2
1 ✝దావీదుకు మరణ కాలం సమీపమైంది. అతడు తన కొడుకు సొలొమోనుకు ఇలా ఆదేశించాడు: 2 “మనుషులందరిలాగా నేనూ పోతున్నాను. నువ్వు బలంగా✽ పౌరుషంగా ఉండు. 3 నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన బాధ్యతను వహించి ఆయన విధానాలను✽ అనుసరించి నడువు. నీవు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా వివేకంగా ప్రవర్తించాలి, గనుక మోషే ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాసి ఉన్న శాసనాలను, ఆజ్ఞలను, న్యాయ నిర్ణయాలను, ఉపదేశాలను పాటించు. 4 అప్పుడు యెహోవా నాతో చెప్పిన మాట✽ స్థిరపరుస్తాడు. ఆ మాట ఏమిటంటే – ‘నీ సంతానం శ్రద్ధతో నడుచుకొంటూ హృదయపూర్వకంగా✽ మనసారా నిజాయితీతో నా సన్నిధానంలో మెలగుతూ ఉంటే నీ సంతతివారు ఇస్రాయేల్ రాజ్యపరిపాలన ఎప్పుడూ చేస్తారు.’5 “సెరూయా కొడుకు యోవాబు నాపట్ల జరిగించిన కీడు నీకు తెలుసు. ఇస్రాయేల్ రాజ్య సేనాధిపతులిద్దరిని నేర్ కొడుకు అబ్నేర్‌నూ యెతేర్ కొడుకు అమాశానూ – హత్య చేసిన✽ సంగతి కూడా నీకు తెలుసు. యుద్ధకాలంలో చేసినట్లు సమాధాన కాలంలో ఆ విధంగా రక్తపాతం చేసి ఆ రక్తంతో తన నడికట్టును, పాదరక్షలను మైల చేశాడు. 6 ✽అతడికి తలవెండ్రుకలు నెరసినా అతడి విషయం నీ జ్ఞానాన్ని అనుసరించి అతణ్ణి మృత్యులోకానికి శాంతితో వెళ్ళనివ్వకు.
7 ✝“గిలాదువాడైన బర్‌జిల్లయి సంతానంమీద దయ చూపు. నీ అన్న అబ్‌షాలోం దగ్గరనుంచి నేను పారిపోయినప్పుడు వారు నన్ను ఆదరించారు, గనుక నీతో బల్ల దగ్గర భోం చేసేవారిలో వారిని చేర్చు.
8 “గెరా కొడుకు షిమీ✽ ఇక్కడ ఉన్నాడు గదా. అతడు బెన్యామీను గోత్రికుడు, బహురీం గ్రామస్థుడు. నేను మహనయీంకు వెళ్ళినప్పుడు వాడు నన్ను ఘోరంగా శపించాడు. తరువాత వాడు నన్ను కలుసుకోవడానికి యొర్దాను దగ్గరికి వచ్చాడు. ‘ఖడ్గానికి నిన్ను గురి చేయను’ అంటూ యెహోవా పేర వాడితో శపథం చేశాను. 9 ఇప్పుడు వాణ్ణి శిక్షించకుండా ఉండకు✽. నీవు జ్ఞానం గలవాడివి గదా. వాడికేం చేయాలో నీకు తెలుసు. నెరసిన వెండ్రుకలున్న అతడి రక్తం కార్చి వాణ్ణి మృత్యులోకానికి పంపెయ్యి.”
10 ✽ఆ తరువాత దావీదు కన్ను మూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతణ్ణి దావీదు నగరం✽లో సమాధి చేశారు. 11 ✽ ఇస్రాయేల్ ప్రజలను దావీదు పరిపాలన చేసినది నలభై ఏళ్ళు. హెబ్రోనులో ఏడేళ్ళు, జెరుసలంలో ముప్ఫయి మూడేళ్ళు పరిపాలించాడు. 12 సొలొమోను తన తండ్రి దావీదు సింహాసనం ఎక్కాడు. అతడి రాజ్యం సుస్థిరమైపోయింది.
13 ✝ఒక రోజు సొలొమోను తల్లి బత్‌షెబ దగ్గరికి హగ్గీతు కొడుకు అదోనీయా వచ్చాడు. ఆమె “శాంతంగా✽ వస్తున్నావా?” అని అడిగింది.
ఆమె “చెప్పు” అంది.
15 ✽అతడు ఇలా అన్నాడు: “రాజ్యం నాకు రావలసి ఉందనీ ఇస్రాయేల్ ప్రజలంతా నేనే రాజునవుతాను అనుకొన్నారనీ మీకు తెలుసు గదా! కానీ అంతా మారిపోయింది. యెహోవా సంకల్పం వల్ల రాజ్యం నా తమ్ముడిదయింది. 16 ఇప్పుడు నాదొక కోరిక. అది మీకు చెప్తున్నాను. తిరస్కరించవద్దండి.”
ఆమె “చెప్పు” అంది.
17 “సొలొమోనురాజు షూనేం గ్రామస్థురాలైన అబీషగు✽ను నాకు భార్యగా ఇవ్వవలసిందని మీరు నా తరఫున ఆయనను అడగండి. ఆయన మీ మాట తిరస్కరించడు.”
18 అందుకు బత్‌షెబ “మంచిది. నీ పక్షంగా రాజుతో మాట్లాడుతాను” అంది.
19 బత్‌షెబ అదోనీయా తరఫున మాట్లాడడానికి సొలొమోను దగ్గరికి వెళ్ళింది. ఆమెను కలుసుకోవడానికి రాజు లేచి ఆమె ఎదుట వంగి తన సింహాసనం పై కూర్చుని తన తల్లి కోసం ఆసనం తెప్పించాడు. ఆమె అతని కుడి ప్రక్కన✽ కూర్చుంది.
20 అప్పుడామె “నాదో చిన్న మనవి. తిరస్కరించవద్దు” అంది.
అందుకు రాజు “తల్లిగారూ, అదేమిటో చెప్పండి. నేను తిరస్కరించను” అన్నాడు.
21 ఆమె “నీ అన్న అదోనీయాను షూనేం గ్రామస్థురాలైన అబీషగును పెండ్లి చేసుకోనీ” అని చెప్పింది.
22 సొలొమోనురాజు తల్లికిలా జవాబిచ్చాడు: “అదోనీయా కోసం షూనేం గ్రామస్థురాలు అబీషగును ఎందుకు అడుగుతున్నావు? అలా అడిగితే అతడికోసం రాజ్యాన్ని✽ కూడా అడగండి! అతడు నా అన్న గదా! అవును అతడికోసం, అబ్యాతారుయాజి కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్ని అడగండి!”
23 ✽ అప్పుడు సొలొమోనురాజు యెహోవా పేర శపథం చేసి “ఈ మాట చెప్పినందుకు అదోనీయా చస్తాడు. లేకపోతే దేవుడు అంతకంటే ఎక్కువ కీడు నాకు చేస్తాడు గాక! 24 నన్ను రాజుగా స్థిరపరచి నా తండ్రియైన దావీదు సింహాసనం ఎక్కించి తాను చెప్పినట్టే✽ ఈ రాజవంశాన్ని స్థాపించిన యెహోవా జీవంమీద ఒట్టుబెట్టి చెపుతున్నాను. ఇవ్వేళే అదోనీయా తప్పక చస్తాడు” అన్నాడు.
25 సొలొమోనురాజు యెహోయాదా కొడుకైన బెనాయా✽ను పంపగా అతడు వెళ్ళి అదోనీయా పైబడి చంపాడు. అలా అదోనీయా మృతి చెందాడు.
26 అబ్యాతారు✽యాజితో రాజు “అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు చావుకు తగ్గవాడివి. అయినా నిన్ను ఇప్పుడు చంపించను. ఎందుకంటే, నీవు నా తండ్రి దావీదు సమక్షంలో ప్రభువైన యెహోవా ఒడంబడిక పెట్టెను మోసుకుపోయేవాడివి. ఆయన కష్టాలన్నిట్లో✽ పాలిభాగస్తుడివి” అన్నాడు.
27 ✝అబ్యాతారును యెహోవాకు యాజిగా ఉండకుండా సొలొమోను చేశాడు. ఏలీ వంశాన్ని గురించి షిలోహులో యెహోవా చెప్పిన వాక్కు ఈ విధంగా నెరవేరింది.
28 జరిగినదంతా యోవాబుకు తెలియవచ్చింది. అతడు అబ్‌షాలోం పక్షం వహించకపోయినా అదోనీయా పక్షం వహించాడు✽, గనుక అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠం✽ మీద ఉన్న కొమ్ములను పట్టుకొన్నాడు. 29 యెహోవా గుడారానికి యోవాబు పారిపోయి బలిపీఠం దగ్గర ఉన్న సంగతి సొలొమోనురాజుకు ఎవరో చెప్పారు. సొలొమోను “వెళ్ళి అతడిపైబడు✽” అంటూ యెహోయాదా కొడుకు బెనాయాను పంపించాడు. 30 బెనాయా యెహోవా గుడారానికి వచ్చి యోవాబుతో “రాజు బయటికి రమ్మంటున్నాడు” అన్నాడు.
కానీ యోవాబు “రాను. ఇక్కడే చస్తాను” అన్నాడు.
బెనాయా వెళ్ళి యోవాబు ఇచ్చిన జవాబును రాజుకు తెలిపాడు.
31 అందుకు రాజు ఇలా అన్నాడు: “అతడు చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతడిపైబడు. అతణ్ణి పాతిపెట్టి న్యాయవంతులను హత్య చేసిన అతడి అపరాధం నామీదనుంచీ నా తండ్రి కుటుంబం మీదనుంచీ ఆ విధంగా తొలగించు✽. 32 తనకంటే మంచివారూ న్యాయవంతులూ అయిన ఇద్దరిని యోవాబు చంపాడు. నా తండ్రి దావీదుకు తెలియకుండానే అతడు నేర్ కొడుకూ ఇస్రాయేల్ రాజ్య సేనాధిపతీ అయిన అబ్నేర్‌ను, యెతేరు కొడుకూ యూదా రాజ్య సేనాధిపతి అయిన అమాసాను కత్తితో హత్య చేశాడు గనుక అతడు ఒలికించిన రక్త విషయం అతడి నెత్తిమీదికి వచ్చేలా✽ యెహోవా చేస్తాడు. 33 ✽వారి రక్తం ఒలికించిన విషయంలో యోవాబు, అతడి సంతానం ఎల్లకాలం జవాబుదారులుగా ఉంటారు గాక! దావీదుకూ ఆయన సంతానానికీ ఆయన సింహాసనానికీ ఆయన వంశానికీ యెహోవా శాశ్వతంగా శాంతిని ప్రసాదిస్తాడు గాక!”
34 యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబుపైబడి అతణ్ణి చంపాడు. అడవిలో ఉన్న అతడి ఇంటిదగ్గర వారతణ్ణి పాతిపెట్టారు. 35 రాజు యెహోయాదా కొడుకు బెనాయాను యోవాబు స్థానంలో సేనాధిపతిగా నియమించాడు. సాదోకుయాజిని అబ్యాతారు స్థానంలో నియమించాడు.
36 ✽రాజు షిమీని పిలువనంపించి అతడితో “నీవు జెరుసలంలో ఇల్లు కట్టు. అందులోనే కాపురం ఉంటూ నగరం బయటికి ఎక్కడికీ వెళ్ళకు. 37 నీవు నగరం బయటికి వెళ్ళి కిద్రోను వాగును దాటిన రోజే తప్పక చస్తావని రూఢిగా తెలుసుకో. నీ చావుకు నీవే జవాబుదారివవుతావు” అన్నాడు.
38 రాజుతో షిమీ “మీరు చెప్పినది సరే. నా యజమానులైన రాజు మాట ప్రకారమే మీ దాసుడైన నేను చేస్తాను” అన్నాడు. చాలాకాలం షిమీ జెరుసలంలో కాపురం ఉన్నాడు. 39 మూడేళ్ళ తరువాత షిమీ దాసులు ఇద్దరు పారిపోయి గాతు రాజూ మయకా కొడుకూ అయిన ఆకీషు దగ్గరికి చేరారు. “ఇప్పుడు మీ దాసులు గాతులో ఉన్నార”ని ఎవరో షిమీకి తెలిపారు. 40 కనుక షిమీ అతడి గాడిదకు జీను వేసి బయలుదేరి అతడి దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరికి వెళ్ళాడు, గాతునుంచి తన దాసులను తీసుకువచ్చాడు. 41 షిమీ జెరుసలంనుంచి గాతుకు వెళ్ళి తిరిగి వచ్చిన సంగతి సొలొమోనుకు వినవచ్చింది. 42 రాజు షిమీని పిలువనంపించి అతడితో ఇలా అన్నాడు:
“నీవు జెరుసలం విడిచి ఎక్కడికైనా వెళితే ఆ రోజే తప్పక చస్తావని నీవు రూఢిగా తెలుసుకోవాలని నేను గట్టిగా హెచ్చరించి యెహోవా పేర నీచేత శపథం చేయించాను గదా. అందుకు నీవు ‘మీరు చెప్పినది సరే’ అన్నావుగా. 43 యెహోవా పేర నీవు చేసిన శపథం ప్రకారం, నేను జారీ చేసిన ఆజ్ఞప్రకారం నీవు చేయకపోయావేమిటి?” 44 రాజు షిమీతో ఇంకా అన్నాడు “నీ హృదయంలో ఉన్న కీడంతా✽ – నా తండ్రి దావీదు విషయములో నీవు చేసిన ఆ కీడంతా నీకు తెలుసు. నీవు చేసినదానికి ప్రతిఫలం యెహోవా నీమీదికి రప్పిస్తున్నాడు✽. 45 ✽సొలొమోనురాజుకు ఆశీస్సులు కలుగుతాయి, దావీదు సింహాసనం యెహోవా సమక్షంలో నిరంతరమూ సుస్థిరంగా ఉంటుంది.”
46 ✽తరువాత రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞ జారీ చేశాడు. బెనాయా వెళ్ళి షిమీపైబడి అతణ్ణి చంపాడు. ఈ విధంగా సొలొమోను స్వాధీనంలో రాజ్యం సుస్థిరమైంది.