5
1 తండ్రి స్థానంలో సొలొమోను పట్టాభిషేకం పొందాడని తూరు నగరం రాజు హీరాం విన్నాడు. హీరాం ఎప్పుడూ దావీదుకు మిత్రుడు, గనుక అతడు తన పరివారంలో కొందరిని సొలొమోను దగ్గరికి పంపాడు. 2 సొలొమోను హీరాంకు ఇలా కబురు పంపాడు:
3 “నా తండ్రి అయిన దావీదుకున్న శత్రువులను ఆయన పాదాలక్రింద యెహోవా అణచేవరకు ఆయన యుద్ధాలలో నిమగ్నుడయ్యాడు, గనుక తన దేవుడైన యెహోవా పేరుకోసం ఆయన ఆలయాన్ని కట్టించలేకపోయాడు. ఈ సంగతి మీకు తెలుసు గదా. 4 ఇప్పుడు నా దేవుడు యెహోవా నా చుట్టు అంతటా నెమ్మది కలిగించాడు. శత్రువులంటూ లేరు. ఆపదలు లేవు. 5 నా తండ్రి దావీదుతో యెహోవా ఇలా అన్నాడు: ‘నీ స్థానంలో నీ సింహాసనం పై నేను ఎక్కించే నీ కొడుకు నా పేరుకోసం ఆ ఆలయాన్ని కట్టిస్తాడు.’ ఆ మాటప్రకారం ఇప్పుడు నేను నా దేవుడు యెహోవా పేరుకు ఆలయాన్ని కట్టించాలనుకొంటున్నాను. 6 కాబట్టి నాకోసం లెబానోనులో దేవదారు చెట్లను నరికించండి. నా పనివాళ్ళు మీ పనివాళ్ళతో కలిసి పని చేస్తారు. మీ పనివాళ్ళకు మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంతా మీకిస్తాను. మీ సీదోనువాళ్ళ మాదిరిగా మ్రాను నరకగలవాడు మా మధ్య ఎవ్వడూ లేడని మీకు తెలుసు గదా.”
7 సొలొమోను చెప్పినది హీరాం విని చాలా సంబరపడ్డాడు, “ఈ గొప్ప ప్రజను పరిపాలించడానికి జ్ఞానం గల కొడుకును దావీదుకు ప్రసాదించిన యెహోవాకు స్తుతి!” అన్నాడు.
8 హీరాం సొలొమోనుకు ఇలా జవాబు పంపాడు: “మీరు నాకు పంపిన సందేశం అందింది. దేవదారు, సరళ వృక్షం మ్రానుల విషయం మీరు కోరినట్టే చేస్తాను. 9 నా పనివాళ్ళు లెబానోను పర్వతాలనుంచి దూలాలను సముద్రతీరానికి చేరుస్తారు. అక్కడనుంచి మీరు చెప్పే స్థలానికి సముద్రంమీద చేరేలా నేను వాటిని తెప్పలుగా కట్టిస్తాను. చేరిన స్థలంలో వాటిని విడివిడిగా చేయిస్తాను. అప్పుడు మీరు వాటిని తీసుకుపోవచ్చు. మీరు నా కోరిక తీర్చి నా భవనానికి భోజనపదార్థాలు సరఫరా చేయవచ్చు.”
10 హీరాం సొలొమోనుకు ఇష్టమున్నంత దేవదారు, సరళవృక్షం మ్రానులను ఇచ్చాడు. 11 సొలొమోను హీరాంకు అతడి భవనానికి ఆహారంగా రెండు లక్షల తూముల గోధుమలనూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల స్వచ్ఛమైన నూనెనూ ఇచ్చాడు. ఈ విధంగా సొలొమోను హీరాంకు ఏటేటా ఇస్తూ వచ్చాడు. 12 యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. హీరాం, సొలొమోను ఒడంబడిక చేసుకొన్నారు. ఇద్దరిమధ్య సమాధానం ఉంది.
13  సొలొమోను ఇస్రాయేల్ దేశమంతట్లో వెట్టిపని చేసేవారిని ముప్ఫయి వేలమందిని ఏర్పాటు చేశాడు. 14 వారిని వంతులప్రకారం నెలకు పదివేలమందిని లెబానోనుకు పంపాడు. వారు లెబానోనులో ఒక నెల, ఇంటిదగ్గర రెండు నెలలు గడిపారు. ఆ పనివారిమీద అదోనీరాం అధికారి. 15 అంతేగాక, సొలొమోనుకు కొండలలో గనులలో రాళ్ళు త్రవ్వేవారు ఎనభై వేలమంది, బరువులు మోసేవారు డెబ్భై వేలమంది కూడా ఉన్నారు. 16 వీరు గాక, ఆ పని నిర్వహించేవారు మూడు వేల మూడు వందలమంది సొలొమోనుకు ఉన్నారు. వారు పనివారిమీద అధికారులు. 17 రాజు ఆజ్ఞలమేరకు దేవాలయం పునాదులకోసం పనివారు గనులలో నుంచి పెద్దపెద్ద రాళ్ళూ అసాధారణమైన రాళ్ళూ తీశారు, వాటిని చెక్కారు. 18 సొలొమోను హీరాంల వడ్రంగులూ రాతిపనివారూ గిబ్లీ ప్రదేశస్థులూ ఆ రాళ్ళు మలచారు, ఆలయాన్ని కట్టడానికి మ్రానులనూ రాళ్ళనూ సిద్ధం చేశారు.