2
1 యెహోవా ఏలీయాను ఆకాశంలోకి సుడిగాలిలో తీసుకుపోయే సమయం ఆసన్నమైంది. ఏలీయా, ఎలీషా గిల్గాల్ నుంచి బయలుదేరారు. 2 అయితే ఏలీయా ఎలీషాతో “యెహోవా నన్ను బేతేల్‌కు వెళ్ళమన్నాడు. నీవు ఇక్కడ నిలిచిపో” అన్నాడు.
అందుకు ఎలీషా “యెహోవా జీవం మీద, నీ జీవం మీద ఆనబెట్టి చెప్తున్నాను, నిన్ను విడువను” అన్నాడు. వారిద్దరు బేతేల్‌కు వెళ్ళారు.
3 బేతేల్‌లో ప్రవక్తల బృందం ఉంది. వారు ఎలీషా దగ్గరికి వచ్చి “ఇవ్వేళ యెహోవా మీ గురువును మీ దగ్గర్నుంచి తీసుకుపోతాడని మీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా “నాకు తెలుసు. ఊరుకోండి” అని బదులు చెప్పాడు.
4 ఏలీయా అతనితో “ఎలీషా! నీవు ఇక్కడ ఆగిపో. యెహోవా నన్ను యెరికోకు వెళ్ళమంటున్నాడు” అన్నాడు.
అందుకు ఎలీషా “యెహోవా జీవం మీద, నీ జీవం మీద ఆనబెట్టి చెపుతున్నాను, నిన్ను విడువను” అన్నాడు. అలా వారు యెరికో చేరుకొన్నారు.
5 యెరికోలో కూడా ప్రవక్తల బృందం ఉంది. వారు ఎలీషా దగ్గరికి వచ్చి “ఇవ్వేళ యెహోవా మీ గురువును మీ దగ్గర్నుంచి తీసుకుపోతాడని మీకు తెలుసా?” అని అడిగారు.
ఎలీషా “నాకు తెలుసు. ఊరుకోండి” అని బదులు చెప్పాడు.
6 అతనితో ఏలీయా “నీవు ఇక్కడ ఆగిపో, యెహోవా నన్ను యొర్దానుకు వెళ్ళమంటున్నాడు” అన్నాడు.
అందుకు ఎలీషా “యెహోవా జీవం మీద, నీ జీవం మీద ఆనబెట్టి చెపుతున్నాను, నిన్ను విడువను” అన్నాడు. వారిద్దరూ అలా సాగిపోయారు.
7 వారిద్దరూ యొర్దాను ఒడ్డున నిలబడ్డారు. ప్రవక్తల బృందంలో యాభైమంది వచ్చి కొంత దూరంలో ఆగి నిలబడ్డారు. 8  ఏలీయా తన పైవస్త్రాన్ని తీసివేసి మడత పెట్టి నీళ్ళమీద కొట్టాడు. నీళ్ళు ఆ వైపూ ఈ వైపూ చీలిపోయాయి. వారిద్దరూ పొడి నేలమీద దాటిపోయారు.
9 వారు దాటిపోయినతరువాత ఏలీయా ఎలీషాతో “యెహోవా నన్ను నీ దగ్గరనుంచి తీసుకుపోయేముందు నేను నీకోసం ఏం చెయ్యాలో కోరుకో” అన్నాడు. అందుకు ఎలీషా “నీమీద ఉన్న ఆత్మ నామీద రెండంతలుగా నిలిచి ఉండేలా చెయ్యి” అన్నాడు.
10 “నీవు అడిగినది కష్టతరమే. అయినా యెహోవా నీ దగ్గరనుంచి నన్ను తీసుకుపోవడం నీవు చూస్తే అలాగే జరుగుతుంది. చూడకపోతే అలా జరగదు” అని ఏలీయా అన్నాడు.
11 వారు మాట్లాడుతూ సాగిపోతూ ఉన్నారు. ఉన్నట్టుండి మంటలవంటి రథం, మంటలవంటి గుర్రాలు వారిద్దరి మధ్యకు వచ్చి వారిని వేరు చేశాయి. ఏలీయా ఆకాశంలోకి సుడిగాలిలో పైకి వెళ్ళిపోయాడు. 12 ఎలీషా చూస్తూ ఉన్నాడు –
“నా తండ్రీ! నా తండ్రీ! ఇస్రాయేల్‌కు చెందిన రథం, దాని రౌతులు!” అని కేక పెట్టాడు.
ఎలీషా అతణ్ణి మరి చూడలేదు. అప్పుడు ఎలీషా తాను వేసుకొన్న బట్టలు రెండుగా చింపాడు. 13  ఏలీయామీదనుంచి క్రిందపడ్డ పైవస్త్రం ఎత్తుకొని తిరిగి వెళ్ళి యొర్దాను ఒడ్డున నిలిచాడు. 14 ఏలీయా మీద నుంచి క్రిందపడ్డ ఆ వస్త్రం చేతపట్టుకొని నీళ్ళు కొట్టి ఇలా అన్నాడు:
“ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు!”
అతడు ఆ నీళ్ళు కొట్టినప్పుడు నీళ్ళు ఆ వైపూ ఈ వైపూ చీలిపోయాయి. అతడు దాటిపోయాడు.
15 యెరికోలో ఉన్న ప్రవక్తల బృందంవారు అతణ్ణి చూచి “ఏలీయామీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉండడం నిశ్చయం” అన్నారు. వారు అతణ్ణి కలుసుకోవడానికి ఎదురుగా వెళ్ళి నేలకు వంగారు. 16 “ఒకవేళ యెహోవా ఆత్మ మీ గురువును పైకెత్తి ఏదైనా కొండమీదో ఏదైనా లోయలోనో పడవేసి ఉండవచ్చు. మీ దాసులైన మా దగ్గర యాభైమంది బలాఢ్యులు ఉన్నారు. వారు వెళ్ళి ఆయనకోసం వెదుకుతారు, సెలవియ్యండి” అన్నారు.
ఎలీషా “మీరు వారిని పంపించకూడదు” అన్నాడు.
17 వారు నొక్కి నొక్కి అడుగుతూ అతణ్ణి విసిగించారు, గనుక అతడు “సరి, పంపించండి” అన్నాడు. వారు యాభైమంది మనుషులను పంపారు గాని వారు ఏలీయా కోసం మూడు రోజులు గాలించినా అతడు కనిపించలేదు. 18 వారు యెరికోలో ఆగిపోయిన ఎలీషా దగ్గరికి వచ్చారు. “వెళ్ళకూడదని నేను మీతో చెప్పలేదా?” అని అతడు అన్నాడు.
19 తరువాత ఆ పట్టణస్థులు ఎలీషాతో “మా యాజమానులైన మీరు చూస్తున్నట్టు ఈ పట్టణం ఉన్నస్థలం చాలా బాగుంది. కానీ నీళ్ళు మంచివి కావు. భూమి నిస్సారంగా ఉంది” అన్నారు.
20 అతడు “క్రొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. వారు దానిని తెచ్చారు.
21 అప్పుడు అతడు ఊటదగ్గరకు వెళ్ళి అందులో ఆ ఉప్పు వేశాడు. “యెహోవా ఇలా అంటున్నాడు – నేను ఈ నీళ్ళు బాగు చేశాను. ఇక మీద వీటివల్ల చావు గానీ నిస్సారత గానీ ఉండదు” అన్నాడు. 22 ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఈ రోజు వరకూ ఆ నీళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నాయి.
23 ఎలీషా అక్కడనుంచి బేతేల్‌కు బయలుదేరాడు. అతడు దారిన వెళ్తూ ఉంటే పట్టణంలోనుంచి కొంతమంది చిన్న కుర్రవాళ్ళు వచ్చి అతణ్ణి గేలి చేస్తూ “బోడివాడా! పైకి వెళ్ళిపో! బోడివాడా! పైకి వెళ్ళిపో!” అన్నారు. 24 అతడు వెనుకకు తిరిగి వాళ్ళను చూచి యెహోవా పేర వాళ్ళను శపించాడు. రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలోనుంచి వచ్చి ఆ కుర్రవాళ్ళలో నలభై ఇద్దరిని గాయపరచాయి. 25 ఎలీషా అక్కడనుంచి కర్మెల్ కొండకు వెళ్ళాడు. తరువాత షోమ్రోను తిరిగి వచ్చాడు.