22
1 ✝సిరియాకూ ఇస్రాయేల్‌కూ మూడు సంవత్సరాలు యుద్ధం జరగలేదు. 2 ✽మూడో సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇస్రాయేల్ రాజును దర్శించాడు. 3 ఇస్రాయేల్ రాజు తన పరివారంతో “రామోత్ గిలాదు✽ పట్టణం మనదని మీకు తెలుసు గదా. అయితే మనం దానిని సిరియా రాజు చేతిలోనుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయడమే లేదు” అన్నాడు.4 ✽యెహోషాపాతును చూచి అతడు “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వస్తారా?” అని అడిగాడు.
ఇస్రాయేల్ రాజుతో యెహోషాపాతు “మీలాగే నేను సిద్ధంగా ఉన్నాను. మీ జనం, మీ గుర్రాలలాగే నా జనం, నా గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి” అని జవాబిచ్చాడు. 5 అప్పుడు యెహోషాపాతు ఇస్రాయేల్ రాజుతో “ముందు యెహోవా✽ ఏం అంటాడో విచారణ చేద్దాం” అన్నాడు.
6 కాబట్టి ఇస్రాయేల్ రాజు ప్రవక్తలను✽ పిలిపించాడు. వాళ్ళు సుమారు నాలుగు వందల మంది. “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళనా? వద్దా?” అని వారినడిగాడు.
“రాజా! దానిని యెహోవా మీ వశం చేస్తాడు. వెళ్ళండి” అని వాళ్ళ జవాబు.
7 ✽అయితే యెహోషాపాతు “వీళ్ళు గాక మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒకడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
8 అందుకు ఇస్రాయేల్ రాజు “ఇంకో ప్రవక్త ఉన్నాడు – ఇమ్లా కొడుకు మీకాయా. యెహోవా వాక్కుకోసం అతడి ద్వారా విచారణ చేయవచ్చు. కానీ నాకు అతడంటే ద్వేషం✽. ఎందుకంటే, అతడు నాకు ఎప్పుడూ ప్రతికూలంగా ప్రకటిస్తాడు గానీ అనుకూలంగా కాదు” అన్నాడు. అందుకు యెహోషాపాతు “రాజా, అలా అనవద్దండి” అన్నాడు.
9 కనుక ఇస్రాయేల్ రాజు ఒక ఉద్యోగిని పిలిచి “వెంటనే వెళ్ళి ఇమ్లా కొడుకు మీకాయా✽ను తీసుకురా” అని ఆదేశించాడు.
10 ఇస్రాయేల్ రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. వారు షోమ్రోను నగర ముఖ్య ద్వారం దగ్గర ఉన్న మైదానంలో ఉన్నారు. వారి సమక్షంలో ఆ ప్రవక్తలంతా ప్రకటిస్తున్నారు. 11 ✽కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకొని వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే, సిరియావాళ్ళు నాశనం అయ్యేంతవరకు మీరు వీటితో వాళ్ళను పొడుస్తారు” అన్నాడు. 12 ఆ ప్రవక్తలంతా అదే మాట పలికారు. “రాజా, రామోత్ గిలాదును యెహోవా మీ వశం చేస్తాడు. దాని మీదికి వెళ్ళి విజయం సాధించండి” అన్నారు.
13 ✽మీకాయాను పిలవడానికి రాజు పంపగా వెళ్ళిన మనిషి మీకాయాతో ఇలా అన్నాడు: “ప్రవక్తలంతా రాజుకు అనుకూలమైన మాటలు ఒక్క కంఠంతో పలుకుతున్నారు. మీరు కూడా వాళ్ళలాగే అనుకూలంగా చెప్పండి.”
14 ✽కానీ మీకాయా “యెహోవా జీవం మీద ఆన పెట్టి చెప్తున్నాను. యెహోవా నాకు చెప్పేదే నేను చెపుతాన”ని జవాబిచ్చాడు.
15 ✽మీకాయా ఇస్రాయేల్ రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు “మీకాయా, మేము రామోత్‌గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాలా? వద్దా?” అని అడిగాడు. “రాజా! దానిని యెహోవా మీ వశం చేస్తాడు. దాని మీదికి వెళ్ళి విజయం సాధించండి!” అని మీకాయా బదులు పలికాడు.
16 ✽ అందుకు రాజు “యెహోవా పేర సత్యమే నాకు చెప్పమని నేనెన్ని సార్లు నీకు ఆదేశించాలి?” అన్నాడు.
17 ✽అప్పుడు మీకాయా అన్నాడు “కాపరి లేని గొర్రెలలాగా ఇస్రాయేల్ ప్రజలంతా కొండలమీద చెదరిపోవడం చూస్తున్నాను. ‘వీరికి నాయకుడు లేడు; వారు ప్రశాంతంగా వారి వారి ఇండ్లకు తిరిగి వెళ్ళవలసింది’ అని యెహోవా చెప్తున్నాడు.”
18 యెహోషాపాతుతో ఇస్రాయేల్ రాజు “చూశారా! అతడు నాకు ఎప్పుడూ ప్రతికూలంగా ప్రకటిస్తాడు గానీ అనుకూలంగా కాదని నేను చెప్పానుగా!” అన్నాడు.
19 ✽మీకాయా ఇంకా అన్నాడు “యెహోవా నుంచి వచ్చిన వాక్కు ఇప్పుడు వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆయన కుడిచేతి వైపూ ఎడమ చేతివైపు పరలోక సమూహమంతా నిలబడి ఉన్నారు. 20 యెహోవా ‘అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్ళి అక్కడ కూలేట్టు అతణ్ణి ఎవరు పురికొలుపుతారు?’ అని అడిగాడు. ఒకడు ఒక విధంగా, ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు. 21 చివరికి ఆత్మరూపుడొకడు ముందుకు వచ్చి యెహోవా సమక్షంలో నిలబడి ‘నేనతణ్ణి పురికొలుపుతాను’ అన్నాడు. 22 ‘ఎట్లా?’ అని యెహోవా ప్రశ్న వేసినప్పుడు ఆ ఆత్మరూపుడు ‘నేను వెళ్ళి అతడి ప్రవక్తలందరి నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటాన’ని చెప్పాడు. యెహోవా ‘నీవు అతణ్ణి పురికొలుపుతావు. నీ ప్రయత్నం సఫలం అవుతుంది. వెళ్ళి అలా చెయ్యి’ అన్నాడు. 23 రాజా, వినండి! యెహోవా మీ గురించి కీడు పలికాడు, గనుక ఈ మీ ప్రవక్తలందరి నోట అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”
24 అప్పుడు కెనయనా కొడుకైన సిద్కియా దగ్గరికి వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నాదగ్గర్నుంచి వెళ్ళడం ఎలా జరిగిందంటావు?” అన్నాడు.
25 ✽అందుకు మీకాయా “నీవు దాగుకోవడానికి లోపలి గదుల్లోకి చొరబడే రోజున తెలుసుకొంటావు” అన్నాడు.
26 ఇస్రాయేల్ రాజు ఇలా ఆదేశించాడు: “మీకాయాను పట్టుకువెళ్ళి నగరాధ్యక్షుడు ఆమోనుకూ రాకుమారుడైన యోవాషుకూ అప్పచెప్పండి. 27 వాళ్ళతో చెప్పవలసినది ఏమిటంటే, రాజు ఇలా అంటున్నాడు – ఇతణ్ణి ఖైదులో✽ ఉంచండి. నేను క్షేమంగానే తిరిగి వచ్చేవరకూ ఆహారం, నీళ్ళు పరిమితంగా అతడికివ్వండి.”
28 ✝మీకాయా “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే యెహోవా నా ద్వారా మాట్లాడలేదన్నమాటే” అన్నాడు. “ప్రజలారా, మీరంతా విని అర్థం చేసుకోండి” అన్నాడు.
29 ✽ఇస్రాయేల్ రాజు, యూదా రాజు యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్ళారు. 30 ✽యెహోషాపాతుతో ఇస్రాయేల్ రాజు “యుద్ధ రంగంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషం వేసుకుంటాను. మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అన్నాడు. ఇస్రాయేల్ రాజు మారువేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు.
31 ✽సిరియా రాజు తన రథాల మీద ఉన్న ముప్ఫయి ఇద్దరు అధిపతులకు ఇలా ఆజ్ఞ జారీ చేశారు: “మీరు ఇస్రాయేల్ రాజు ఒక్కణ్ణే ఎదుర్కోవాలి. ఇంకెవరితో – అల్పులతో గానీ ఘనులతో గానీ – యుద్ధం చేయకూడదు.”
32 అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు “ఇతడే ఇస్రాయేల్ రాజు. అనుమానం లేదు” అని చెప్పుకొన్నారు. అతని పైబడడానికి అతని వైపు తిరిగారు. యెహోషాపాతు కేక వేశాడు. 33 అతడు ఇస్రాయేల్ రాజు కాడని రథాధిపతులు తెలుసుకొన్నారు, గనుక అతణ్ణి తరమడం మానివేశారు.
34 ✽ఉన్నట్టుండి ఎవడో ఒకడు విల్లెక్కుపెట్టి గురి లేకుండానే బాణం వేశాడు. అది పోయి ఇస్రాయేల్ రాజుకు కవచం కీళ్ళలో ఒకదానిగుండా దూరింది. రాజు తన రథసారధితో “నాకు గాయం తగిలింది. రథం త్రిప్పి యుద్ధం నుంచి నన్ను వెనక్కు తీసుకుపో” అన్నాడు.
35 అయితే ఆ రోజు హోరాహోరీగా యుద్ధం చెలరేగింది గనుక రాజును సిరియా సైన్యానికి ఎదురుగా అతడి రథంలో నిలబెట్టి ఉంచారు. అతడి గాయంలో నుంచి రక్తం రథం అడుగు భాగానికి కారింది. సాయంకాలాన అతడు చనిపోయాడు. 36 ప్రొద్దు క్రుంకే సమయాన “అందరూ వారి వారి ప్రాంతాలకు, వారివారి ఊళ్ళకు వెళ్ళిపొండి” అని సైన్యంలో ప్రకటనలు వినిపించాయి.
37 ఆవిధంగా రాజు మృతి చెందాడు. వారు అతణ్ణి షోమ్రోనుకు తీసుకువచ్చి షోమ్రోనులో అతణ్ణి సమాధి చేశారు. 38 ✝వేశ్యలు స్నానం చేసే షోమ్రోను మడుగు దగ్గర అతడి రథం కడిగారు. కుక్కలు వచ్చి అతడి రక్తం నాకాయి. ఈ విధంగా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
39 ✽అహాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతడు దంతంతో ఇల్లు కట్టించుకొన్న సంగతి, అతడు కట్టించిన అన్ని పట్టణాల సంగతి ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయి. 40 అహాబు కన్ను మూసి✽ తన పూర్వీకుల దగ్గర చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు అహజ్యా రాజయ్యాడు.
41 ✝ఇస్రాయేల్ రాజు అహాబు పరిపాలనలో నాలుగో ఏట ఆసా కొడుకు యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు. 42 యెహోషాపాతు రాజయినప్పుడు అతడి వయస్సు ముప్ఫయి అయిదేండ్లు. అతడు జెరుసలంలో ఇరవై అయిదేండ్లు పరిపాలన చేశాడు. అతడి తల్లి పేరు అజూబా. ఆమె షిల్హీ కూతురు. 43 యెహోషాపాతు తన తండ్రి ఆసా✽ జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించేవాడు. దాని నుంచి తొలగిపోకుండా యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. కానీ అతడు ఎత్తయిన పూజాస్థలాలను✽ తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు ఇంకా బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. 44 యెహోషాపాతు ఇస్రాయేల్ రాజుతో సంధి చేశాడు కూడా.
45 యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, అతడు కనుపరచిన బలప్రభావాలు, యుద్ధం చేసిన విధానం యూదా రాజుల చరిత్ర గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయి. 46 ✝అతడి తండ్రి ఆసా కాలం నుంచి గుళ్ళకు అనుబంధంగా పురుష సంపర్కులలో కొంతమంది మిగిలారు. యెహోషాపాతు వాళ్ళను దేశంలో లేకుండా చేశాడు.
47 ఆ రోజుల్లో ఎదోం దేశానికి రాజు లేడు. అధికారులలో ఒకడు పరిపాలించేవాడు. 48 ✽యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరుకు వెళ్ళడానికి తర్షీషు ఓడలను కట్టించాడు గాని ఆ ఓడలు బయలుదేరలేదు. అవి ఎసోన్‌గెబెరు దగ్గరే బ్రద్దలైపోయాయి. 49 అప్పుడు అహాబు కొడుకైన అహజ్యా యెహోషాపాతుతో “నా సేవకుల్ని మీ సేవకులతోపాటు ఓడలలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు. కానీ యెహోషాపాతు అందుకు ఒప్పుకోలేదు.
50 యెహోషాపాతు కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. తన పూర్వీకుల దగ్గర తన పూర్వీకుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోరాం రాజయ్యాడు.
51 యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలో పదిహేడో ఏట అహాబు కొడుకు అహజ్యా ఇస్రాయేల్‌కు షోమ్రోనులో రాజయ్యాడు. అతడు ఇస్రాయేల్ ప్రజలపై రెండేండ్లు పరిపాలన చేశాడు. 52 ✝యెహోవా దృష్టిలో అతడు చెడుగా ప్రవర్తించేవాడు. అతడు తండ్రి జీవిత విధానాన్నీ తల్లి జీవిత విధానాన్నీ అనుసరించేవాడు. నెబాతు కొడుకు ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన యరొబాం జీవిత విధానాన్ని అనుసరించేవాడు.
53 అతడు బయల్✽దేవుడికి సేవ చేసి మ్రొక్కేవాడు. అతడి తండ్రిలాగే అతడు ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు కోపం✽ రేపేవాడు.