14
1  ఆ కాలంలో యరొబాం కొడుకు అబీయాకు జబ్బు చేసింది. 2 యరొబాం తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు యరొబాం భార్యవని ఎవ్వరూ గుర్తు పట్టకుండా మారువేషం వేసుకొని షిలోహుకు వెళ్ళు. అక్కడ అహీయాప్రవక్త ఉన్నాడు. నేను ఈ ప్రజమీద రాజునవుతానని నాకు చెప్పినది ఆయనే. 3 పది రొట్టెలూ కొన్ని అప్పాలూ జాడీ నిండా తేనె చేత పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏం జరుగుతుందో ఆయన నీకు చెప్తాడు.”
4 యరొబాం భార్య అలా చేసింది. ఆమె బయలుదేరి షిలోహుకు వెళ్ళి అహీయా ఇంటికి చేరింది. అహీయాకు చూపు లేదు. ముసలితనం వల్ల అతనికి మందదృష్టి కలిగింది.
5 అంతకుముందు యెహోవా అహీయాతో “యరొబాం కొడుక్కు జబ్బు చేసింది. ఆమె కొడుకును గురించి నిన్ను సంప్రదించడానికి యరొబాం భార్య రానై ఉంది. నేను చెప్పేది నీవు ఆమెతో చెప్పాలి. ఆమె వచ్చి ఇంకొక స్త్రీలాగా నటిస్తుంది” అన్నాడు.
6 ఆమె గుమ్మందగ్గరికి వచ్చినప్పుడు అహీయాకు ఆమె నడుస్తున్న చప్పుడు వినిపించింది. అతడు ఇలా అన్నాడు: “యరొబాం భార్యా! లోపలికి రా! నీవు ఇంకొక స్త్రీ లాగా నటిస్తున్నావెందుకని? కఠినమైన మాటలు నీకు చెప్పాలని నాకు ఆజ్ఞ వచ్చింది. 7 నీవు వెళ్ళి యరొబాంతో ఇలా చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను నిన్ను ప్రజలోనుంచి హెచ్చించాను. నా ఇస్రాయేల్ ప్రజమీద నాయకుడుగా నియమించాను. 8 దావీదు రాజవంశంలో నుంచి ఈ రాజ్యం తీసి నీకిచ్చాను. అయితే నీవు నా సేవకుడైన దావీదులాగా ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలు శిరసావహించాడు. మనస్పూర్తిగా నన్ను అనుసరించి నడిచాడు, నా దృష్టిలో ఏవేవి మంచివో అవే జరిగించాడు. 9 నీవైతే నీ ముందు బ్రతికినవారందరికంటే ఎక్కువ దుర్మార్గం జరిగించావు. నీకోసం ఇతర దేవుళ్ళను చేయించుకొన్నావు. విగ్రహాలను పోత పోయించుకొన్నావు; అలా నాకు కోపం రేపావు; నన్ను పూర్తిగా విసర్జించావు. 10 గనుక నేను యరొబాం వంశంమీదికి కీడు రప్పిస్తున్నాను. ఇస్రాయేల్ దేశమంతట్లో యరొబాం వంశానికి చెందే మగవారందరినీ – అల్పులను గానీ ఘనులను గానీ – నిర్మూలం చేస్తాను. చెత్తను పూర్తిగా అవతలికి ఊడ్చినట్టు నేను యరొబాం వంశంలో మిగిలిన వారందరినీ తుడిచివేస్తాను. 11 యరొబాం కుటుంబంవారిలో పట్టణాలలో చచ్చినవారిని కుక్కలు తింటాయి. పట్టణాల బయట చచ్చినవారిని ఎగిరే పక్షులు తింటాయి. ఇది యెహోవా వాక్కు.
12 “ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ అబ్బాయి చనిపోతాడు. 13 ఇస్రాయేల్ ప్రజలంతా అతడికోసం మొత్తుకొంటారు. అతణ్ణి సమాధి చేస్తారు. యరొబాం వంశంలో మంచి అనేది ఈ అబ్బాయిలోనే ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు కనబడింది, గనుక యరొబాం వంశంలో ఆ అబ్బాయి ఒక్కణ్ణే సమాధి చేయడం జరుగుతుంది.
14 “తరువాత యెహోవా తనకోసం ఇస్రాయేల్ ప్రజమీద రాజును నియమిస్తాడు. అతడు యరొబాం వంశాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇది త్వరలోనే జరుగుతుంది. 15 ఇస్రాయేల్ ప్రజలు ఆషేరాదేవి స్తంభాలు చేసి యెహోవాకు కోపం రేపారు, గనుక ప్రవాహం జమ్మిరెల్లును అల్లాడించినట్టు యెహోవా వాళ్ళను అల్లాడిస్తాడు. ఆయన వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ మంచి దేశం నుంచి వాళ్ళను తొలగిస్తాడు. యూఫ్రటీసు నది అవతలికి చెదరగొట్టివేస్తాడు. 16 యరొబాం చేసిన పాపాల కారణంగా, అతడు ఇస్రాయేల్‌ప్రజలచేత చేయించిన పాపాల కారణంగా యెహోవా వాళ్ళను శత్రువులకు అప్పగిస్తాడు.”
17 అప్పుడు యరొబాం భార్య బయలుదేరి తిర్సాకు వెళ్ళిపోయింది. ఆమె వాకిట్లో అడుగుపెట్టడంతోనే అబ్బాయి చనిపోయాడు. 18 యెహోవా తన సేవకుడైన అహీయా ప్రవక్తచేత మాట్లాడించినట్టు అతణ్ణి సమాధి చేసి ఇస్రాయేల్ ప్రజలంతా అతడికోసం మొత్తుకొన్నారు.
19 యరొబాంను గురించిన ఇతర విషయాలు, అతడు ఎలా యుద్ధం చేసినది, పరిపాలన చేసినది ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 20 యరొబాం ఇరవై రెండు ఏళ్ళు పరిపాలన చేశాడు. అప్పుడతడు కన్నుమూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతడి కొడుకు నాదాబు అతడి స్థానంలో రాజయ్యాడు.
21 యూదా ప్రదేశాన్ని సొలొమోను కొడుకు రెహబాం పరిపాలిస్తున్నాడు. రెహబాం రాజయినప్పుడు అతడి వయస్సు నలభై ఒకటి. అతడు జెరుసలంలో పదిహేడేళ్ళు పరిపాలించాడు. ఆ నగరం తన పేరు ఉంచుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాలు నివసించిన స్థలాలన్నిట్లోనుంచి యెహోవా ఎన్నుకొన్న నగరం. రెహబాం తల్లి పేరు నయామా. ఆమె అమ్మోను దేశస్థురాలు. 22 యూదావారు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు. వాళ్ళు చేసిన పాపాల చేత వాళ్ళ పూర్వీకుల కంటే అధికంగా యెహోవాకు రోషం రేపారు. 23 వాళ్ళు కూడా తమకోసం ప్రతి ఎత్తయిన కొండమీదా ప్రతి పచ్చని చెట్టుక్రిందా ఎత్తయిన పూజా స్థలాలు కట్టుకొన్నారు, విగ్రహాలూ ఆషేరాదేవి స్తంభాలూ నిలిపారు. 24 అంతేగాక, యూదా దేశంలో గుళ్ళకు అనుబంధంగా పురుషసంపర్కుల గుంపులు కూడా ఉన్నాయి. ఇస్రాయేల్ ప్రజల ఎదుట నుంచి యెహోవా వెళ్ళగొట్టిన జనాలు చేసిన నీచ కార్యాలు యూదావారు చేశారు.
25 రెహబాంరాజు పరిపాలిస్తున్న అయిదో సంవత్సరంలో ఈజిప్ట్ రాజైన షీషక్ వచ్చి జెరుసలం పైబడ్డాడు. 26 అతడు యెహోవా ఆలయంలోను రాజభవనంలోను ఉన్న విలువైన వస్తువులన్నిటినీ దోచుకొన్నాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్ళన్నీ కూడా తీసుకుపోయాడు. 27 రెహబాంరాజు ఆ డాళ్ళకు బదులు కంచు డాళ్ళను చేయించాడు. వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకుడికి అప్పచెప్పాడు. 28 రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్ళు మోసుకుపోయారు. తరువాత వాటిని తమ గదిలో ఉంచారు.
29 రెహబాంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 30 రెహబాంకూ యరొబాంకూ మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంది. 31 రెహబాం కన్నుమూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. దావీదు నగరంలో అతణ్ణి తన పూర్వీకుల దగ్గర సమాధి చేశారు. అతడి తల్లి పేరు నయామా. ఆమె అమ్మోను దేశస్థురాలు. అతడి స్థానంలో అతడి కొడుకు అబీయా రాజయ్యాడు.