5
1 సిరియా రాజుకు నయమాను✽ సేనాధిపతి. యెహోవా అతడిచేత సిరియాకు విజయం✽ ప్రసాదించాడు, గనుక అతడి యజమాని దృష్టిలో అతడు గొప్పవాడు, గౌరవనీయుడు. అతడు మహాశూరుడు కూడా. కానీ అతడు కుష్ఠురోగి✽. 2 అంతకుముందు సిరియనులైన దోపిడీగాళ్ళ గుంపులు ఇస్రాయేల్ దేశం మీదికి వెళుతూ ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు అక్కడినుండి ఒక పడుచును బందీగా తీసుకువచ్చారు. ఆమె నయమాను భార్యకు పరిచారిక అయింది. 3 ఆమె తన యజమానురాలితో “నా యజమాని షోమ్రోనులో ఉన్న ప్రవక్త✽ను కలిస్తే ఎంత బాగుండేది! ఆయన నా యజమాని కుష్ఠును పూర్తిగా నయం చేస్తాడు” అంది.4 రాజు దగ్గరికి వెళ్ళి నయమాను “ఇస్రాయేల్ దేశం పిల్ల ఇలా చెప్పింది” అంటూ ఆ విషయం తెలియజేశాడు. 5 ✽అందుకు సిరియా రాజు “సరే, నీవు వెళ్ళు. నేను ఇస్రాయేల్ రాజుకు లేఖ పంపిస్తాను” అని బదులు చెప్పాడు.
నయమాను మూడు వందల నలభై కిలోగ్రాముల వెండి, ఆరు వేల తులాల బంగారం, పది జతల దుస్తులు తీసుకొని తరలివెళ్ళాడు. 6 అతడు ఇస్రాయేల్ రాజు దగ్గరికి ఆ లేఖ తీసుకు వచ్చాడు. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: “ఈ లేఖతోపాటు నా సేవకుడైన నయమానును పంపిస్తున్నాను. అతడికి ఉన్న కుష్ఠును మీరు బాగు చేయాలని కోరుతున్నాను.”
7 ఇస్రాయేల్ రాజు ఆ లేఖ చదవగానే తన బట్టలు చించుకొని✽ “కుష్ఠు బాగు చేయాలని ఈ మనిషి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపాడే! నేను దేవుణ్ణా? జీవం, మరణం నా వశంలో ఉన్నాయా? అతడు నాతో కయ్యానికి ఎలా కాలు దువ్వుతున్నాడో చూడండి” అన్నాడు.
8 దేవుని మనిషి అయిన ఎలీషాకు ఇస్రాయేల్ రాజు తన బట్టలు చించుకొన్నాడని వినవచ్చింది. అతడు “మీరు మీ బట్టలు చించుకొన్నారెందుకని?✽ ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరికి రానియ్యండి. ఇస్రాయేల్‌లో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు” అని రాజుకు కబురు పంపాడు.
9 నయమాను తన గుర్రాలతో రథంతో ఎలీషా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగాడు. 10 ✽ఎలీషా ఒక మనిషిచేత “నీవు యొర్దాను✽కు వెళ్ళి అందులో ఏడు సార్లు స్నానం చెయ్యి. అప్పుడు నీ శరీరం పూర్తిగా నయమై యథాస్థితికి వస్తుంది” అని కబురు పంపాడు.
11 ✽నయమానుకు కోపం వచ్చింది. “అతడు తప్పకుండా నా కోసం బయటికి వచ్చి నిలబడి అతడి దేవుడైన యెహోవా పేర ప్రార్థన చేసి తన చేయి రోగం ఉన్న చోటు మీద ఆడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను. 12 మరి, ఇస్రాయేల్‌లోని నీళ్ళన్నిటి కంటే దమస్కులో ఉన్న అబానా నది, ఫర్పర్ నది మంచివి కావా? ఆ నదుల్లో స్నానం చేసి నయం చేసుకోలేనా?” అంటూ ఆగ్రహం తెచ్చుకొని మళ్ళుకొని వెళ్ళిపోయాడు.
13 అయితే అతడి సేవకులు దగ్గరగా వచ్చి అతడితో “నాయనా, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప క్రియ చేయండని చెప్పి ఉంటే మీరు అలా చేయకుండా ఉంటారా? స్నానం చేసి ఆరోగ్యం పొందండి అన్నమాట దానికంటే ఇంకా మంచిది గదా. అలా చేయకూడదా?” అన్నారు.
14 ✽అందుచేత దేవుని మనిషి చెప్పినట్టు అతడు వెళ్ళి యొర్దానులో ఏడు సార్లు మునిగాడు. వెంటనే అతడి శరీరం పూర్తిగా నయమై పిల్లవాడి శరీరంలాగా యథాస్థితికి వచ్చింది.
15 ✽అప్పుడతడు తన పరివారంతోపాటు దేవుని మనిషి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇంట్లో ప్రవేశించి అతనిముందు నిలబడి ఇలా అన్నాడు: “ఇస్రాయేల్‌లో ఉన్న దేవుడు తప్ప భూలోకమంతట్లో మరో దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలుసు. దయ చేసి మీ దాసుడైన నేను ఇచ్చే ఈ కానుక పుచ్చుకోండి.”
16 ✽ఎలీషా “నేను యెహోవా సన్నిధానంలో నిలుచున్నాను. ఆయన జీవంమీద ఆనబెట్టి చెపుతున్నాను – నేనేమి తీసుకోను” అని బదులు చెప్పాడు. తీసుకోవాలని నయమాను నొక్కి నొక్కి చెప్పినా ఎలీషా ఒప్పుకోలేదు.
17 అప్పుడు నయమాను ఇలా అన్నాడు: “ఇప్పటి నుంచి మీ దాసుడైన నేను యెహోవాకే హోమాలూ బలులూ అర్పిస్తాను గాని మరే దేవుడికి అర్పించను. కనుక దయ చేసి మీ దాసుడైన నాకు రెండు కంచర గాడిదలు మోసే మట్టి✽ ఇవ్వండి. 18 ✽కానీ ఓ విషయంలో యెహోవా మీ దాసుడైన నన్ను క్షమిస్తాడు గాక. అంటే, నా రాజు రిమ్మోనుదేవుడి ఆలయంలో ఆరాధన చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన నా చేతి మీద ఆనుకొంటాడు. అప్పుడు నేను రిమ్మోను దేవాలయంలో వంగితే అలా చేసినందుకు యెహోవా మీ దాసుడైన నన్ను క్షమిస్తాడు గాక.”
19 ✽ఎలీషా అతడితో “క్షేమంగా వెళ్ళు” అన్నాడు.
అతడు ఎలీషా దగ్గరనుంచి కొంత దూరం వెళ్ళిన తరువాత 20 ✽దేవుని మనిషి అయిన ఎలీషాకు పరిచర్య చేసే గేహజీ ఇలా అనుకొన్నాడు: “చూశారా! ఈ సిరియావాడైన నయమాను తెచ్చినవాటిని తీసుకోకుండా నా యజమాని అతణ్ణి ఊరికే వెళ్ళనిచ్చాడు. యెహోవా జీవంమీద ఆన – నేను అతడివెంట పరుగెత్తి అతడినుంచి ఏదైనా తీసుకుంటాను.”
21 అలా అనుకొని గేహజీ నయమాను వెంటపడ్డాడు. నయమాను తన వెనుక ఒక వ్యక్తి పరుగెత్తి రావడం గమనించి అతణ్ణి కలుసుకోవడానికి రథం దిగాడు. “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.
22 ✽గేహజీ “క్షేమమే. నా యజమాని నన్ను పంపి ఇలా అంటున్నాడు: ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమనుంచి నా దగ్గరికి ఇప్పుడే వచ్చారు. వారికోసం ముప్ఫయి అయిదు కిలోగ్రాముల వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి.’”
23 అందుకు నయమాను “నీకిష్టమైతే డెబ్భై కిలోగ్రాముల వెండి తీసుకో” అని నొక్కి నొక్కి చెపుతూ, డెబ్భై కిలోగ్రాముల వెండి రెండు సంచులలో ఉంచి వాటినీ రెండు జతల దుస్తులనూ తన సేవకులలో ఇద్దరికి అప్పగించాడు. గేహజీకి ముందు వాళ్ళు వాటిని మోసుకుపోయారు. 24 ✽తాను కాపురమున్న కొండదగ్గరికి చేరగానే గేహజీ ఆ కానుకలను వాళ్ళ చేతి నుంచి తీసుకొని ఇంట్లో దాచిపెట్టాడు. అప్పుడు ఆ మనుషులను వెళ్ళమన్నాడు. 25 ✽వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమానికి ముందు నిలబడ్డాడు.
ఎలీషా “గేహజీ! ఎక్కడికి వెళ్ళి వచ్చావు?” అని అతణ్ణి అడిగాడు.
అందుకు గేహజీ “మీ దాసుడైన నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అని జవాబిచ్చాడు.
26 అయితే ఎలీషా “ఆ మనిషి నిన్ను కలుసుకోవడానికి రథం దిగి నీవైపు తిరిగినప్పుడు నేను✽ నీతో కూడా ఉన్నట్టు ఉన్నాను. వెండి, దుస్తులు తీసుకోవడానికి ఇదా సమయం? ఆలీవ్ చెట్లూ ద్రాక్షతోటలూ మందలూ పశువులూ దాసదాసీ జనాన్నీ సంపాదించుకోవడానికి ఇదా సమయం? 27 ✽ఇప్పుడు నయమానుకు ఉన్న కుష్ఠు నీకూ నీ సంతానానికీ ఎప్పుడూ సోకుతుంది” అన్నాడు.
మంచులాగా తెల్లటి కుష్ఠు పుట్టి గేహజీ అతడి సమక్షంనుంచి బయటికి వెళ్ళాడు.