4
1 సొలొమోనురాజు ఇస్రాయేల్‌ప్రజలందరి మీద రాజయ్యాడు. 2 అతని అధికారులు వీరు: సాదోకుయాజి కొడుకైన అజర్యా; 3 షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా కార్యదర్శులు; అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు; 4 యెహోయాదా కొడుకు బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజులు; 5 నాతాను కొడుకు అజర్యా ఉద్యోగస్థులందరికీ ఉన్నతాధికారి; నాతాను కొడుకైన జాబూదుయాజి రాజుకు సన్నిహితుడు; 6 అహీషారు రాజభవనం మీద నిర్వాహకుడు; అబదా కొడుకు అదోనీరాం వెట్టిపనులు చేసేవారి పై అధికారి.
7 సొలొమోను క్రింద, ఇస్రాయేల్ రాజ్యమంతటి మీద, పన్నెండుమంది పాలకులు ఉన్నారు. వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. సంవత్సరంలో నెలకు ఒకరి చొప్పున భోజనపదార్థాలు సరఫరా చేసేవారు. 8 వారిపేర్లు ఇవి: ఎఫ్రాయిం కొండ ప్రదేశంలో బెన్‌హూరు; 9 మాకసులో, షాల్బీంలో, బేత్‌షెమెషులో, పలోన్ బెథానానులో బెన్‌దాకరు; 10 అరుబ్బోతులో బెన్‌హెపెదు (అతడు శోకో మీదా హెపెరు ప్రదేశమంతటి మీదా పాలకుడు); 11 దోరు ప్రదేశమంతటి మీదా బెన్‌అబీనాదాబు (అతడి భార్య సొలొమోను కూతురు టాపాతు); 12 అహీలూదు కొడుకు బానాతానాక్ మీదా మెగిద్దోమీదా బేత్‌షెయాను ప్రాంతమంతటి మీదా అధికారి (బేత్‌షెయాను సారెతాను దగ్గరగా యెజ్రేల్ దిగువగా ఉంది. అతడి ప్రాంతం బేత్‌షెయానునుంచి ఆబేల్‌మేహోలా వరకు, యొక్నేం అవతల ఉన్న స్థలంవరకు ఉంది.) 13 బెన్‌గెబెరు రామోత్ గిలాదులో ఉండేవాడు. అతనిది గిలాదులో ఉన్న మనష్షే వంశస్థుడైన యాయీరు పట్టణాలు, బాషానులోని అర్గోబు ప్రదేశం. ఆ ప్రదేశంలో ప్రాకారాలూ కంచుద్వారం అడ్డగడియలూ ఉన్న అరవై పెద్ద పట్టణాలు ఉన్నాయి. 14 ఇద్దో కొడుకు అహీనాదాబు ప్రాంతం మహనయీం. 15 నఫ్తాలి ప్రదేశంలో అహీమాను ఉండేవాడు. అతడు సొలొమోను కూతురు బాశెమతును వివాహమాడాడు. 16 ఆలోతు, ఆషేరు ప్రదేశంలో హూషై కొడుకు బానా ఉండేవాడు. 17 ఇశ్శాకారు ప్రదేశంలో పరూయా కొడుకు యెహోషాపాతు ఉండేవాడు. 18 బెన్యామీను ప్రదేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు. 19 గిలాదులో ఊరీ కొడుకు గెబెరు ఉండేవాడు. (పూర్వం ఆ ప్రదేశం అమోరీవాళ్ళ రాజు సీహోనుకూ బాషాను రాజు ఓగుకూ చెందిన ప్రదేశం.) అతడు ఒక్కడే ఆ ప్రదేశంలో పాలకుడు.
20 యూదావారూ ఇస్రాయేల్‌వారూ సంఖ్యలో సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. వారు తింటూ త్రాగుతూ సంబరపడుతూ ఉన్నారు. 21 సొలొమోను యూఫ్రటీసు నదినుంచి ఫిలిష్తీయవాళ్ళ దేశంవరకు, ఈజిప్ట్ సరిహద్దువరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ రాజ్యాలవారు సొలొమోనుకు కప్పం చెల్లిస్తూ అతడు బ్రతికి ఉన్నంత కాలం అణిగి మణిగి ఉన్నారు. 22 సొలొమోను భవనానికి ఒక్కొక్క రోజుకు సరిపోయే ఆహారమెంతంటే ఆరు వందల తూముల మెత్తని గోధుమ పిండి, వెయ్యిన్ని రెండువందల తూముల ముతక పిండి, 23 పది బలిసిన ఎడ్లు, మందలో మేపే ఎడ్లు మరో ఇరవై, వంద గొర్రెలు, మేకలు. ఇవేగాక, లేళ్ళు, దుప్పులు, మగ జింకలు, కొవ్విన పక్షులు కూడా ఉన్నాయి.
24 సొలొమోను అధికారం యూఫ్రటీసు నదికి పడమరగా, తిప్సానుంచి గాజావరకు ఉంది. ఆ నదికి పడమరగా ఉన్న రాజులందరూ అతని అధికారం క్రింద ఉన్నారు. అంతటా అందరూ అతనితో సమాధానంగా ఉన్నారు. 25 సొలొమోను పరిపాలన కాలమంతా యూదావారూ ఇస్రాయేల్‌వారూ దాను పట్టణం నుంచి బేర్‌షెబా పట్టణం వరకు నిర్భయంగా ఉండిపోయారు. ఒక్కొక్కరికి సొంత ద్రాక్షచెట్లూ అంజూరుచెట్లూ ఉన్నాయి. 26  సొలొమోనుకు రథాలకోసం నలభై వేల గుర్రాలూ శాలలూ ఉన్నాయి. రౌతులకోసం పన్నెండు వేల గుర్రాలు కూడా ఉన్నాయి. 27 ఆ పన్నెండుమంది పాలకులలో ఒక్కొక్కరు తన నెలలో సొలొమోను రాజుకూ అతడి బల్ల దగ్గర భోజనం చేసే వారందరికీ భోజన పదార్థాలు సరఫరా చేశారు. ఎవరికీ కొదువ కాలేదు. 28 అంతేగాక, ఆ పాలకులు గుర్రాలు, రౌతుల గుర్రాలు ఉన్నచోట్లకు వాటికి ఎండుగడ్డి, యవలు తెప్పించారు.
29 సొలొమోనుకు దేవుడు మహా గొప్ప జ్ఞానాన్నీ వివేచనాశక్తినీ ప్రసాదించాడు. ఇసుక రేణువులున్న సముద్ర తీరమంత విశాల హృదయాన్ని ఇచ్చాడు. 30 సొలొమోను జ్ఞానం తూర్పు దేశాలవాళ్ళందరి జ్ఞానంకంటే, ఈజిప్ట్‌లోని జ్ఞానమంతటికంటే మెరుగైనది. 31 మనుషులందరికంటే సొలొమోను ఎక్కువ జ్ఞానం గలవాడు. ఎజ్రాహివాడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోల్, దర్దల కంటే జ్ఞానవంతుడు. అతని పేరుప్రతిష్ఠలు చుట్టూరా ఉన్న అన్ని దేశాలలో వ్యాపించాయి. 32 అతడు మూడు వేల సామెతలు పలికాడు. అతని కీర్తనలు వెయ్యిన్ని అయిదు. 33 అతడు అన్ని రకాల చెట్లను గురించి – లెబానోనులో పెరిగే దేవదారుల నుంచి గోడలో మొలిచే హిస్సోపు చెట్ల మొక్కలవరకు – మాట్లాడాడు. జంతువులు, పక్షులు, ప్రాకే ప్రాణులు, చేపలను గురించి కూడా మాట్లాడాడు. 34 అతని జ్ఞానాన్ని గురించి విన్న భూరాజులందరిలోనుంచీ అన్ని జాతులలోనుంచీ మనుషులు అతని జ్ఞాన వాక్కులు విందామని సొలొమోను దగ్గరికి వచ్చారు.