21
1 తరువాత ఈ సంఘటన జరిగింది – యెజ్రేల్‌ పట్టణస్థుడైన నాబోతుకు ద్రాక్షతోట ఉంది. ఆ తోట యెజ్రేల్‌లో షోమ్రోను రాజైన అహాబు భవనానికి ప్రక్కనే ఉంది. 2 నాబోతుతో అహాబు ఇలా అన్నాడు: “నీ ద్రాక్షతోట నా భవనం ప్రక్కనే ఉంది. నీ తోట నాకు ఇస్తే దానిని నేను కూరగాయలు పెంచే తోటగా వాడుకొంటాను. నీ తోటకంటే మంచి ద్రాక్షతోట నీకు ఇస్తాను. లేదా, అమ్మాలని నీకు ఇష్టం ఉంటే దాని వెల ఇస్తాను.”
3 అందుకు నాబోతు “అది పూర్వీకులవల్ల నాకు వచ్చిన వారసత్వం. నేను దానిని మీకివ్వకుండా యెహోవా చేస్తాడు గాక!” అని జవాబిచ్చాడు.
4 యెజ్రేల్ వాడైన నాబోతు “నా పూర్వీకుల వల్ల నాకు వచ్చిన వారసత్వం మీకివ్వన”ని చెప్పిన మాట విని అహాబు కోప ముఖంతో చిరచిరలాడుతూ తన భవనానికి వెళ్ళాడు. మంచమెక్కి ఎవరివైపూ చూడకుండా ముఖం త్రిప్పుకొన్నాడు. భోజనం వద్దన్నాడు.
5 అతడి భార్య యెజెబెల్ అతడిదగ్గరికి వచ్చి “భోజనం మానేసి ఇలా చిరచిరలాడుతున్నావేం?” అంది.
6 అందుకు అహాబు “నేను యెజ్రేల్‌వాడైన నాబోతుతో మాట్లాడాను. ‘నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేదా, నీకిష్టం ఉంటే నీ తోటకు బదులుగా ఇంకో తోట ఇస్తాను’ అన్నాను. కానీ అతడు ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు.
7 అతడి భార్య యెజెబెల్ “ఇప్పుడు నువ్వు ఇస్రాయేల్‌కు రాజువా? కావా? లేచి భోం చెయ్యి. సంతోషంగా ఉండు. యెజ్రేల్‌వాడైన నాబోతు ద్రాక్షతోట నేనే నీకిప్పిస్తా” అంది.
8 అప్పుడామె అహాబు పేర తాకీదులు వ్రాసి వాటిమీద అతడి ముద్ర వేసింది. నాబోతు నివసించే పట్టణం పెద్దలకూ ఉన్నత వంశీకులకూ ఆ తాకీదులు పంపింది. 9 వాటిలో ఆమె ఇలా వ్రాసింది: “ఉపవాస దినం ఒకటి చాటించండి. తరువాత సమకూడిన ప్రజల ముందు నాబోతును కూర్చోబెట్టండి. 10 ఇద్దరు దుర్మార్గులను తయారు చేసి నాబోతుకు ఎదురుగా కూర్చోబెట్టండి. వాళ్ళు నాబోతును చూచి ‘నువ్వు దేవుణ్ణీ రాజునూ దూషించావు’ అంటూ నేరం మోపాలి. అప్పుడు మీరు నాబోతును బయటికి తీసుకుపోయి రాళ్ళు రువ్వి చంపాలి.”
11 యెజెబెల్ తమకు పంపిన ఆ తాకీదులలో వ్రాసిన దానిప్రకారం నాబోతు పట్టణంలో ఉంటున్న పెద్దలూ ఉన్నత వంశీకులూ చేశారు. 12 వాళ్ళు ఉపవాస దినం చాటించారు. నాబోతును ప్రజల ఎదుట కూర్చోబెట్టారు. 13 ఇద్దరు దుర్మార్గులు వచ్చి నాబోతుకు ఎదురుగా కూర్చున్నారు. ప్రజల ముందు ఆ దుర్మార్గులు “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అంటూ నాబోతు మీద నేరం మోపారు. అప్పుడు ప్రజలు పట్టణం బయటికి అతణ్ణి తీసుకువెళ్ళి రాళ్ళు రువ్వి చంపారు.
14 “నాబోతు రాళ్ళతో కొట్టబడి చచ్చాడు” అని యెజెబెల్‌కు కబురు పంపారు. 15 నాబోతును రాళ్ళు రువ్వి చంపిన సంగతి యెజెబెల్ తెలుసుకొని అహాబుతో ఇలా అంది: “లే! యెజ్రేల్‌వాడు నాబోతు నీకు అమ్మనని చెప్పిన ద్రాక్షతోటను నీ వశం చేసుకో! నాబోతు ప్రాణంతో లేడు, చచ్చాడు.” 16 నాబోతు చనిపోయాడని విని యెజ్రేల్‌వాడైన నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అహాబు బయలుదేరాడు.
17  ఆ సమయంలోనే యెహోవా నుంచి వాక్కు తిష్బిగ్రామస్థుడైన ఏలీయాకు వచ్చింది. 18 “షోమ్రోనులో ఇస్రాయేల్ రాజైన అహాబును వెళ్ళి కలుసుకో. నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అతడు వెళ్ళాడు. ఇప్పుడు ఆ తోటలోనే ఉన్నాడు. 19 నీవు అతడితో చెప్పవలసినది ఏమిటంటే ‘యెహోవా ఇలా చెపుతున్నాడు: నీవు హత్య చేశావా? ఈ తోటను ఆక్రమించావా?’; అతడితో ‘యెహోవా ఇలా చెపుతున్నాడు: ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో ఆ స్థలంలోనే నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి’ అని; కూడా చెప్పాలి.”
20 అహాబు ఏలీయాను చూచి “నా విరోధీ, నన్ను పసికట్టావా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు: “నిన్ను పసికట్టాను. యెహోవా దృష్టికి చెడుగు చేయడానికి నిన్ను నీవే అమ్ముకొన్నావు. 21  యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘నీవు నాకు కోపం రేపావు. ఇస్రాయేల్ ప్రజలచేత పాపాలు చేయించావు. గనుక నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ సంతానాన్ని లేకుండా తుడిచివేస్తాను. ఇస్రాయేల్‌లో అహాబు వంశానికి చెందే మగవారందరినీ – అల్పులను గానీ ఘనులను గానీ – నిర్మూలం చేస్తాను. 22 నెబాతు కొడుకు యరొబాం రాజవంశాన్నీ అహీయా కొడుకు బయెషా రాజవంశాన్నీ నేను చేసినట్టే నీ రాజ్యవంశాన్ని కూడా చేస్తాను.’ 23 అంతేగాక, యెజెబెల్‌ను గురించి యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘యెజ్రేల్ ప్రాకారం దగ్గరే యెజెబెల్ శవాన్ని కుక్కలు తింటాయి. 24 అహాబు కుటుంబంవారిలో పట్టణంలో చచ్చినవాళ్ళను కుక్కలు తింటాయి, బయట చచ్చినవాళ్ళను ఎగిరే పక్షులు తింటాయి.”
25  తన భార్య యెజెబెల్ ప్రేరేపణకు లొంగిపోతూ, యెహోవా దృష్టిలో చెడుగు చేయడానికి తనను తానే అమ్ముకొన్న అహాబులాంటివాడు ఎవ్వడూ లేడు. 26 అహాబు విగ్రహాలను పెట్టుకొని చాలా నీచంగా ప్రవర్తించేవాడు. ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుంచి యెహోవా వెళ్ళగొట్టిన అమోరీవాళ్ళలాగే చేసేవాడు. 27 అయితే ఆ మాటలు అహాబు విన్నప్పుడు బట్టలు చించుకొని ఒంటిమీద గోనెపట్ట కట్టుకొన్నాడు, ఉపవాసం ఉన్నాడు. గోనెమీదే నిద్రపోతూ వచ్చాడు. మెల్లగా నడిచే వాడయ్యాడు. 28 అప్పుడు యెహోవా నుంచి తిష్బి గ్రామస్థుడైన ఏలీయాకు ఈ వాక్కు వచ్చింది:
29 “అహాబు ఎలా నా ఎదుట వినయంతో తల వంచుకొన్నాడో చూశావా? అతడు నా ఎదుట తగ్గించు కొన్నందుచేత ఆ కీడును అతడి కాలంలో రప్పించను. అతడి కొడుకు కాలంలో అతడి రాజవంశం మీదికి రప్పిస్తాను.”