10
1 యెహోవా✽ పేరును గురించీ, సొలొమోను ప్రఖ్యాతి విషయం షేబ✽ దేశం రాణి✽ విన్నది. చిక్కు ప్రశ్నలతో ఆయనను పరీక్ష చేద్దామని ఆమె బయలుదేరి వచ్చింది. 2 ఆమె ఒంటెల మీద సుగంధద్రవ్యాలు, చాలా బంగారం, వెలగల రాళ్ళు ఎక్కించి గొప్ప పరివారంతో బయలుదేరి జెరుసలంకు చేరింది. ఆమె సొలొమోనుదగ్గరికి వచ్చి తన మనసులో ఉన్నదంతా విడమరచి చెప్పింది. 3 ✝ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను జవాబు చెప్పాడు. వాటిలో అతడు భావం చెప్పలేని సంగతి ఏదీ లేదు. 4 సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని షేబ రాణి గుర్తించింది; అతడు కట్టించిన భవనాన్ని చూచింది; 5 బల్లదగ్గర వారు తినే భోజన పదార్థాలనూ అక్కడ కూర్చుని ఉన్న అతడి పరివారాన్నీ నిలబడి ఉన్న అతడి పరిచారకులనూ వారి వస్త్రాలనూ పాత్రలు అందించేవారినీ కూడా కళ్ళారా చూచింది. యెహోవా ఆలయంలో అతడు అర్పించిన హోమబలులను కూడా చూచింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతంత కాదు.6 గనుక ఆమె రాజుతో ఇలా అంది: “మీ గురించీ మీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న కబురు నిజమే! 7 అయినా నేను వచ్చి కండ్లారా చూచేవరకు నేను అది నమ్మలేకపోయాను. నిజంగా ఉన్నదానిలో సగమైనా నాకు వినిపించలేదు. మీ జ్ఞానం, మీ శ్రేయస్సు నేను విన్న దానికంటే ఎంతో మించి ఉన్నాయి. 8 మీ మనుషులు ఎంత ధన్యజీవులు! మీ సముఖంలో ఎప్పుడూ ఉండి మీ జ్ఞానవాక్కులు వినే మీ పరివారం ఎంత ధన్యం! 9 మీ దేవుడు యెహోవా మీ గురించి సంతోషించి ఇస్రాయేల్ రాజ్య సింహాసనం మిమ్మల్ని ఎక్కించినందుచేత ఆయనకు స్తుతులు✽ కలుగుతాయి గాక! యెహోవా ఇస్రాయేల్ ప్రజను శాశ్వతంగా ప్రేమించేవాడు, గనుక న్యాయం✽, ధర్మం జరిగించడానికి మిమ్మల్ని రాజుగా చేశాడు.”
10 ✝ఆమె రాజుకు నాలుగు వేల కిలోగ్రాముల బంగారం, చాలా సుగంధ ద్రవ్యాలు, వెలగల రాళ్ళు ఇచ్చింది. షేబ రాణి ఇచ్చినంత సుగంధ ద్రవ్యాలు సొలొమోనురాజుకు మరెన్నడూ రాలేదు. 11 ✝ఓఫీరు నుంచి బంగారం తెచ్చిన హీరాం ఓడలు అక్కడనుంచి చాలా చందనం చెక్కలూ వెలగల రాళ్ళూ కూడా తెచ్చాయి. 12 ఆ చందనం దూలాలతో రాజు యెహోవా ఆలయానికీ తన భవనానికీ స్తంభాలు చేయించాడు. గాయకులకు వేరువేరు తంతి వాద్యాలు కూడా చేయించాడు. అలాంటి చందనం చెక్కలు ఇంకెన్నడూ దొరకలేదు. ఈనాటికీ అక్కడ కన్పించడం లేదు.
13 సొలొమోనురాజు షేబ రాణికి ఔదార్యంతో కానుకలిచ్చాడు. అంతేగాక, ఆమె ఏవి కోరుకొంటే అవన్నీ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతోపాటు స్వదేశానికి వెళ్ళిపోయింది.
14 ✽సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు ఇరవై మూడు వేల కిలోగ్రాములు. 15 అదే గాక వ్యాపారస్థుల వల్ల, వర్తకులవల్ల, అరబ్బు రాజులవల్ల, దేశాధికారుల వల్ల కూడా రాబడి ఉంది. 16 సాగగొట్టిన బంగారంతో సొలొమోనురాజు రెండు వందల డాళ్ళను చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు వందల తులాల బంగారం వినియోగించారు. 17 ✝కొట్టిన బంగారముతో రాజు ఇంకా మూడు వందల చిన్న డాళ్ళు చేయించాడు. వాటిలో ఒక్కొక్క దానికి రెండు కిలోగ్రాముల బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన భవనంలో ఉంచాడు. 18 రాజు దంతంతో పెద్ద సింహాసనం కూడా చేయించాడు. దానికి మేలిమి బంగారం తొడుగు చేయించాడు. 19 సింహాసనానికి ఆరు మెట్లు ఉన్నాయి. సింహాసనం మీది భాగం వెనుకవైపు గుండ్రంగా ఉంది. సింహాసనానికి రెండు వైపులా ఊతలున్నాయి. ఊతలదగ్గర రెండు సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. 20 ఆ ఆరు మెట్ల మీద రెండు వైపులా పన్నెండు సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారు కాలేదు. 21 సొలొమోను రాజు పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి. లెబానోను వనం భవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను కాలంలో వారికి వెండి అంటే లెక్కే లేదు. 22 ✝హీరాం ఓడలు గాక తర్షీషు ఓడలు కూడా రాజుకు సముద్రంలో ఉన్నాయి. ఆ తర్షీషు ఓడలు మూడేండ్లకు ఒక సారి బంగారం, వెండి, దంతం, కోతులను, నెమళ్ళను తెస్తూ ఉండేవి. 23 ✽సొలొమోనురాజు సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే మించినవాడు. 24 ✽దేవుడు అతని మనసులో ఉంచిన అతని జ్ఞానవాక్కులు విందామని లోకమంతా సొలొమోను దర్శనం కావాలని కోరింది. 25 అతడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలూ బంగారు పాత్రలూ వస్త్రాలూ యుద్ధాయుధాలూ సుగంధద్రవ్యాలూ గుర్రాలనూ కంచరగాడిదలనూ తెచ్చారు. ఏటేటా ఇలా జరుగుతూ ఉంది.
26 ✽ సొలొమోను రథాలనూ రౌతులనూ ఏర్పాటు చేశాడు. అతడికి వెయ్యిన్ని నాలుగు వందల రథాలూ, పన్నెండు వేలమంది రౌతులు ఉన్నారు. వీటిలో కొన్నిటిని రథాలకోసం కట్టిన పట్టణాలలో ఉంచాడు. 27 కొన్నిటిని జెరుసలంలో తన దగ్గర ఉంచాడు. రాజు వ్యవహారాల వల్ల జెరుసలంలో వెండి రాళ్ళలాగా, దేవదారు మ్రానులు కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలాగా అతి విస్తారంగా ఉన్నాయి. 28 సొలొమోను గుర్రాలను ఈజిప్ట్‌నుంచీ కవే నుంచీ దిగుమతి చేసుకొనేవాడు. రాజు నియమించిన వర్తకులు ధరలిచ్చి వాటిని తెచ్చారు.
29 ✽ఈజిప్ట్ నుంచి రథం ఆరు వందల తులాల వెండి ప్రకారం, గుర్రం నూట యాభై తులాల వెండిప్రకారం దిగుమతి చేసుకొన్నారు. హిత్తిజాతివాళ్ళ రాజులందరికీ, సిరియా రాజులకు అమ్మడానికి కూడా అదే విధంగా దిగుమతి చేశారు.