3
1 యూదారాజు యెహోషాపాతు పరిపాలనలో పద్ధెనిమిదో ఏట అహాబు కొడుకు యెహోరాం షోమ్రోనులో రాజయ్యాడు. అతడు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు. 2 అతడు తన తల్లిదండ్రుల తీరును అనుసరించకపోయినా అతడు కూడా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. తన తండ్రి నిలిపిన బయల్✽దేవుడి రాయి తీసివేశాడు 3 గానీ నెబాతు కొడుకు✽ యరొబాం ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించి పాపాలు చేస్తూ ఉండేవాడు. అతడు వాటిని వదలిపెట్టలేదు.4 మోయాబు రాజైన మేషా గొర్రెలను పెంచేవాడు. అతడు ఇస్రాయేల్ రాజుకు లక్ష గొర్రెపిల్లలనూ లక్ష పొట్టేళ్ళ ఉన్నినీ కప్పంగా ఇస్తూ వచ్చాడు. 5 అయితే అహాబు చనిపోయిన తరువాత మోయాబు రాజు ఇస్రాయేల్ రాజుమీద తిరగబడ్డాడు. 6 వెంటనే యెహోరాంరాజు షోమ్రోనునుంచి బయలుదేరి ఇస్రాయేల్ సైన్యాలన్నిటినీ సమకూర్చాడు. 7 అంతేకాకుండా, యూదా రాజు యెహోషాపాతుకు ఈ మాటలు చెప్పి పంపాడు: “మోయాబు రాజు నామీద తిరగబడ్డాడు. మీరు నాతో కూడా మోయాబు మీదికి యుద్ధానికి వస్తారా?” యెహోషాపాతు✽ “నేను వస్తాను. మీలాగే నేను సిద్ధంగా ఉన్నాను. మీ జనం, గుర్రాలలాగే నా జనం, గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి” అని జవాబిచ్చాడు.
8 యెహోరాం “ఏ దారిన వెళ్దాం?” అని అడిగినప్పుడు అతడు “ఎదోం ఎడారి గుండా పోయే దారి” అని చెప్పాడు.
9 ఇస్రాయేల్ రాజూ యూదా రాజూ ఎదోం రాజు✽తో కలిసి వెళ్ళారు. వారు ఏడు రోజులు చుట్టు తిరిగి ప్రయాణం చేశారు. సైన్యాలకూ వాళ్ళ వెంట ఉన్న పశువులకూ నీళ్ళు మిగలలేదు.
10 గనుక ఇస్రాయేల్ రాజు “అయ్యో! మోయాబువాళ్ళ వశం చేయడానికి యెహోవా రాజులమైన మన ముగ్గురిని సమకూర్చాడు!” అన్నాడు.
11 అందుకు యెహోషాపాతు “యెహోవా వాక్కు కోసం విచారణ చేద్దాం✽. సంప్రదించడానికి యెహోవా ప్రవక్త ఎవరైనా ఇక్కడ ఉన్నాడా?” అని అడిగాడు. ఇస్రాయేల్ రాజు పరివారంలో ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా✽ ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏలీయా చేతులకు నీళ్ళు పోసినవాడు” అని బదులు చెప్పాడు.
12 యెహోషాపాతు “ఆయన యెహోవా వాక్కు తెలియ జేసేవాడు” అన్నాడు. యెహోషాపాతు, ఇస్రాయేల్ రాజు, ఎదోం రాజు ఎలీషా దగ్గరికి వెళ్ళారు.
13 ✽ ఎలీషా ఇస్రాయేల్ రాజుతో “నాతో నీకేం పని? నీ తల్లిదండ్రుల ప్రవక్తల దగ్గరికి వెళ్ళు” అన్నాడు. ఇస్రాయేల్ రాజు అతనితో “అలా కాదు! మోయాబువాళ్ళ వశం చేయడానికి యెహోవా రాజులమైన మా ముగ్గురిని సమకూర్చాడు” అన్నాడు.
14 అందుకు ఎలీషా “నేను సేనల ప్రభువు యెహోవా✽ సన్నిధానంలో నిలుచున్నాను. ఆయన జీవం మీద ఆనబెట్టి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న యూదా రాజైన యెహోషాపాతు✽ను నేను గౌరవించకపోతే, నిన్ను లక్ష్యపెట్టేవాణ్ణి కాదు, నీవైపు చూచేవాణ్ణీ కాదు. 15 ✝అయితే ఇప్పుడు తంతివాద్యం✽ వాయించేవాణ్ణి నా దగ్గరికి తీసుకురా” అన్నాడు. ఆ మనిషి వాద్యం వాయిస్తూ ఉంటే యెహోవా బలప్రభావాలు ఎలీషాను ఆవరించాయి. 16 అతడు ఇలా పలికాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ లోయలో అంతా కందకాలు త్రవ్వాలి. 17 యెహోవా ఇలా చెపుతున్నాడు – గాలి గానీ వాన గానీ మీరు చూడరు. అయినా నీళ్ళతో ఈ లోయ నిండిపోతుంది. మీరు దప్పి తీర్చుకోగలుగుతారు. మీ పశువులకూ జంతువులకూ కూడా నీళ్ళు ఉంటాయి. 18 యెహోవాకు ఇది తేలికైన పని✽. పైపెచ్చు ఆయన మోయాబువాళ్ళను మీ వశం చేస్తాడు. 19 మీరు ప్రాకారం గల ప్రతి పట్టణాన్నీ వాళ్ళకు ప్రియమైన ప్రతి పట్టణాన్నీ జయించాలి. మంచి చెట్లన్నిటినీ నరికివేయాలి. ఊటలన్నీ పూడ్చాలి. ప్రతి మంచి పొలం రాళ్ళతో నింపి పాడు చేయాలి.”
20 మరుసటి ఉదయం నైవేద్యం✽ అర్పించే సమయంలో ఎదోం వైపునుంచి నీళ్ళు వచ్చాయి. వాళ్ళున్న ప్రాంతమంతా నీళ్ళమయమైంది.
21 రాజులు వాళ్ళపైకి యుద్ధం చేయడానికి వచ్చిన సంగతి మోయాబు ప్రజలందరికీ తెలిసిపోయింది. యువకులు మొదలుకొని ముసలివాళ్ళవరకు ఆయుధాలు ధరించుకోగల వాళ్ళంతా సమకూడి దేశం సరిహద్దులకు వెళ్ళి అక్కడ ఆగిపోయారు. 22 ఉదయం వాళ్ళు లేచినప్పుడు సూర్య కిరణాలు నీళ్ళ మీద పడుతూ ఉన్నాయి. వాళ్ళకు ఎదురుగా ఉన్న ఆ నీళ్ళు మోయాబువాళ్ళకు రక్తంలాగా ఎర్రగా కనబడ్డాయి.
23 వాళ్ళు “అది రక్తం! రాజులు ఒకడితో ఒకడు యుద్ధం చేసుకొన్నారు. ఒకణ్ణి ఒకడు చంపుకొన్నారు. అనుమానం లేదు. మోయాబువాళ్ళారా! దోపిడీసొమ్ము పట్టుకుందాం, పదండి” అని చెప్పుకొన్నారు.
24 వాళ్ళు ఇస్రాయేల్‌వారి శిబిరం చేరినప్పుడు ఇస్రాయేల్ వారు వాళ్ళ పైబడ్డారు. వారి దగ్గరనుంచి మోయాబువాళ్ళు పారిపోయారు. ఇస్రాయేల్‌వారు మోయాబులో చొరబడి వాళ్ళను కూలగొట్టారు. 25 వాళ్ళ పట్టణాలు పడగొట్టారు. ప్రతి మంచి పొలం పూడిపోయినంతవరకు అందరూ తలా ఒక రాయి వేశారు. ప్రతి ఊటను పూడ్చారు. ప్రతి మంచి చెట్టును నరికివేశారు. చివరికి కీర్‌హరెశతు మాత్రమే దాని ప్రాకారంతోపాటు మిగిలింది. వడిసెలవాళ్ళు దానిని కూడా చుట్టుముట్టి రాళ్ళు వేస్తూ ఉన్నారు. 26 మోయాబు రాజు యుద్ధం తన శక్తికి మించిందని గ్రహించాడు. అతడు ఖడ్గం దూసేవాళ్ళను ఏడు వందలమందిని వెంటబెట్టుకొని ఎదోం రాజు దగ్గరికి సైన్యవ్యూహం గుండా చొరబడడానికి ప్రయత్నం చేశాడు గానీ అది వాళ్ళకు చేతకాలేదు. 27 అప్పుడు మోయాబు రాజు తన స్థానంలో రాజు కావలసిన తన పెద్ద కొడుకును తీసుకుపోయి పట్టణం గోడమీద హోమబలిగా✽ అర్పించాడు. ఇస్రాయేల్‌వారిమీద తీవ్ర కోపం రగులుకొంది. వారు ఆ పట్టణం విడిచి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారు.