15
1 నెబాతు కొడుకు యరొబాంరాజు పరిపాలిస్తున్న పద్ధెనిమిదో సంవత్సరంలో అబీయా యూదాకు రాజయ్యాడు. 2 అతడు జెరుసలంలో మూడేళ్ళు✽ పరిపాలించాడు. అబీషాలోం కూతురు మయకా అతడి తల్లి. 3 మునుపు తన తండ్రి✽ చేసిన పాపాలన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడు దావీదువలె గాక, తన దేవుడు యెహోవాను యథార్థ హృదయంతో అనుసరించేవాడు కాడు✽. 4 హిత్తీవాడైన✽ ఊరియా విషయంలో తప్ప దావీదు బ్రతికిన కాలమంతా యెహోవా దృష్టిలో న్యాయంతో ప్రవర్తించాడు. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేనికీ అవిధేయుడు కాలేదు. 5 గనుక దావీదు యొక్క దేవుడైన యెహోవా అతడికోసం అతడి తరువాత అతడి సంతానాన్ని సింహాసనం ఎక్కించాడు. జెరుసలం భద్రం చేశాడు. అలా జెరుసలంలో దావీదు కోసం దీపం✽ ఉంచాడు. 6 ✝కానీ రెహబాం బ్రతికినంత కాలం అతడికీ యరొబాంకూ మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంది.7 అబీయాను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో✽ వ్రాసి ఉన్నాయి. అబీయాకూ యరొబాంకూ కూడా యుద్ధం జరిగింది. 8 అబీయా కన్ను మూసి✽ అతడి పూర్వీకుల దగ్గర చేరాడు. దావీదు నగరంలో అతణ్ణి సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఆసా రాజయ్యాడు. 9 ఇశ్రాయేల్ రాజైన యరొబాం పరిపాలిస్తున్న ఇరవైయో సంవత్సరంలో ఆసా యూదా మీద రాజయ్యాడు. 10 అతడు జెరుసలంలో నలభై ఒక్క సంవత్సరం పరిపాలించాడు. అబీషాలోం కూతురు మయకా అతడి అవ్వ. 11 అతడి పూర్వీకుడు దావీదువలె ఆసా✽ యెహోవా దృష్టిలో న్యాయంతో ప్రవర్తించేవాడు. 12 ✽గుళ్ళకు అనుబంధంగా పురుష సంపర్కుల గుంపులను దేశంనుంచి వెళ్ళగొట్టాడు, అతడి పూర్వీకులు చేసిన విగ్రహాలను తొలగించాడు. 13 అతడి అవ్వ మయకా అషేరా దేవికి ఒక అసహ్యమైన స్తంభాన్ని✽ చేయించింది. అందుచేత ఆమె రాజమాతగా ఉండకుండా చేశాడు. ఆసా ఆమె స్తంభాన్ని నరికివేసి కిద్రోను లోయలో తగలబెట్టాడు. 14 ఎత్తయిన పూజా స్థలాలను మాత్రం ఉండనిచ్చాడు. అయినా ఆసా బ్రతికినన్నాళ్ళూ యెహోవాను యథార్థ హృదయంతోనే అనుసరించాడు. 15 అతడి తండ్రీ తానూ ప్రతిష్ఠించిన బంగారం, వెండి పాత్రలు యెహోవా ఆలయానికి తెచ్చాడు.
16 ✽ఆసాకూ ఇస్రాయేల్‌రాజు బయెషాకూ వారు బ్రతికినంత కాలం యుద్ధం జరుగుతూ ఉంది. 17 యూదా రాజైన ఆసా దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకుండా, అతడి దగ్గర నుంచి ఎవ్వరూ రాకుండా చేయడానికి ఇస్రాయేల్ రాజైన బయెషా యూదాపై దండెత్తి వచ్చి రమా✽ పట్టణం మళ్ళీ కట్టించాడు. 18 ఆ కాలంలో సిరియాకు బెన్‌హదదు రాజుగా ఉండి దమస్కులో నివసించేవాడు. అతడు టబ్రిమ్మోన్ కొడుకు, హెజ్యోన్ మనుమడు. ఆసారాజు, యెహోవా ఆలయంలోను తన భవనంలోను ఉన్న ఖజానాలలో మిగిలిన వెండి బంగారాలన్నీ తీసి తన సేవకుల చేతికప్పగించి బెన్‌హదదు దగ్గరికి పంపించి ఇలా మనవి చేశాడు:
19 “నా తండ్రి మీ తండ్రి ఒద్దికగా ఉన్నారు. మనం కూడా ఒద్దికగా ఉందాం. మీకు వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇస్రాయేల్ రాజు బయెషా నా దేశంనుంచి వెళ్ళిపోయేలా అతడితో మీకు ఉన్న ఒడంబడిక✽ను తెగతెంపులు చేయండి.”
20 ఆసారాజు చేసిన మనవి బెన్‌హదదు అంగీకరించాడు. తన సేనాధిపతులను ఇస్రాయేల్ పట్టణాల పైకి పంపాడు. వాళ్ళు వచ్చి ఈయోను, దాను, ఆబేల్‌బేత్‌మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా పట్టుకొన్నారు. 21 బయెషా ఈ వార్త విని రమాను కట్టించడం ఆపాడు. తిర్సా✽కు వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. 22 అప్పుడు ఆసారాజు ఎవరినీ మినహాయించకుండా యూదావారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి రమాను కట్టించడంలో బయెషా ఉపయోగించిన రాళ్ళనూ కలపనూ ఎత్తుకుపోయారు. వాటిని ఆసారాజు బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా మళ్ళీ కట్టించడానికి ఉపయోగించాడు.
23 ఆసాను గురించిన మిగతా విషయాలు, అతడి బలప్రభావాలు, అతడు చేసినదంతా, అతడు కట్టించిన పట్టణాలు యూదా రాజుల చరిత్ర గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయి. ముసలి ప్రాయంలో అతడికి పాదాల్లో జబ్బు పుట్టింది✽. 24 ఆసా కన్నుమూసి✽ తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతడి పూర్వీకుడైన దావీదు నగరంలో అతడి పూర్వీకుల దగ్గర అతణ్ణి సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.
25 యూదా రాజైన ఆసా పరిపాలనలో రెండో ఏట యరొబాం కొడుకు నాదాబు ఇస్రాయేల్‌కు రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇస్రాయేల్‌పై పరిపాలించాడు. 26 ✝అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. అతడి తండ్రి జీవిత విధానమే అనుసరించేవాడు. అతడి తండ్రి ఇస్రాయేల్ ప్రజలను పట్టించిన తప్పుదారి కూడా అనుసరించేవాడు. 27 ✝నాదాబు మీద ఇశ్శాకారు గోత్రికుడూ అహీయా కొడుకూ అయిన బయెషా కుట్ర పన్నాడు. నాదాబు, ఇస్రాయేల్‌వారంతా ఫిలిష్తీయవాళ్ళకు చెందిన గిబ్బెతోను ముట్టడి వేస్తూ ఉంటే బయెషా అక్కడే నాదాబును హతమార్చాడు. 28 యూదా రాజైన ఆసా పరిపాలనలో మూడో ఏట బయెషా నాదాబును చంపి అతడి స్థానంలో రాజయ్యాడు. 29 బయెషా రాజయిన వెంటనే యరొబాం వారందరినీ కూల్చాడు. యరొబాం వంశంలో ప్రాణంతో ఉన్న ఏ ఒక్కణ్ణి కూడా వదలిపెట్టలేదు. ఆ వంశాన్ని నిర్మూలం చేశాడు. ఆ విధంగా యెహోవా తన సేవకుడూ షిలోహు గ్రామస్తుడూ అయిన అహీయాచేత మాట్లాడించిన మాట నెరవేరింది. 30 ✝యరొబాం పాపాలు చేశాడు, ఇస్రాయేల్ ప్రజల చేత పాపాలు చేయించాడు, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు కోపం రేపాడు. అందుకే ఇలా జరిగింది. 31 నాదాబును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 32 ఆసాకూ ఇస్రాయేల్ రాజు బయెషాకూ వారి బ్రతికినంత కాలం యుద్ధం జరుగుతూ ఉంది.
33 యూదా రాజైన ఆసా పరిపాలనలో మూడో ఏట అహీయా కొడుకు బయెషా ఇస్రాయేల్ రాజ్యమంతటికీ రాజయ్యాడు. తిర్సాలో ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు. 34 అతడు కూడా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు, యరొబాం జీవిత విధానాన్నీ అతడు ఇస్రాయేల్ ప్రజలను పట్టించిన తప్పుదారినీ అనుసరించాడు.