7
1 అయితే తన సొంత భవనాన్ని కట్టించుకోవడం ముగించడానికి సొలొమోనుకు పదమూడేండ్లు పట్టింది. 2 అతడు కట్టించుకొన్న “లెబానోను వనం” అనే తన భవనం పొడవు నూరు మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్ఫయి మూరలు. దానిని నాలుగు వరుసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాల మీద దేవదారు దూలాలు వేశారు. 3 ప్రక్క గదులు నలభై ఐదు స్తంభాలతో కట్టారు. మూడు వరుసల స్తంభాలు ఉన్నాయి. ఒక్కో వరుసకు పదిహేను స్తంభాల చొప్పున ఉన్నాయి. 4 మూడు వరుసల కిటికీలు ఉన్నాయి. కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. 5 తలుపుల, కిటికీల గుమ్మాలు నలుచదరంగా ఉన్నాయి. కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. 6 అతడు ఆ భవనానికి స్తంభాలతో ఒక మంటపం కట్టించాడు. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ముప్ఫయి మూరలు. దానికి ముందు స్తంభాలతో, చూరుతో కట్టిన వసారా ఉంది. 7 తాను తీర్పు తీర్చే స్థలంగా “సింహాసన శాల” సొలొమోను కట్టించాడు. దాని అడుగునుంచి పైకప్పువరకు దేవదారు కర్రతో దాని గోడలు చేయించాడు. 8 ఈ చావడి వెనుక ఆవరణంలో సొలొమోను కాపురం చేసే సొంత భవనాన్ని కట్టించుకొన్నాడు. దానిని కూడా పైవాటి మాదిరిగానే కట్టించుకొన్నాడు. ఈజిప్ట్ చక్రవర్తి కూతురైన తన భార్య కోసం కూడా ఆ శాలలాంటి భవనాన్ని కట్టించాడు.
9 ఇవన్నీ చాలా ఖరీదైన రాళ్ళతో కట్టారు. ఆ రాళ్ళు కొలతప్రకారం, లోపలివైపు ఉండే ప్రక్కలనూ బయటి ప్రక్కలనూ రంపాలతో కోశారు. పునాదుల నుంచి మదురుల వరకు, బయట ఉన్న భాగానికి గొప్ప ఆవరణం వరకు అలాంటి రాళ్ళు ఉన్నాయి. 10 పునాదిరాళ్ళు కూడా చాలా ఖరీదైనవి. అవి బ్రహ్మాండమైనవి. కొన్ని ఎనిమిది మూరలు, కొన్ని పది మూరలు పొడవు ఉండేవి. 11 పునాదులమీద కొలతలప్రకారం మలచిన చాలా ఖరీదైన రాళ్ళూ దేవదారు దూలాలూ ఉన్నాయి. 12 గొప్ప ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్ళు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా ఆలయానికి చెందిన ఆవరణం, భవనానికి చెందిన మంటపం కూడా అలాగే ఉన్నాయి.
13 సొలొమోనురాజు తూరునుంచి హీరాం అనే మనిషిని పిలువనంపించాడు. 14 అతడు విధవరాలి కొడుకు. ఆమె నఫ్తాలి గోత్రానికి చెందినది. అతడి తండ్రి తూరు నగరవాసి, కంచు పనిచేసేవాడు. ఈ హీరాం ఏ కంచుపనిలో అయినా ఆరితేరినవాడు, చాలా తెలివి గల పనివాడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతడి పనంతా చేశాడు.
15 హీరాం రెండు కంచు స్తంభాలను పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు పద్ధెనిమిది మూరలు. ఒక్కొక్క దాని చుట్టుకొలత పన్నెండు మూరలు. 16 ఆ స్తంభాల మీద ఉంచడానికి అతడు రెండు కంచు పీటలు కూడా పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు అయిదు మూరలు. 17 స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో వలలలాంటి వాటిని చేశాడు. ఒక్కొక్క పీటకు ఏడేసి చేశాడు. 18 ఆ విధంగా ఆ స్తంభాలను చేసి ఆ పీటలను కప్పడానికి ఆ వలలమీద రెండేసి వరుసల కంచు దానిమ్మపండ్లు చేశాడు. 19 స్తంభాల మీది పీటలు నాలుగు మూరల వరకు కలువ రూపం గలవి. 20 ఆ రెండు స్తంభాల మీది పీటలపై ఉన్న ఆ వలల దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు ఆ దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఉబ్బెత్తుకు రెండు వందల చొప్పున ఆ దానిమ్మ పండ్లు వరుస వరుసలుగా ఉన్నాయి. 21 సొలొమోను ఆ స్తంభాలను దేవాలయం వసారాలో నిలబెట్టించాడు. కుడివైపున స్తంభానికి “యాకీన్” అనే పేరు పెట్టాడు, ఎడమ వైపున స్తంభానికి “బోయజు” అనే పేరు పెట్టాడు. 22 స్తంభాల మీద ఆ కలువ పుష్పాకారం ఉంది. అలా స్తంభాల పని ముగిసింది.
23 హీరాం గుండ్రని సరస్సును కూడా పోత పోశాడు. ఆ పై అంచునుంచి ఈ పై అంచువరకు దాని కొలత పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు, దాని చుట్టుకొలత ముప్ఫయి మూరలు. 24 పై అంచు క్రింద చుట్టు గుబ్బలు ఉన్నాయి. మూరకు పది గుబ్బల ప్రకారం సరస్సును పూర్తిగా చుట్టుకొన్నాయి. దానిని పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరుసలుగా పోత పోశారు. 25 ఆ సరస్సు పన్నెండు ఎడ్లమీద కూర్చుని ఉంది. వాటి వెనుక భాగాలు లోపలివైపుకు ఉన్నాయి. వాటి ముఖాలలో మూడు ఉత్తరం వైపుకు, మూడు పడమటి వైపుకు, మూడు దక్షిణం వైపుకు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు ఆ ఎడ్ల మీద కూర్చుని ఉంది. 26 సరస్సు బెత్తెడు మందం గలది. దానిపై అంచు పాత్రపై అంచులాగా, కలువ పువ్వులాగా ఉంది. అది నలభై నాలుగు కిలోలీటర్లు పట్టేది.
27 అప్పుడతడు పది కంచు పీఠాలు చేశాడు. ప్రతిదాని పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగు మూరలు, ఎత్తు మూడు మూరలు. 28 ఆ పీఠాలు చేసిన విధానమిది – వాటికి ప్రక్క పలకలు ఉన్నాయి. ఆ పలకలు జవల మధ్య అమర్చారు. 29 జవల మధ్య ఉన్న పలకల మీద సింహం, ఎద్దు, కెరూబుల ఆకారాలు ఉన్నాయి. జవలమీద పీట ఉంది. సింహం, ఎద్దుల క్రింద పూదండలు వ్రేలాడుతున్నట్లున్నాయి. 30 ప్రతి పీఠానికి నాలుగు కంచు చక్రాలు ఉన్నాయి. కంచు ఇరుసులు కూడా ఉన్నాయి. ప్రతి పీఠం నాలుగు మూలలకు దిమ్మెలు ఉన్నాయి. ఇవి తొట్టికోసం. వాటి రెండు ప్రక్కల పోత పోసిన పూదండలు ఉన్నాయి. 31 పీఠం పైభాగంలో దాని మూతి ఉంది. పీఠం మాదిరిగా దాని మూతి గుండ్రంగా ఉంది. పీఠం పైభాగం నుంచి దాని ఎత్తు ఒక మూర. మూతి అడుగునుంచి దాని ఎత్తు మూరన్నర. ఆ మూతి మీద కూడా చిత్తరువులు చెక్కారు. దాని చట్రం గుండ్రనిది గాక, నలుచదరంగా ఉంది. 32 ప్రక్క పలకల క్రింద ఆ నాలుగు చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు పీఠాలతో కలిపారు. చక్రాల ఎత్తు మూరన్నర. 33 చక్రాలు రథం చక్రాలలాగా ఉన్నాయి. వాటి ఇరుసులు, అడ్డలు, పూటీలు, ఆకులు అన్నీ పోత పని. 34 పీఠాలకు నాలుగు మూలలకు దిమ్మెలు ఉన్నాయి. ఈ దిమ్మెలు పీఠంతోనే పోత పోశారు. దిమ్మెలు, పీఠం ఒకటిగా ఉన్నాయి. 35 పీఠం పైన చుట్టు జానెడు ఎత్తు గల గుండ్రని బొద్దు ఉంది. పీఠం, దానిపై ఉన్న చట్రం పలకలు ఒకటిగా పోత పోశారు. 36 ఆ జవల పలకల మీద స్థలమున్న దగ్గరెల్లా కెరూబు, సింహం, ఖర్జూర వృక్షాల ఆకారాలు హీరాం చెక్కాడు. పూదండలు కూడా అలా చెక్కాడు. 37 ఈ విధంగా ఆ పది పీఠాలు చేశాడు. అన్నిటికీ ఒకే పోత, ఒకే కొలత, ఒకే ఆకారం. 38 అతడు పది కంచు తొట్లు కూడా చేశాడు. ప్రతి తొట్టి కొలత నాలుగు మూరలు. ప్రతి తొట్టి ఎనిమిది వందల ఎనభై లీటర్లు పట్టేది. అతడా తొట్లు ఆ పీఠాల మీద ఉంచాడు. 39 దేవాలయానికి కుడివైపు అయిదు పీఠాలు, ఎడమ వైపు అయిదు పీఠాలు ఉంచాడు. ఆ సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిక్కుగా ఉంచాడు.
40 హీరాం గంగాళాలూ పెద్దపెద్ద గరిటెలూ పాత్రలూ కూడా చేశాడు. యెహోవా ఆలయానికి సొలొమోను చేయమన్న వస్తువులన్నీ హీరాం చేసి ఆ పని ముగించాడు. 41 ఆ వస్తువులు – రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాలమీద ఉన్న గిన్నె లాంటి పీటలు, స్తంభాలమీద ఉన్న గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి ఆ రెండు కంచు వలలు, 42 ఆ రెండు వలలకు నాలుగు వందల దానిమ్మపండ్లు ఒక్కొక్క వలకు రెండేసి వరుసలు, 43 పది పీఠాలు, వాటిపై ఉన్న పది తొట్లు, 44 సరస్సు, దాని క్రింద ఉన్న పన్నెండు ఎద్దులు, 45 గంగాళాలు, పెద్దపెద్ద గరిటెలు, పాత్రలు – యెహోవా ఆలయానికి సొలొమోనురాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన కంచుతో హీరాం తయారు చేశాడు. 46 వీటన్నిటినీ యొర్దాను మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టి నేలలో సొలొమోనురాజు పోత పోయించాడు. 47 ఆ కంచు వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ, గనుక సొలొమోను వాటిని తూకం వేయించలేదు. ఆ కంచు బరువు ఎంతో ఎవరూ నిశ్చయించలేదు.
48 యెహోవా ఆలయానికి తక్కిన ఈ వస్తువులను కూడా సొలొమోను చేయించాడు: బంగారు ధూపవేదిక, సన్నిధి రొట్టెలున్న బంగారు బల్ల, 49 గర్భగృహానికి ముందున్న సప్తదీపస్తంభాలు (కుడివైపు అయిదు, ఎడమవైపు అయిదు ఉన్నాయి; వాటిని మేలిమి బంగారంతో చేయించాడు), వాటి బంగారు పుష్పాలూ దీపాలూ పట్టకార్లూ, 50 మేలిమి బంగారు పాత్రలూ కత్తెరలూ గిన్నెలూ గరిటెలూ ధూపార్తులూ గర్భగృహం అనే అతి పవిత్ర స్థలానికి ఆలయం విశాల భాగానికీ ఉన్న తలుపుల బంగారు బందులు.
51 ఈ విధంగా యెహోవా ఆలయానికి సొలొమోనురాజు చేయించిన పనంతా పూర్తి అయింది. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదు ప్రతిష్ఠ చేసిన వెండి బంగారు పాత్రలు కూడా తెప్పించి యెహోవా ఆలయంలోని ఖజానాలో ఉంచాడు.