20
1 తరువాత సిరియా దేశం రాజు బెన్‌హదదు✽ తన సైన్యమంతటినీ సమకూర్చాడు. అతడితోపాటు ముప్ఫయి ఇద్దరు రాజులు ఉన్నారు. అనేక గుర్రాలూ రథాలూ కూడా ఉన్నాయి. బెన్‌హదదు వచ్చి షోమ్రోనును ముట్టడించాడు, యుద్ధం చేశాడు. 2 ఇస్రాయేల్ రాజైన అహాబు నగరంలో ఉన్నాడు. బెన్‌హదదు అతడి దగ్గరికి ఇలా చెప్పి పంపాడు:3 “బెన్‌హదదు చెప్పేదేమిటంటే, నీ వెండి బంగారాలు నావే. నీ భార్యల్లో మీ సంతానంలో ఉత్తములు నావాళ్ళే.”
4 ✽అందుకు ఇస్రాయేల్ రాజు “నా యజమానులైన రాజా, మీరు చెప్పినట్టే నేనూ నాకు కలిగినదంతా మీ వశంలో ఉన్నాం” అని జవాబిచ్చాడు.
5 తరువాత బెన్‌హదదు దగ్గరనుంచి వార్తాహరులు తిరిగి వచ్చి ఇలా చెప్పారు: “బెన్‌హదదు చెప్పేదేమిటంటే, నీ వెండినీ నీ బంగారాన్ని నీ భార్యల్నీ నీ సంతానాన్నీ నాకు స్వాధీనం చేయాలని నేను కబురంపాను గదా. 6 ✽సరే కానీ రేపు ఇదే వేళకు నా సేవకుల్ని నీ దగ్గరికి పంపిస్తాను. వాళ్ళు నీ ఇంటినీ నీ సేవకుల ఇండ్లనూ గాలిస్తారు, కోరదగ్గవాటన్నిటినీ చేతపట్టుకొని వెళ్తారు.”
7 అప్పుడు ఇస్రాయేల్ రాజు దేశంలోని పెద్దలందరినీ పిలిపించి వాళ్ళతో “ఈ రాజు చూడండి, ఎంత చెడుగు చేయాలని తలపెట్టాడు! నా భార్యలు, నా సంతానం, నా వెండి బంగారాలు కావాలంటూ నాకు కబురు పంపాడు. నేను కాదనలేదు” అన్నాడు.
8 ఆ పెద్దలూ అక్కడి ప్రజలూ ఏకంగా “మీరు వాడి మాట వినకండి, దానికి ఒప్పుకోకండి” అన్నారు.
9 గనుక బెన్‌హదదు పంపిన వార్తాహరులతో అహాబు చెప్పాడు “నా యజమానులైన రాజుతో ఈ విధంగా చెప్పండి – మీ సేవకుడైన నాకు మీరు మొదట చెప్పి పంపిన మాట ప్రకారం చేసితీరుతాను. కానీ ఈసారి మీరు కోరినట్టు నేను చేయలేను.”
వార్తాహరులు వెళ్ళి బెన్‌హదదుతో ఈ వార్త చెప్పారు.
10 బెన్‌హదదు “నేను షోమ్రోనును ధూళిగా చేస్తాను. నాతో కూడా వచ్చిన వాళ్ళంతా పిడికెడు ఎత్తుకుపోవడానికి ఆ ధూళి చాలదు. ఇలా జరగకపోతే దానికంటే దేవుళ్ళు ఎక్కువ కీడు నాకు చేస్తారు గాక!” అని చెప్పి పంపాడు.
11 ✝దానికి ఇస్రాయేల్ రాజు “యుద్ధానికి ఆయుధాలు ధరించినవాడు యుద్ధానంతరం ఆయుధాలు తీసివేసిన వాడిలాగా గొప్పలు చెప్పకూడదని అతడితో చెప్పండి” అంటూ జవాబిచ్చాడు.
12 ఈ వార్త వచ్చినప్పుడు బెన్‌హదదు, అతడితో పాటు వచ్చిన రాజులు గుడారాలలో త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుషులతో “యుద్ధానికి సిద్ధపడండి” అన్నాడు. వాళ్ళు నగరంపైబడడానికి సంసిద్ధులయ్యారు.
13 ఈలోగా, ఇస్రాయేల్ రాజైన అహాబుదగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త “యెహోవా✽ ఇలా చెపుతున్నాడు – ఈ గొప్ప సైన్యం చూశావు గదా! ఇదిగో విను, దానిని ఈ రోజు నీ హస్తగతం చేస్తాను. ఆవిధంగా నేనే యెహోవానని తెలుసు కొంటావు✽” అన్నాడు.
14 అహాబు “ఇది ఎవరి చేత జరుగుతుంది?” అని అడిగాడు.
“ప్రాంతీయ అధికారుల దగ్గర సేవ చేసే యువకులు అలా జరిగిస్తారని యెహోవా చెపుతున్నాడ”ని ప్రవక్త చెప్పాడు.
“ఎవరు యుద్ధం ఆరంభం చేయాలి?” అని అహాబు అడిగితే “నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు. 15 ✽ప్రాంతీయ అధికారుల దగ్గర సేవ చేసే యువకులను అహాబు సమకూర్చాడు. వారు రెండు వందల ముప్ఫయి ఇద్దరు. తరువాత అక్కడ ఉన్న ఇస్రాయేల్ మనుషులందరినీ సమకూర్చి లెక్క చూస్తే, వారు ఏడువేలమంది.
16 మధ్యాహ్నం వారు బయలుదేరి వెళ్ళారు. అప్పుడు బెన్‌హదదు, అతడికి అండగా వచ్చిన ఆ ముప్ఫయి ఇద్దరు రాజులు గుడారాల్లో త్రాగుతూ ఉన్నారు, మత్తుగా ఉన్నారు. 17 ప్రాంతీయ అధికారుల దగ్గర సేవ చేసే యువకులు ముందు బయలుదేరారు. సంగతి తెలుసుకుందామని బెన్‌హదదు కొందరిని బయటికి పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి “షోమ్రోను నుంచి కొంతమంది బయలుదేరి వస్తున్నారు” అని అతడికి తెలియజేశారు.
18 బెన్‌హదదు “వాళ్ళు సంధి రాయబారంగా వచ్చినా, యుద్ధం చేయడానికి వచ్చినా వాళ్ళను ప్రాణంతో పట్టుకోండి” అని ఆదేశించాడు.
19 నగరం నుంచి బయలుదేరిన వారు ప్రాంతీయ అధికారుల దగ్గర సేవ చేసే యువకులు, యువకుల వెంట నడుస్తున్న సైన్యంవారు. 20 ఒక్కొక్కడు తనతో పోరాడినవాణ్ణి కూలగొట్టాడు. సిరియనులు పారిపోయారు. ఇస్రాయేల్‌వారు వాళ్ళ వెంటబడ్డారు. సిరియా రాజు బెన్‌హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతో పాటు తప్పించుకొన్నాడు. 21 అప్పుడు ఇస్రాయేల్ రాజు నగరం నుంచి వెళ్ళి గుర్రాలనూ రథాలనూ కూలగొట్టాడు. సిరియావాళ్ళలో చాలామందిని సంహారం చేశాడు.
22 ✽ఇంకో సారి ఇస్రాయేల్ రాజుదగ్గరికి ఆ ప్రవక్త వచ్చి ఇలా అన్నాడు: “ధైర్యం తెచ్చుకొని నీవు చేయవలసినదేదో కనిపెట్టి ఉండు. ఎందుకంటే, వచ్చే సంవత్సరంలో సిరియా రాజు మళ్ళీ నీమీదికి దండెత్తి వస్తాడు.”
23 సిరియా రాజపరివారం అతడికి ఇలా సలహా చెప్పారు: “ఇస్రాయేల్ వాళ్ళ దేవుడు కొండల✽ దేవుడు. అందుకనే వాళ్ళు మనల్ని గెలిచారు. మనం మైదానాల ప్రాంతంలో వాళ్ళతో యుద్ధం జరిగిస్తే తప్పనిసరిగా వాళ్ళను గెలవగలం. 24 ఇప్పుడు నీవు ఈ విధంగా చేయాలి – ఆ రాజుల్ని తొలగించి వాళ్ళ స్థానంలో సైన్యాధిపతుల్ని నియమించు. 25 నీవు పోగొట్టుకొన్న సైన్యమంత మరో సైన్యాన్ని సమకూర్చు, గుర్రానికి బదులు గుర్రం, రథానికి బదులు రథం సిద్ధం చేయి. అప్పుడు వాళ్ళతో మైదానాల ప్రాంతంలో యుద్ధం జరిగిస్తాం. తప్పకుండా వాళ్ళను గెలుస్తాం.” రాజు వాళ్ళ సలహా విని దాని ప్రకారం చేశాడు.
26 మరుసటి సంవత్సరంలో బెన్‌హదదు సిరియా సైన్యాలను సమకూర్చాడు, ఇస్రాయేల్ వారితో యుద్ధం చేయడానికి ఆఫెక్‌దగ్గరికి వచ్చాడు. 27 ✝ఇస్రాయేల్‌వారు కూడా సమకూడి సంసిద్ధులై సిరియావాళ్ళను ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఇస్రాయేల్‌వారు వాళ్ళ ఎదుట రెండు చిన్న మేకల మందల్లాగా దిగారు. సిరియావాళ్ళతో ఆ ప్రాంతమంతా నిండి ఉంది.
28 దేవుని మనిషి✽ ఒకడు ఇస్రాయేల్ రాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా కొండల దేవుడే గానీ లోయల దేవుడు కాద’ని సిరియావాళ్ళు చెప్పారు. అందుకనే ఈ గొప్ప సమూహాన్ని అంతా నీ వశం చేస్తాను. ఆవిధంగా నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు✽.”
29 వారు ఎదురెదురుగా గుడారాలు వేసుకొని ఏడు రోజులు అలా ఉన్నారు. ఏడో రోజున యుద్ధం ఆరంభమైంది. ఆ ఒక్క రోజున ఇస్రాయేల్‌వారు సిరియా సైన్యంలో కాల్బలం లక్షమందిని కూలగొట్టారు. 30 మిగతావారు ఆఫెక్ ఊరిలోకి పారిపోయారు. ఆ మిగతా వాళ్ళలో ఇరవై ఏడు వేలమంది మీద ఊరి ప్రాకారాలు కూలాయి. బెన్‌హదదు కూడా పారిపోయి, ఊరిలో ప్రవేశించి ఏదో లోపలి గదిలో చొరబడ్డాడు.
31 అతడి సేవకులు అతడితో “ఇస్రాయేల్ రాజవంశం వారంతా దయ గలవాళ్ళని విన్నాం. ఇప్పుడు మేం నడుంకు గోనెపట్ట✽ కట్టుకొని తలమీద త్రాళ్ళు వేసుకొంటాం. అలా ఇస్రాయేల్ రాజు దగ్గరికి మమ్మల్ని వెళ్ళనివ్వండి. అతడు నిన్ను బ్రతకనివ్వవచ్చు” అన్నారు.
32 అలాగే వాళ్ళు నడుముకు గోనెపట్ట కట్టుకొని తలమీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయేల్ రాజు దగ్గరికి వచ్చారు, “మీ సేవకుడైన✽ బెన్‌హదదు ఇలా చెప్తున్నాడు: దయ చూపి నన్ను బ్రతకనివ్వండి” అన్నారు.
రాజు “అతడింకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అన్నాడు.
33 వాళ్ళు అతడి మాటలలో మంచి సూచన కోసం కనిపెట్టారు గనుక అతడు ఆ మాట అనగానే అందుకొని “అవును, మీ సోదరుడు బెన్‌హదదు!” అన్నారు.
అప్పుడు రాజు “మీరు వెళ్ళి అతణ్ణి తీసుకురండి” అన్నాడు. బెన్‌హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతణ్ణి తన రథంలో ఎక్కించుకొన్నాడు.
34 ✽అప్పుడు బెన్‌హదదు అన్నాడు: “మీ తండ్రి వశంలోనుంచి నా తండ్రి పట్టుకొన్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో వ్యాపార కేంద్రాలు కట్టించుకొన్నట్టు మీరు దమస్కులో కట్టించుకోవచ్చు.”
అందుకు అహాబు “అలా చేస్తే నీతో సంధి చేసి నిన్ను వెళ్ళనిస్తాను” అన్నాడు. అహాబు అతడితో సంధి చేసి అతణ్ణి వెళ్ళనిచ్చాడు.
35 ✝ప్రవక్తల బృందంలో ఒకడు తన సాటి ప్రవక్తతో యెహోవా ఆజ్ఞచేత “నన్ను దెబ్బ కొట్టు” అన్నాడు. దానికి అతడు ఒప్పుకోలేదు. 36 ✽గనుక మొదటివాడు “నీవు యెహోవా ఆజ్ఞను పెడచెవి బెట్టావు. అందుచేత నా దగ్గర నుంచి వెళ్ళగానే నిన్ను ఒక సింహం చంపుతుంది” అని అతడితో చెప్పాడు. ఆ రెండోవాడు వెళ్ళిపోతుండగానే ఒక సింహం ఎదురుపడి అతణ్ణి చంపింది.
37 ఆ ప్రవక్త ఇంకో అతడిదగ్గరికి వెళ్ళి “నన్ను దెబ్బకొట్టు” అన్నాడు. ఆ వ్యక్తి అతణ్ణి కొట్టి గాయపరచాడు. 38 అప్పుడా ప్రవక్త వెళ్ళి దారిప్రక్కన నిలబడి ఇస్రాయేల్ రాజు రాకడకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండేలా తన కళ్ళకు గుడ్డ కట్టుకొన్నాడు. 39 రాజు రానేవచ్చాడు. ప్రవక్త రాజును పిలిచి ఇలా అన్నాడు:
“మీ సేవకుడైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్ళాను. అక్కడ ఒక మనిషి నా దగ్గరికి ఒకణ్ణి బందీగా తెచ్చి నాకు అప్ప చెప్పి ఇలా అన్నాడు: ‘ఈ మనిషిని చూస్తూ ఉండు. తరువాత వాడు కనబడకపోయాడా, వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పెట్టాలి✽. లేకపోతే నీవు ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల వెండి ఇవ్వాలి.’ 40 అయితే మీ సేవకుడైన నేను పనిమీద అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటే వాడు అంతర్థానం అయ్యాడు!”
ఇస్రాయేల్ రాజు అతడితో “సరే, నీకు అలాగే జరగాలి. నీకు నీవే తీర్పు చెప్పుకొన్నావు” అన్నాడు.
41 ప్రవక్త తన కండ్లకు కట్టుకొన్న గుడ్డ త్వరగా తీసివేశాడు. అతడు ప్రవక్తలలో ఒకడని అప్పుడు రాజు గుర్తించాడు.
42 ✽ప్రవక్త అతడితో ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, నేను చావుకు నియమించినవాణ్ణి నీవు వెళ్ళిపోనిచ్చావు, గనుక అతడి ప్రాణానికి బదులు నీ ప్రాణం, అతడి సైన్యానికి బదులు నీ సైన్యం నష్టం కావాలి.” 43 రాజు కోప ముఖంతో చిరచిరలాడుతూ షోమ్రోనుకు తన ఇంటికి వెళ్ళిపోయాడు.