18
1 చాలా రోజులు గడిచాయి. మూడో సంవత్సరంలో యెహోవానుంచి వాక్కు ఏలీయాకు వచ్చింది: “నీవు వెళ్ళి అహాబుకు కనబడు. అప్పుడు నేను దేశం మీద వర్షం కురిపిస్తాను.”
2 గనుక అహాబుకు కనబడడానికి ఏలీయా తరలివెళ్ళాడు. షోమ్రోనులో ఆ కరవు తీవ్రంగా ఉంది. 3 కాబట్టి అహాబు తన గృహనిర్వాహకుడు ఓబద్యాను పిలిచాడు. యెహోవా అంటే ఈ ఓబద్యాకు చాలా భయభక్తులు. 4 ఒకప్పుడు యెహోవా ప్రవక్తలను యెజెబెల్ సంహారం చేస్తూ ఉన్నప్పుడు ఓబద్యా వందమంది ప్రవక్తలను తీసుకువెళ్ళి వారిని దాచాడు. వాళ్ళను యాభైమంది చొప్పున రెండు గుహలలో ఉంచి వారికి అన్నపానాలు ఇచ్చి పోషించాడు.
5 ఇప్పుడు అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “దేశమంతటా తిరుగుతూ ఊటలన్నీ వాగులన్నీ చూడాలి. మన గుర్రాలూ కంచరగాడిదలూ చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో. అప్పుడు కొన్ని పశువులనయినా దక్కించుకుంటాం.” 6 వారు వెళ్ళి చూడడానికి దేశాన్ని రెండుగా విభాగించారు. ఒకవైపు అహాబు ఒక్కడే వెళ్ళాడు. మరోవైపు ఓబద్యా వెళ్ళాడు.
7 ఓబద్యా దారిన వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఏలీయా ఎదురుపడ్డాడు. ఓబద్యా అతణ్ణి గుర్తుపట్టి సాష్టాంగపడి “మీరు నా యజమానులైన ఏలీయా గదా” అన్నాడు.
8 ఏలీయా అతడితో “ఏలీయానే. వెళ్ళి, ఏలీయా ఇక్కడ ఉన్నాడనీ నీ యజమానితో చెప్పు” అన్నాడు.
9 అందుకు ఓబద్యా అన్నాడు: “అహాబు నన్ను చంపడానికి మీరు మీ దాసుడైన నన్ను ఆయన చేతికిచ్చేలా నేనేం తప్పిదం చేశాను? 10 మీ దేవుడు యెహోవా జీవంమీద ఆనబెట్టి చెప్తున్నాను, నా యజమాని మీకోసం వెదకడానికి అన్ని దేశాలకూ రాజ్యాలకూ మనుషులను పంపాడు. అక్కడ వాళ్ళు ‘ఏలీయా ఇక్కడ లేడ’ని చెప్పినప్పుడు ఆ దేశంవాళ్ళూ రాజ్యంవాళ్ళూ మిమ్మల్ని చూడలేదని ఆయన వాళ్ళ చేత శపథం చేయించుకొనేవాడు. 11 ఇప్పుడు మీరు వెళ్ళి నీ యజమానితో, ఏలీయా ఇక్కడ ఉన్నాడని చెప్పమంటున్నారు. 12 అయితే ఒకవేళ నేను మీ దగ్గరనుంచి వెళ్ళినవెంటనే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలానికి మిమ్మల్ని ఎత్తుకుపోతాడు. నేను అహాబు దగ్గరికి చేరి మీరు ఇక్కడ ఉన్నారని చెప్తాననుకోండి. మీరు కనబడకపోతే ఆయన నన్ను చంపేస్తాడు. అయితే యెహోవా అంటే చిన్నతనం నుంచి మీ దాసుడైన నాకు భయభక్తులే అని గుర్తించండి. 13 యెహోవా ప్రవక్తలను యెజెబెల్ చంపించిన కాలంలో నేనేం చేశానో నా యజమానులైన మీకు ఎవరూ తెలుపలేదా? ప్రవక్తలలో వందమందిని గుహల్లో దాచాను, ఒక్కొక్క గుహలో యాభైమందిని ఉంచి వారికి అన్నపానాలిచ్చి పోషించాను. 14 మరి ఇప్పుడు నేను వెళ్ళి నా యజమానితో, ఏలీయా ఇక్కడ ఉన్నాడని చెప్పాలని అంటున్నారే. ఆయన నన్ను చంపేస్తాడు!”
15 అందుకు ఏలీయా “నేను సేనలప్రభువైన యెహోవా సన్నిధానంలో నిలుచున్నాను. ఆయన జీవం మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను – ఈరోజే నేను అతడికి తప్పక కనబడతాను” అన్నాడు.
16 ఓబద్యా అహాబును కలుసుకొని ఈ విషయం తెలియజేశాడు. అహాబు ఏలీయాను కలుసుకోవడానికి వెళ్ళాడు. 17 అహాబు ఏలీయాను చూడగానే అతనితో “ఇస్రాయేల్ ప్రజను కష్టపెట్టేవాడివి నీవే గదా” అన్నాడు.
18 అందుకు ఏలీయా ఇలా జవాబిచ్చాడు: “ఇస్రాయేల్ ప్రజను కష్టపెట్టేది నేను కాదు. వారిని కష్టపెట్టేది నీవూ నీ తండ్రి వంశంవారూ. ఏలాగంటే మీరంతా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను పెడచెవిని బెట్టి బయల్‌దేవుణ్ణి అనుసరించేవారు. 19 ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారందరినీ కర్మెల్ పర్వతానికి రప్పించు. నేనక్కడ ఉంటాను. యెజెబెల్ బల్ల దగ్గర భోం చేసే నాలుగు వందల యాభైమంది బయల్‌దేవుడి ప్రవక్తలనూ నాలుగు వందల మంది అషేరాదేవి ప్రవక్తలనూ కూడా పిలువు.”
20 అహాబు ఇస్రాయేల్ వారందరినీ పిలువనంపించాడు. ఆ ప్రవక్తలను కర్మెల్ పర్వతం మీద సమకూర్చాడు. 21  ఏలీయా ప్రజలందరినీ సమీపించి ఇలా అన్నాడు:
“మీరు ఎంత కాలం రెండు అభిప్రాయాలమధ్య తడబడుతూ ఉంటారు? యెహోవాయే దేవుడైతే ఆయనను అనుసరించండి, బయల్‌దేవుడే దేవుడైతే వాణ్ణి అనుసరించండి.”
ప్రజ అతనికి జవాబుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. 22  అప్పుడు ఏలీయా చెప్పాడు, “యెహోవా ప్రవక్తలలో నేనొకణ్ణే మిగిలాను. బయల్‌దేవుడి ప్రవక్తలు నాలుగు వందల యాభైమంది. 23 మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. ముందు వాళ్ళు ఆ ఎద్దులలో ఒకదానిని కోరుకొని దానిని తునకలుగా కోసి కట్టెలమీద పేర్చాలి. నిప్పు మాత్రం అంటించకూడదు. ఇంకో ఎద్దును నేను సిద్ధం చేసి కట్టెల మీద పేరుస్తాను. నేను కూడా నిప్పు అంటించను. 24 అప్పుడు మీరు మీ దేవుడి పేర ప్రార్థన చేయండి; నేను యెహోవా పేర ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే మంటలు పంపడంవల్ల జవాబిస్తాడో ఆయనే దేవుడు.”
ప్రజలంతా “అది మంచి మాటే” అంటూ జవాబిచ్చారు.
25 అప్పుడు ఏలీయా బయల్‌దేవుడి ప్రవక్తలను చూచి ఇలా చెప్పాడు: “మీరు చాలామంది గదా. ముందు మీరు ఒక ఎద్దును కోరుకొని దానిని సిద్ధం చేయాలి. నిప్పు అంటించ కుండానే మీ దేవుడి పేర ప్రార్థన చేయాలి.”
26 ఆ ప్రవక్తలు ఆ ఎద్దును తీసుకొని సిద్ధం చేశారు. ఉదయంనుంచి మధ్యాహ్నం వరకూ “బయల్‌స్వామీ! మాకు జవాబివ్వు!” అంటూ బయల్ పేరెత్తి మొరపెట్టుకొంటూ ఉన్నారు. వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు. వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర చిందులు త్రొక్కడం మొదలుపెట్టారు. 27 మధ్యాహ్న కాలంలో ఏలీయా వాళ్ళను గేలి చేస్తూ ఇలా అన్నాడు:
“వాడు దేవుడేగా! బాగా కేకలెయ్యండి! వాడు ఆలోచనలో మునిగివున్నాడేమో, బయటికి వెళ్ళి ఉండవచ్చు, ప్రయాణం మీద ఉండవచ్చు, లేకపోతే వాడు నిద్రబోతూ ఉంటే లేపాలేమో చూడండి.”
28 అందుకని వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ వాళ్ళ అలవాటుచొప్పున రక్తధారలయ్యేవరకు కత్తులతో ఈటెలతో తమను పొడుచుకొన్నారు. 29 మధ్యాహ్నం నుంచి సందెవేళ నైవేద్యం పెట్టె సమయం వరకు పూనకం వచ్చి పిచ్చిపట్టిన వాళ్ళలాగా మసలుకొన్నారు. అయితే వాళ్ళకు జవాబేమీ రాలేదు, ఎవరి స్వరమూ వినిపించలేదు, వాళ్ళను ఎవరూ గమనించినట్టు లేదు.
30 అప్పుడు ఏలీయా ప్రజలందరితో “నా దగ్గరికి రండి” అన్నాడు.
ప్రజలంతా దగ్గరికి వచ్చాక అతడు శిథిలమైపోయిన యెహోవా బలివేధికను సరి చేశాడు. 31 ఏలీయా పన్నెండు రాళ్ళు తీసుకొన్నాడు. 32 రాళ్ళతో యెహోవా పేరున బలిపీఠం కట్టి దానిచుట్టూరా అయిదు తూముల గింజలు పట్టేటంత పెద్దగా కందకం త్రవ్వాడు. 33 కట్టెలు పేర్చాడు, ఎద్దును ముక్కలుగా కోసి కట్టెలమీద పెట్టాడు.
“నాలుగు కుండల నిండా నీళ్ళు నింపి తెచ్చి హోమబలిమీదా కట్టెలమీదా పోయండి” అని ప్రజలతో చెప్పాడు. 34 అలా చేశాక “రెండో సారి అలాగే చేయండి” అన్నాడు. వారు రెండో సారి కూడా అలా చేశారు. “మూడో సారి అలాగే చేయండి” అన్నాడు. వారు మూడో సారి కూడా అలా చేశారు. 35 నీళ్ళు వేధిక మీద నుంచి పారాయి. చుట్టు ఉన్న కందకం నీళ్ళతో నిండిపోయింది. 36 సందెవేళ నైవేద్యం పెట్టె సమయాన ఏలీయాప్రవక్త బలివేధిక సమీపించి ఇలా ప్రార్థించాడు:
“యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇస్రాయేల్‌ల దేవా! ఇస్రాయేల్‌లో నీవే దేవుడవని వెల్లడి చెయ్యి. నేను నీ సేవకుణ్ణనీ నీ ఆజ్ఞప్రకారమే నేనిదంతా చేశాననీ కూడా వెల్లడించు. 37 నాకు జవాబివ్వు. యెహోవా, నాకు జవాబివ్వు! అప్పుడు, యెహోవా, నీవే దేవుడవనీ నీవు వారి హృదయాలను నీవైపు మళ్ళీ త్రిప్పుతున్నావనీ ఈ ప్రజ తెలుసుకొంటారు.”
38  వెంటనే యెహోవానుంచి మంటలు దిగివచ్చి బలినీ కట్టెలనూ రాళ్ళనూ మట్టినీ దహించివేశాయి. కందకంలో ఉన్న నీళ్ళను ఇంకిపోయేలా చేశాయి. 39  ప్రజలంతా ఇది చూచి సాష్టాంగపడ్డారు.
“యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు!” అన్నారు.
40 ఏలీయా “బయల్‌దేవుడి ప్రవక్తలను పట్టుకోండి! ఒకణ్ణి కూడా తప్పించుకోనివ్వకండి!” అన్నాడు.
ప్రజలు వాళ్ళను పట్టుకొన్నారు. ఏలీయా వాళ్ళను కీషోను వాగు ఒడ్డుకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళను చంపాడు.
41 తరువాత ఏలీయా అహాబుతో “ప్రచండ వర్షం వచ్చే చప్పుడు వస్తూవుంది. నీవు వెళ్ళి అన్నపానాలు పుచ్చుకో!” అన్నాడు.
42 అహాబు అన్నపానాలు పుచ్చుకోవడానికి వెళ్ళాడు. ఏలీయా కర్మెల్ పర్వత శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ అతడు నేలమీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొన్నాడు. 43 కాసేపటికి ఏలీయా అతడి పరిచారకుడితో, “నీవు మెరకమీదికి వెళ్ళి సముద్రంవైపు చూడు” అన్నాడు.
అతడు వెళ్ళి చూచి “ఏమీ కనిపించడం లేదు” అన్నాడు.
ఏలీయా ఏడు సార్లు “వెళ్ళి అలా చూడు” అన్నాడు.
44 ఏడో సారి అతడు చూచి “ఇప్పుడు మనిషి చెయ్యి అంత మబ్బు సముద్రం నుంచి లేస్తూ ఉంది” అన్నాడు.
అందుకు ఏలీయా అతడితో “నీవు వెళ్ళి అహాబుతో ‘వర్షం నిన్ను ఆపకుండేలా నీ రథం సిద్ధం చేసుకొని వెళ్ళుమ’ని చెప్పు” అన్నాడు.
45 ఈలోగా ఆకాశం మబ్బులతో గాలివానతో చీకటి అయి, ప్రచండ వర్షం కురియడం ఆరంభమైంది. అహాబు రథమెక్కి యెజ్రేల్ పట్టణం వెళ్ళాడు. 46 యెహోవా హస్తం ఏలీయాను బలపరచింది. అతడు నడికట్టు బిగించుకొని అహాబు కంటే ముందే పరుగెత్తి యెజ్రేల్ ద్వారం చేరుకొన్నాడు.