3
1 తరువాత సొలొమోను ఈజిప్ట్‌చక్రవర్తి ఫరోకు అల్లుడయ్యాడు. అతడు ఫరో కూతురిని పెండ్లి చేసుకొని✽ దావీదు నగరానికి✽ ఆమెను తీసుకువచ్చాడు. తన సొంత భవనాన్నీ యెహోవా ఆలయాన్నీ జెరుసలం చుట్టూరా ప్రాకారాన్నీ కట్టించడం ముగించేవరకు దావీదునగరంలోనే ఆమెను ఉంచాడు. 2 ✽అంతకుముందు యెహోవా పేరుకోసం ఆలయాన్ని కట్టడం జరగలేదు గనుక ప్రజలు ఎత్తయిన ఆరాధన స్థలాలమీద బలులు అర్పించేవారు. 3 ✽సొలొమోను యెహోవాను ప్రేమిస్తూ తన తండ్రి దావీదు నియమాల ప్రకారం మెలగుతూ ఉండేవాడు. కానీ అతను కూడా ఎత్తయిన ఆరాధన స్థలాల మీద బలులు అర్పించేవాడు, ధూపం వేసేవాడు.4 ✝ఎత్తయిన ఆరాధన స్థలాలలో గిబియోను✽ ముఖ్యమైనది, గనుక ఒక రోజు బలులు అర్పించడానికి రాజు అక్కడికి వెళ్ళాడు. అక్కడి బలిపీఠం మీద సొలొమోను వెయ్యి హోమబలులు అర్పించాడు. 5 గిబియోనులో సొలొమోనుకు యెహోవా రాత్రివేళ కలలో✽ ప్రత్యక్షమై “నేను నీకు ఏం ఇవ్వాలో✽ కోరుకో” అన్నాడు.
6 అందుకు సొలొమోను ఇలా చెప్పాడు✽: “నీ దాసుడూ నా తండ్రి అయిన దావీదు నీ సముఖంలో విశ్వసనీయతనూ న్యాయాన్నీ నిజాయితీనీ✽ అనుసరిస్తూ మెలగేవాడు. అప్పుడు నీవు అతనిమీద ఎంతో అనుగ్రహం చూపించావు. అతని విషయం నీ గొప్ప అనుగ్రహాన్ని పొడిగించి ఈ వేళే ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కొడుకు✽ను కూర్చోబెట్టావు. 7 యెహోవా, నా దేవా! ఇప్పుడు నా తండ్రి అయిన దావీదు స్థానంలో నీ దాసుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను పిల్లవాణ్ణి✽. నాయకత్వంలో నేర్పు లేనివాణ్ణి. 8 నీవు ఎన్నుకొన్న నీ ప్రజలమధ్య నీ దాసుడైన నేను ఉన్నాను. ఈ ప్రజ అసంఖ్యాకం✽. లెక్కించ వీలుకాని గొప్ప ప్రజ. 9 ఈ నీ గొప్ప ప్రజను పరిపాలించగలవాడెవడు?✽ గనుక మంచి చెడ్డలు వివేచించడానికీ నీ ప్రజను న్యాయంగా పరిపాలించడానికీ నీ దాసుడైన నాకు తెలివి గల మనసు✽ ప్రసాదించు.”
“నీవు దీర్ఘాయువును గానీ ధనాన్ని గానీ నీ శత్రువుల ప్రాణాలను గానీ కోరుకోకుండా, న్యాయ పరిపాలన కోసం తెలివితేటలనూ వివేచనాశక్తినీ కోరుకొన్నందుచేత నీ కోరిక ప్రకారం✽ ఇప్పుడే నీకిచ్చాను. 12 వివేచనాశక్తినీ జ్ఞానాన్నీ✽ ప్రసాదించాను. పూర్వం జ్ఞానంలో నీ అంతటివాడు పుట్టలేదు, నీ తరువాత పుట్టబోడు. 13 నీవు అడగనివాటిని కూడా ఇస్తాను. ధనాన్నీ ఘనతనూ నీకు ప్రసాదిస్తాను. నీవు జీవించే కాలం రాజులందరిలో నీకు సాటి ఎవడూ ఉండడు. 14 ✽ అంతేగాక, నీ తండ్రి దావీదులాగా నీవు నా విధానాలను అనుసరించి నడుస్తూ నా శాసనాల, ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, నిన్ను ఆయుష్మంతుణ్ణి✽ చేస్తాను.”
15 సొలొమోను మేల్కొని అది కల అని తెలుసుకొన్నాడు. అతడు జెరుసలం వచ్చి యెహోవా ఒడంబడికపెట్టె✽ ఎదుట నిలబడి హోమబలులూ శాంతిబలులూ అర్పించాడు✽. తన పరివారానికి విందు చేశాడు.
16 ✽తరువాత ఇద్దరు పడుపుకత్తెలు రాజు దగ్గరికి వచ్చి అతని ముందు నిలబడ్డారు. 17 వారిలో ఒకతె ఇలా అంది: “స్వామీ! నేను, ఈమె ఇద్దరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆమె ఇంట్లోనే ఉన్నప్పుడు నేనొక పిల్లవాణ్ణి కన్నాను. 18 నేను కన్న మూడో రోజున ఈమె కూడా ఒక పిల్లవాణ్ణి కన్నది. మేమిద్దరమే అక్కడ ఉన్నాం. ఇంట్లో ఇంకెవరూ లేరు. 19 రాత్రిపూట ఈమె పడకలో తన పిల్లవాడిమీద దొర్లింది. పిల్లవాడు చచ్చిపోయాడు. 20 మధ్యరాత్రి ఇది లేచి నా ప్రక్కన ఉన్న పసివాణ్ణి తీసివేసింది – మీ దాసినైన నేను నిద్రపోతూ ఉన్నాను. చచ్చిపోయిన తన పిల్లవాణ్ణి నా ప్రక్కన ఉంచి నా పిల్లవాణ్ణి తన ప్రక్కన పడుకోబెట్టుకొంది. 21 ప్రొద్దున నా పసివాడికి పాలివ్వడానికి లేస్తే వాడికి ప్రాణం లేదు. అప్పుడు వాణ్ణి బాగా పరిశీలనగా చూస్తే నా గర్భాన పుట్టిన కొడుకు కాదని తేలిపోయింది.”
22 ఆ రెండో ఆమె “అలా కాదు. బతికి ఉన్న బిడ్డడు నా బిడ్డడు. చచ్చినవాడే నీ బిడ్డడు” అంది.
మొదట మాట్లాడిన ఆమె “కాదు. బతికి ఉన్న బిడ్డడు నా బిడ్డడు. చచ్చినదే నీ బిడ్డడు” అంది. ఇద్దరూ రాజు ముందర ఇలా మాట్లాడారు.
23 రాజు “ఈమె ‘బ్రతికి ఉన్న బిడ్డడు నా బిడ్డడు, చచ్చినది నీ బిడ్డడు’ అంటుంది: ఆమె ‘కాదు. చచ్చినదే నీ బిడ్డడు, బ్రతికి ఉన్న బిడ్డడు నా బిడ్డడు’ అంటుంది.”
24 అప్పుడు రాజు “ఖడ్గం తీసుకురా” అని పరివారంతో చెప్పాడు. వారు రాజుదగ్గరికి ఖడ్గం తెచ్చినప్పుడు రాజు అన్నాడు 25 “ప్రాణంతో ఉన్న బిడ్డణ్ణి రెండు ముక్కలు చేసి ఈమెకో సగం ఆమెకో సగం ఇచ్చెయ్యి” అన్నాడు.
26 అందుకు బ్రతికి ఉన్న పసివాడి తల్లికి తన బిడ్డడి విషయం గుండె జాలితో కరిగిపోయింది. రాజుతో “స్వామీ! దయ ఉంచి బతికివున్న బిడ్డణ్ణి దానికివ్వండి. బిడ్డణ్ణి ఏమాత్రం చంపొద్దండి” అంది.
కానీ రెండో ఆమె “ఆమెకు గానీ నాకు గానీ దక్కకుండా చెరిసగం చెయ్యండి” అంది.
27 రాజు “బతికివున్న పసివాణ్ణి మొదటి స్త్రీకి ఇచ్చెయ్యి. వాణ్ణి చంపకు. వాడి తల్లి ఆమె” అని తీర్పు చెప్పాడు.
28 ✽రాజు చెప్పిన తీర్పు ఇస్రాయేల్ ప్రజలందరికీ వినవచ్చింది. న్యాయం తీర్చే దైవజ్ఞానం రాజు హృదయంలో ఉందని వారికి భయం వేసింది.