8
1 ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన పిల్లవాడి తల్లితో ఇలా అన్నాడు: “యెహోవా కరవు రప్పిస్తున్నాడు. అది ఈ దేశంలో ఏడు సంవత్సరాలపాటు ఉంటుంది. గనుక మీరూ మీ కుటుంబంవారూ బయలుదేరి మీకు వీలున్న స్థలానికి వెళ్ళి ప్రస్తుతం అక్కడ కాపురం ఉండండి.” 2 దేవుని మనిషి చెప్పినట్టు ఆ స్త్రీ చేసింది. ఆమె, ఆమె కుటుంబంవారు ఫిలిష్తీయవాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలు కాపురం చేశారు.
3 ఏడేళ్ళు ముగిసిన తరువాత ఆమె ఫిలిష్తీయవాళ్ళ దేశం నుంచి తిరిగి వచ్చింది. తన ఇల్లు, భూమి కోసం మనవి చేసుకోవడానికి ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. 4 ఆ సమయంలో దేవుని మనిషికి పరిచర్య చేసే గేహజీతో రాజు సంభాషిస్తూ ఉన్నాడు. “ఎలీషా చేసిన గొప్ప క్రియలన్నీ నాకు చెప్పు” అని అడుగుతూ ఉన్నాడు. 5 ఎలీషా చచ్చినవాణ్ణి ఎలా బ్రతికించాడో గేహజీ రాజుకు చెపుతూ ఉండగానే అతడు బ్రతికించిన పిల్లవాడి తల్లి వచ్చింది, తన ఇల్లు, భూమికోసం రాజుకు మనవి చేసుకోవడం మొదలుపెట్టింది. గేహజీ “నా యజమానీ, రాజా! ఆ స్త్రీ ఈమే, ఇతడు ఈమె కొడుకు. ఎలీషా బ్రతికించినవాడు ఇతడే” అన్నాడు.
6 రాజు ఆమెను అడిగినప్పుడు ఆమె ఆ విషయం వివరించింది. రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించి అతడికి “ఆమె ఆస్తి అంతా ఆమెకు ఇప్పించు. అంతేగాక, ఆమె దేశం విడిచివెళ్ళిన రోజు నుంచి ఇప్పటివరకూ ఆమె భూమివల్ల వచ్చిన రాబడి కూడా ఆమెకు ఇప్పించు” అని ఆజ్ఞ జారీ చేశాడు.
7 సిరియా రాజైన బెన్‌హదదుకు జబ్బు చేసింది. అప్పుడు ఎలీషా దమస్కుకు వెళ్ళాడు. “ఆ దేవుని మనిషి ఇక్కడికి వచ్చాడ”ని వార్త రాజుకు వినవచ్చింది.
8 రాజు హజాయేల్‌ను పిలిచి ఇలా ఆదేశించాడు: “నువ్వు కానుక చేతపట్టుకొని వెళ్ళి దేవుని మనిషిని కలుసుకో. నాకు ఈ జబ్బు నయం అవుతుందో, లేదో ఆయన చేత యెహోవా దగ్గర విచారణ చేయించు.”
9 హజాయేల్ కానుకగా దమస్కులో అన్ని రకాల మంచి వస్తువులను ఎన్నుకొని నలభై ఒంటెలమీద ఎక్కించి ఎలీషాను కలుసుకోవడానికి బయలుదేరాడు. ఎలీషా దగ్గరికి వచ్చి అతడి ముందు నిలబడి ఇలా అన్నాడు: “మీ కుమారుడూ సిరియారాజూ అయిన బెన్‌హదదు మీదగ్గరికి నన్ను పంపించాడు. తనకు జబ్బు నయం అవుతుందో, లేదో అని అడుగుతున్నాడు.”
10 అందుకు ఎలీషా “నీవు వెళ్ళి ‘మీకు తప్పకుండా నయం అవుతుంది’ అని ఆయనతో చెప్పు. ఆయన తప్పక చనిపోతాడని యెహోవా నాకు తెలియజేశాడు” అన్నాడు. 11 హజాయేల్ తత్తరపడేంతవరకు దేవుని మనిషి తదేకంగా అతణ్ణి తేరిచూస్తూ ఉన్నాడు. కన్నీళ్ళు విడిచాడు.
12  హజాయేల్ “నా యజమానులైన మీరు ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నారు?” అని అడిగాడు.
ఎలీషా ఇలా జవాబు చెప్పాడు: “నీవు ఇస్రాయేల్‌ప్రజకు చేయబోయే కీడు నాకు తెలుసు. గనుకనే నేను కన్నీళ్ళు విడుస్తున్నాను. వారి కోటలు తగులబెట్టిస్తావు. వారి యువకులను ఖడ్గంతో చంపుతావు. వారి చంటిపిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు. వారి గర్భిణి స్త్రీల కడుపులు చీలుస్తావు.”
13  అందుకు హజాయేల్ “మీ దాసుడైన నేను కుక్కలాంటి అల్పుణ్ణి. ఇంత పని చేయడానికి నేనెంత మాత్రంవాణ్ణి?” అన్నాడు.
ఎలీషా “నీవు సిరియా మీద రాజవుతావని యెహోవా నాకు వెల్లడి చేశాడ”ని చెప్పాడు.
14 హజాయేల్ ఎలీషాను విడిచి తన యజమానిదగ్గరికి వచ్చాడు. బెన్‌హదదు “ఎలీషా నీతో ఏం చెప్పాడు?” అని అడిగినప్పుడు హజాయేల్ “మీకు తప్పకుండా నయం అవుతుంది అన్నాడు” అని జవాబిచ్చాడు. 15 మరుసటి రోజు హజాయేల్ ముతక బట్ట నీళ్ళలో ముంచి రాజు ముఖంమీద కప్పాడు. అలా రాజు చనిపోయాడు. అతడి స్థానంలో హజాయేల్ రాజయ్యాడు.
16 ఇస్రాయేల్ రాజైన అహాబు కొడుకు యెహోరాం పరిపాలనలో అయిదో ఏట యూదా రాజైన యెహోషాపాతు కొడుకు యెహోరాం రాజయ్యాడు. 17 యెహోరాం రాజయినప్పుడు అతడి వయస్సు ముప్ఫయి రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఎనిమిది ఏళ్ళు పరిపాలించాడు. 18 అతడు అహాబు కూతురిని పెండ్లి చేసుకొన్నాడు గనుక అహాబు రాజవంశంలాగే, ఇస్రాయేల్ రాజుల జీవిత విధానాలను అనుసరించి నడిచేవాడు. యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 19 అయినా యెహోవా తన సేవకుడైన దావీదును తలంచుకొని యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. అతని కోసం, అతని సంతానం కోసం దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చేస్తానని యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు.
20 యెహోరాం కాలంలో ఎదోంవాళ్ళు యూదా పరిపాలనను వ్యతిరేకించారు. వాళ్ళు స్వయంగా ఒక రాజును తమ మీద నియమించుకొన్నారు. 21 అప్పుడు యెహోరాం తన రథాలన్నీ తీసుకొని జాయీర్‌కు వెళ్ళాడు. రాత్రిలో లేచి తననూ తన రథసారథులనూ చుట్టుముట్టిన ఎదోంవాళ్ళపైబడ్డాడు. ప్రజలు తమ ఇండ్లకు పారిపోయారు. 22 ఈనాటికీ ఎదోంవాళ్ళు యూదా పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ సమయంలో లిబ్నా పట్టణస్థులు కూడా తిరగబడ్డారు. 23 యెహోరాంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి. 24 యెహోరాం కన్ను మూసి తన పూర్వీకులదగ్గర చేరాడు. అతడి పూర్వీకులదగ్గర దావీదు నగరంలో అతణ్ణి పాతిపెట్టారు. అతడి స్థానంలో అతడి కొడుకు అహజ్యా రాజయ్యాడు.
25 ఇస్రాయేల్ రాజైన అహాబు కొడుకు యెహోరాం పరిపాలనలో పన్నెండో ఏట యూదా రాజైన యెహోరాం కొడుకు అహజ్యా రాజయ్యాడు. 26 అహజ్యా రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఏడాది పరిపాలించాడు. అతడి తల్లి పేరు అతల్యా. ఆమె ఇస్రాయేల్ రాజైన ఒమ్రీ మనుమరాలు. 27 అహజ్యా అహాబు ఇంటి అల్లుడు గనుక అతడు అహాబు ఇంటివాళ్ళ జీవిత విధానాలను అనుసరించాడు. అహాబు రాజు వంశంలాగే యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. 28 ఒకసారి అతడు అహాబు కొడుకు యెహోరాంతో కలిసి సిరియా రాజైన హజాయేల్ మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్ళాడు. అక్కడ సిరియావాళ్ళు యెహోరాంను గాయపరిచారు. 29 సిరియా రాజైన హజాయేల్‌తో యుద్ధం చేస్తూ ఉంటే, రమా దగ్గర సిరియా వాళ్ళ వల్ల తనకు కలిగిన గాయాలు నయం చేసుకోవడానికి యెహోరాంరాజు యెజ్రేల్‌కు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాం అనారోగ్యంగా ఉన్నందుచేత యూదా రాజైన యెహోరాం కొడుకు అహజ్యా అతణ్ణి చూడడానికి యెజ్రేల్‌కు వెళ్ళాడు.