19
1 అహాబు వెళ్ళి ఏలీయా చేసినదంతా, ఆమెకు చెందిన ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపిన✽ సంగతంతా యెజెబెల్✽కు తెలియజేశాడు. 2 యెజెబెల్ ఏలీయాకు వార్తాహరుడితో ఇలా కబురంపింది: “రేపు ఈవేళకు నిన్ను వాళ్ళలాగే చేస్తాను. ఒక వేళ నేను అలా చెయ్యకపోతే దానికంటే ఎక్కువ కీడు దేవుళ్ళు నా మీదికి తెస్తారు గాక!”3 అందుకు ఏలీయా భయపడి✽ ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయాడు. యూదా బేర్‌షెబాకు చేరి అక్కడ అతడి పరిచారకుణ్ణి ఉంచాడు. 4 ✽ ఏలీయా ఒంటరిగా ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక రేగుచెట్టు దగ్గరికి చేరి దానిక్రింద కూర్చున్నాడు. చనిపోవాలని ఆశించి ఇలా ప్రార్థించాడు:
“యెహోవా! నాకింకా ఈ జీవితం చాలు. నా ప్రాణం తీసుకో. నేను నా పూర్వీకులకంటే మంచివాణ్ణి కాను✽.”
5 అప్పుడా రేగుచెట్టు క్రింద పడుకొని నిద్రపోయాడు.✽ ఉన్నట్టుండి ఒక దేవదూత✽ అతణ్ణి తట్టి “నీవు లేచి భోం చెయ్యి!” అన్నాడు. 6 ✽అతడు కండ్లు విప్పి చూస్తే అతడి తల దగ్గర సీసాలో నీళ్ళు, వేడి రాళ్ళ మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని నీళ్ళు త్రాగి మళ్ళీ పడుకొన్నాడు. 7 తరువాత యెహోవా దూత✽ రెండో సారి వచ్చి అతణ్ణి తట్టి “లేచి భోం చెయ్యి. లేకపోతే నీవు చేసే ప్రయాణం✽ నీ బలానికి మించిపోతుంది” అన్నాడు.
8 అతడు లేచి తిని నీళ్ళు త్రాగి ఆ ఆహారం వల్ల బలం పుంజుకొని నలభై రాత్రింబగళ్ళు నడుస్తూ దేవుని పర్వతమైన హోరేబు✽ చేరుకొన్నాడు.
9 అక్కడ అతడు గుహలో ఉండిపోయాడు. ఉన్నట్టుండి అతనికి యెహోవా వాక్కు ఇలా వినిపించింది: “ఏలీయా! ఇక్కడేమి చేస్తున్నావు?✽”
10 ✽ఏలీయా “ఇస్రాయేల్‌ప్రజ నీ ఒడంబడికను కాలదన్నారు, నీ వేధికలను పడద్రోశారు, ఖడ్గంతో నీ ప్రవక్తలను చంపారు, గనుక సేనల ప్రభువు అయిన యెహోవాదేవుని విషయంలో నాకు చాలా రోషం. నేనొక్కణ్ణే✽ మిగిలాను. వాళ్ళు నన్ను కూడా చంపడానికి చూస్తున్నారు” అన్నాడు.
11 ✽అందుకు యెహోవా “వెలుపలికి వెళ్ళి పర్వతం మీద యెహోవా సన్నిధానంలో నిలబడు” అన్నాడు.
అక్కడ యెహోవా ఈవైపునుంచి ఆ వైపుకు వెళ్ళాడు. హోరున పెద్ద గాలి వీచింది, యెహోవా ముందు పర్వతాలు బ్రద్దలయ్యాయి, రాళ్ళు ముక్కచెక్కలయ్యాయి! అయితే ఆ గాలిలో యెహోవా లేడు. గాలి పోయిన తరువాత భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో యెహోవా లేడు. 12 భూకంపం తరువాత మంటలు కనిపించాయి. ఆ మంటలలో యెహోవా లేడు. మంటలు ఆగిపోయిన తరువాత నెమ్మదిగా మాట్లాడే సన్నని స్వరం వినిపించింది. 13 ఏలీయా ఆ స్వరం వినీ వినడంతోనే తన పైవస్త్రంతో ముఖం కప్పుకొని వెళ్ళి ఆ గుహ ప్రవేశంలో నిలబడ్డాడు. తక్షణమే ఒక స్వరం ఇలా వినిపించింది:
“ఏలీయా, ఇక్కడేమి చేస్తున్నావు?”
14 ✽ఏలీయా “ఇస్రాయేల్ ప్రజ నీ ఒడంబడికను కాలదన్నారు, నీ వేధికలను పడద్రోశారు, ఖడ్గంతో నీ ప్రవక్తలను చంపారు. గనుక సేనలప్రభువైన యెహోవాదేవుని విషయంలో నాకు చాలా రోషం. నేనొక్కణ్ణే మిగిలాను. వాళ్ళు నన్ను కూడా చంపడానికి చూస్తున్నారు” అన్నాడు.
15 ✽అప్పుడు యెహోవా అతనితో అన్నాడు “నీవు వచ్చిన దారి తిరిగి పట్టి దమస్కు దగ్గర ఉన్న ఎడారి గుండా వెళ్ళు. దమస్కులో ప్రవేశించి సిరియామీద హజాయేల్‌ను రాజుగా అభిషేకించు. 16 తరువాత ఇస్రాయేల్ మీద నింషీ కొడుకు యెహూను రాజుగా అభిషేకించు. నీ స్థానంలో ప్రవక్తగా ఆబేల్‌మెహోలా గ్రామస్థుడైన షాపాత్ కొడుకు ఎలీషాను అభిషేకించు. 17 ✽హజాయేల్ యొక్క ఖడ్గం నుంచి తప్పించుకొనేవాళ్ళను యెహూ చంపుతాడు. యెహూ ఖఢ్గం నుంచి తప్పించుకొనేవాళ్ళను ఎలీషా చంపుతాడు. 18 అయితే ఇస్రాయేల్‌ప్రజలో ఏడు వేల మంది✽ బయల్‌దేవుడికి మోకరించలేదు, మ్రొక్కలేదు. బయల్ విగ్రహాన్ని ముద్దు పెట్టుకోలేదు. వారందరినీ నేను మిగుల్చుకొంటాను.”
19 ఏలీయా అక్కడనుంచి ప్రయాణమై షాపాత్ కొడుకు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దుక్కి దున్నుతూ✽ ఉన్నాడు. అతని ముందు పన్నెండు జతల ఎద్దులు ఉన్నాయి. అతడు పన్నెండో జతతో దున్నుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్ళి తన పై వస్త్రం✽ తీసి అతనిమీద వేశాడు. 20 ఎలీషా ఎద్దులను విడిచిపెట్టి ఏలీయా వెంట పరుగెత్తి, “నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దుపెట్టుకొని వచ్చి మిమ్మల్ని అనుసరిస్తాను” అన్నాడు.
అందుకు ఏలీయా “తిరిగి వెళ్ళు✽. నేను నీకు చేసినదేమిటి?” అన్నాడు. 21 ✽ఎలీషా అతణ్ణి విడిచి తిరిగి వెళ్ళి ఆ జత ఎద్దులను వధించాడు; కాడి మ్రానులతో వాటి మాంసం వండించాడు; మాంసం అక్కడి వారికి వడ్డించాడు. వారు తిన్నారు. ఆ తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్ళాడు; అతనికి పరిచారకుడయ్యాడు.