4
1 తరువాత ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషాను చూచి ఇలా మొర పెట్టింది: “మీ సేవకుడైన నా భర్త చనిపోయారు. ఆయనకు యెహోవా అంటే భయభక్తులని మీకు తెలుసు గదా. మాకు ఇద్దరు కొడుకులు. అప్పిచ్చినవాడు వచ్చి వారిని బానిసలుగా తీసుకుపోవాలని ఉన్నాడు.”
2 ఎలీషా “నేను నీకు ఏం చేయాలి? నీ ఇంట్లో ఏం ఉన్నదో నాకు చెప్పు” అన్నాడు. అందుకామె “మీ దాసురాలైన నా ఇంట్లో ఒక జాడీ నిండా నూనె తప్ప ఇంకేమీ లేదు” అంది.
3 ఎలీషా ఇలా చెప్పాడు: “నీవు బయటికి వెళ్ళి నీ పొరుగువాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రలు ఎరవు తీసుకో. దొరకగలగినన్ని తీసుకో. 4 అప్పుడు నీవు నీ కొడుకులతోపాటు ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసివెయ్యి. ఆ పాత్రలన్నిట్లో నూనె పోయండి. నిండిన వాటిని ప్రక్కన పెట్టు.”
5 అలాగే ఆమె అతని దగ్గరనుంచి వెళ్ళింది. తరువాత తన కొడుకులతో కూడా ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసింది. వారు పాత్రలు అందిస్తూ ఉంటే ఆమె నూనె పోస్తూ ఉంది. 6 ఆ పాత్రలు నిండిపోయినప్పుడు ఆమె “ఇంకో పాత్ర తీసుకురా” అని కొడుకుతో చెపితే అతడు “ఇంకొకటి లేదు” అన్నాడు. వెంటనే జాడీలో నూనె సరఫరా నిలిచింది. 7 ఆమె వచ్చి దేవుని మనిషికి ఆ విషయం తెలియజేసింది. అతడు “నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చు. మిగిలిన దానితో నీవూ నీ కొడుకులూ జీవనం చేయండి” అన్నాడు.
8 ఒక రోజు ఎలీషా షూనేం ఊరు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక గొప్ప స్త్రీ భోజనానికి రావాలని అతణ్ణి ప్రాధేయపడి ఒప్పించింది. ఆ తరువాత అతడు ఆ దారిన వెళ్ళడం తటస్థించి నప్పుడెల్లా అక్కడ ఆగి ఆమె ఇంట్లో భోజనం చేసేవాడు. 9 ఒకప్పుడు ఆమె తన భర్తతో ఇలా చెప్పింది: “ఈ దారిన ఎప్పుడూ వస్తూవుండే మనిషి దేవుని మనిషీ పవిత్రుడూ అని నాకు తెలుసు. 10 గనుక పైకప్పుమీద గోడలు కట్టి చిన్న గది తయారు చేద్దాం. అందులో పడక, బల్ల, పీట, దీపం ఉన్న స్తంభం ఉంచుదాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతి సారి అందులో బస చేయవచ్చు.”
11 ఒక రోజు ఎలీషా అక్కడికి వచ్చి ఆ మేడ గదిలో ప్రవేశించి పడుకొన్నాడు. 12 తరువాత అతడు అతడి పరిచారకుడైన గేహజీతో “ఈ షూనేం కాపురస్థురాలను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ఎలీషా ముందు నిలబడింది.
13 అతడు గేహజీతో “నీవు ఈమెతో ఇలా చెప్పు: మీరు మా కోసం ఈ శ్రమంతా తీసుకొన్నారు. నేను మీకోసం ఏం చెయ్యాలి? నేను మీ తరఫున రాజుతో గానీ సేనాధిపతితో గానీ ఏదైనా మాట చెప్పాలా?” అందుకామె “నేను నా స్వజనుల మధ్య కాపురం ఉంటున్నాను” అని జవాబిచ్చింది.
14 ఎలీషా “మరి ఈమెకోసం నేనేం చేయాలి?” అని అడిగితే గేహజీ “ఆమెకు సంతానం లేదు. ఆమె భర్త ముసలివాడు” అన్నాడు. 15 మరో సారి ఎలీషా “ఆమెను పిలువు” అన్నాడు. గేహజీ ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.
16 అప్పుడు ఎలీషా “వచ్చే సంవత్సరం ఇదే కాలానికి నీవు ఒక కొడుకును ఎత్తుకొంటావు” అన్నాడు. అందుకామె “అలా చెప్పకండి, స్వామీ! దేవుని మనుషులైన మీరు మీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దండి” అంది. 17 అయితే తరువాత ఆమె గర్భవతి అయింది. మరుసటి సంవత్సరం ఎలీషా ఆమెతో చెప్పిన కాలంలోనే కొడుకును కన్నది.
18 ఆ పిల్లవాడు కొంత పెరిగిన తరువాత ఒకరోజు కోత కోసేవాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. 19 ఉన్నట్టుండి అతడు తండ్రితో “నా తల! నా తల!” అన్నాడు. అతడి తండ్రి “పిల్లవాణ్ణి ఎత్తుకుని వాడి అమ్మదగ్గరికి తీసుకుపో” అని పనివాళ్ళలో ఒకడితో చెప్పాడు. 20 పనివాడు పిల్లవాణ్ణి ఎత్తుకొని వాడి తల్లిదగ్గరికి తీసుకువెళ్ళాడు. పిల్లవాడు ఆమె తొడ మీద మధ్యాహ్నం వరకు కూర్చున్నాడు. అప్పుడు చనిపోయాడు. 21 ఆమె ఆ పిల్లవాణ్ణి తీసుకుపోయి దేవుని మనిషి ఎలీషా పడకమీద ఉంచింది. తలుపు మూసి ఇంటి బయటికి వెళ్ళి తన భర్తతో ఇలా చెప్పింది:
22 “నాకోసం పనివాళ్ళలో ఒకణ్ణీ ఒక గాడిదనూ పంపించు. నేను తొందరగా దేవుని మనిషి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తాను.”
23 అతడు “ఇవ్వేళ అతడి దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు” అన్నాడు. అందుకామె “నేను వెళ్ళడం మంచిది” అంది.
24 ఆమె గాడిదమీద జీను వేయించి పనివాడితో “గాడిదను త్వరగా నడిపించు. నేను చెపితేనే తప్ప నిమ్మళంగా పోనివ్వద్దు” అంది.
25 ఇలా ఆమె బయలుదేరి కర్మెల్ పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది. దేవుని మనిషి దూరం నుంచి ఆమె రావడం చూచి అతడి పరిచారకుడైన గేహజీతో ఇలా అన్నాడు: “అదుగో! ఆ షూనేం కాపురస్థురాలు! 26 ఆమెను కలుసుకోవడానికి పరుగెత్తిపో. ఆమెను ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా? మీ పిల్లవాడు క్షేమమా?’ అని అడుగు.” అందుకు ఆమె “క్షేమమే” అంది. 27 ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషిదగ్గరికి చేరుకొని అతడి పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరికి వచ్చాడు గాని దేవుని మనిషి “ఆమెను ఉండనియ్యి. ఆమెకు హృదయంలో చాలా దుఃఖం ఉంది. యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశాడు” అన్నాడు.
28 ఆమె “నా యజమానులైన మీతో కొడుకు కావాలన్నానా? నన్ను మోసం చేయవద్దని నేను చెప్పలేదా?” అంది.
29 ఎలీషా గేహజీతో ఇలా అన్నాడు: “నీ నడికట్టు బిగించుకొని నా దండం చేతపట్టుకొని అక్కడికి వెళ్ళు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు. ఎవరైనా పలకరిస్తే జవాబేమీ ఇవ్వకు. అక్కడ చేరి నా కర్ర పిల్లవాడి ముఖం మీద ఉంచు.”
30 అయితే ఆ పిల్లవాడి తల్లి “యెహోవా జీవంమీద, మీ జీవం మీద ఆనబెట్టి చెప్తున్నాను – మిమ్మల్ని విడిచిపెట్టను” అంది. ఎలీషా లేచి ఆమెను అనుసరించాడు.
31 గేహజీ వారికంటే ముందే వెళ్ళి పిల్లవాడి ముఖంమీద ఆ కర్ర ఉంచాడు. కానీ పిల్లవాడు శబ్దం ఏమీ చేయలేదు, వినిపించుకోలేదు. గనుక గేహజీ ఎలీషాను కలుసుకోవడానికి వచ్చి అతనితో “పిల్లవాడు మేల్కోలేదు” అని చెప్పాడు. 32 ఎలీషా ఇంట్లోకి వచ్చాడు. అతడి పడకమీద చనిపోయిన ఆ పిల్లవాడు పడి ఉండడం చూశాడు. 33 గదిలో ప్రవేశించి తలుపు మూశాడు. అతడూ పిల్లవాడూ మాత్రమే లోపల ఉన్నారు. అప్పుడు ఎలీషా యెహోవాకు ప్రార్థన చేశాడు. 34 ఆ తరువాత మంచంమీదికి ఎక్కి పిల్లవాడిమీద పడుకొన్నాడు. పిల్లవాడి నోటిమీద తన నోరు, కండ్లమీద తన కండ్లు, చేతులమీద తన చేతులు ఉంచి పిల్లవాడి మీద బోర్లా చాచుకొన్నాడు. పిల్లవాడికి శరీరంలో వేడి పుట్టింది. 35 ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటూ ఇటూ నడిచాడు. మళ్ళీ మంచం ఎక్కి పిల్లవాడి మీద చాచుకొన్నాడు. పిల్లవాడు ఏడు సార్లు తుమ్మి కండ్లు తెరిచాడు.
36 ఎలీషా గేహజీని పిలిచి, “ఈ షూనేం కాపురస్థురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలిచాడు. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు అతడు “మీ కొడుకును ఎత్తుకోండి” అన్నాడు. 37  ఆమె గది లోపలికి వచ్చి ఎలీషా కాళ్ళ దగ్గర పడి నేలకు వంగింది. ఆమె కొడుకును ఎత్తుకొని వెలుపలికి వెళ్ళింది.
38 తరువాత ఎలీషా గిల్గాల్‌కు తిరిగి వెళ్ళాడు. అప్పుడు దేశంలో కరవు ఉంది. ప్రవక్తల గుంపు ఎలీషా ముందు కూర్చుని ఉన్నప్పుడు అతడు తన పరిచారకుడితో “పెద్ద కుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తల గుంపుకు వంటకం చెయ్యి” అన్నాడు.
39 వారిలో ఒకతను కూరాకులను ఏరుకోవడానికి పొలాలకు వెళ్ళాడు. వెర్రి తీగ కనిపించగా అతడి ఒడినిండా ఈ తీగ కాయలు సేకరించి వచ్చి వంటకం వండుతున్న కుండలో తరిగి పోశాడు. ఆ కాయలు ఎలాంటివో వారికి తెలియలేదు. 40 ఆ వంటకం తినడానికి అక్కడివారికి వడ్డించారు. వారు తింటూ ఉంటే “దేవుని మనిషీ! కుండలో విషం ఉంద”ని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు. 41  ఎలీషా “పిండి కొంచెం తెమ్ము” అన్నాడు. అతడా పిండి కుండలో వేసి “వంటకం వడ్డించు. వారు తినవచ్చు” అన్నాడు. ఆ తరువాత కుండలో హానికరమైనది ఏదీలేదు. 42 ఒక రోజు ఒక మనిషి బయల్‌షాలిషా నుంచి దేవుని మనిషి దగ్గరికి వచ్చాడు. ఆ మనిషి మొదటి పంట బాపతు యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలూ తాజా ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. ఎలీషా “ఇవి ఇక్కడివారికి ఇవ్వండి. వారు తింటారు” అన్నాడు.
43 అయితే అతడి పరిచారకులు “నూరు మంది ఉన్నారు. అంతమందికి ఇవి ఎలా పెట్టగలను?” అన్నాడు. అందుకు ఎలీషా “వారు తినేలా ఇవి వడ్డించు. యెహోవా చెప్పేదేమిటంటే, వారు తిన్నతరువాత ఇంకా కొంత మిగులుతుంది” అన్నాడు. 44 అప్పుడు అతడు వారికి వడ్డించాడు. యెహోవా చెప్పిన మాటప్రకారం వారు తిన్న తరువాత కొంత మిగిలింది.