6
1 ✝సొలొమోను ఇస్రాయేల్‌దేశ పరిపాలనలో నాలుగో సంవత్సరాన✽ జీఫ్ అనే రెండో నెలలో యెహోవాకు ఆలయాన్ని కట్టించడం ఆరంభించాడు. ఆ సంవత్సరం ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌దేశంనుంచి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభైయ్యో సంవత్సరం. 2 ✽యెహోవాకు సొలొమోనురాజు కట్టించిన ఆలయం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్ఫయి మూరలు. 3 ఆలయం విశాల భాగానికి ముందు వసారా ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని పొడవు, ఆలయం వెడల్పు ఒకటే. ఆలయం ముందు ఆ వసారా వెడల్పు పది మూరలు. 4 ఆలయానికి నగిషి పని చేసిన అల్లిక కిటికీలు పెట్టించాడు. 5 అతడు ఆలయం గోడల చుట్టూరా గదుల వరుస కట్టించాడు. విశాల భాగం బయటి గోడలకూ పవిత్ర స్థలం బయటి గోడలకూ కూడా ఆ గదులు ఉన్నాయి. 6 మూడు అంతస్తులున్నాయి. క్రింది అంతస్తు గదుల వెడల్పు అయిదు మూరలు; రెండో అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు; మూడో అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు. గదుల దూలాలు ఆలయం గోడలోకి చొప్పించకుండా, ఆలయం బయటి గోడలకు చుంచురాళ్ళు ఉంచారు. 7 ఆలయం కట్టేటప్పుడు ముందుగానే మలచి తెచ్చిన రాళ్ళు వినియోగించారు. ఆలయం కట్టడం జరుగుతూ ఉన్నప్పుడు సుత్తె, గొడ్డలి, మరే ఇనుప పనిముట్టు చప్పుడు వినిపించలేదు. 8 క్రింది అంతస్తు గుమ్మం ఆలయానికి కుడివైపున ఉంది. మెడమీది రెండో అంతస్తుకు, అక్కడనుంచి మూడో అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. 9 సొలొమోను ఆలయం కట్టించడం ముగించాడు. ఆలయం పైన దేవదారు దూలాలతో, పలకలతో కప్పు వేయించాడు. 10 ఆలయం చుట్టు ఆ గదుల వరుస కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు. వాటిని దేవదారు దూలాలతో ఆలయానికి కలిపి కట్టారు.11 ఆలోగా యెహోవానుంచి వాక్కు సొలొమోనుకు వచ్చింది✽: 12 ✽“నీవు కట్టించే ఈ ఆలయాన్ని గురించి ఒక మాట – నీవు నా శాసనాల ప్రకారం ప్రవర్తిస్తూ నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ నా ఆజ్ఞలన్నీ శిరసావహించి అనుసరిస్తూ ఉంటే, నీ తండ్రి అయిన దావీదుకు నేను చేసిన నా వాగ్దానం✽ నీపట్ల నెరవేరుస్తాను; 13 ఇస్రాయేల్ ప్రజల మధ్య ఉంటాను✽; నా ఇస్రాయేల్ ప్రజను విడిచిపెట్టను.”
14 సొలొమోను ఆలయం కట్టించడం ముగించాడు. 15 ఆలయం లోపలి గోడలను అడుగునుంచి పైకప్పువరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలు, నేలను సరళవృక్షాల పలకలు పరిచారు. 16 ఆలయం వెనుక భాగంలో అతి పవిత్ర స్థలం✽ అనే గర్భగృహాన్ని కట్టించారు. దాని వెడల్పు ఇరవై మూరలు. దానిని వేరు చేసే అడ్డుగోడ ఉంది. అడుగునుంచి పైకప్పువరకు దేవదారు పలకలతో దాన్ని కట్టించాడు. 17 అతి పవిత్ర స్థలానికి ముందున్న విశాల భాగం✽ పొడుగు నలభై మూరలు. 18 ✝ఆలయం లోపల ఉన్న దేవదారు పలకలమీద వికసించిన పువ్వులు చెక్కి అలంకరించారు. ఆలయంలోపల అంతా దేవదారు చెక్కలే, రాయి ఒక్కటి కూడా కనిపించలేదు. 19 ఆలయంలోపల గర్భగృహాన్ని✽ సిద్ధం చేశాడు. అది యెహోవా ఒడంబడిక పెట్టె✽ ఉంచడం కోసం. 20 ఆ గర్భగృహం పొడవు ఇరవై మూరలు✽, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దానికి మేలిమి బంగారు తొడుగు చేయించాడు. దేవదారు కర్రతో చేసిన ధూపవేదికను కూడా అలా చేయించాడు. 21 సొలొమోను ఆలయం లోపలి భాగమంతా బంగారు రేకులతో✽ తొడుగు చేయించాడు. గర్భగృహం ముందు భాగానికి బంగారు గొలుసులను చేయించి పెట్టించాడు. గర్భగృహానికి బంగారు తొడుగు చేయించాడు. 22 ఆలయమంతటికీ బంగారు తొడుగు చేయించాడు. గర్భగృహం దగ్గర ఉన్న ధూపవేదికకు బంగారు తొడుగు చేయించాడు.
23 ఆలీవ్ కర్రతో రెండు కెరూబులను✽ చేయించి గర్భగృహంలో ఉంచాడు. ఒక్కొక్క దాని ఎత్తు పది మూరలు. 24 ఆ కెరూబులకు రెక్కలున్నాయి. ఒక్కొక్క రెక్క పొడవు అయిదు మూరలు; ఈ రెక్క కొననుంచి ఆ రెక్క కొనవరకు పది మూరలు. 25 ఆ రెండో కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులూ ఒకే కొలత, ఒకే ఆకారం. 26 ఆ రెండు కెరూబుల ఎత్తు పది మూరలు. 27 సొలొమోను ఆ కెరూబులను గర్భగృహంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొన్నాయి. ఒక రెక్క కొన ఆ గోడను, మరో రెక్క కొన ఈ గోడను తగులుకొన్నాయి. గర్భగృహం మధ్యలో వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తగులుకొన్నాయి. 28 కెరూబులకు కూడా బంగారు తొడుగు చేయించాడు.
29 గర్భగృహంలో గానీ దాని బయట ఉన్న శాలలో గానీ దేవాలయం గోడలన్నిటి మీదా కెరూబులూ ఖర్జూరం చెట్లూ విచ్చుకొన్న పువ్వులూ చెక్కించాడు. 30 ఆ లోపలి గది నేలమీద, దాని బయటి గది నేలమీద బంగారు తొడుగు చేయించాడు. 31 గర్భగృహం ద్వారానికి ఆలివ్‌కర్రతో తలుపులు చేయించాడు. తలుపుల గడపనూ దానిపై కర్రనూ కూడా ఆలివ్‌కర్రతో చేయించాడు. ఈ ద్వార స్తంభాలకు పంచకోణాకారం ఉంది. 32 ఆలీవ్ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద కెరూబులూ ఖర్జూరం చెట్లూ విచ్చుకొన్న పువ్వులూ చెక్కించాడు. తలుపుల మీద, కెరూబుల మీద, చెట్ల మీద బంగారు తొడుగు చేయించాడు. 33 విశాల భాగం ద్వారానికి ఆలీవ్‌కర్రతో స్తంభాలు చేయించాడు. అవి నలుచదరంగా ఉన్నాయి. 34 రెండు తలుపులూ సరళవృక్షం కర్రతో చేసినవి. రెండు తలుపులకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి. 35 తలుపుల మీద కెరూబులూ ఖర్జూరం చెట్లూ విచ్చుకొన్న పువ్వులూ చెక్కించి వాటికి బంగారు తొడుగు చేయించాడు. 36 ✽లోపలి ఆవరణాన్ని మూడు వరుసల మలిచిన రాళ్ళతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
37 నాలుగో సంవత్సరం✽ జీఫ్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు. 38 పదకొండో సంవత్సరంలో బూల్ అనే ఎనిమిదో నెలలో ఆలయాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడేండ్లు పట్టింది.