11
1 సొలొమోను చాలామంది విదేశీయ స్త్రీలను మోహించేవాడు. ఈజిప్టు చక్రవర్తి కూతురిని గాక మోయాబు, అమ్మోను, ఎదోం, సీదోను, హిత్తిజాతుల స్త్రీలను ఆశించి ఉంచుకొన్నాడు. 2 “వాళ్లూ మీరూ పరస్పర సంబంధాలు పెట్టుకోకూడదు. వాళ్ళు మీ హృదయాన్ని వాళ్ళ దేవుళ్ళవైపు తప్పక త్రిప్పుతార”ని యెహోవా ఇస్రాయేల్ ప్రజతో ఏ జాతుల జనాలను గురించి చెప్పాడో ఆ జనాలకే ఈ స్త్రీలు చెందినవారు. 3 సొలొమోనుకు ఏడు వందలమంది భార్యలు ఉన్నారు. వారందరూ రాజుల కూతుర్లు. ఆ భార్యలు గాక, అతడికి మూడు వందలమంది ఉంపుడుకత్తెలు కూడా ఉన్నారు. అతడి భార్యలు అతడి హృదయాన్ని అలా తిప్పారు. 4 సొలొమోను ముసలివాడయిన తరువాత ఇది జరిగింది. అతడి భార్యలు అతడి హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు మళ్ళించారు. అతడి తండ్రి దావీదులాగా గాక, సొలొమోను తన దేవుడైన యెహోవాను మనస్పూర్తిగా అనుసరించలేదు. 5 సీదోనువాళ్ళ దేవత అష్తారోతునూ అమ్మోనువాళ్ళ అసహ్యమైన దేవుడైన మిల్కోమ్నూ సొలొమోను అవలంబించాడు. 6 అలా సొలొమోను యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు, తన తండ్రి దావీదులాగా గాక, యెహోవాను సంపూర్ణంగా అనుసరించలేదు. 7 సొలొమోను మోయాబువాళ్ళ అసహ్యమైన కెమోష్‌దేవుడికీ అమ్మోనువాళ్ళ అసహ్యమైన మొలెక్‌దేవుడికీ జెరుసలంకు ఎదురుగా ఉన్న కొండమీద ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. 8 తన విదేశీయ భార్యలలో ఎవరైతే వారి వారి దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పిస్తూ ఉన్నారో వారందరి కోసం సొలొమోను ఎత్తయిన పూజా స్థలాలను కట్టించాడు.
9 ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా రెండు సార్లు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఇతర దేవుళ్ళను అనుసరించకూడదని అతడికి ఆజ్ఞ ఇచ్చాడు. 10 అయినా యెహోవా ఆజ్ఞాపించినట్టు సొలొమోను ప్రవర్తించలేదు. అతడి హృదయం యెహోవా నుంచి తిరిగింది. అందుకని యెహోవా సొలొమోనుమీద కోపగించాడు. 11 యెహోవా సొలొమోనుతో ఇలా అన్నాడు: “నీవు నా ఒడంబడికనూ నేను నీకు ఆజ్ఞాపించిన శాసనాలనూ ఆచరించలేదు గనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా లాగివేసి నీ సేవకులలో ఒకడికి ఇచ్చితీరుతాను. 12 అయితే నీ తండ్రి అయిన దావీదు కారణంగా నీ కాలంలో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలో ఉండకుండా తీసివేస్తాను. 13 అతడికి రాజ్యమంతా లేకుండా మాత్రం చెయ్యను. నా సేవకుడైన దావీదు కారణంగా, నేను ఎన్నుకొన్న జెరుసలం కారణంగా, నేను నీ కొడుకుకు ఒక్క గోత్రం ఇస్తాను.”
14 యెహోవా సొలొమోనుకు విరోధిగా ఎదోంవాడైన హదదును లేపాడు. అతడు ఎదోం రాజ వంశానికి చెందినవాడు. 15 గతంలో దావీదు ఎదోంమీద జరిగించిన యుద్ధకాలంలో సైన్యాధిపతి అయిన యోవాబు హతమైన వాళ్లను పాతిపెట్టించడానికి వెళ్ళినప్పుడు అతడు ఎదోంలోని మగవాళ్ళందరినీ కూలగొట్టాడు. 16 ఎదోంలో ఉన్న మగవాళ్ళంతా నిర్మూలం అయ్యేవరకు యోవాబు, ఇస్రాయేల్ వారందరితోపాటు అక్కడ ఉండిపోయాడు. 17 అప్పుడు హదదు పసివాడు. హదదు, ఎదోం వాళ్ళైన అతని తండ్రి సేవకులలో కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. 18 వాళ్ళు మిద్యాను ప్రాంతం నుంచి బయలుదేరి పారాను ఎడారి చేరుకొన్నారు. పారాను నుంచి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్ట్‌చక్రవర్తి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో హదదుకు ఇల్లు, బత్తెం, భూమి ఇచ్చాడు. 19 ఫరో హదదును చాలా దయ చూశాడు, అతడికి తన భార్య (తహపనేసురాణి) సోదరిని ఇచ్చి పెండ్లి చేశాడు. 20 తహపనేసు సోదరి హదదుకు కొడుకును కన్నది. కొడుకు పేరు గెనుబతు. గెనుబతును తహపనేసు ఫరో భవనంలో పెంచింది. అతడు ఫరో భవనంలోనే, ఫరో కొడుకులతోనే ఉన్నాడు. 21 దావీదు కన్నుమూసి తన పూర్వీకుల దగ్గర చేరాడనీ సేనాధిపతి అయిన యోవాబు కూడా చనిపోయాడనీ హదదుకు ఈజిప్ట్‌లో వినవచ్చింది. గనుక హదదు ఫరోతో “నా స్వదేశం వెళ్ళాలి. అనుమతించండి” అన్నాడు.
22 అందుకు ఫరో “నా దగ్గర నీకేం తక్కువైంది? ఎందుకు నీ దేశం వెళ్ళాలనుకుంటున్నావు?” అని అడిగాడు. హదదు “ఏమీ తక్కువ కాలేదు గాని మీరు నన్ను తప్పక వెళ్ళనివ్వాలి” అన్నాడు.
23 దేవుడు సొలొమోను మీదికి ఇంకో శత్రువును లేపాడు. అతడు ఎల్యాదా కొడుకైన రెజోను. అతడు హదద్‌ఎజరు అనే సోబా రాజుకు సేవకుడు. అతడు ఆ రాజు దగ్గర నుంచి పారిపోయాడు. 24 దావీదు సోబావాళ్ళను హతం చేసిన తరువాత రెజోను కొంతమందిని పోగు చేసుకొన్నాడు. ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వాళ్ళు దమస్కు చేరి అక్కడ ఉండిపోయారు. రెజోను దమస్కులో రాజయ్యాడు. 25 సొలొమోను కాలమంతా అతడు ఇస్రాయేల్ ప్రజకు శత్రువుగా ఉన్నాడు. అతడు సిరియాను పరిపాలించాడు, ఇస్రాయేల్ ప్రజను ద్వేషించాడు. హదదు చేసిన కీడు గాక, ఇతడు కూడా కీడు చేశాడు.
26 సొలొమోను సేవకులలో ఒకడు కూడా రాజు మీద తిరగబడ్డాడు. అతడు ఎఫ్రాయిం గోత్రికుడూ జెరేదా గ్రామస్థుడూ అయిన నెబాత్ కొడుకు. పేరు యరొబాం. తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు. 27 యరొబాం రాజుమీద తిరగబడ్డ చరిత్ర ఇది: సొలొమోను మిల్లోను మళ్ళీ కట్టించాడు. తన తండ్రి దావీదు నగర ప్రాకారంలో ఉన్న బీట బాగు చేయించాడు. 28 యరొబాం బలవంతుడు, ధైర్యశాలి. ఆ యువకుడు ఎలా కష్టపడి పని చేశాడో సొలొమోను గమనించాడు. యోసేపు గోత్రానికి చెందిన ప్రదేశంలో వెట్టిపని చేసేవాళ్ళమీద అతణ్ణి అధికారిగా నియమించాడు. 29  ఒకసారి యరొబాం జెరుసలం విడిచి వెళ్తున్నాడు. త్రోవలో షిలోహు గ్రామస్థుడైన అహీయాప్రవక్త అతణ్ణి కనుగొన్నాడు. అహీయా క్రొత్త పైవస్త్రం తొడుగుకొని ఉన్నాడు. వారిద్దరు తప్ప ఆ పొలంలో ఇంకెవరూ లేరు. 30 అహీయా తాను వేసుకొన్న ఆ క్రొత్త వస్త్రాన్ని తీసి పన్నెండు ముక్కలుగా చింపి యరొబాంతో ఇలా అన్నాడు:
31 “నీవు పది ముక్కలు తీసుకో. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఈ విధంగా చెప్పాడు – సొలొమోను చేతిలో నుంచి నేను రాజ్యం లాగివేసి నీకు పది గోత్రాలు ఇస్తాను. 32 వారు నన్ను విడిచిపెట్టారు. సీదోనువాళ్ళ అష్తారోతు దేవతనూ మోయాబువాళ్ళ కెమోష్‌దేవుణ్ణీ అమ్మోనువాళ్ళ మిల్కోమ్ దేవుణ్ణీ పూజించారు. వారు నా విధానాలను అనుసరించి నడవలేదు, నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు, నా శాసనాలూ నా న్యాయ నిర్ణయాలూ ఆచరణలో పెట్టలేదు. సొలొమోను తండ్రి అయిన దావీదు వాటిని ఆచరించాడు గాని సొలొమోను ఆచరించలేదు. 33 నా సేవకుడైన దావీదు కారణంగా, నేను ఎన్నుకొన్న జెరుసలం నగరం కారణంగా సొలొమోనుకు ఇస్రాయేల్ గోత్రాలలో నుంచి ఒకే గోత్రం ఉండనిస్తాను. 34 నేను ఎన్నుకొన్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలూ శాసనాలూ శిరసావహించాడు. అతడి కారణంగా నేను సొలొమోను చేతిలోని రాజ్యమంతా తీసివేయను, అతడు బ్రతికివున్నంత కాలం అతణ్ణి పరిపాలన చేయనిస్తాను. 35 అయితే అతని కొడుకు చేతిలో నుంచి రాజ్యం తీసివేసి నీకు పది గోత్రాలు ఇస్తాను. 36 నా పేరు అక్కడ ఉండేలా నేను ఎన్నుకొన్న జెరుసలం నగరంలో నా సేవకుడైన దావీదు కోసం నా సమక్షంలో దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అందుచేత నేను సొలొమోను కొడుకుకు ఒక గోత్రం ఇస్తాను. 37 నేను నిన్ను ఎన్నుకొంటాను. నీవు ఇస్రాయేల్ ప్రజపై రాజుగా ఉంటావు. నీవు కోరేదానంతటి మీద రాజ్యం చేస్తావు. 38 నేను ఆజ్ఞాపించేదంతా నీవు శిరసావహించి నా విధానాలను అనుసరించి నడిస్తే, నా దృష్టిలో సరిగా మెలగుతూ ఉంటే, నా సేవకుడైన దావీదు నా శాసనాలు, ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తూ ఉంటే, నేను నీతో ఉంటాను; దావీదుకు స్థిరమైన రాజవంశాన్ని కలిగించినట్టు నీకూ కలిగిస్తాను. నీకు ఇస్రాయేల్ రాజ్యం ఇస్తాను. 39 దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం కారణంగా అణచివేస్తాను. కానీ ఎల్లకాలం అలా చేయను.”
40 ఆ తరువాత సొలొమోను యరొబాంను చంపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ యరొబాం ఈజిప్ట్‌కు పారిపోయాడు. ఈజిప్ట్ రాజు షీషక్‌దగ్గర చేరి సొలొమోను చనిపోయేవరకు ఈజిప్ట్‌లోనే ఉండిపోయాడు.
41 సొలొమోనును గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా, అతడి జ్ఞానం, సొలొమోను చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 42 సొలొమోను జెరుసలంలో ఇస్రాయేల్ ప్రజలందరిమీదా నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 43 అప్పుడు సొలొమోను కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతణ్ణి అతని తండ్రి దావీదు నగరంలో సమాధి చేయడం జరిగింది. సొలొమోను స్థానంలో అతడి కొడుకు రెహబాం రాజయ్యాడు.