన్యమంతటితో కలిసి సిరియా రాజైన హజాయేల్‌ను ఎదిరించడానికి రామోత్ గిలాదును కాపలా కాస్తూ ఉన్నాడు. 15 కానీ అతడు సిరియా రాజైన హజాయేల్‌తో యుద్ధం చేసినప్పుడు సిరియావాళ్ళ వల్ల తగిలిన గాయాలు నయం చేసుకోవడానికి యెజ్రేల్✽కు తిరిగి వెళ్ళాడు. 16 యెహోరాం యెజ్రేల్‌లో ఇంకా మంచం పట్టి ఉన్నాడు. గనుక యెహూ రథమెక్కి అక్కడికి తరలివెళ్ళాడు. ఆ సమయంలోనే యూదా రాజైన అహజ్యా యెహోరాంను చూడడానికి అక్కడికి వెళ్ళాడు.
17 యెజ్రేల్ కావలి గోపురం మీద కావలివాడు నిలుచున్నాడు. యెహూ, అతని సైనికుల గుంపు రావడం చూచి అతడు “నాకో సైనికుల గుంపు కనిపిస్తున్నది” అన్నాడు. అందుకు యెహోరాం “రౌతును ఒకణ్ణి వాళ్ళను కలవడానికి పంపించు. అతడు వాళ్ళతో ‘శాంతి భావంతో వస్తున్నారా?’ అని అడగాలి” అని ఆదేశించాడు.
18 ఆ రౌతు యెహూను ఎదుర్కోవడానికి వెళ్ళి “శాంతి భావంతో వస్తున్నారా? అని రాజు అడుగుతున్నాడ”ని చెప్పాడు. అందుకు యెహూ “శాంతితో నీకేం పని? నా వెనక్కు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. అప్పుడు కావలివాడు “మనం పంపినవాడు వాళ్ళ దగ్గరికి చేరాడు గానీ తిరిగి రావడం లేద”ని చెప్పాడు.
19 రాజు ఇంకో రౌతును పంపించాడు. అతడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి “శాంతి భావంతో వస్తున్నారా? అని రాజు అడుగుతున్నాడు” అన్నాడు. దానికి యెహూ “శాంతితో నీకేం పని? నా వెనక్కు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.
20 కావలివాడు “అతడు వాళ్ళ దగ్గరికి చేరాడు గానీ తిరిగి రావడం లేదు. ఆ రథాలు నడపడం నింషీ కొడుకు యెహూ నడపడం లాగా ఉంది. వెర్రివాడి మాదిరిగా నడుపుతూ వస్తూ వున్నాడు” అన్నాడు.
21 యెహోరాం “నా రథం సిద్ధం చెయ్యి” అన్నాడు. వారు అతడి రథం సిద్ధం చేశాక ఇస్రాయేల్ రాజు యెహోరాం బయలుదేరాడు. అతడితోపాటు యూదా రాజు అహజ్యా తన రథంలో బయలుదేరాడు. వారు యెహూను ఎదుర్కోవడానికి వెళ్ళి యెజ్రేల్ పట్టణస్థుడైన నాబోతు✽కు చెందిన పొలంలో అతణ్ణి కలుసుకొన్నారు. 22 యెహోరాం యెహూను చూచీ చూడడంతోనే “శాంతిభావంతో వచ్చారా, యెహూ?” అనడిగాడు. అందుకు యెహూ ఇలా జవాబిచ్చాడు: “మీ తల్లి యెజెబెల్✽ ఇంత అపరిమితంగా వ్యభిచారం, మంత్రవిద్య జరిగిస్తూవుంటే శాంతి ఎలాగుంటుంది?”
23 ✽ అది విని యెహోరాం అహజ్యాతో “అహజ్యా! ఇది రాజద్రోహం!” అంటూ తన రథం త్రిప్పి పారిపోయాడు. 24 అయితే యెహూ తన బలంకొద్ది విల్లు ఎక్కుపెట్టి యెహోరాం భుజాల మధ్యకు కొట్టాడు. బాణం అతడి గుండెగుండా దూసుకుపోయింది. అతడు తన రథంలో వాలాడు. 25 ✝అప్పుడు యెహూ తన సహాయ అధిపతి అయిన బిద్కర్‌తో ఇలా చెప్పాడు: “అతడి శవాన్ని తీసుకొని యెజ్రేల్‌వాడైన నాబోతు పొలంలో పడెయ్యి. ఒకసారి మనమిద్దరం రథమెక్కి అతడి తండ్రి అహాబు వెంట వెళ్తున్నప్పుడు యెహోవా అహాబుమీద శిక్ష విధించాడు. జ్ఞాపకం చేసుకో. 26 ✝అప్పుడు యెహోవా అతడికి చెప్పినదేమిటంటే ‘నిన్నటి రోజు నేను నాబోతు రక్తం అతని కొడుకుల రక్తం తప్పక చూశాను. ఈ పొలంలోనే నీకు ప్రతీకారం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.’ కనుక ఇప్పుడు యెహోవా మాటప్రకారం నీవు అతడి శవాన్ని తీసుకొని ఈ పొలంలో పడెయ్యి.”
27 ✝జరిగినది చూచి యూదా రాజైన అహజ్యా వనంలోని భవనం దారిన పారిపోయాడు. అయితే యెహూ అతడి వెంటపడి “అతణ్ణి కూడా కూలగొట్టండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు గూర్‌కు పోయే త్రోవలో ఇబ్‌లెయాం దగ్గర అతడి రథంలోనే అతణ్ణి గాయపరిచారు. అయితే అతడు మెగిద్దోకు పారిపోయి అక్కడ మృతి చెందాడు. 28 అతడి సేవకులు అతణ్ణి రథంలో జెరుసలంకు తీసుకువెళ్ళారు. దావీదు నగరంలో అతడి పూర్వీకుల దగ్గర అతణ్ణి సమాధి చేశారు. 29 అహాబు కొడుకు యెహోరాం పరిపాలిస్తున్న పదకొండో సంవత్సరంలో అహజ్యా రాజయ్యాడు.
30 ✽ యెహూ యెజ్రేల్ వచ్చిన విషయం యెజెబెల్‌కు వినవచ్చింది. అప్పుడామె తన కళ్ళకు కాటుక పెట్టుకొని తల అలంకరించుకొని కిటికీలోనుంచి చూస్తూ ఉంది. 31 ✽యెహూ ద్వారంలో ప్రవేశించగానే యెజెబెల్ అతడితో “శాంతిభావంతో వస్తున్నావా, తన యజమాన్ని హత్య చేసిన జిమ్రీలాంటివాడా?” అని చెప్పింది.
32 అది విని యెహూ తల పైకెత్తి కిటికీవైపు చూచి “నా పక్షం ఉన్నది ఎవరు?” అని అరిచాడు. ఆమె పరివారంలో ఇద్దరు, ముగ్గురు పైనుంచి అతనివైపు చూశారు. 33 యెహూ “ఆమెను క్రింద పడెయ్యండి” అని చెప్పాడు. వాళ్ళు ఆమెను పడవేశారు. ఆమె రక్తంలో కొంత గోడమీదా అతడి గుర్రాలమీదా చిమ్మింది. యెహూ గుర్రాలచేత ఆమెను త్రొక్కించాడు.
34 తరువాత యెహూ భవనం లోపలికి వెళ్ళి అన్నపానాలు పుచ్చుకొని “శాపానికి గురి అయిన ఆ స్త్రీ రాకుమార్తె గనుక ఆమె శవాన్ని కనుగొని పాతి పెట్టండి” అని ఆదేశించాడు. 35 వాళ్ళు ఆమెను పాతిపెట్టడానికి వెళ్ళారు గానీ ఆమె పుర్రె, పాదాలు, అరచేతులు తప్ప ఏమీ కనిపించలేదు. 36 ✽ వాళ్ళు తిరిగి వచ్చి యెహూకు ఆ విషయం చెప్పారు. అప్పుడతడు ఇలా అన్నాడు: “యెహోవా తన సేవకుడూ తిష్బివాడూ అయిన ఏలీయా ద్వారా పలికినదేమిటంటే, యెజ్రేల్ ప్రాంతంలో యెజెబెల్ శరీరాన్ని కుక్కలు తింటాయి. 37 ✽ఇది యెజెబెల్ అని ఎవరూ అనుకోకుండేలా యెజెబెల్ శవం భూతలం మీద ఉన్న పెంటలాగా ఉంటుంది.”