9
1 సొలొమోను యెహోవా ఆలయాన్ని, రాజభవనాన్ని కట్టించదలచిన అన్నిటినీ కట్టించడం ముగించాడు. 2 అప్పుడు యెహోవా సొలొమోనుకు రెండో సారి ప్రత్యక్షం అయ్యాడు. అంతకుముందు యెహోవా అతడికి గిబియోనులో ప్రత్యక్షమైన రీతిగా ప్రత్యక్షం అయ్యాడు. 3 యెహోవా అతడితో ఇలా అన్నాడు:
“నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన, విన్నపాలు విన్నాను. నీవు కట్టించిన ఈ ఆలయంలో నా పేరు ఎల్లకాలం ఉండాలని కోరావు. ఈ ఆలయాన్ని పవిత్రం చేశాను. నా చూపు, నా మనస్సు ఎల్లప్పుడూ దానిమీద ఉంటాయి. 4 నీ తండ్రి దావీదు యథార్థ హృదయుడై నిజాయితీపరుడై నా విధానాలను అనుసరించాడు. అతనిలాగే నీవు నడుస్తూ నా శాసనాలూ న్యాయనిర్ణయాలూ శిరసావహించి నేను నీకు ఆజ్ఞాపించినట్టెల్లా చేస్తూ ఉంటే, 5 నీ రాజవంశాన్ని ఇస్రాయేల్ రాజ్యంపై ఎల్లకాలం సుస్థిరం చేస్తాను. నీ తండ్రి అయిన దావీదుతో ‘నీ సంతతివారు ఇస్రాయేల్ రాజ్యపరిపాలన ఎప్పుడూ చేస్తారు’ అని చెప్పినట్టు నేను చేస్తాను. 6 కానీ నీవు గానీ నీ సంతానం గానీ నన్ను అనుసరించడం మానితే, నేను నీకిచ్చిన నా ఆజ్ఞలనూ శాసనాలనూ పాటించకపోతే, నాకు దూరమైపోయి వేరే దేవుళ్ళను కొలిచి పూజిస్తే, 7 నేను వారికిచ్చిన ఈ దేశంలో ఇస్రాయేల్ ప్రజను లేకుండా చేస్తాను; నా పేరుకు నేను పవిత్రం చేసిన ఈ ఆలయం నా ఎదుట ఉండకుండా చేస్తాను; ఇస్రాయేల్ ప్రజలు అన్ని దేశాలలో చెదరిపోయి సామెతగా పరిహాసాస్పదంగా ఉంటారు. 8 అలాంటప్పుడు ఈ దేవాలయం పాడుపడుతుంది. ఈ దారిన వచ్చేవారంతా నిర్ఘాంతపడి ఆశ్చర్యంతో ఈల వేసి ‘యెహోవా ఈ దేశాన్నీ ఈ ఆలయాన్నీ ఇలా చేయడం ఎందుకో!’ అంటారు. 9 వారికి చెప్పే జవాబు ఇలా ఉంటుంది: వారి పూర్వీకులను ఈజిప్టు దేశం నుంచి తీసుకువచ్చిన వారి దేవుడైన యెహోవాను వారు విడిచిపెట్టారు. వేరు దేవుళ్ళను అవలంబించి ఆ దేవుళ్ళను కొలిచి పూజించారు. అందుకనే యెహోవా ఈ విపత్తు అంతా వారి మీదికి రప్పించాడు.”
10 సొలొమోను యెహోవా ఆలయాన్ని రాజభవనాన్ని రెండింటినీ కట్టించడానికి ఇరవై ఏళ్ళు పట్టింది. 11 సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షం మ్రాను, బంగారం తూరు నగరం రాజు హీరాం సరఫరా చేశాడు. పని ముగిసినప్పుడు సొలొమోను గలలీ ప్రదేశంలో ఇరవై ఊళ్ళు హీరాంకు ఇచ్చాడు. 12 సొలొమోను తనకిచ్చిన ఆ ఊళ్ళు చూడడానికి హీరాం తూరు నుంచి వచ్చాడు. అవి అతడికి నచ్చలేదు, 13 గనుక అతడు “సోదరా! మీరు నాకిచ్చిన ఊళ్ళు ఇవేనా? ఇవి ఎలాంటి ఊళ్ళు!” అన్నాడు. అందుచేత ఈ నాటికీ వాటి ప్రదేశాన్ని “కాబూల్ ప్రదేశం” అంటారు. 14 అంతకుముందు రాజుకు హీరాం నాలుగు వేల కిలోగ్రాముల బంగారం పంపించాడు.
15 సొలొమోను యెహోవా ఆలయాన్నీ తన సొంత భవనాన్నీ మిల్లోనూ జెరుసలం ప్రాకారాన్నీ హాసోర్, మెగిద్దో, గెజెరు పట్టణాలనూ కట్టడానికి వెట్టిపని చేసేవారిని ఏర్పాటు చేశాడు. 16 అంతకుముందు ఈజిప్ట్ చక్రవర్తి ఫరో వచ్చి గెజెరును పట్టుకొని తగలబెట్టాడు, ఆ పట్టణంలో కాపురం ఉన్న కనాను జాతివాళ్ళను చంపాడు, సొలొమోను వివాహమాడిన ఫరో కూతురికి కట్నంగా ఇచ్చాడు. 17 సొలొమోను గెజెరును మళ్ళీ కట్టించాడు. క్రింది బేత్‌హోరోనునూ 18 బాలాతునూ దేశంలోని ఎడారిలో ఉన్న తద్మోరునూ 19 భోజనపదార్థాలకు ఏర్పాటైన పట్టణాలనూ తన రథాలకు, రౌతులకు ఏర్పాటైన పట్టణాలనూ జెరుసలంలోను లెబానోను ప్రదేశంలోను తాను పరిపాలించే రాజ్యమంతట్లోను తాను కట్టించదలచుకొన్న వాటినీ కూడా కట్టించాడు. 20 ఆ కాలంలో ఇస్రాయేల్‌ప్రజ కాని అమోరీ, హిత్తి, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవారు కొంతమంది దేశంలో మిగిలారు. 21 ఇస్రాయేల్‌ప్రజ పూర్తిగా నిర్మూలించలేని ఆ జాతుల వాళ్ళ సంతానమే వీళ్ళు – వీళ్ళందరినీ సొలొమోను వెట్టిపనులకు ఏర్పాటు చేశాడు. ఈ రోజుకూ వాళ్ళు అలాగే ఉన్నారు. 22  కానీ సొలొమోను ఇస్రాయేల్‌ప్రజలో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారు సైనికులూ అతడి సేవకులూ అధికారులూ సైన్యాధిపతులూ రథాధిపతులూ రౌతులూ. 23 సొలొమోను చేయించే పనిమీద అయిదు వందల యాభై మంది ముఖ్యమైన అధికారులు ఉన్నారు. వారు పనులు చేస్తున్న వారిపై అధికారం చేశారు.
24 ఫరో కూతురికోసం సొలొమోను భవనాన్ని కట్టించాడు. ఆమె దావీదు నగరం నుంచి ఆమె భవనానికి వచ్చిన తరువాత సొలొమోను మిల్లోను కట్టించాడు.
25 తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడు సార్లు సొలొమోను హోమబలులూ అర్పించేవాడు. వాటితోపాటు యెహోవా సముఖంలో ఉన్న వేదికమీద ధూపం వేసేవాడు కూడా.
ఆ విధంగా సొలొమోను దేవాలయాన్ని కట్టించడం ముగించాడు.
26 సొలొమోనురాజు ఎసోన్‌గెబెరులో ఓడలను కూడా కట్టించాడు. ఆ పట్టణం ఎదోం దేశంలో, ఎర్ర సముద్ర తీరాన, ఏలత్ దగ్గర ఉంది. 27 హీరాం తనకు సేవ చేసే తన ఓడలవారిని – సముద్రం అంటే బాగా తెలిసినవారిని – పంపించాడు. 28 వారు సొలొమోను సేవకులతోపాటు బయలుదేరి ఓఫీరు దేశం చేరి అక్కడనుంచి బంగారం సొలొమోనురాజు దగ్గరికి తీసుకువచ్చారు. ఆ బంగారం బరువు పధ్నాలుగు వేల అయిదు వందల కిలోగ్రాములు.