16
1 బయెషాను గురించి హనానీ కొడుకు యెహూకు యెహోవానుంచి ఈ వాక్కు వచ్చింది: 2 “మట్టిలో నుంచి నిన్ను పైకెత్తాను, నా ఇస్రాయేల్ ప్రజమీద అధికారిగా చేశాను. అయినా నీవు యరొబాం జీవిత విధానాన్ని అనుసరించావు. నా ఇస్రాయేల్ ప్రజలచేత నాకు కోపం రేపే పాపాలు చేయించావు. 3 ఇదిగో విను, బయెషానూ అతడి వంశాన్నీ భూమిమీద నుంచి తుడిచివేస్తాను. నెబాతు కొడుకైన యరొబాం వంశాన్ని చేసినట్టే నీ వంశాన్ని చేస్తాను. 4 బయెషా కుటుంబంవారిలో పట్టణాలలో చచ్చిన వాళ్ళను కుక్కలు తింటాయి. పట్టణాల బయట చచ్చినవాళ్ళను ఎగిరే పక్షులు తింటాయి.”
5 బయెషాను గురించిన ఇతర విషయాలు, అతడి బలప్రభావాలు, అతడు చేసినదంతా ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 6 బయెషా కన్నుమూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరాడు. తిర్సాలో అతణ్ణి సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఏలా రాజయ్యాడు. 7 యరొబాం వంశం వారిలాగే బయెషా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. అతడు చేసినది యెహోవాకు కోపం రేపింది. అంతేగాక, అతడు యరొబాం వంశాన్ని నాశనం చేశాడు. అందుకనే బయెషాకూ అతడి వంశానికీ వ్యతిరేకంగా యెహోవా తన వాక్కు హనానీ కొడుకు యెహూ ద్వారా వినిపించాడు.
8 యూదా రాజైన ఆసా పరిపాలనలో ఇరవై ఆరో ఏట బయెషా కొడుకు ఏలా ఇస్రాయేల్‌కు రాజయ్యాడు. తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు. 9 ఏలా యొక్క యుద్ధ రథాలు సగంమీద అధికారీ అతడి సేవకుడూ అయిన జిమ్రీ అతడిమీద కుట్ర పన్నాడు. ఏలా తిర్సాలో అతడి గృహనిర్వాహకుడైన ఆర్సా ఇంట్లో బాగా త్రాగి మత్తుగా ఉన్నాడు. 10 ఆ సమయంలో జిమ్రీ లోపలికి వచ్చి ఏలాను కూల్చి చంపాడు, అతడి స్థానంలో రాజయ్యాడు. యూదా రాజైన ఆసా పరిపాలనలో ఇరవై ఏడో ఏట ఇలా జరిగింది. 11 జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ హతమార్చాడు. అతడి బంధువులలో మిత్రులలో మగవారందరినీ చంపాడు. వాళ్ళలో ఎవ్వరినీ వదలిపెట్టలేదు. 12 బయెషా, అతడి కొడుకు ఏలా అనేక పాపాలు చేసేవారు. ఇస్రాయేల్ ప్రజలచేత అనేక పాపాలు చేయించేవారు. ఆ పాపాలన్నిటివల్లా వారు పెట్టుకొన్న విగ్రహాలవల్లా ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు కోపం రేపారు.; 13 అందుచేత జిమ్రీ బయెషా యొక్క వంశాన్ని సమూలనాశనం చేశాడు. ఈవిధంగా యెహూ ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది. 14 ఏలాను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉంది.
15 యూదా రాజైన ఆసా పరిపాలనలో ఇరవై ఏడో ఏట జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అంతలో ఇస్రాయేల్ వారు ఫిలిష్తీయవాళ్ళకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం చుట్టుముట్టి ఉన్నారు. 16 జిమ్రీ కుట్ర పన్ని రాజును చంపాడనే కబురు అక్కడి శిబిరంలో వినవచ్చింది. ఆ రోజే ఆ శిబిరంలోనే ఇస్రాయేల్‌వారంతా ఏకీభవించి సైన్యాధిపతి అయిన ఒమ్రీని ఇస్రాయేల్‌కు రాజుగా చేశారు. 17 అప్పుడు ఒమ్రీ, ఇస్రాయేల్‌వారంతా గిబ్బెతోను విడిచివెళ్ళి తిర్సాను ముట్టడి వేశారు. 18 పట్టణం వారి వశం అయిందని జిమ్రీకి తెలిసింది గనుక వెంటనే అతడు రాజభవనంలోకి వెళ్ళి దానిలో ఉండగానే దానిని తగలబెట్టి చనిపోయాడు. 19 అతడు పాపాలు చేశాడు; యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు; యరొబాం జీవిత విధానాన్నీ యరొబాం చేసిన పాపాన్ని, ఇస్రాయేల్ ప్రజలచేత చేయించిన పాపాన్ని అనుసరించాడు. అందుచేతే అతడు అలా చనిపోయాడు. 20 జిమ్రీని గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
21 అప్పుడే ఇస్రాయేల్ రాజ్యంలో ప్రజలు రెండు పక్షాలయ్యారు. సగం మంది గీనతు కొడుకైన తిబ్నీని రాజుగా చేయాలని అతడి పక్షం వహించారు; మరో సగం మంది ఒమ్రీ పక్షం వహించారు. 22 ఒమ్రీ పక్షంవారు గీనతు కొడుకైన తిబ్నీ పక్షంవారిని జయించారు. తిబ్నీ మృతి చెందాడు, ఒమ్రీ రాజయ్యాడు. 23 యూదా రాజైన ఆసా పరిపాలనలో ముప్ఫయి ఒకటో ఏట ఒమ్రీ ఇస్రాయేల్‌కు రాజై పన్నెండేళ్ళు పరిపాలించాడు. ఆరేళ్ళు తిర్సాలో పరిపాలన చేశాడు. 24 అతడు షెమెరుకు డెబ్భై కిలోగ్రాముల వెండి ఇచ్చి షోమ్రోను కొండను కొన్నాడు. ఆ కొండమీద పట్టణం కట్టించాడు. మునుపు ఆ కొండ షెమెరుది గనుక అతడి పేరును బట్టి ఆ పట్టణానికి షోమ్రోన్ అని పేరు పెట్టాడు. 25 ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు, అతడి స్థానంలో ముందున్న వారందరికంటే దుర్మార్గుడు. 26 అతడు నెబాతు కొడుకైన యరొబాం జీవిత విధానాన్ని అనుసరించాడు. యరొబాం ఇస్రాయేల్‌ప్రజచేత చేయించిన పాపాన్ని – ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాకు వారి విగ్రహాలచేత కోపం రేపడం అనే ఆ పాపాన్ని – కూడా అనుసరించాడు. 27 ఒమ్రీని గురించిన ఇతర విషయాలు, అతడు చూపిన బలపరాక్రమాలు ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 28 ఒమ్రీ కన్నుమూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతణ్ణి షోమ్రోనులో సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు అహాబు రాజయ్యాడు. 29 యూదా రాజైన ఆసా పరిపాలనలో ముప్ఫయిఎనిమిదో ఏట ఒమ్రీ కొడుకు అహాబు ఇస్రాయేల్‌కు రాజయ్యాడు. ఒమ్రీ కొడుకు అహాబు షోమ్రోనులో ఉంటూ, ఇస్రాయేల్ ప్రజను ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 30 అతడి స్థానంలో ముందున్న వారందరికంటే ఒమ్రీ కొడుకు అహాబు యెహోవా దృష్టిలో ఎక్కువ చెడ్డగా ప్రవర్తించేవాడు. 31 నెబాతు కొడుకు యరొబాం చేసిన పాపాలను అతడూ అనుసరించాడు – అలాంటి ప్రవర్తన అతడికి స్వల్ప విషయమనిపించింది. దానికి పైగా అహాబు సీదోను వాళ్ళ రాజైన ఎత్‌బేల్ యొక్క కూతురు యెజెబెల్‌ను వివాహమాడి బయల్‌దేవుణ్ణి పూజిస్తూ సేవిస్తూ వచ్చాడు. 32  అతడు షోమ్రోనులో బయల్ దేవాలయాన్ని కట్టించి అందులో బయల్‌దేవుడికి బలిపీఠాన్ని నిర్మించాడు. 33 అహాబు అషేరాదేవి స్తంభాన్ని కూడా నిలిపాడు. మునుపు ఉన్న ఇస్రాయేల్ రాజులందరికంటే అహాబు ఎక్కువగా దుర్మార్గుడై ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు కోపం రేపేవాడు.
34  అతడి కాలంలో బేతేల్ పురవాసి హీయెల్ యెరికో మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు వాడి పెద్దకొడుకు అబీరాం చచ్చాడు. దానికి గుమ్మాలు పెట్టినప్పుడు వాడి కనిష్ఠుడు సెగూబ్ చచ్చాడు. ఈ విధంగా నూను కొడుకు యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.