12
1 రెహబాంను రాజుగా చేయడానికి ఇస్రాయేల్‌ ప్రజలంతా షెకెంలో సమకూడారు. రెహబాం అక్కడికి వెళ్ళాడు. 2 నెబాతు కొడుకైన యరొబాం సొలొమోను దగ్గరనుంచి ఈజిప్ట్‌కు పారిపోయి ఈజిప్ట్‌లో ఇంకా నివసిస్తున్నాడు. రెహబాం రాజయిన సంగతి విన్నప్పుడు అతడు ఈజిప్ట్‌లో ఉండిపోయాడు. 3 అయితే వారు అతణ్ణి పిలువనంపించారు. అతడూ ఇస్రాయేల్ సమాజంవారంతా రెహబాం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:
4  “మీ తండ్రి మా మీద క్రూరమైన కాడి మోపాడు. మీ తండ్రి పెట్టిన కఠినమైన సేవను, ఆయన మా మీద ఉంచిన క్రూరమైన కాడిని తేలిక చేయండి. అప్పుడు మేము మీకు సేవ చేస్తాం.”
5 రెహబాం “మీరు వెళ్ళి మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అని వారితో చెప్పాడు. ప్రజలు వెళ్ళిపోయారు.
6 తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతడి పరివారంలో ఉన్న పెద్దలను రెహబాంరాజు సంప్రదించాడు. “ఈ ప్రజలకు ఏం జవాబు ఇవ్వాలో మీ సలహా చెప్పండి” అని అడిగాడు.
7 అందుకు వారు అన్నారు “ఈ వేళ మీరు ఈ ప్రజలకు సేవ చేయగోరితే, సేవకుడుగా ఉండి వారికి మృదువుగా జవాబు చెప్పండి. అలా చేస్తే వారు ఎప్పటికీ మీకు సేవకులుగా ఉంటారు.”
8 కానీ పెద్దలు చెప్పిన ఆలోచనకు రెహబాం పెడచెవి పెట్టాడు, తనతోపాటు పెరిగి తన పరివారంలో ఉన్న యువకులను పిలిచి సమాలోచన జరిపాడు – 9 “ఈ ప్రజ వారి మీద నా తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండని నాకు మనవి చేస్తున్నారు. వాళ్ళకు ఏమని జవాబు చెప్పాలి? మీ సలహా ఏమిటో చెప్పండి” అని వారితో చెప్పాడు.
10 అతడితో పాటు పెరిగిన ఆ యువకులు చెప్పిన సలహా ఇది: “ఈ ప్రజ ‘మీ తండ్రి మా మీద క్రూరమైన కాడి ఉంచాడు. మీరు దాన్ని తేలిక చేయండి’ అన్నారుగా. నీవు వారితో ఇలా చెప్పాలి – నా తండ్రి నడుంకంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉంటుంది. 11 నా తండ్రి మీమీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా, నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”
12 రెహబాంరాజు “మూడో రోజు నాదగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పినట్టు యరొబాం, ప్రజలంతా మూడో రోజున అతడి దగ్గరికి వచ్చారు. 13 పెద్దలు చెప్పిన సలహాను పెడచెవి బెట్టి రాజు ప్రజలకు కటువుగా జవాబిచ్చాడు. 14 ఆ యువకులు చెప్పిన సలహా ప్రకారం ఇలా అన్నాడు:
“నా తండ్రి మీ మీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా, నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”
15 రాజు ప్రజల మాట వినిపించుకోలేదు. యెహోవా చేత అలా జరిగింది. యెహోవా షిలోహు గ్రామస్థుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకైన యరొబాంతో పలికించిన మాట అలా నెరవేర్చాడు. 16 రాజు వారి విన్నపం తిరస్కరించడం చూచి ఇస్రాయేల్‌వారంతా రాజుకు ఈ జవాబిచ్చారు:
“దావీదు వంశం తో మాకేం సంబంధం! యెష్షయి కొడుకుతో ఇంకా భాగస్థులం కాము. ఇస్రాయేల్ ప్రజలారా, మీ ఇండ్లకు వెళ్ళిపోండి! దావీదు వంశమా, నీ సంగతి నీవే చూసుకో.”
అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వారి ఇండ్లకు వెళ్ళారు. 17 కానీ యూదా ప్రదేశంలో ఉన్న పట్టణాలలో నివసించే ఇస్రాయేల్ వారి మీద రెహబాం పరిపాలన చేశాడు.
18 తరువాత రెహబాంరాజు వెట్టిపనివాళ్ళమీద అధికారి అయిన అదోరాంను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి పంపాడు. వాళ్ళంతా రాళ్ళు రువ్వి అదోరాంను చంపారు. అయితే రెహబాంరాజు తొందరగా రథమెక్కి జెరుసలం పారిపోయాడు. 19 అప్పటి నుంచీ ఈ నాటికీ దావీదు వంశం మీద ఇస్రాయేల్ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. 20 అంతేగాక, యరొబాం మళ్ళీ వచ్చాడనీ ఇస్రాయేల్ ప్రజలంతా విన్నప్పుడు వారు కబురంపి అతణ్ణి వారి సమావేశానికి పిలిపించారు. అక్కడ వారు ఇస్రాయేల్ ప్రజలందరి మీదా అతణ్ణి రాజుగా చేశారు. యూదా గోత్రంవారు మాత్రమే దావీదు రాజవంశాన్ని అనుసరించారు.
21 రెహబాం జెరుసలం చేరుకొన్నప్పుడు యూదా గోత్రికులలో, బెన్యామీను గోత్రికులలో ఉత్తములైన సైనికులనందరినీ పోగు చేశాడు. వారు లక్ష ఎనభై వేలమంది. వారు ఇస్రాయేల్ రాజవంశంతో యుద్ధం చేసి తనకు రాజ్యం సంపాదించాలని సొలొమోను కొడుకు రెహబాం ఉద్దేశించాడు. 22 కానీ దేవుని మనిషి షెమయాకు దేవుని నుంచి ఈ వాక్కు వచ్చింది:
23 “యూదావారికి రాజుగా ఉన్న సొలొమోను కొడుకు రెహబాంకు, యూదా గోత్రికులందరికీ, బెన్యామీను గోత్రంవారికి, మిగతా వారికి ఇలా చెప్పు: 24 యెహోవా ఈ విధంగా చెప్తున్నాడు – మీరు వెళ్ళి మీ బంధువులైన ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయకూడదు. జరిగినదానిని నేనే జరిగించాను గనుక మీరంతా మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి.” వారు యెహోవా మాట విని దాని ప్రకారం వారి ఇండ్లకు తిరిగి వెళ్ళారు.
25 యరొబాం ఎఫ్రాయిం కొండ ప్రదేశంలో షెకెం మళ్ళీ కట్టించుకొని అక్కడ కాపురం చేశాడు. అక్కడ నుంచి వెళ్ళి పెనూయేల్ కట్టించుకొన్నాడు.
26 యరొబాం ఇలా అనుకొన్నాడు: “అంతా ఇలా ఉండగా ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది. 27 ఈ ప్రజలు జెరుసలంలో ఉన్న యెహోవా ఆలయంలో బలులు అర్పించడానికి వెళ్ళిపోతే వారి యజమానీ యూదారాజూ అయిన రెహబాం వైపు వారి హృదయం మళ్ళీ తిరుగుతుంది. వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాం పక్షం మళ్ళీ చేరుతారు.”
28  యరొబాంరాజు ఆలోచన చేసి, రెండు బంగారు దూడలు చేయించాడు. అప్పుడు ప్రజలతో, “జెరుసలం వెళ్ళడం మీకు చాలా కష్టం. చూడండి, ఇస్రాయేల్ ప్రజలారా, మీ దేవుళ్ళు! ఈజిప్ట్ దేశం నుంచి మిమ్మల్ని తీసుకువచ్చినవి ఇవే!” అన్నాడు.
29 ఆ దూడలలో ఒకదానిని బేతేల్‌లో ఇంకొకదానిని దానులో ఉంచాడు. 30 రాజు చేసినది దోషానికి కారణమైంది. దానులో ఉన్న దూడను పూజించడానికి ప్రజలు అంత దూరం కూడా వెళ్ళడం ఆరంభించారు. 31 యరొబాం ఎత్తయిన స్థలాల మీద గుళ్ళు కట్టించాడు, లేవీగోత్రికులు కాని సామాన్యులను యాజులుగా నియమించాడు. 32 సంవత్సరానికి ఎనిమిదో నెల పదిహేనో రోజున మహోత్సవం జరగాలని యరొబాం నిర్ణయించాడు. ఆ మహోత్సవం యూదా ప్రాంతంలో జరిగే మహోత్సవం లాంటిది. యరొబాం స్వయంగా బలిపీఠం సమీపించాడు. బేతేల్‌లో అలా చేసి తాను చేయించిన దూడలకు బలులు అర్పించాడు. తాను కట్టించిన ఎత్తయిన పూజా స్థలాలకు యాజులను బేతేల్‌లో ఉంచాడు. 33 తాను స్వయంగా నిర్ణయించిన నెల, ఆ ఎనిమిదో నెల పదిహేనో రోజున బేతేల్‌లో తాను కట్టించిన బలిపీఠం సమీపించాడు. ఇస్రాయేల్ ప్రజలకు ఆ మహోత్సవం నియమించి ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చాడు.