2 రాజులు
1
1 అహాబు చనిపోయిన తరువాత ఇస్రాయేల్ మీద మోయాబు దేశం తిరుగుబాటు చేసింది. 2 ఆ కాలంలోనే అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడ మీది కిటికీలోనుంచి క్రిందపడి గాయపడ్డాడు. అతడు “నేను ఈ గాయంనుంచి బాగుపడతానో లేదో మీరు ఎక్రోనుకు వెళ్ళి అక్కడివాళ్ళు పూజించే బయల్‌జెబూబ్‌దేవుడి దగ్గర విచారణ చేయండి” అంటూ మనుషులను పంపించాడు.
3 అప్పుడు యెహోవా దూత తిష్బి గ్రామస్థుడైన ఏలీయాతో ఇలా అన్నాడు: “నీవు లేచి షోమ్రోను రాజు పంపించిన మనుషులకు ఎదురుగా వెళ్ళి వాళ్ళతో ఈ విధంగా చెప్పు – ‘ఎక్రోనువాళ్ళ దేవుడైన బయల్‌జెబూబ్ దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారేమిటి? ఇస్రాయేల్‌లో దేవుడు లేడా? 4 యెహోవా చెప్పేదేమిటంటే, నీవు ఇలా చేసినందుచేత నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు. తప్పకుండా చచ్చిపోతావ’ని మీ రాజుతో చెప్పండి.” ఏలీయా బయలుదేరాడు.
5 ఆ మనుషులు రాజు దగ్గరికి తిరిగి వెళ్ళారు. “మీరు తిరిగి వచ్చారేం?” అని రాజు అడిగాడు.
6 అందుకు వాళ్ళు “ఓ మనిషి మాకు దారిలో ఎదురయ్యాడు. అతడు మాతో ‘మీరు వెనక్కు తిరిగి, మిమ్మల్ని పంపించిన రాజుదగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాలి – యెహోవా చెప్పేదేమిటంటే, నీవు ఎక్రోనువాళ్ళ దేవుడైన బయల్‌జెబూబ్ దగ్గర విచారణ చేయడానికి మనుషులను పంపిస్తున్నావేమిటి? ఇస్రాయేల్‌లో దేవుడు లేడా? నీవిలా చేసినందుచేత నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు. తప్పకుండా చచ్చిపోతావు’ అన్నాడు.”
7 రాజు “మీకు ఎదురుగా వచ్చి ఈ మాటలు చెప్పిన మనిషి ఎలాంటివాడు?” అని వాళ్ళనడిగాడు.
8  “అతడు రోమాల బట్టలు వేసుకున్నాడు. నడుముకు తోలుతో చేసిన నడికట్టు కట్టుకున్నాడు” అని జవాబిచ్చారు. రాజు “అతడు తిష్బి గ్రామస్థుడు ఏలీయా” అన్నాడు.
9 అప్పుడు రాజు యాభైమంది మనుషులను వాళ్ళ అధిపతితోపాటు ఏలీయా దగ్గరికి పంపించాడు. ఏలీయా ఒక కొండమీద కూర్చుని ఉంటే ఆ అధిపతి అతనిదగ్గరికి ఎక్కిపోయి అతనితో “దేవుని మనిషీ! రాజు ‘దిగిరా’ అంటున్నాడు” అని చెప్పాడు.
10 ఆ యాభైమంది మనుషుల అధిపతికి ఏలీయా ఇలా జవాబిచ్చాడు: “నేను దేవుని మనిషినైతే ఆకాశం నుంచి మంటలు రాలి నిన్నూ నీ యాభైమందినీ కాల్చివేస్తాయి గాక!” వెంటనే ఆకాశం నుంచి మంటలు రాలి అతణ్ణీ అతడి యాభైమందినీ కాల్చివేశాయి.
11 రాజు ఇంకో యాభైమందినీ వాళ్ళ అధిపతినీ ఏలీయా దగ్గరికి పంపాడు. ఆ అధిపతి “దేవుని మనిషీ! రాజు ‘నిన్ను తొందరగా దిగిరమ్ము’ అంటున్నాడు” అని చెప్పాడు.
12 అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినైతే ఆకాశం నుంచి మంటలు రాలి నిన్నూ నీ యాభైమందినీ కాల్చివేస్తాయి గాక!” అని జవాబిచ్చాడు. వెంటనే ఆకాశం నుంచి మంటలు రాలి అతణ్ణీ అతడి యాభైమందినీ కాల్చివేశాయి.
13 రాజు మూడో సారి యాభైమందినీ వాళ్ళ అధిపతినీ పంపాడు. ఈ మూడో అధిపతి కొండెక్కి ఏలీయా ముందు మోకాళ్ళమీద వంగి ఇలా బ్రతిమిలాడాడు: “దేవుని మనిషీ! నా ప్రాణాన్నీ మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాల్నీ మీ దృష్టిలో ప్రియమైనవిగా ఎంచి కాపాడండి! 14 ఆకాశం నుంచి మంటలు రాలి ముందు వచ్చిన అధిపతుల్నీ ఇద్దరినీ వాళ్ళ యాభైమందినీ కాల్చివేశాయి. ఇప్పుడు నా ప్రాణాన్ని మీ దృష్టిలో ప్రియమైనదిగా కాపాడండి.”
15 యెహోవా దూత ఏలీయాతో “అతనికి భయపడవద్దు. అతణ్ణి కలిసి దిగి వెళ్ళు” అన్నాడు. కనుక ఏలీయా లేచి ఆ అధిపతితోపాటు కొండ దిగి రాజు దగ్గరికి వెళ్ళాడు. 16 రాజుతో ఇలా చెప్పాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్ ప్రజలమధ్య విచారణ చేయడానికి దేవుడు లేడనుకొంటున్నావా? ఎక్రోనువాళ్ళ దేవుడైన బయల్‌జెబూబ్ దగ్గర విచారణ చేయడానికి నీవు మనుషులను పంపినందుచేత నీవు ఎక్కిన మంచం నుంచి దిగవు. తప్పకుండా నీవు చచ్చిపోతావు.”
17 ఏలీయా చెప్పిన యెహోవా వాక్కు ప్రకారమే రాజు చనిపోయాడు. అతడికి కొడుకు లేకపోవడం చేత అతడి స్థానంలో యెహోరాం రాజయ్యాడు. ఇది యూదా రాజు యెహోషాపాతు కొడుకైన యెహోరాం పరిపాలనలో రెండో ఏట జరిగింది. 18 అహజ్యాను గురించిన ఇతర విషయాలు ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.