8
1 అప్పుడు సొలొమోనురాజు యెహోవా ఒడంబడికపెట్టెను✽ తెప్పించాలని కోరాడు. అది సీయోను అనే దావీదు నగరంలో ఉంది. గనుక ఇస్రాయేల్‌ప్రజల పెద్దలను – గోత్రాల నాయకులందరినీ ఇస్రాయేల్‌ప్రజల పూర్వీకుల వంశ ప్రధానులందరినీ సొలొమోను తనదగ్గరికి జెరుసలంకు పిలిపించాడు. 2 ఈ ఇస్రాయేల్ మనుషులంతా ఎతనీం అనే ఏడో నెలలో జరిగే పండుగ✽ సమయంలో సొలొమోనురాజు దగ్గర సమావేశం అయ్యారు. 3 ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా వచ్చాక యాజులు యెహోవా ఒడంబడికపెట్టెను ఎత్తుకొని 4 దానినీ సన్నిధిగుడారాన్నీ✽ గుడారంలో ఉన్న ఆ పవిత్ర సామాన్నంతా తీసుకువచ్చారు. యాజులూ లేవీగోత్రికులూ కలిసి వాటిని తీసుకువచ్చారు. 5 ✽అప్పుడు సొలొమోనురాజు, అతని దగ్గర సమావేశం అయిన ఆ ఇస్రాయేల్‌వారంతా ఒడంబడిక పెట్టె ముందు నిలబడ్డారు. లెక్కించ వీలులేనన్ని గొర్రెలనూ, ఎద్దులనూ బలి చేశారు. 6 ✝ఆ తరువాత యాజులు యెహోవా ఒడంబడికపెట్టెను దాని స్థలానికి తీసుకువచ్చారు. గర్భగృహం అనే అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద ఉంచారు. 7 కెరూబుల✽ రెక్కలు ఒడంబడిక పెట్టె ఉన్న స్థలం వరకు చాపి ఉన్నాయి. ఆ రెక్కలు పెట్టెకూ దాని మోత కర్రలకూ పైగా ఉండి వాటిని కప్పివేశాయి. 8 ఆ కర్రలు చాలా పొడవుగా ఉన్నాయి. గర్భగృహానికి ముందున్న పవిత్ర స్థలంలో నుంచి చూస్తే అవి కనబడ్డాయి గాని బయట నుంచి కనబడలేదు. ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి. 9 ఒడంబడికపెట్టెలో రెండు రాతి పలకలు✽ ఉన్నాయి గాని మరేమీ లేదు. ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ నుంచి వచ్చినప్పుడు హోరేబు✽ దగ్గర వారితో యెహోవా ఒడంబడిక చేసిన సమయంలో మోషే ఆ పలకలు ఆ పెట్టెలో ఉంచాడు.10 యాజులు పవిత్ర స్థలం నుంచి బయటికి వచ్చినప్పుడు యెహోవా మేఘంతో తన ఆలయం నిండిపోయింది.
11 అలా యెహోవా ఆలయం యెహోవా మహిమాప్రకాశం✽తో నిండుకోవడంవల్ల, ఆ మేఘం కారణంగా యాజులు అక్కడ నిలబడి సేవ జరిగించలేకపోయారు.
12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “యెహోవా చీకటియైన మేఘం✽లో నివాసం చేస్తానన్నాడు. 13 ప్రభూ, నీ కోసం నేను ఘనమైన ఆలయాన్ని కట్టించితీరాను, ఎల్లకాలం✽ నీవు నివాసం చేసే స్థలంగా దానిని నిర్మించాను.”
14 ✽ఇస్రాయేల్ సమాజమంతా అక్కడ నిలబడి ఉన్నారు. రాజు వారివైపుకు మళ్ళుకొని వారిని దీవించాడు. అప్పుడతడు ఇలా అన్నాడు: 15 “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! ఆయన నా తండ్రి దావీదుతో చెప్పిన మాట✽ నెరవేర్చాడు. 16 ✝ఆయన అన్నాడు, ‘ఈజిప్ట్ నుంచి నేను నా ప్రజను తీసుకువచ్చిన రోజునుంచి నా పేరుకు ఆలయాన్ని కట్టించుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాలకు చెందిన పట్టణాలలో దేనినీ ఎన్నుకోలేదు. కానీ నేను నా ఇస్రాయేల్‌ప్రజను పరిపాలించేందుకు దావీదును ఎన్నుకొన్నాను’. 17 ✝ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా పేరుకు ఆలయాన్ని కట్టించే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉంది. 18 అయితే నా తండ్రి దావీదుతో యెహోవా ఇలా అన్నాడు: ‘నా పేరుకు ఆలయాన్ని కట్టించే ఆశ నీ హృదయంలో ఉంది. నీ హృదయాభిలాష మంచిదే. 19 ✝అయినా ఆ ఆలయాన్ని నీవు కట్టించకూడదు. నీకు జన్మించే నీ కొడుకు నా పేరుకు ఆలయాన్ని కట్టిస్తాడు. 20 ✝యెహోవా తన మాటప్రకారం చేశాడు. యెహోవా చెప్పినట్టే నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇస్రాయేల్ రాజ్య సింహాసనం ఎక్కాను, ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా పేరుకు ఈ ఆలయాన్ని కట్టించాను. 21 యెహోవా మన పూర్వీకులను ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చినప్పుడు తాను వారితో చేసిన ఒడంబడిక✽ ఉన్న పెట్టెకోసం ఆలయంలో స్థలం నిర్మించాను.”
22 అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇస్రాయేల్ సమాజ సమక్షంలో నిలబడి✽, చేతులు ఆకాశాలవైపు ఎత్తి ఇలా పలికాడు: 23 “యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! పైన ఆకాశాలలో గానీ క్రింద భూమి మీద గానీ నీకు సాటియైన✽ దేవుడు మరొకడు లేడు. నీ మార్గంలో మనసారా నడిచే నీ సేవకుల పట్ల దయ చూపుతూ నీ ఒడంబడిక✽ను నెరవేరుస్తూ ఉంటావు. 24 నీవు నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో చెప్పిన మాటప్రకారం చేశావు. నీ నోటితో చెప్పినది ఈరోజు నీవు నెరవేర్చావు. 25 ✝యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో నీవు ఇలా చెప్పావు: ‘నీ కొడుకులు నీ మాదిరిగా నా ఎదుట నడుచుకొంటూ వారి ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉంటే, నీ సంతతివారు ఇస్రాయేల్ రాజ్య పరిపాలన ఎప్పుడూ చేస్తారు.’ 26 ఇస్రాయేల్ ప్రజల దేవా! నీ సేవకుడూ నా తండ్రీ అయిన దావీదుతో నీవు చెప్పిన మాట నెరవేర్చమని వేడుకొంటున్నాను.
27 ✽ “అయితే దేవుడు భూమిమీద నిజంగా నివాసం చేస్తాడా? ఆకాశం, పై ఆకాశాలు నీకు సరిపోవు. నేను కట్టించిన ఈ ఆలయం ఎలా సరిపోతుంది? 28 అయినా నీ దాసుడైన నేను చేసే ప్రార్థన, విన్నపం ఆలకించు. యెహోవా! నా దేవా! నీ దాసుడైన నేను ఈవేళ నీకు పెట్టే మొర, నా ప్రార్థన వినిపించుకో. 29 ✝నీవు ఈ ఆలయాన్ని గురించి ‘నాపేరు అక్కడ ఉంటుంది’ అన్నావు, గనుక రాత్రింబగళ్ళు నీ కనుదృష్టి ఈ ఆలయంపై ప్రసరించనియ్యి. నీ దాసుడు ఈ ఆలయంవైపు మళ్ళుకొని చేసే ప్రార్థన విను. 30 నీ దాసుడు, నీ ఇస్రాయేల్‌ప్రజ ఈ ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేసేటప్పుడెల్లా వారి విన్నపం ఆలకించు. నీ నివాస స్థల✽మైన పరలోకంలో నుంచి విను. విని, పాపాలు క్షమించు.
31 ✽“ఎవడైనా తన పొరుగువాడి విషయం పాపం చేస్తే దానిని గురించి ఒట్టుపెట్టుమని ఇతరులు ఆ వ్యక్తిని ఈ ఆలయంలోని నీ పీఠం ముందుకు తీసుకువచ్చి ప్రమాణం చేయించుకొంటే, 32 ✝నీవు పరలోకంనుంచి ఆలకించు. నీ దాసులైన వారికి తీర్పు తీర్చు. పాపం చేసినవాణ్ణి దోషిగా నిర్ణయించి, వాడి నెత్తిమీదికి శిక్ష రప్పించు. న్యాయవంతుణ్ణి నిర్దోషిగా నిర్ణయించి అతడి నిర్దోషత్వం ప్రకారం అతడికి ప్రతిఫలం ప్రసాదించు.
33 “నీ ఇస్రాయేల్‌ప్రజ నీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతులలో ఓడిపోయినప్పుడు, వారు నీవైపు తిరిగి, నీ పేరును ఒప్పుకొని, ఈ ఆలయంలో నీకు ప్రార్థన, విన్నపాలు చేస్తే 34 నీవు పరలోకం నుంచి విను. నీ ఇస్రాయేల్‌ప్రజ చేసే పాపం క్షమించి వారి పూర్వీకులకు నీవు ఇచ్చిన ఈ దేశానికి వారిని మళ్ళీ చేర్చు.✽
35 “వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినందుచేత నీవు ఆకాశం మూసుకొని వాన కురిపించక✽పోయినప్పుడు వారు ఈ స్థలంవైపు తిరిగి, నీకు ప్రార్థన చేస్తే నీవు వారిమీద పెట్టిన బాధ కారణంగా వారు వారి పాపం విసర్జించి నీ పేరును ఒప్పుకొంటే, 36 నీవు పరలోకంనుంచి ఆలకించు; నీ దాసుల పాపం, నీ ఇస్రాయేల్ ప్రజ పాపం క్షమించు; వారు నడవవలసిన మంచి విధానాన్ని వారికి నేర్పించు✽; నీవు నీ ప్రజకు వారసత్వంగా ఇచ్చిన దేశం మీద మళ్ళీ వాన కురిపించు✽.
37 ✝“ఈ దేశంలో కరవు వస్తే, తెగులు గానీ పంటలకు చీడలు గానీ మిడతలు గానీ పురుగులు గానీ వచ్చిపడితే, వారి శత్రువులు వారి పట్టణాలలో వారిని ముట్టడి వేస్తే – ఎలాంటి దెబ్బ గానీ రోగం గానీ వచ్చినా, 38 నీ ఇస్రాయేల్ ప్రజలో ఎవరైనా ప్రార్థన, విన్నపం చేస్తే నీవు ఆలకించు. అలాంటి వ్యక్తి తన అంతరంగంలో ఉన్న వ్యాధి✽ తెలుసుకొని ఈ ఆలయంవైపు తన చేతులు చాపి ప్రార్థన చేస్తే, 39 ✝నీ నివాసస్థలమైన పరలోకంనుంచి అతడి ప్రార్థన విని క్షమాపణ ప్రసాదించి ప్రతి వ్యక్తి ప్రవర్తనప్రకారం ప్రతిఫలమియ్యి. ప్రతి వ్యక్తి హృదయం నీకు తెలుసు గదా. మనుషులందరి హృదయాలలో ఏమి ఉన్నదో నీకు మాత్రమే తెలుసు. 40 ఈ విధంగా నీవు మా పూర్వీకులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత వరకూ నీవంటే భయభక్తులు✽ కలిగి బ్రతికేలా చెయ్యి.
41 ✽“ఇస్రాయేల్‌వారు గాక, దూర దేశంలోని పరాయివాళ్ళు నీ గొప్ప పేరును గురించీ నీ బలమైన హస్తాన్ని, చాపిన చేతిని గురించీ వింటారు. 42 అలాంటివారెవరైనా నీ పేరుప్రతిష్ఠలను బట్టి వాళ్ళ దేశం నుంచి వచ్చి ఈ ఆలయంవైపు తిరిగి నీకు ప్రార్థన చేస్తే, నీవు నీ నివాసస్థలమైన పరలోకంనుంచి ఆలకించు✽; 43 ✝ఆ విదేశీయులు నిన్ను అడిగేదంతా వారికి ప్రసాదించు. ఆ విధంగా లోకంలో అన్ని జాతులవారు నీ పేరుప్రతిష్ఠలు తెలుసుకొని నీ ఇస్రాయేల్ ప్రజలాగా నీ విషయం భయభక్తులతో ఉంటారు. నేను కట్టించిన ఈ ఆలయమే నీ పేరు పెట్టబడ్డ ఆలయమని తెలుసుకొంటారు.
44 ✝“వారి శత్రువులతో యుద్ధం చేయడానికి నీవు నీ ప్రజను ఎక్కడికైనా పంపించినప్పుడు నీవు ఎన్నుకొన్న నగరం వైపూ నీ పేరుకు నేను కట్టించిన ఈ ఆలయం వైపూ వారు మళ్ళుకొని యెహోవాకు ప్రార్థన చేస్తే, 45 వారి ప్రార్థన, విన్నపాలు పరలోకంనుంచి ఆలకించు. వారి పక్షం వహించు.
46 “నీ ప్రజ నీకు వ్యతిరేకంగా పాపం✽ చేసేటప్పుడు – పాపం చేయనివాడెవడూ లేడు గదా – నీవు వారిమీద కోపపడి వారిని శత్రువుల వశం చేసినందుచేత వారు శత్రువుల దేశానికి బందీలు✽గా వెళ్ళిన తరువాత, ఆ దేశం దూరంగా ఉన్నా, 47 అప్పుడు బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో వారు తలంచుకొని పశ్చాత్తాపపడి ‘మేము పాపం చేశాం, మూర్ఖంగా ప్రవర్తించాం, దుర్మార్గులమయ్యాం’ అంటూ తాము బందీలుగా వెళ్ళిన ఆ దేశంలో నీకు విన్నపం చేస్తే నీవు ఆలకించు. 48 ✝తమకు బందీలుగా కొనిపోయిన వారి శత్రువుల దేశంలో ఉండి వారు హృదయపూర్వకంగా మనసారా నీవైపు తిరిగి, నీవు వారి పూర్వీకులకిచ్చిన ఈ దేశంవైపూ నీవు ఎన్నుకొన్న నగరంవైపూ నీ పేరుకు నేను కట్టించిన ఈ ఆలయం వైపూ చూస్తూ నీకు ప్రార్థన చేస్తే, 49 నీవు నీ నివాస స్థలమైన పరలోకం నుంచి వారి ప్రార్థన, విన్నపాలు ఆలకించు, వారి పక్షం వహించు. 50 ✝నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజను క్షమించు. నీ విషయం వారు చేసిన తప్పిదాలన్నిటినీ క్షమించి వారిని బందీలుగా తీసుకుపోయినవాళ్ళకు వారిమీద జాలి కలిగించు. 51 వారు నీ ప్రజ✽. నీ సొత్తు. నీవు వారిని ఈజిప్ట్ నుంచి – ఆ ఇనుప కొలిమి✽ మధ్యలోనుంచి – బయటికి తీసుకువచ్చావు. 52 కాబట్టి నీ కనుదృష్టి మామీద ఉంచి నీ దాసుడైన నేనూ నీ ఇస్రాయేల్ ప్రజ చేసే విన్నపం ఆలకించు. వారు నీకు మొర పెట్టేటప్పుడెల్లా ఆలకించు. 53 ప్రభూ! యెహోవా! ఈ ప్రజ నీ సొత్తుగా✽ ఉండడానికి ప్రపంచంలో అన్ని జాతులవారిలోనూ నీవు నీకోసం వారిని ప్రత్యేకించుకొన్నావు గదా! నీవు మా పూర్వీకులను ఈజిప్ట్ నుంచి తీసుకువచ్చినప్పుడు నీవు నీ సేవకుడైన మోషేచేత అలా మాట్లాడించావు గదా!”
54 ✝సొలొమోను ఆకాశం వైపు చేతులెత్తి యెహోవా బలిపీఠం ముందు మోకరించి యెహోవాకు ఈ ప్రార్థన, ఈ విన్నపం చేయడం ముగించాక 55 ✽అతడు నిలబడి స్వరమెత్తి ఇస్రాయేల్ సర్వసమాజాన్ని ఇలా దీవించాడు:
56 ✽ “యెహోవాకు స్తుతులు కలుగుతాయి గాక! తాను చెప్పిన మాటప్రకారం ఆయన తన ఇస్రాయేల్‌ప్రజకు ప్రశాంతి ప్రసాదించి ఉన్నాడు. తన సేవకుడైన మోషేచేత ఆయన మాట్లాడించిన హితవాక్కులలో ఒక్కటి కూడా తప్పలేదు. 57 ✝మన పూర్వీకులతో ఉన్నట్టు మన దేవుడు యెహోవా మనతో కూడా ఉంటాడు గాక! మనలను వదలక ఉంటాడు గాక! 58 ఆయన విధానాలన్నిటినీ అనుసరించి నడిచేలా ఆయన మన పూర్వీకులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలూ శాసనాలూ న్యాయనిర్ణయాలూ పాటించేలా ఆయన మన హృదయాలను✽ తనవైపు త్రిప్పుకొంటాడు గాక! 59 ✽యెహోవా సన్నిధానంలో నేను చేసిన ఈ ప్రార్థనా పదాలు మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళూ ఉంటాయి గాక! ఆయన తన దాసుడైన నాపట్ల, తన ఇస్రాయేల్‌ప్రజ పట్ల, ఒక్కొక్కరి అనుదిన అవసరంప్రకారం న్యాయం జరిగిస్తాడు గాక! 60 అప్పుడు ప్రపంచంలో అన్ని జాతులవారు యెహోవాయే దేవుడనీ ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడనీ తెలుసుకొంటారు. 61 ✽గనుక ఈ రోజు ఉన్నట్టు మన దేవుడు యెహోవా విషయం మీ భక్తిలో లోపం లేకుండా ఆయన శాసనాలను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు గాక!”
62 అప్పుడు రాజూ అతడితోపాటు ఉన్న ఇస్రాయేల్ వారంతా యెహోవా సన్నిధానంలో బలులు అర్పించారు. 63 సొలొమోను ఇరవై రెండు వేల ఎద్దులనూ లక్ష ఇరవై వేల గొర్రెమేకలనూ శాంతిబలులు✽గా యెహోవాకు అర్పించాడు. ఈ విధంగా రాజూ ఇస్రాయేల్‌వారంతా యెహోవా ఆలయాన్ని ప్రతిష్ఠించారు. 64 ✽యెహోవా సమక్షంలో ఉన్న కంచు బలిపీఠం ఆ హోమబలులూ నైవేద్యాలూ శాంతిబలుల క్రొవ్వునూ పట్టలేనంత చిన్నగా ఉంది. కనుక ఆ రోజు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్యభాగాన్ని పవిత్రం చేశాడు. అక్కడే ఆ హోమబలులూ నైవేద్యాలూ శాంతిబలుల క్రొవ్వూ అర్పించాడు. 65 ఆ సమయంలో సొలొమోను అతడితోపాటు ఇస్రాయేల్‌వారంతా ఒక విందు చేశారు. హమాతు త్రోవ✽నుంచి ఈజిప్ట్ వాగు✽వరకు ఉన్న ప్రాంతాల నుంచి వారు గొప్ప సమూహంగా సమావేశం అయ్యారు. యెహోవా దేవుని సన్నిధానంలో ఏడు రోజులు మహోత్సవం✽ చేశారు; తరువాత ఇంకా ఏడు రోజులు చేశారు – మొత్తం పద్నాలుగు రోజులు. 66 ✽ఎనిమిదో రోజు రాజు ప్రజలకు సెలవిచ్చాడు. వారు రాజును కీర్తించి యెహోవా తన సేవకుడైన దావీదుకూ తన ఇస్రాయేల్ ప్రజకూ చేసిన అన్ని మేలుల కారణంగా ఆనందభరితులై సంబరపడుతూ వారి వారి గుడారాలకు వెళ్ళిపోయారు.