6
1 ప్రవక్తల బృందం ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “చూడండి, మీ దగ్గర మాకున్న ఈ స్థలం ఇరుకుగా ఉంది. 2 మమ్మల్ని యొర్దానుకు వెళ్ళనివ్వండి. తలా ఒక దూలం తయారు చేసి మాకోసం నివాసం అక్కడ కట్టుకుంటాం.” ఎలీషా “వెళ్ళండి” అన్నాడు. 3 వారిలో ఒకడు “దయ చేసి మీ దాసులైన మాతో కూడా రండి” అని మనవి చేస్తే అతడు “సరే, వస్తాను” అన్నాడు.
4 అతడు వారితో వెళ్ళాడు. వారు యొర్దానుకు చేరి చెట్లు నరుకుతూ ఉన్నారు. 5 వారిలో ఒకడు దూలం నరుకుతుండగా ఉన్నట్టుండి గొడ్డలి ఊడి నీళ్ళలో పడింది. అతడు “అయ్యో, స్వామీ! అది అరువు తెచ్చుకున్నదే!” అని కేక పెట్టాడు.
6 దేవుని మనిషి “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం చూపెట్టినప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి నీళ్ళలో వేసినప్పుడు గొడ్డలి పైకి తేలింది. 7 “దానిని పట్టుకో” అన్నాడు. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొన్నాడు.
8 సిరియా రాజు ఇస్రాయేల్‌వారితో యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు. అతడు తన పరివారంతో “ఫలాని స్థలంలో మకాం చేద్దాం” అని ఆలోచన చేసేవాడు. 9 అయితే దేవుని మనిషి “ఫలాని స్థలానికి వెళ్ళవద్దు. అక్కడికి సిరియనులు దిగివచ్చారు” అని ఇస్రాయేల్ రాజుకు కబురంపాడు. 10 దేవుని మనిషి తనకు హెచ్చరిక చేసిన స్థలానికి ఇస్రాయేల్ రాజు మనుషులను పంపించి సంగతి తెలుసుకొని తనను రక్షించుకొన్నాడు. అనేక సార్లు ఇలా జరిగింది. 11 సిరియా రాజు చాలా కంగారుపడ్డాడు. అతడు తన పరివారాన్ని పిలిచి “మనలో ఇస్రాయేల్ రాజు పక్షం చేరినవాడెవడో చెప్పండి” అన్నాడు.
12 అతడి పరివారంలో ఒకడు “నా ప్రభూ! రాజా! ఎవ్వరూ కాదు. ఇస్రాయేల్‌లో ఎలీషా ప్రవక్త ఉన్నాడు గదా. మీరు పడకగదిలో కూడా పలికిన మాటలు ఆయన ఇస్రాయేల్ రాజుకు తెలియజేస్తాడు” అన్నాడు.
13 “అతడు ఎక్కడ ఉన్నాడో వెళ్ళి వెదకండి. అతణ్ణి పట్టుకోవడానికి నేను మనుషుల్ని పంపిస్తాను” అని రాజు ఆదేశించాడు. “అతడు దోతానులో ఉన్నాడు” అని వార్త వచ్చింది, 14 గనుక రాజు గుర్రాలనూ రథాలనూ పెద్ద సైన్యాన్నీ అక్కడికి పంపాడు. వాళ్ళు రాత్రి వెళ్ళి ఆ ఊరిని చుట్టుముట్టారు.
15 దేవుని మనిషికి పరిచర్య చేసేవాడు పెందలకడ లేచి బయటికి వెళ్ళాడు. ఊరిచుట్టూ గుర్రాలూ, రథాలూ, సైన్యం ఉండడం చూచి ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చాడు. “అయ్యో, అయ్యగారూ, మనం ఇప్పుడేం చెయ్యాలి?” అని ఆ యువకుడు అన్నాడు.
16 అందుకు ఎలీషా “భయపడవద్దు. వారి పక్షం ఉన్నవాళ్ళకంటే మన పక్షం ఉన్నవారే ఎక్కువమంది” అన్నాడు. 17 అప్పుడు ఎలీషా దేవునికి ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇతడు చూచేలా ఇతడి కండ్లు తెరువు.” అలాగు యెహోవా ఆ యువకుడి కండ్లు తెరిచాడు. ఎలీషా చుట్టూరా కొండమీద అంతటా మంటల్లాంటి గుర్రాలూ రథాలూ అతడికి కనిపించాయి.
18 సిరియావాళ్ళు ఎలీషావైపు వస్తూ ఉన్నప్పుడు అతడు యెహోవాకు “ఈ ప్రజకు గుడ్డితనం కలగజెయ్యి” అని ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థించినట్టు యెహోవా వాళ్ళకు గుడ్డితనం కలగజేశాడు.
19 అప్పుడు ఎలీషా వాళ్ళతో “ఇది తప్పుదారి. ఇది మీరు వెదికిన ఊరు కాదు. నా వెంట రండి. మీరు వెదికే మనిషి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోతాను” అన్నాడు. అతడు వాళ్ళను షోమ్రోనుకు తీసుకుపోయాడు. 20 వాళ్ళు షోమ్రోనులో అడుగుపెట్టిన తరువాత ఎలీషా “యెహోవా, వీరు చూచేలా వీరి కండ్లు తెరువు” అని ప్రార్థించాడు. యెహోవా వాళ్ళ కండ్లు తెరిచాడు. చూపు వచ్చి వాళ్ళు షోమ్రోను మధ్యలోనే ఉన్నట్లు తెలుసుకొన్నారు.
21 ఇస్రాయేల్ రాజు వాళ్ళను చూచి ఎలీషాతో “అయ్యా! వీళ్ళను కూల్చనా! వీళ్ళను చంపనా?” అని అడిగాడు.
22 అందుకు ఎలీషా అన్నాడు “నీవు వాళ్ళను చంపకూడదు. నీ ఖడ్గంతో వింటితో బందీలుగా తెచ్చినవాళ్ళను చంపవు గదా! వాళ్ళకు అన్నపానాలు ఇవ్వు. వాళ్ళు తిని త్రాగి తిరిగి వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళనియ్యి.”
23 రాజు వాళ్ళకు గొప్పవిందు చేశాడు. వాళ్ళు తిని త్రాగిన తరువాత వాళ్ళను వాళ్ళ యజమాని దగ్గరికి పంపించాడు. ఆ తరువాత సిరియనులైన దోపిడీగాళ్ళ గుంపులు ఇస్రాయేల్‌లోకి రావడం మానుకొన్నాయి.
24 అయితే కొంతకాలానికి సిరియారాజైన బెన్‌హదదు తన సైన్యం అంతటినీ పోగు చేసి వచ్చి షోమ్రోన్ను ముట్టడించాడు. 25 షోమ్రోనులో తీవ్రమైన కరవు సంభవించింది. గాడిద తల ధర ఎనభై తులాల వెండి, పావులీటర్ పావురం రెట్టను అయిదు తులాల వెండికి అమ్మారు. సిరియావాళ్ళు వేసిన ముట్టడి అంత కఠినంగా ఉందన్నమాట. 26 ఒక రోజు ఇస్రాయేల్ రాజు ప్రాకారం మీద పచారు చేస్తూ ఉంటే ఒక స్త్రీ అతణ్ణి చూచి “రాజా, నా యజమానీ! సహాయం చేయండి!” అని కేక పెట్టింది.
27 అందుకు రాజు “యెహోవా నీకు సహాయం చేయకపోతే నేనెక్కడ్నుంచి సహాయం చేసేది – కళ్ళంలోనుంచా, లేక ద్రాక్షగానుగ తొట్టినుంచా?” అన్నాడు. 28 అప్పుడు రాజు “నీ కష్టమేమిటి?” అని ఆమెను అడిగాడు. ఆమె ఇలా జవాబు చెప్పింది: “ఈ స్త్రీ నాతో ‘నీ కొడుకును ఇవ్వు. ఇవ్వేళ వాణ్ణి తింటాం. రేపు నా కొడుకును తింటాం’ అంది. 29 అలాగే నా అబ్బాయిని వండి తిన్నాం. మరుసటి రోజు ఆమెను చూచి ‘నీ అబ్బాయిని ఇవ్వు’ అన్నాను గానీ ఆమె తన కొడుకును దాచుకుంది.”
30 రాజు ఆ స్త్రీ చెప్పినది విన్నప్పుడు తన బట్టలు చించుకొన్నాడు. అతడు ప్రాకారం మీద నడిచి వెళుతూ ఉన్నప్పుడు ప్రజలు చూస్తూ ఉంటే అతడి బట్టలలోపల అతడి ఒంటి మీద గోనెపట్ట కనిపించింది. 31  రాజు ఇలా శపథం చేశాడు: “ఇవ్వేళ షాపాతు కొడుకు ఎలీషాకు శిరచ్ఛేదం జరుగుతుంది. లేకపోతే యెహోవా నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక!”
32 అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అతనితో కూడా గ్రామం పెద్దలు కూర్చుని ఉన్నారు. రాజు ఒక మనిషిని పంపాడు గాని ఆ మనిషి ఎలీషా దగ్గరికి చేరకముందే ఎలీషా ఆ పెద్దలతో “ఆ హంతకుడు నా తల నరకమని మనిషిని పంపిస్తున్నాడని మీకు తెలుసా? చూడండి, రాజు పంపినవాడు రాగానే తలుపు మూసి వాణ్ణి లోపలికి రానియ్యకుండా తలుపు గట్టిగా నెట్టండి. వాడి వెంట వాడి యజమాని పాదాల చప్పుడు వినవస్తూ ఉంది గదా” అన్నాడు.
33 ఎలీషా అలా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపినవాడు అక్కడికి వచ్చాడు. రాజు “ఇది యెహోవావల్ల జరిగిన విపత్తు. నేను యెహోవాకోసం ఇంకా ఎందుకు కనిపెట్టాలి?” అన్నాడు.