7
1  అందుకు ఎలీషా ఇలా అన్నాడు: “యెహోవా వాక్కు విను. యెహోవా చెప్పేదేమిటంటే, రేపు ఇదే వేళకు తులం వెండికి నాలుగు కిలోగ్రాముల మెత్తని గోధుమపిండి, తులం వెండికి ఎనిమిది కిలోల యవలు షోమ్రోను ద్వారందగ్గర దొరుకుతాయి.”
2 అప్పుడు రాజు తన అధిపతులలో ఒకడి చేతిమీద ఆనుకొని ఉన్నాడు. ఆ అధిపతి దేవుని మనిషికి “యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా అలా జరగగలదా?” అని బదులు చెప్పాడు. ఎలీషా “ఇదిగో విను. నీవు కండ్లారా చూస్తావు గాని దానిలో ఏమీ తినవు” అన్నాడు.
3 నగర ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు. వారు ఒకడితో ఒకడు “మనం చచ్చేంతవరకూ ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలి? 4 అయితే మనం నగరంలోకి వెళ్తామనుకోండి. అక్కడ కరవు ఉంది. అక్కడైనా చస్తాం. ఇక్కడే కూర్చునివున్నా చస్తాం. గనుక మనం ఇప్పుడు సిరియావాళ్ళ శిబిరానికి వెళదాం పదండి. ఒకవేళ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం, చంపితే చస్తాం” అని చెప్పుకొన్నారు.
5 సందె చీకటిలో వారు సిరియావాళ్ళ శిబిరానికి వెళ్ళడానికి బయలుదేరారు. అయితే ఆ శిబిరానికి దగ్గరగా వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు! 6 అంతకుముందు యెహోవా సిరియా సైన్యానికి రథాలూ గుర్రాల చప్పుడు వినిపించేలా చేశాడు. అందుచేత సిరియావాళ్ళు ఒకడితో ఒకడు “ఇదిగో విను. ఇస్రాయేల్ రాజు మన పైబడడానికి హిత్తివాళ్ళ రాజుల్నీ ఈజిప్ట్‌వాళ్ళ రాజుల్నీ కానుక ఇచ్చి తోడు తెచ్చుకున్నాడు” అని చెప్పుకొన్నారు. 7 కాబట్టి వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవాలని సందె చీకటిలో పారిపోయారు. గుడారాలనూ గుర్రాలనూ గాడిదలనూ శిబిరం ఉన్నది ఉన్నట్టు వదిలి వెళ్ళారు. 8 ఆ కుష్ఠురోగులు శిబిరం పొలిమేరకు వచ్చి ఒక గుడారంలో చొరబడ్డారు. దానిలో తిన్నారు, త్రాగారు. అక్కడనుంచి వెండి, బంగారం, దుస్తులు ఎత్తుకుపోయి వేరే చోట దాచారు. తిరిగి వచ్చి ఇంకో గుడారంలోకి వెళ్ళి దానిలో నుంచి వస్తువులు తీసుకుపోయి వాటిని దాచిపెట్టారు.
9 అప్పుడు వారు ఒకడితో ఒకడు “మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభవార్త ఉన్న రోజు. అయితే మనం ఎవరికీ చెప్పడం లేదు. తెల్లవారేవరకు ఇక్కడ ఆగితే శిక్షకు గురి అవుతాం. గనుక వెళ్ళి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.
10 వారు వచ్చి నగర ద్వారం దగ్గర ఉన్న కాపలావాళ్ళను పిలిచి ఇలా అన్నారు: “మేం సిరియావాళ్ళ శిబిరానికి వెళ్ళాం. అక్కడ ఎవ్వరూ లేరు. మనిషి చప్పుడూ లేదు. గుర్రాలూ గాడిదలూ కట్టి ఉన్నాయి. గుడారాలు ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయి.” 11 ఆ కావలివాళ్ళు ఆ వార్త బిగ్గరగా కేకలు వేస్తూ రాజభవనంలో ఉన్న వారికి తెలియజేశారు.
12 రాజు రాత్రిపూట లేచి తన పరివారంతో ఇలా అన్నాడు: “మనకు వ్యతిరేకంగా సిరియావాళ్ళు చేసేది చెప్తాను, వినండి. మనం ఆకలితో ఉన్నామని వాళ్ళకు తెలుసు. వాళ్ళు శిబిరం నుంచి వెళ్ళి బయట దాక్కున్నారు. మనం నగరం నుంచి వెళ్ళినప్పుడు మనల్ని ప్రాణాలతో పట్టుకొని నగరంలో చొరబడతారు. ఇదే వాళ్ళ ఆలోచన.”
13 అందుకు రాజ పరివారంలో ఒకడు ఇలా జవాబిచ్చాడు: “ఎవరినైనా నగరంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకొని అక్కడికి వెళ్ళనివ్వండి. వారి స్థితి, నగరంలో మిగిలిన వాళ్ళందరి స్థితి ఒక్కటే. ఇది వరకు జరిగినట్టు జరిగితే అందరూ నాశనం అవుతారు గదా. కనుక వారిని పంపి అక్కడి పరిస్థితులు తెలుసుకుందాం.” 14 అప్పుడు వాళ్ళు రెండు రథాలనూ గుర్రాలనూ ఎన్నుకొన్నారు. రాజు “మీరు వెళ్ళి చూడండి” అంటూ వాళ్ళను సిరియా సైన్యం వెనుక పంపాడు.
15 వారు సిరియా సైన్యం వెంట యొర్దానుదాకా వెళ్ళారు. దారి పొడుగున సిరియావాళ్ళు తొందరలో బట్టలూ పాత్రలూ పారవేసినట్టు చూశారు. రాజు పంపినవారు తిరిగి వచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు.
16  అప్పుడు ప్రజలు బయటికి వెళ్ళి సిరియావాళ్ళ శిబిరాన్ని దోచుకొన్నారు. యెహోవా చెప్పిన వాక్కు ప్రకారమే తులం వెండికి నాలుగు కిలోగ్రాముల మెత్తని గోధుమపిండి, తులానికి ఎనిమిది కిలోల యవలు అమ్మారు. 17 రాజు ఏ అధిపతి చేతిమీద ఆనుకొన్నాడో ఆ అధిపతిని ముఖ్య ద్వారపాలకుడుగా నియమించాడు. ద్వారం దగ్గర ప్రజలు అతణ్ణి త్రొక్కివేశారు. అతడు చనిపోయాడు. రాజు తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మనిషి చెప్పినట్టు ఇది జరిగింది. 18 దేవుని మనిషి రాజుతో “రేపు ఇదే వేళకు తులం వెండికి ఎనిమిది కిలోల యవలు, తులానికి నాలుగు కిలోల మెత్తని గోధుమ పిండి షోమ్రోను నగర ద్వారం దగ్గర దొరుకుతాయి” అన్నాడు. 19 ఆ అధిపతి దేవుని మనిషికి ఇలా జవాబిచ్చాడు: “యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా ఈ మాటల ప్రకారం జరగగలదా?” దేవుని మనిషి “ఇదిగో విను. నీవు కండ్లారా చూస్తావు గాని దానిలో ఏమీ తినవు” అన్నాడు. 20 ఆ అధిపతికి అలాగే జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతణ్ణి త్రొక్కివేశారు. అతడు చనిపోయాడు.