17
1 ✽ గిలాదు ప్రదేశం లోని తిష్బి గ్రామంవాడైన ఏలీయా అహాబుతో ఇలా అన్నాడు: “నేను ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా సన్నిధానంలో నిలుచున్నాను✽. ఆయన జీవం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్పేంతవరకు ఈ సంవత్సరాలలో మంచు గానీ వర్షం✽ గానీ ఏమీ పడదు.”2 తరువాత యెహోవా నుంచి ఏలీయాకు వాక్కు వచ్చింది: 3 “ఈ స్థలం వదలిపెట్టి తూర్పువైపుకు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగుకో✽. ఆ వాగు యొర్దానుకు ఎదురుగా ఉంది. 4 ఆ వాగు నీళ్ళు నీవు త్రాగాలి. నీకు కాకులు✽ ఆహారం అక్కడికి తెస్తాయి. వాటికి నేను అలా ఆదేశించాను.”
5 యెహోవా చెప్పినట్టే ఏలీయా చేశాడు. అతడు వెళ్ళి యొర్దానుకు తూర్పుగా ఉన్న కెరీతు వాగు ఒడ్డున ఉండిపోయాడు. 6 ప్రతిరోజూ ఉదయాన సాయంకాలాన కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి. అతడు ఆ వాగు నీళ్ళు త్రాగేవాడు. 7 కొంతకాలానికి దేశంలో వర్షం లేక ఆ వాగు ఎండిపోయింది✽.
8 అప్పుడు యెహోవా నుంచి వాక్కు అతనికి వచ్చింది: 9 “నీవు లేచి సీదోనుకు చెందిన సారెపతు✽కు వెళ్లి అక్కడ ఉండు. నిన్ను ఒక విధవరాలు పోషించాలని ఆమెకు నేను ఆదేశించాను✽.”
10 ✽అతడు లేచి సారెపతు వెళ్ళాడు. ఊరిద్వారం చేరగానే ఒక విధవరాలు కనిపించింది. ఆమె కట్టె పుల్లలు ఏరుతూ ఉంది. ఏలీయా ఆమెను పిలిచి, 11 “దయ చూపి త్రాగడానికి కొంచెం నీళ్ళు చెంబులో నాకు తీసుకురండి” అన్నాడు. ఆమె నీళ్ళు తేబోతూ ఉంటే అతడు మళ్ళీ ఆమెను పిలిచి “మీ చేతితో ఒక రొట్టెముక్క కూడా నాకు తీసుకురండి” అన్నాడు.
12 ✽అందుకామె ఇలా జవాబిచ్చింది: “మీ దేవుడు యెహోవా జీవంతోడు ఒట్టుపెట్టి చెప్తున్నాను – నా దగ్గర కాల్చిన రొట్టె ఒక్కటి కూడా లేదు. కుండలో పట్టెడు పిండి, జాడీలో కొంచెం నూనె మాత్రం ఉన్నాయి. చావబోయే ముందు ఇంటికి వెళ్ళి నాకూ నా అబ్బాయికీ రొట్టె చేద్దామని నేను కట్టెపుల్లలు ఏరుతున్నాను.”
13 ✽ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “నిర్భయంగా ఉండండి. వెళ్ళి మీరు చెప్పినట్టే చేయండి. అయితే ముందు నాకోసం చిన్న రొట్టె చేసి తీసుకురండి, ఆ తరువాత మీకూ మీ అబ్బాయికీ రొట్టెలు చేసుకోండి. 14 ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇలా చెప్తున్నాడు – దేశం మీద యెహోవా వర్షం కురిపించేవరకు ఆ కుండలో పిండి తగ్గిపోదు, జాడీలో నూనె అయిపోదు.”
15 ఆమె వెళ్ళి ఏలీయా చెప్పినట్టు చేసింది. అతడు, ఆమె, ఆమె కుటుంబం తిన్నారు. చాలా రోజులకు ఇలా వారికి తినడానికి తిండి ఉంది. 16 కుండలో పిండి తరిగిపోలేదు, జాడీలో నూనె అయిపోలేదు. ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
17 కొంతకాలం తరువాత ఆ గృహిణి కొడుకుకు జబ్బు చేసింది. ఆ జబ్బు తీవ్రమై అతడు ప్రాణం విడిచాడు.
18 ✽ఆమె ఏలీయాతో “దేవుని మనుషులైన మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా అపరాధాలు జ్ఞాపకం చేసి నా కొడుకును చంపడానికి వచ్చారా?” అంది.
19 అతడు “మీ కొడుకును ఇలా ఇవ్వండి” అంటూ ఆమె కౌగిట్లో నుంచి ఆ అబ్బాయిని అందుకొన్నాడు. తాను ఉంటున్న మేడ గదికి అతణ్ణి తీసుకువెళ్ళి తన పడక మీద పడుకోబెట్టాడు. 20 ✽అప్పుడతడు యెహోవాకు ఇలా మొరపెట్టాడు: “యెహోవా, నా దేవా, నాకు బస ఇచ్చిన ఈ విధవరాలి మీదికి విపత్తు రప్పించి ఆమె కొడుకును చనిపోయేలా చేశావా?”
21 అప్పుడు ఏలీయా ఆ అబ్బాయిమీద మూడు సార్లు పార చాచుకొన్నాడు, “యెహోవా, నా దేవా! ఈ పిల్లవాడికి ప్రాణం తిరిగి రానిమ్మని వేడుకొంటున్నాను” అంటూ ప్రార్థించాడు.
22 ✽ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నాడు. పిల్లవాడికి ప్రాణం తిరిగి వచ్చింది. అతడు బ్రతికాడు. 23 ఏలీయా పిల్లవాణ్ణి ఎత్తుకొని ఆ గదినుంచి ఇంట్లోకి తీసుకువచ్చి అతణ్ణి తల్లి చేతికి అందజేస్తూ “ఇడుగో, మీ కొడుకు బ్రతికేవున్నాడు” అన్నాడు.
24 ✽ఆ స్త్రీ ఏలీయాతో “మీరు దేవుని మనుషులే. మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమే. ఇది నాకు ఇప్పుడు తెలిసింది” అంది.